ఎటువంటి ఆహారం శరీరానికి మంచిది, ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఎవరిని సంప్రదించడం ఉత్తమమో సద్గురు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు.

ఈ మానవ శరీరం ఎటువంటి  ఆహారం తీసుకునేలా నిర్మించబడింది? మీరు ఒక విధమైన ఆహారం తీసుకుంటే హాయిగా ఉంటారు. మరో రకమైన ఆహారం తీసుకుంటే శరీరం మందకొడిగా, సోమరిగా మారి, ఎక్కువ నిద్రపోతుంది. మీరు 100 సంవత్సరాలూ జీవించి, రోజుకి 8 గంటలు పడుక్కున్నారంటే,  మీ జీవితంలో మూడోవంతు నిద్రలో గడిపినట్టే. మరొక 30 నుండి 40 శాతం శరీర అవసరాల నిమిత్తం గడిచిపోతుంది. జీవించడానికి చాలినంత సమయమే దొరకదు. మీరు ఆహారాన్ని శక్తి పొందడం కోసం తీసుకుంటారు. మీరు సుష్టుగా భోజనం చేస్తే, మీకు శక్తి ఎక్కువున్నట్టు అనిపిస్తుందా, బద్ధకంగా ఉంటుందా? మీరు తిన్న ఆహార నాణ్యతను బట్టి, మీకు ముందు బద్ధకంగా అనిపించి క్రమంగా శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది.

ఇలా ఎందుకు జరుగుతుంది?

ఒక అంశం ఏమిటంటే  పచనంచేసిన(వండిన) ఆహారాన్ని మీ వ్యవస్థ యధాతధంగా జీర్ణం చేసుకోలేదన్నది ఒక సత్యం; దానికి కొన్ని రసాయనిక పదార్థాలు కావాలి. జీర్ణక్రియకి కావలసిన అన్ని రసాయనిక పదార్థాలూ కేవలం శరీరంలోనే లభ్యం కావు. మీరు తినే ఆహారంలో కూడా లభిస్తాయి. మీరు వండుతున్నపుడు 80 నుండి 90 శాతం దాకా ఈ రసాయనిక పదార్థాలు నశిస్తాయి. వంటలో నశించిన రసాయనిక పదార్థాలను మీరు పునః సృష్టి చెయ్యలేరు గనుక, మనుషులకు తాము తినే ఆహారంలో 50 శాతం వృధా అయిపోతుంది.

ఆహారం విషయానికి వచ్చేసరికి అది మీ శరీరం. ఎటువంటి ఆహారంతో అది సౌఖ్యంగా ఉంటుందో మీ నాలుకని కాకుండా, మీ శరీరాన్ని అడగండి.

రెండవకోణం, ఈ వ్యవస్థమీద ఉన్న ఒత్తిడి. శరీరం దాని దైనందిన చర్యలకు కావలసిన కాస్తంత శక్తి కోసం తిన్నదాన్నంతటినీ జీర్ణం చెయ్యవలసి వస్తుంది. మనం తీసుకున్న ఆహారంలో జీర్ణక్రియకి కావలసిన ఎంజైములన్నిటితో తీసుకుంటే, ఈ వ్యవస్థ పూర్తిగా భిన్న స్థాయికి చెందిన నైపుణ్యంతో పనిచేస్తుంది. ఆహారం శక్తిగా మారే నిష్పత్తి వేరుగా ఉంటుంది. సహజమైన ఆహారపదార్థాలు వాటిని పచనం చెయ్యని స్థితిలో తీసుకుంటే, జీవకణాలు చెప్పలేనంత ఆరోగ్యాన్నీ, జీవశక్తినీ ఈ వ్యవస్థకు సమకూరుస్తాయి.

ఎవరైనా దీన్ని సులభంగా ప్రయోగంచేసి చూడవచ్చు. మీరు మీ వైద్యుణ్ణి గాని, పోషణ నిపుణుడిని గాని, మీ యోగా గురువుని గాని సంప్రదించవద్దు. ఆహారం విషయానికి వచ్చేసరికి అది మీ శరీరం. ఎటువంటి ఆహారంతో అది సౌఖ్యంగా ఉంటుందో మీ నాలుకని కాకుండా, మీ శరీరాన్ని అడగండి. మీ శరీరం ఎటువంటి ఆహారం తింటే హాయిగా ఉంటుందో అటువంటి ఆహారం తీసుకోవడమే ఉత్తమోత్తమం. మీరు మీ శరీరం చెప్పిన మాటను వినడానికి అలవాటు పడాలి. ఈ శరీర స్పృహ పెరిగినకొద్దీ, మీకు ఒక విధమైన ఆహారం తింటే ఎలా ఉంటుందో చూడగానే బాగా తెలుస్తుంది. మీకు దాన్ని నోట్లో పెట్టుకోవాల్సిన పనేలేదు. ఈ రకమైన వేగవంతమైన ప్రతిస్పందన మీరు అలవరచుకుంటే, ఆహారాన్ని చూడడం, తాకడం చాలు, నోట్లో పెట్టుకోకుండానే, దాని ప్రభావం మీ మీద ఎలా ఉంటుందో తెలుసుకోగల సమర్థత అలవడుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు