Sadhguruమన కార్యక్రమాలకై నేను ఎక్కడకు వెళ్ళినా సరే, ఆ కార్యక్రమం జరగడానికి అక్కడ వారు తమ పరిమితులను దాటి పనిచేయడం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరైతే, వారు ఏర్పరచుకున్న హద్దులను బద్దలు చేసుకోరో వారు అందులోనే చిక్కుకు పోతారు. మీ పరిమితులను విచ్ఛిన్నం చేయడం మీ ఆధ్యాత్మిక  పురోగతికి అవసరం. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నది పౌరాణిక గ్రంధాల పైనో,  వేదాంతం పైనో, పాత ఆచారలపైనో ఆధారవడి లేదు - అది సజీవమైనది. మీరు ప్రతిరోజూ జీవించ వలసింది.  రోజువారీ ఉండే అనేక పరిస్థితులలో చిక్కుకు పోవడం వల్లో, ఇతరులతో సమస్యల వల్లో, ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోగూడదని నా ఆకాంక్ష. మీరు జీవితంలో ముందుకు సాగాలంటే,  మీరు మీ పురోగతిని ఎప్పుడూ గమనించుకోవాలి, వీలైతే ప్రతి రోజు,  కనీసం వారానికి ఒకసారి కాని, నెలకోసారి కాని చూసుకోవాలి. “నేను మెరుగౌతున్నానా, లేదా? ఇంకాస్త సంతోషంగా ఉండగలుగుతున్నానా? నిన్న ఉన్నదానికంటే నేను ఇంకాస్త అభివృద్ధి చెందానా? “ అని మీకు మీరు ప్రశ్నించు కోవాలి.

అన్నిటికన్నా విలువైన విషయం ఏమిటంటే, మీరిప్పుడు బ్రతికే ఉన్నారు.

మనుషులు తమ డబ్బు లెక్కలు చూసుకుంటారు. అది కేవలం లావాదేవీలకు ఉపయోగించే ఉపకరణమే, మీరు చనిపోయినప్పుడు దాన్ని మీతో తీసుకుని వెళ్ళలేరు. అన్నిటికన్నా విలువైన విషయం ఏమిటంటే, మీరిప్పుడు బ్రతికే ఉన్నారు. మరి అటువంటప్పుడు జీవితంలో మీరెటుపోతున్నారో సరిచూసుకోవడం అవసరమైనదే కదా – పురోగమిస్తున్నారా లేక తిరోగమనిస్తున్నారా? మరొకరి మూలంగా మీరు తిరోగమించరు. మీ అంతర్ముఖంలో, ఎవరూ మిమల్ని ఏమీ చేయలేరు. మీ బయట పరిస్థితులో, మీ బాసో లేక మీ ఇంట్లో వాళ్ళో కొంత కష్టతరం చేయగలరు. అంటే, దానర్ధం వారు మీకు మరికొంత ఎక్సరసైజ్ ఇస్తున్నారని, అంతే. అది మిమ్మల్ని మరింత బలవంతులుగా తయారుచేయాలి. మీరు కనీసం ఈ తెలివిగల గాడిదంత తెలివిగలవారు కావాలి, మీకు ఆ కధ చెబుతాను.

ఒక రోజు ఒక ముసలి గాడిద కాలు జారి భావిలో పడింది. ఆ భావి అంత లోతైనదీ కాదు, అందులో నీళ్ళూ లేవు, కాని గాడిద బయటకు రాలేక పోయింది. అది దీనంగా ఓండ్ర పెడుతోంది. కొందరు గ్రామస్తులు, దాని యజమానీ ఏం జరిగిందోనని వచ్చి చూసారు. తన ప్రాణం కాపాడుకోవడం కోసం, బయటకు రావాలని గాడిద అరుస్తూనే ఉంది. గ్రామస్థులు ఈ పనికి మాలిన గాడిద ఇట్లా అరుస్తూనే ఉంది. అది ముసలి దై పోయింది. అది మనకు ఉపయోగపడదూ, అమ్మనూలేమూ. మనం ఎలాగూ భావిని పూడ్చుద్దామనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడే ఆ పని చేసేద్దాం అనుకున్నారు. బ్రతికుండగానే గాడిదను పూడ్చేద్దామనుకున్నారు.

