ప్రశ్న : దాదాపు ఈ మధ్యకాలం వరకు, అంటే మరీ ప్రాచీన కాలంలో కాకుండా మొన్నమొన్నటి వరకూ కూడా, ప్రజలు భూమి గమనాలను గ్రహించే వారు. వాళ్లు పంటలు వేసేటప్పుడు అనేక విషయాలు గమనించేవారు - జంతువుల నడకల ధ్వనులు, చంద్ర భ్రమణ ఆవృత్తుల వంటివి. మరి ఇప్పుడు అంతా ఉపగ్రహ చిత్రాలు, జన్యుగతంగా మార్పుచెందిన జంతుజాతులు, భూమి నిండా రసాయనాలు. పాతకాలం లో లాగా, జీవన ఆవృత్తుల పరిధిని అర్థం చేసుకొని, ఆ పరిధిలోనే పనిచేస్తూ, తమ సొంత మనుగడకోసం వాటిని గౌరవించడం ఆచరించడం మనం ప్రజలకు ఎలా నేర్పగలం?

సద్గురుఈ రోజుల్లో, ముఖ్యంగా నగరాల్లో దాదాపు 95% మందికి ఆరోజు చంద్రుడి దశ ఏమిటో తెలియదు. మీరు వాళ్లను ఏమిటని అడిగితే, వాళ్లు గూగుల్‌లో చూస్తారు తప్ప ఆకాశం వైపు కాదు. మీ శరీరం మీద, మానసిక నిర్మాణం మీద చంద్రుడి దశల ప్రభావం విస్తృతమయినది.

చంద్రుడి దశలకు మొత్తం మహా సముద్రాన్నే పైకి లాగగల శక్తి ఉంది. కానీ మీ మీద మాత్రం ఏమి ప్రభావం లేదని మీరెందుకనుకుంటున్నారు? ఎందుకంటే మీరు జ్ఞానాన్ని పోగుచేసుకునే సమాజంలా తయ్యారయ్యారు, అంతే తప్ప అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించడం లేదు. ప్రతిదానికోసం మనం ఏదో పుస్తకం చదవాలి. మెల్లమెల్లగా మనం నిజమైన జీవితాన్ని గడపడం వదిలి, కూపస్థ మండుకాలుగా మారుతున్నాం. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరెన్నో జరుగుతాయి కూడా. ప్రస్తుతానికి ఈ వైఖరిని మార్చగల స్థితి లోనే మనం ఉన్నాం. పరిస్థితి మరింత అధోగతిపాలైతే, సరిదిద్దడం అంత తేలిక కాదు.

సౌరమండల వ్యవస్థ - కుమ్మరి చక్రం

యోగాలో సౌరమండల వ్యవస్థను కుమ్మరి చక్రంగా భావిస్తాం. ఆ చక్రం తిరుగడం నుండే మనం ఉద్భవించాం. సౌర వ్యవస్థకూ, శరీరానికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాం. అందుకే దానితో సమన్వయించడానికి అనేక అభ్యాసాలను నిర్మించడం జరిగింది. మన శరీరంలో 72,000 శక్తి వాహికలున్నాయి. అవి విశిష్టరీతిలో 114  చోట్ల కలుస్తాయి. రెండు భౌతిక శరీరానికి వెలుపల ఉంటాయి. నాలుగింటిలో మీరు మార్పుచేయగలిగిందేమీలేదు. అంటే మీరు వాస్తవంగా పరివర్తింప గలిగినవి 108 అన్నమాట.

108 అనే సంఖ్యకు భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. సూర్యుని గురించిన శాస్త్రం ‘సూర్యసిద్ధాంతం’ అని ఒక ప్రాచీన గ్రంథం ఉంది. భూమికీ, సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు అని ఈ గ్రంథం చెప్తుంది. భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు. మానవ వ్యవస్థ కూడా దీనితో సమన్వయంతో ఉంటుంది.

సృష్టి పరాకాష్ఠ

15,000 సంవత్సరాల కిందట ఆదియోగి తన శిష్యులైన సప్తర్షులకు యోగాన్ని అందిస్తూ, సృష్టిలో మనిషి ఎట్లా పరివర్తన చెందుతారో ఆయన వివరిస్తున్నారు.

మొదటి రూపం మత్స్యం (జల చరం), తరువాత కూర్మం - ఉభయచరం. క్షీరదాలలో మొదటిది వరాహం. తరువాత ఆయన సగం జంతువు, సగం మనిషి గురించి చెప్పారు. తర్వాత వామనుడు - మరుగుజ్జు. ఆ తర్వాత పూర్తి మానవుడు, కాని భావోద్వేగ విషయంలో చంచలుడు. తర్వాత ఆయన ఒక శాంతి పూర్ణ  పురుషుడి గురించి, ప్రేమ జీవి గురించి, ధ్యానజీవి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఒక మార్మికుడైన వ్యక్తి - ఇతర విషయాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వ్యక్తి – ఇలాంటి వ్యక్తి రావాల్సి ఉంది. అంటే, ఈ సందర్భంలో ఆయన ఈ భూగోళం మీద మానవ వికాసం గురించి మాట్లాడుతున్నారు.

