ప్రశ్న: నేను ఏమి చేసినా ఏంతో సంఘర్షణకు లోనవుతాను. దీనిని ఏవిధంగా ఎదుర్కోవాలి?

సద్గురు: చాలామందికి ఇది ప్రతిరోజూ జరగడం నేను గమనిస్తున్నాను. ఏదైనా ఒక పని జరగాలని అనుకుంటే. అది జరగనప్పుడు, ప్రక్క వారి కారణంగానే ఆపని జరగడం లేదన్నది, చాలామందికి ముందుగా వచ్చే భావన. వారికి పక్కవారిపై వేలు చూపడం మామూలైపోయింది. ఎంతోమంది ఆ పని జరగకపోవటానికి ఏదో లేనిపోని కారణాన్ని వెదుకుతారు. వారు నన్ను కూడా తప్పుపడుతున్నారు. "సద్గురు మీ అనుగ్రహం పని చేయడంలేదని" అంటుంటారు. ఇన్నర్ ఇంజనీరింగ్(Inner Engineering) కార్యక్రమానికి వచ్చిన మొదటి రోజునుండి, ఇంకా చెప్పాలంటే ఫ్రీ ఇంట్రడక్టరీ కార్యక్రమం నుండి కూడా, మేము ఈ విషయాన్ని మీకు నొక్కివక్కాణించి చెపుతున్నాము. ఏదైనా సరిగ్గా జరగకపోతే దానికి కారణం, మీరు దానిని సరిగ్గా చేయకపోవడమేనని. బహుశా మీకు ఇది ఇప్పుడు అర్థంకాకపోవచ్చు కానీ ఏదైనా జరగవలసినట్టు జరగకపోతే, ఖచ్చితంగా దానిని చేయవలసినట్టు చేయలేదని అర్థం. కానీ మనుషులు లేనిపోని కారణాలు వెదుకుతూ ఉంటారు. ఎంతోమంది మార్మికత అంటే ఇదే అనుకుంటారు. జీవితంలోని సామాన్యమైన విషయాలని క్లిష్టం చేసి అదే మార్మికతగా భావిస్తారు. మార్మికత అంటే అది కాదు. పంచేంద్రియాలకు అనుభవంకాని విషయాలను, తర్కానికి అంతుపట్టని విషయాలను, తగినంత తార్కికంగా మీ అనుభవంలోకి తీసుకురావడం మార్మికం. మామూలు విషయాలను మీ అనుభవానికి దూరంచేసి, అధ్యాత్మికం చేయడంలో ఎటువంటి మార్మికతా లేదు.

మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఘర్షణ ఎదురైతే, మీరే గరుకు కాగితం (sandpaper)అని ఒప్పుకోక తప్పదు. మీకు ఒక గరుకు కాగితాన్ని ఇచ్చి, ప్రతిరోజూ మీకు సంఘర్షణ ఎదురైనప్పుడల్లా దానితో మీ చర్మాన్ని గీరుకొమ్మనిచెబితే, మీరు మీ పద్ధతులని మార్చుకోవడమో లేక మీకు చర్మం అనేది మిగలక పోవడమో జరుగుతుంది. మీకు చర్మం మిగలనప్పుడు మీరు సంఘర్షణకు దూరంగా ఉంటారు. మీరు సౌమ్యంగా నడుస్తారు. ఇటువంటి చికిత్స మీరు కోరుకుంటే మీకు అటువంటిదే అందచేయగలం. లేదా, మీరు మీ ఆలోచనకి పదునుపెట్టి, మీరు ఎటువంటి పని చేసినా అందులో సంఘర్షణ ఉందని గ్రహిస్తే, అందుకు కారణం మీరేనని తెలుసుకోండి.

ఈ సంఘర్షణను తగ్గించుకోవాలంటే మీరు చేయగలిగిన సాధారణమైన విషయం: మీరు ఒక రోజులో, గంటలో,నిమిషంలో పలికే మాటలను సగానికి తగ్గించండి. కేవలం మీరు మాట్లాడటం తగ్గించడం వల్లనే ఎంతో సంఘర్షణ తగ్గిపోతుంది. మీరు ఏది చూసినా, పురుషుడైనా, స్త్రీ అయ్యినా, పిల్లవాడైనా,ఆవునైనా, లేక గాడిదనైనా, చూసినప్పుడు మీరు వంగి నమస్కారం చేయండి. సంఘర్షణకి అవకాశం మిగలదు. ఉత్తిత్తిగా కాక మనస్ఫూర్తిగా గాడిదకు కూడా వంగి నమస్కారం చేయడం నేర్చుకోండి.

రెండు రకాలైన సంఘర్షణలకు అవకాశం ఉంది. ఒకటి మనలో ఉన్నది. వెలుపలి సంఘర్షణ మనలోని సంఘర్షణకు వ్యక్తీకరణం మరియు దాని పర్యవసానం. ఇన్నర్ ఇంజినీరింగ్ (Inner Engineering) అంటే ఇదే: మీరు ఇక్కడ ఏవిధమైన సంఘర్షణ లేకుండా కూర్చోగలగడం. మీరిక్కడ సంఘర్షణకు లోను కాకుండా కూర్చోగలిగితే, వెలుపలి సంఘర్షణ కూడా తగ్గిపోతుంది. మీరు గరుకు కాగితాన్ని ఎదుర్కొన్నప్పుడు, మీకు సంఘర్షణ తప్పదు. అందువల్ల, వీలైనంతగా గరుకు కాగితాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. కానీ, కొన్ని సమయాలలో వాటితో పని చేయవలసి వస్తుంది. మీరు గరుకు కాగితంతో పనిచేయవలసి వచ్చినప్పుడు కొంత నైపుణ్యం అవసరం. ఇది మీరు నేర్చుకోవలసి ఉంటుంది.

గరుకు కాగితాలవంటి వారిని కలిసినప్పుడు కొంత మంది ఎంతో నైపుణ్యంతో వ్యవహరిస్తారు. ఎదుటివారు ఎంత గరుకుగా ఉన్నా వారెంతో మెత్తగా తమ పని ముగించుకుంటారు. గరుకు కాగితాలవంటి వారితో వ్యవహరించడం అనేది కొంత నైపుణ్యం, మరికొంత అనుభవంతోకూడిన పని. ఇందులో ఆధ్యాత్మికత ఏమీ లేదు, ఇది సామాజిక నైపుణ్యం మాత్రమే. ముళ్ళపంది తన ముళ్ళను నిక్కబొడిస్తే, వాటినుండి మీరు దూరంగా ఉండాలి. ముళ్ళు ముడుచుకున్నప్పుడు మీరు దానితో వ్యవహరించవచ్చు. ముళ్ళని ఎప్పుడూ నిక్కబొడిచే శక్తి దానికి లేదు.

ఇలా కానప్పుడు, మీ సంఘర్షణ మీ వల్లనేనని మీరు అర్థం చేసుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు