ప్రశ్న: యోగా గురుంచి ఎంతో చర్చ జరుగుతోంది కానీ (నిజమైన) యోగాని సరైన పధ్ధతిలో ఆచరించడం ఎలా?

సద్గురు: ఈరోజుల్లో చాలామంది అపార్థం చేసుకుంటున్నట్లు, యోగా అనేది ఒక వ్యాయమ క్రమం కాదు. యోగా అంటే “ఐక్యం” అని అర్థం . ప్రస్తుతం మీ అనుభవంలో – ఇది మీరు, అది విశ్వం అనిపిస్తోంది మీకు. జీవితంలో ఏదైనా కారణం చేత కొంచెం బాధ ఎదురైతే, అప్పుడిక మీకూ, విశ్వానికి మధ్య యుద్ధమన్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా కష్టమైన పోటీ. “మీకూ, విశ్వానికి పోటీ” అన్న ఈ భావన మూలంగానే మానవునిలో ‘భయాలు, అభద్రతలు’ వంటి అన్ని సమస్యలు  ఎదురుకుంటున్నది. యోగా అంటే మీరు ఎరుకతో మీ వ్యక్తిత్వ సరిహద్దులను చెరిపివేయడం. ఇదేదో మీ ఆలోచనల్లోనో  భావాలలోనో కాదు , నిజానికి, ఇది  మీ అనుభూతిలో జరగాలి. ఇది మీ వ్యక్తిత్వాన్ని విశ్వంతో లయం చెయ్యడమే.

యోగా అంటే ప్రొద్దున, సాయంత్రం ఏదో సాధన చేయడం కాదు. సాధన ఉంటుంది కానీ అదే ఒకటే అంశం కాదు. మీ జీవితంలో ప్రతి అంశం, మీరు నడిచే విధానం, శ్వాసించడం,అందరితో మసులుకునే తీరు ఇలా అన్ని అంశాలూ విశ్వంతో ఐక్యానికి దారులే. ఏ అంశాన్నీ మినహాయించటానికి లేదు. ఇది ఒక చర్య కాదు, ఒక లక్షణం. మీ శరీరాన్ని, మనసును, భావాలను ఇంకా శక్తులను ఒక నిర్దిష్ట స్థాయికి తీసుకురాగలిగితే, మీలో ఒక భిన్నమైన లక్షణం మేల్కొంటుంది - అదే యోగ.

మీ ఉద్యానవనాన్ని చక్కగా సంరక్షిస్తే, మీకు అది పుష్పాలను అందిస్తుంది. అదేవిధంగా మీరు “నేను” అనేదాన్ని సంరక్షిస్తే, అది కూడా వికసిస్తుంది. అంటే, ప్రశాంతంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండటమనేది బయటి అంశాల మీద ఆధారపడదు, అది మీరే నిర్దేశించుకుంటారు.

ప్రశ్న: భవిష్యత్తులో స్త్రీత్వమనేది మీ దృష్టిలో ఎలా ఉండబోతుంది?

సద్గురు: పురుషత్వం, స్త్రీత్వ మనేవి ప్రకృతిలోని రెండు ప్రాధమిక లక్షణాలు. విశ్వంలో భౌతికత అనేది భిన్న ధృవాల మధ్య జరుగుతుంది. దానిలో ఒక పార్శ్వమే ఈ పురుషత్వం, స్త్రీత్వాలు. నేను పురుషత్వం, స్త్రీత్వమన్నప్పుడు, నేను స్త్రీ పురుషుల గురుంచి మాట్లాడటం లేదు. మీరు ఒక స్త్రీ కావచ్చు, కానీ మీలో ఎంతో మంది మగవారి కంటే కూడా ఎక్కువ పురుషత్వం ఉండి ఉండవచ్చు. మీరు ఒక పురుషుడు కావచ్చు, కానీ మీలో ఎంతో మంది ఆడవారి కంటే కూడా ఎక్కువ స్త్రీత్వం ఉండి ఉండవచ్చు.

భౌతిక మనుగడ అనేది ఒకరిలో ఎప్పుడు ప్రగాడమవుతుంతో, అప్పుడు పురుషత్వమనేది ప్రధానమవుతుంది, ఎందుకంటే ఇప్పుడది మనుగడకు సంబంధించిన ప్రశ్న. చాలా కాలం, ఈ మనుగడ అనేది జీవితాలలో ముఖ్యమయిన అంశం కావటంచేత, పురుషత్వానికి ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వటం జరిగింది. సమాజాలు తమ మనుగడను తేలికగా సాధించుకుని, ఒక నిర్దిష్టమైన, సుస్థిరమైన సంస్కృతులను ఏర్పరుచుకున్న తరువాతే, స్త్రీత్వం ఒక సరైన స్థానానికి చేరుకుంటుంది.

ఈకాలం ప్రజల మనుగడ ప్రక్రియ మునుపటి తరాలకంటే కూడా ఎంతో మెరుగ్గా నిర్వహింపబడుతోంది. అయినా, ఇప్పటికీ ఆర్ధిక వ్యవస్థే ప్రధాన శక్తి కావటం వలన, బలమున్నోడిదే బతుకన్న పూర్వపు ఆటవికత మళ్ళీ వచ్చిపడింది. పురుషత్వ వైఖరులు, భావాలు శాసిస్తున్నాయి. సాధారణంగా స్త్రీత్వాన్ని ఒక బలహీనతగా భావిస్తారు.

కానీ మీరు ఒక సంపూర్ణమైన మానవుడిగా ఉండాలనుకుంటే, మీలో స్త్రీ, పురుషత్వాలను సరి సమానంగా ఉంచుకోవడమనేది ఎంతో ముఖ్యం. సంగీతం, కళ, ప్రేమ, కరుణ వంటివి కూడా ఆర్ధిక వ్యవస్థంత ముఖ్యమైతే, అప్పుడే స్త్రీత్వమనేది వికసిస్తుంది. అది జరగకపోతే, ప్రపంచంలో స్త్రీత్వానికి స్థానమే ఉండదు. మీరు ఒక స్త్రీ అయినప్పటికీ, మీలో పురుషత్వమే కనిపిస్తుంది.

ప్రశ్న: ఒక మనిషి ఈరోజు నుంచి ఉల్లాసంగా ఉండాలంటే, చేయవలసిన ఆ ఒక్క ముఖ్య విషయం ఏమిటి?

సద్గురు: మీరు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు, మొట్టమొదట చేయవలసింది హాయిగా నవ్వడం, ఎందుకంటే మీరు నిద్ర లేవటమనేది చిన్న విషయం కాదు. నిన్న రాత్రి నిద్రలోకి జారుకున్న ఎన్నో వేలమంది ఈరోజు నిద్రనుంచి లేవలేదు, కానీ మీరు నిద్ర లేచారు. అందుకే మీరు నిద్ర లేవగలిగారు కాబట్టి మీరో చిరునవ్వు చిందించండి. ఆ తరువాత మీ చుట్టూ ఎవరన్నా ఉంటే, వారివంక చూసి ఓ చిరునవ్వు చిందించండి. ఎందుకంటే ఈరోజు ఎన్నో లక్షల మంది తమ ఆప్తులను నిద్రలోనే కోల్పోయారు, కానీ మీ దగ్గరి వారందరూ నిద్ర లేచారు. ఎంతో అద్భుతం కదా? ఇది ఎంతో అందమైన రోజు, అవునా? బయటికి వెళ్లి చెట్లను కూడా చూడండి, మీలాగే అవి కూడా నిద్ర లేచాయి ఈరోజు.

మీకిదంతా హాస్యాస్పదంగా అనిపించొచ్చు కానీ మీ దగ్గరి వారెవరైనా నిద్రనుంచి ఎప్పటికీ లేవకపోతే, ఆ బాధ మీకు అర్థమవుతుంది. దాని విలువ తెలిసొచ్చేంత వరకూ వేచి ఉండకండి. ఇదేదో హాస్యాస్పదమైన విషయం కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం – మీరు జీవించి ఉండటం ఇంకా మీకు సంబంధించిన వారందరూ జీవించి ఉండటం. దానిని గుర్తించి కనీసం ఒక చిరునవ్వు చిందించండి. కొంతమందిని ప్రేమతో చూడటం నేర్చుకోండి.

మీరొకవేళ దీనంతటినీ ఒక గంటలోనే మరచిపోయి, ఓ పాకే జంతువులాగా మరొకరిని కరిచే రకమైతే – మీరు ఈ విషయాన్ని గంటకొకసారి గుర్తు చేసుకోండి. మీ అంతట మీరే ఈ డోసు ఇచ్చుకొండి – జీవితం విలువను గుర్తు చేసేదిదే.

ప్రేమాశీస్సులతో,

సద్గురు