అప్పుడు సప్తర్షులు ఆదియోగిని ఇలా అడిగారు, ‘‘మనిషి అంతకుమించి ఇంకా వికసించలేడా?’’ అని. దానికి ఆదియోగి ఇలా చెప్పారు, ‘‘సౌరవ్యవస్థలో విపరీతమైన మార్పులు సంభవిస్తే తప్ప మీ శరీరం ఇంతకుమించి వికసించలేదు; భౌతిక సూత్రాలు దానికి అనుమతించవు’’. ఇవ్వాళ ఆధునిక శాస్త్రజ్ఞులు (న్యూరో సైంటిస్టులు) దాదాపు ఇదే విషయం చెప్తున్నారు. ‘‘మన మెదడు ఇంతకంటే పెరిగే అవకాశం లేదా? పెద్ద మెదడుతో ఎక్కువ పనులు చేయగలం కదా!’’ అని ఎవరైనా అడిగితే, వాళ్లిలా చెప్తున్నారు, ‘‘మనిషి మెదడుకు ఇంతకంటే వికసించే అవకాశం లేదు. దీనికి కారణం నాడీ(neuron) సంబంధ నియమాలు కావు, భౌతిక నియమాలే’’. వాటిని మెరుగ్గా వాడడం మాత్రమే నేర్చుకోగలం తప్ప దాన్ని మరింత పెంపొందించలేం, అలా పెంపొందించాలంటే దానిలోకి మరిన్ని నాడీకణాల్ని కూరాలి. మనమలా చేసినట్లయితే, ఇప్పడు ఉన్న స్పష్టత పోతుంది’’. ఇలా కొంతమంది పిల్లలు ఉన్నారు - వారికి అద్భుతమైన మేధస్సు ఉంది కాని, స్పష్టత లేదు.  కాలక్రమంలో ప్రాకృతిక ఆవృత్తులు కొన్ని నాడీకణాలను చంపివేస్తాయి. అది ఒక సమతుల్య స్థితిని తీసుకువస్తుంది. నాడీకణాలు తగ్గకపోతే, వారు సాధారణ స్థితికి రారు.

మెదడు పెరగడానికి మరో పద్ధతి దాని న్యూరాన్ల పరిమాణం పెరగడం. అప్పుడు మెదడు ఉపయోగించే శక్తి ఎంత అధికమవుతుందంటే, భౌతిక శరీరం అంత శక్తిని సరఫరా చేయలేదు.  మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు అది మీ శక్తి మొత్తంలో 20% వాడుకుంటుంది. ఒకవేళ న్యూరాన్ల పరిమాణం పెరిగినట్లయితే అవి ఖర్చుపెట్టే శక్తి చాలా ఎక్కువ. అంత శక్తిని భౌతిక శరీరం అందించలేదు. దీనికి కారణం భౌతిక సూత్రాలే తప్ప నాడీ సంబంధమైన నియమాలు కావు. ఆదియోగి ఈ విషయం 15,000 సంవత్సరాల కిందటే చెప్పారు.

సమన్వయం

సౌర వ్యవస్థతో సమన్వయంతో ఉండేట్లుగా యోగాఅభ్యాసాల వ్యవస్థ తయారుచేసాం.

సౌర వ్యవస్థతో సమన్వయంతో ఉండేట్లుగా యోగాఅభ్యాసాల వ్యవస్థ తయారుచేసాం. దీని వల్ల మీ శారీరక ఆరోగ్యం, మానసిక  సమతౌల్యం, ఆధ్యాత్మిక స్వస్థతలు అసలు ఒక సమస్యగా తలెత్తకుండా సహజంగానే హాయిగా గడిచిపోతాయి. మొత్తం వ్యవస్థతో మీరు సమన్వయంలో ఉంటే ఇదంతా సహజంగానే జరిగిపోతుంది. ఇవ్వాళ మనమిదంతా నిర్లక్ష్యం చేసి జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ పద్ధతిలో మీరు స్వస్థతతో ఉండలేరు.

అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న సమాజాలతో ప్రపంచాన్ని నిర్మించడంకోసం మనం కష్టపడుతూ వచ్చాం. కాని మనిషి అంతర్గత స్వస్థతను సాధించడంకోసం మనం శ్రమించవలసినంత శ్రమించ లేదు. అర్థం లేని విశ్వాస వ్యవస్థల అవసరం లేకుండానే అంతర్గత సంభావ్యాలను అందించే మౌలిక సదుపాయం మనక్కావాలి; ఒక మనిషి తన అంతరంగంలోకి తిరిగి తనను తాను అన్వేషించుకొనే మౌలిక సదుపాయం కావాలి. నేను అంతరంగ అన్వేషణ మీ అనుభూతిలోకి రావడం గురించి మాట్లాడుతున్నాను, మానసికంగా విశ్లేషించడం గురించి కాదు. అది జరగకపోతే పరిసరాలపట్ల స్పృహ అన్నది కేవలం ఒక ఫాషనో, చాపల్యమో తప్ప మరొకటి కాదు.