ఆసనం అనేది ఒక భంగిమ. మీ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలు 'యోగాసనాలు'గా గుర్తించబడ్డాయి. మిమ్మల్ని జీవితంలోని ఒక ఉన్నత పార్శ్వానికి తీసుకువేళ్ళేది లేక మీకు ఉన్నతమైన జీవిత అవగాహనను  అందిచ్చేది 'యోగా'. అందువల్ల ఎటువంటి భంగిమ అయితే మిమల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళ్తుందో దాన్నే 'యోగాసనం'అంటారు.

మీరు అనుభవించే వివిధ మానసిక,  భావోద్వేగ పరిస్థితులకు మీ శరీరం సహజంగానే ఒక భంగిమను తీసుకుంటుంది. మీరు ఆనందంగా ఉంటే, ఒక విధంగా కూర్చుంటారు. మీరు ఆనందంగా లేనప్పుడు,  ప్రశాంతంగా లేనప్పుడు  లేదా కోపంగా ఉన్నప్పుడు మరోలా కూర్చుంటారు. ఎవరైనా ఎలా కూర్చున్నారనే దాన్ని బట్టి వారిలోపల ఏమి జరుగుతుందో మనం కొన్నిసార్లు చెప్పగలుగుతాము.  మీరు ఇది గమనించారా?  ఆసన శాస్త్రంలో దీనికి విరుద్ధంగా చేస్తాము. అంటే చేతనంగా మీ శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి, అది మీ చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం ద్వారా మీరు అనుభూతి చెందే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని, అర్ధంచేసుకునే విధానాన్ని మార్చుకోవచ్చు. యోగాసనాలలో చైతన్యాన్ని పెంచే ప్రాధమిక ఆసనాలు 84 ఉన్నాయి. మనం 84 ఆసనాలు అన్నప్పుడు అవి 84 భంగిమలని అనుకొకండి. ఇవి ముక్తి సాధించడానికి ఉన్న 84 వ్యవస్థలు, లేదా 84 మార్గాలు. మీకు కేవలం ఒక్క యోగాసనంలో ప్రావీణ్యత ఉంటే చాలు, ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు.

మీకు కేవలం ఒక్క యోగాసనంలో ప్రావీణ్యత ఉంటే చాలు, ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు.

యోగాసనాలు అనేవి వ్యాయామ ప్రక్రియలు కావు. అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుక (awareness)తో చేయవలసి ఉంటుంది. యోగా సూత్రాలలో పతంజలి “సుఖం స్థిరం ఆసనం” అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యమైనదో, ఏ ఆసనమైతే అత్యంత స్థిరమైనదో, అదే మీ ఆసనం. మీ శరీరం అత్యంత సౌకర్యంగా ఉండి, మనస్సుకు కూడా పూర్తిగా హాయిగా ఉండి, మీ శక్తి పూర్తి ఉత్తేజంతో, సమతుల్యతతో ఉంటే,  అప్పుడు మీరు ఊరికే కూర్చున్నా, ధ్యానంలోనే ఉంటారు. అంటే ఆసనమనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మన వేసే ఒక సన్నాహక (preparatory) అడుగు. అందువల్ల ఆసనాలు అనేవి ఒక విధంగా చరుకైన ధ్యాన మార్గాలు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం 'ఈశా హఠ యోగా స్కూల్‌' వారు 21 వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 08300097444కి కాల్ చేయండి, లేదా  info@ishahathayoga.com కి ఈమెయిల్ చేయండి.