అందుకే మీపై ఎవరేది వేసినా మీరు దానిని బాగా ఉపయోగించుకోవాలి, అదే ఆధ్యాత్మిక ప్రక్రియ.

వారు భావిలో మట్టివేయడం మొదలు పెట్టారు. గాడిద వీపుమీద గంపతో మట్టి పడగానే, అది దానిని దులిపేసుకుని ఆ మట్టి మీదకు అడుగు వెయ్యడం మొదలు పెట్టింది. మట్టి పడేకొద్దీ అది  మరింత పైకి రావడం మొదలు పెట్టింది. ఒక పక్క పూర్తిగా నింపగానే అది బయటకు దూకేసింది. గ్రామస్థులంతా తెలివైన గాడిద అని దానిని మెచ్చుకున్నారు. మెప్పుకోలుగా యజమాని దానిని కౌగలించుకోబోతే అది ఒక్క తన్నుతన్నిస్వేచ్ఛగా పారిపోయింది. అందుకే మీపై ఎవరేది వేసినా మీరు దానిని బాగా ఉపయోగించుకోవాలి, అదే ఆధ్యాత్మిక ప్రక్రియ.

మీలాగా బుర్రకూడా లేని మామిడి చెట్టు, మట్టినుంచి తీయటి మామిడి పళ్ళను తయారు చేస్తోంది. మొక్కలు, మురికిని సువాసన కలిగిన పూలుగా మారుస్తున్నాయి. మీకేది తారసపడ్డా మీరు దానినుంచి మంచిదేదో చేయాలి. మీరలా చేయగలిగితే అది మీరెవరో చూపుతుంది. ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏమిటంటే, మీ జీవితంలో చిన్న విషయాలేమైనా సరిగ్గా జరగక పొతే  చిన్నవాడిదే (మరొకరిది)   తప్పంటారు. పెద్ద సమస్యలేమైనా వస్తే పెద్దాయనదే (భగవంతుడిదే) తప్పంటారు. తమంత తాముగా దేనికీ బాధ్యత వహించరు. మీరు మరొకరి తప్పులెంచడం మానవలసిన సమయం ఆసన్నమైంది. దానికి బదులు మీరే మీ పూర్తి సామర్ధ్యానికి ఎదగాలి.

మీ అంతరంగంలోనే జరగవలసినదానికై బయట ప్రపంచంలో వెతకడం తెలివితక్కువతనం అవుతుంది. శాంతి, సుఖాలకోసం ప్రజలు పైకి చూస్తున్నారు. శ్రేయస్సుకోసం ప్రపంచమంతా వెతుకుతున్నారు. మీరు లోపలికి తిరిగితేనే అదంతా సాద్యమవుతుంది. మీ ఆంతరంగిక, పరమోత్తమ శ్రేయస్సుకోసం సాధన శాస్త్రీయమైన విధానం. మీ సాధన ఫలప్రదం కావాలనుకుంటే మీ బుర్రనుంచి చెత్తను తొలగించాలి. శాంభవి దీక్ష ద్వారా మీకు సరైన బీజమే పడింది. దానికి సరైన మన్నును తయారు చేసుకోవడం ఇక మీ పని. ఎంతో మంచి విత్తనం కూడా రాయిమీద పడితే మొలకెత్తదు. మీరు పరాయవాళ్ళ చెత్తనంతా ప్రోగుచేసుకుంటుంటే, అది దేనినీ పెరగనివ్వదు. ఈ కాలం ఎలా ఉందంటే దాదాపు అందరికీ వాళ్ళ బుర్రల్లో ఎంత చెత్త ఉందంటే, వారికి అందించిన అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మీరు ఈ జీవితాన్ని వృధా చేసుకోకూడదని నా ఆకాంక్ష.

మానసిక పరధ్యానం తగ్గించడానికి ఒక మార్గం వ్యర్ధ ప్రసంగాలు మానుకోవడం.

