ప్రశ్న: సద్గురు, మన జీవితంలో మనకు చేదు అనుభవాలు కలిగినట్లయితే అది మన గత కర్మల కారణంగానే అని మీరెన్నోసార్లు చెప్పారు. భవిష్యత్తులో చేదు అనుభవాలు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఎటువంటి కార్యకలాపాలు చేయాలి?

సద్గురు: మీ అనుభవంలోని చేదు విషయం అన్నది  ఏమి జరిగిందన్న దానిపై ఆధారపడి ఉండదు, మీరు దాన్ని ఎలా స్వీకరించారన్న దాన్నిబట్టి ఉంటుంది. ఒక మనిషికి శాపంగా కనిపించేది, మరో మనిషికి వరంగా తోచవచ్చు. ఒకసారి ఎంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఒక సమాధిపై తలకొట్టుకుంటూ ఇలా దుఃఖిస్తున్నాడు, “నా జీవితం, ఎంత అర్థరహితమైనది. ఈనా కళేబరం, నీవు నన్ను వదిలిపోయినందువల్ల గుడ్డిగవ్వకు కొరగాకుండా పోయింది. నీవే జీవించి ఉంటే! నిన్ను విధి ఇంత క్రూరంగా ఈ లోకంనుండి తీసికొని పోక పోయినట్లయితే! ఎంత అద్భుతంగా ఉండేది!” అని దగ్గరలో ఉన్న ఒక మతాధికారి అతని మాటలు విని ఇలా అన్నాడు, “ఇక్కడ సమాధి చేయ్యబడ్డ  వ్యక్తి నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి, అవునా!” “ముఖ్యమైన వ్యక్తా? ఔను, నిజంగా,” అంటూ ఆ వ్యక్తి మరింత శోకాలు పెడుతూ బిగ్గరగా ఏడ్వసాగాడు. “అతను నా భార్యకు మొదటి భర్త.”  చేదు అన్నది జరుగుతున్నదానిలో లేదు. మీ అనుభవం, మీరు ఒక విషయాన్ని ఎలా గ్రహిస్తున్నారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా గతంలో మీరు చేసిన పని లేదా కర్మ కూడా చేసిన పని దృష్ట్యాకాదు, ఆ పనిచేయడంలో మీ సంకల్పం ఏమిటన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

ఎప్పుడైతే  సంకల్పం లేదో, అక్కడ కర్మ ఉండదు. అన్నిటినే స్వీకరించగలగడమంటే, మీరు అప్పటికీ, ఆ పరిస్థితికి ఏది అవసరమో అదే చేయడం.

మీరు నా మాటలను, నా బోధనను కొంచెం అర్థం చేసుకున్నా, మీరు ఓ సంకల్పంతో చేయడమనేది మానేస్తారు. మీరు చేయవలసినదేదో, అంటే ఆ పరిస్థితికి ఏది అవసరమో అదే చేస్తారు. చైతన్యంతో ఉండడమంటే అదే. అక్కడ సంకల్పం ఉండదు. ఎప్పుడైతే  సంకల్పం లేదో, అక్కడ కర్మ ఉండదు. అన్నిటినే స్వీకరించగలగడమంటే, మీరు అప్పటికీ, ఆ పరిస్థితికి ఏది అవసరమో అదే చేయడం. అపరిమితమైన బాధ్యత అంటే మీరు ఏదీ ఓ ప్రత్యేకమైన సంకల్పంతో చేయకపోవడమే.. ఎటువంటి పరిస్థితిలోనయినా మీ చైతన్యాన్ని బట్టి మీరు ఏది అవసరమనుకుంటారో, దాన్ని మీ శక్త్యనుసారం మీరు చేయడమే. మీ సంకల్పశక్తి అంటే మీ కర్మను నిర్మించేది. అది మంచా, చెడా అన్నదానితో సంబంధం లేదు.

“మీ లక్ష్యం ఏమిటి?” అన్న ప్రశ్న, చాలామంది నన్ను మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. “నాకు లక్ష్యంలేదు, నేను ఊరికే కాలంగడుపుతున్నాను” అని చెప్తే, నేను అర్థంలేని సమాధానం చెప్తున్నాననుకుంటారు. ఈ ప్రపంచంలో జీవించడం గురించిన అతిలోతైన ప్రకటన చేస్తున్నానని వారు అర్థం చేసుకోరు. ఒక నిర్దిష్టమైన సంకల్పం లేదు – కేవలం అవసరమైంది చేస్తున్నానంతే. ఈ ప్రక్రియలో మీరేమి అనుభవించినా అందులో కర్మలేదు. మీరు చేస్తున్నదంతా అవసరమైంది కాబట్టి జరుగుతుంది. ఒకటి చేయవలసిన అవసరం మీకుంది కాబట్టి అది చేస్తే కర్మ అవుతుంది. కానీ మీకు ఎదీ చేయవలసిన అవసరం లేనప్పుడు, మీరు అవసరమైంది మాత్రమే చేసినప్పుడు దానికి కర్మ అంటదు. అది మంచీ కాదు, చెడూ కాదు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు