చాలా మంది వారి మనస్సు వారి మాట వినకుండా ఎక్కడికో వెళ్తూంటుంది అని అంటూంటారు. దానిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఇటువంటి సమస్యకి సద్గురు చెబుతున్న సమాధానం తెలుసుకోండి..

మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేనిగురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేనిగురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు.  మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయారంటే,  మీరు  మీ మనస్సు మరెక్కడో ఉంది - అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి.. మీ మనస్సు మీరు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో  మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు. అంటే, మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు.

మీరు కానివాటితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నప్పుడు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీరు  ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు. మీరు తప్పుడు గుర్తింపులన్నిటినీ విడిచి పెట్టన క్షణాన, మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. కానీ, ఇప్పుడు మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే, మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.

మీరు మీ శరీరంతో,  మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో,  ఎన్నో విషయాలతో..  మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.

ఇప్పుడు మీ పొట్టలో గ్యాస్ చేరినప్పుడు, దానిని మీరు ఆపుకోలేరు కదా..? మీరు సరైన ఆహారం తినలేదు కాబట్టి, ఇది దానికి ప్రతిచర్య. అలానే మీరు ఎన్నో విషయాలతో గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు, దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బార్ గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే - భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి – అని. మీరు రాముడి గురించో, కృష్ణుడి గురించో ఆలోచించినప్పుడు.. మీరు రాముడితో సినిమాకి వెళతారు.. మనస్సు యొక్క తత్త్వం అలాంటిది..! రాముడే వచ్చి స్వయంగా మిమ్మల్ని బార్ కి తీసుకు వెళ్తాడు. రాముడే వచ్చి మిమ్మల్ని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు, గుర్తించుకున్నారు.

ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్నదానిపట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో..  మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు..! ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు.

అందుకనే, నేను శూన్య అని ఒక చిన్న, సరళమైన సాధనం ఇచ్చాను. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. ఫరవాలేదు. మీరు, దాని నుంచి విడిపడగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత  మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ  విడిపడగలరు.  ఎందుకంటే, ఈ మనస్సే మీలో  ఈ  గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. కేవలం ఈ పనిముట్టుని వాడండి. ప్రతిరోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాలపాటూ, మీ గందరగోళాన్నంతా ప్రక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్ఖర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి. మీరు ఏవైతే ఊహించనే లేదో అటువంటివి కూడా జరుగుతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

మీరు పడే మానసిక వ్యధకు అసలు కారణం మీరే..!!