మానసిక పరధ్యానం తగ్గించడానికి ఒక మార్గం వ్యర్ధ ప్రసంగాలు మానుకోవడం. ఎవరైనా చెడుపని చేస్తే దాని గురించి మాట్లాడుకునేవారికి దాని కర్మఫలం వస్తుందని, కన్నడాలో ఒక సామెత ఉంది. అది చేసినవారు దాని గురించి మరచిపోయి ఉండవచ్చు, కాని దాని గురించి మాట్లాడుకునేవారికి అది వస్తుంది, ఎందుకంటే అది వారి మనస్సును ఆక్రమించింది. ఇతరులతో కలసి జీవిస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోవడం అవసరం.

మీరు సోక్రటిస్ గురించి వినే ఉంటారు, ఆయన జీవితకాలంలోనే, ఆయన ఎంతో తెలివైనవాడని ప్రతీతి. ఒకరోజు ఆయన దగ్గరకు ఎవరో వచ్చి ‘‘డియోజినస్’ గురించి మీకో విషయం చెప్పాలి’’ అన్నాడు . సోక్రటిస్ నాకో చిన్న నియమం ఉన్నది. నీకేమి చెప్పాలనిపించినా, దానిని మూడు జల్లెడల్లో వేస్తాను. ఆ మనిషి ఏమిటి ఆ మూడు జల్లెడలు అని అడిగాడు. సోక్రటిస్ ‘‘నీకేమి చెప్పాలని పించినా అది నిజమా, కాదా అని నిర్ధారించుకున్నావా?’’ అతను ‘‘లేదు నాకిదెవరో చెప్పారు’’ అన్నాడు. సోక్రటిస్ అంటే అది మొదటి జల్లెడలోనే నిలిచిపోయింది. రెండో జల్లెడ ఏమిటంటే, అదేమైనా మంచి విషయమా?’’ ‘‘ లేదు! అది అందుకు భిన్నమైనది, అందుకే నేను మీకు చెబుదామనుకుంటున్నాను.’’ సోక్రటిస్ ‘‘ అయితే అది రెండవ ఫిల్టర్ కూడా దాటలేదన్నమాట. మరి అదేమన్నా ఉపయోగకరమైనదా?’’ అన్నాడు. అతను ‘‘ అది ఉపయోగకరమైనది కాదనుకుంటాను, నేను ఊరకే చెబుదామనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘అంటే అది ఏ జల్లెడా దాటలేదన్నమాట’’ అని సోక్రటిస్ అన్నాడు.

మీరూ, ఈ ఫిల్టర్లను గుర్తుంచుకోండి. మీకెవరైనా ఏదైనా చెబితే, అది నిజమేనని వారేమైనా నిర్ధారణ చేసుకున్నారా? అది ఎవరి గురించైనా మంచి విషయమా? అది ఉపయోగకరమా? మీకెవరైనా ఏమైనా చెప్పదలచుకున్నా, మీరెవరికైనా ఏదైనా చెప్పదలచుకున్నా, ఈ మూడు నిబంధనలకూ నిలబడనివి మీ బుర్రలోనుంచి తీసి వేస్తే, అప్పుడు ఉపయోగపడేవి, అమోఘమైనవి, ఆధ్యాత్మికమైనవీ చేయడానికి మీ బుర్రలో బోలెడంత చోటు ఉంటుంది. మీరు మీకు సంబంధించినవి గాని, ఇతరులకు సంబంధించినవిగాని, ఈ నిబంధనలకు నిలబడని వ్యర్ధ విషయాలతో మీ బుర్ర నింపుకుంటే, మీరెప్పుడూ ఈ చెత్తతోనే బిజీ అయిపోతారు. మీరు మరొకరి సమస్యల గురించి చర్చించడంలో ఆనందం పొందకూడదు. అతని సమక్షంలో తప్ప అవతలి మనిషిని గురించి ఏమీ మాట్లాడకూడదని మీరు మీకు నిర్ణయించుకోండి.

ఎంతో తీవ్రతతోనూ, నిమగ్నతతోనూ మీరేదైనా చేసుకుంటూ పోతే, మీ సామర్ధ్యం పెరుగుతూనే ఉంటుంది.

ఎవరో చేసిన వాటి గురించో, అన్న వాటి గురించో చర్చించుకుంటూ మీ శక్తిని వృధా చేసుకోవద్దు. కళ్ళు మూసుకోగానే మీ అనుభూతిలో ఈ ప్రపంచం  కనుమరుగైపోయే స్థితిలో మీరందరూ లేరు. మీ పరిస్థితి ఇదే అయితే, మీ శ్రేయస్సుకు అవసరంకాని దేని గురించీ ఆలోచించడానికి మీకు శక్తే మిగలకుండా మీరు శక్తి అంతా ఖర్చుచేసివేయాలి, అదే మంచిది.  విసుగు, బద్దకం, బాధలలో చావడంకన్నా అలసటతో చావడం ఎంతో మేలు. మీకు వయసు పై బడుతోందని , మీరు చేసే పనులను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో తీవ్రతతోనూ, నిమగ్నతతోనూ మీరేదైనా చేసుకుంటూ పోతే, మీ సామర్ధ్యం పెరుగుతూనే ఉంటుంది.

ఒక రోజు పశువులు కాసుకునే ఓ కుర్రవాడు తన ఆవులను మేపడానికి అడవికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆవు దూడను ఈనింది. మొదటి సారిగా అతను దూడ పుట్టడం చూశాడు. ఒక్కపారిగా అక్కడో క్రొత్త జీవి ప్రత్యక్ష మయ్యింది, అది అతనికి ఒక అద్భుతంగా అనిపించింది. అతనిలో ఎంతో గాఢమైన ప్రేమ, దయ చిగురించి దానిని గుండెకు హత్తుకున్నాడు. అది నడవలేక పోతోంది కాబట్టి, దానిని భుజం మీద వేసుకుని ఇంటికి వెళ్ళాడు. మరునాడు మళ్ళీ ఆవులతో పాటు దానినీ మోసుకునే వెళ్ళాడు, ఇలా ప్రతిరోజూ చేస్తున్నాడు. కొంతకాలంలో ఈ దూడ పెరిగి పెద్ద ఎద్దయ్యింది. దాని బరువు పెరిగేకొద్దీ అతని బలం కూడా పెరిగుతూ వచ్చింది. ఈ ఎద్దును భుజాలమీద ఎత్తుకుని అతను తిరుగుతుంటే ఊళ్ళో అందరూ అతడో సూపర్ మాన్ అనుకున్నారు. నేనుకూడా అలానే అంతటా సూపర్ మాన్, సూపర్ ఉమన్ లను చూడాలనుకుంటున్నాను.  మీరు చేసేదానికి హద్దులు పెట్టుకోకండి. తమపై హద్దులు పెట్టుకునేవారు గొప్పదేదీ సాధించలేరు.

మీరు అన్ని విధాలుగా, మీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలని నా ఆకాంక్ష.

మీరు అన్ని విధాలుగా, మీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలని నా ఆకాంక్ష. ఇది ఎంతో చిన్న జీవితం, పనికిరానివాటితో జీవితం వృధా చేసుకోవడం ఎందుకు? మీ అంతర్గత శ్రేయస్సుకు గాని, మీ చుట్టూ ఉండేవారికి ఉపయోగపడేదిగాని  చేయాలి. మీ శక్తినంతా వినియోగించడం వల్ల, మీరు తలగడ మీద తలపెట్టగానే నిద్రలోకి జారుకోగలగితే,  అలాంటి స్థితిలో మీ సాధన ఎన్నో రెట్లు  శక్తిమంతం  అవుతుంది. ఏమిచేయాలా, ఏమి ఎగ్గొట్టాలా అని కూర్చుని ఆలోచిస్తూ ఉండకండి. మీరు విముఖత్వం నుంచి సుముఖత్వం, జడత్వం నుంచి ఉప్పొంగడం ప్రారంభిస్తే, మీ జీవితం ఆనందమయం అవుతుంది, మీ ప్రయాణం సులభతరం అవుతుంది. మీరు చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు, వెనుదిరిగి చూసుకుంటే, అద్భుతమైన జీవితం గడిపామన్న తృప్తి మీకు మిగులుతుంది. మీకిలా జరగడం నాకెంతో ముఖ్యం. అద్భుతంగా మారండి, ప్రపంచాన్ని వెలుగులతో నింపండి. నేనూ మీతో వెలుగుతాను.

ప్రేమాశిస్సులతో,
సద్గురు