సద్గురు: పుస్తకాలు మనల్ని ఎన్నో అనుభవాలకు దగ్గర చేస్తాయి, ముఖ్యంగా చిన్నతనంలో మనం స్వయంగా అనుభవించలేని ఎన్నో అనుభవాలని మనకు చవి చూపిస్తాయి. అందరి జీవితం మనం జీవించాలంటే మనకు వేయి సంవత్సరాలు కావాలి, కానీ మీరు పుస్తకం చదివిన రెండు రోజులలో ఇతరుల జీవితాన్ని జీవించకనే వారి అనుభవాలని ఎంతో దగ్గరగా అనుభవిస్తారు.

బాల్యం - సముద్రంలో తప్పిపోయింది

నేను మొట్ట మొదటగా చదివిన పుస్తకం బహుశా మూడవ తరగతిలో ఉన్నప్పుడు 20000 లీగ్స్ అండర్ ద సీ, జులేస్ వెర్నె రచించినది. అతను అన్నిటినీ అతిశయోక్తం చేసి రాసాడు. సబ్మరీనుని ముంచెత్తే అంతపెద్ద ఆక్టోపస్ ని సృష్టించాడు. అటువంటి ఆక్టోపస్ ప్రపంచంలో లేదు. ఆది నా ఉహశక్తిని చిన్నాభిన్నం చేసింది. నేను సముద్రం లోకి వెళ్లి ఈ అక్టోపస్లని చూడాలని అనుకున్నాను. ఒక ఆరేడు నెలలు ఇవే ఆక్టోపస్లు నా తలనిండా తిరుగుతూ ఉన్నాయి. నేను తరువాత చదివిన పెద్ద పుస్తకం గల్లివర్స్ ట్రావెల్స్. మీకు ఆరు ఏడూ సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఒక లిల్లీపుట్ - అందరు మీకన్నా పొడుగుగా ఉన్నవారే. నేను వారి లాగా ఆలోచించగలను, వారి లాగానే అనుభూతి పొందగలను కానీ వారెప్పుడు నన్ను లిల్లీపుట్ అనే అనుకునేవారు. అందుకని నాకు ఆ ద్వీపానికి వెళ్లి ఆ చిన్న చిన్న మనుషులని చూడాలని ఉండేది.

రోబిన్సన్ క్రూసో లాగా సముద్రం మీద విహరించే పుస్తకాలు నాకెంతో నచ్చేవి. మేము తొమ్మిదవ తరగతికి వచ్చేసరికి కొంత మంది స్నేహితులతో కలిసి ఒక పడవని తయారుచేసి తహితికి ప్రయాణం కావాలనుకున్నాము. సముద్ర ప్రవాహాలని అధ్యయనం చేసాము, ఏ ఋతువులో వెళ్తే అనుకూలమో నిర్ణయించుకున్నాము. కానీ మేము వెళ్ళటం మాత్రం జరగలేదు. హైస్కూలులో ఉన్నప్పుడు నేను చదివిన ఇంకొక పుస్తకం రిచర్డ్ బాచ్ రచించిన ‘జోనతాన్ లివింగ్ స్టన్ సీగల్’. అతని ఇల్యూషన్స్ పుస్తకం కూడా ఎన్నో సార్లు చదివాను. హెర్మన్ మెల్విల్ రచించిన ‘మోబి డిక్’ కూడా సముద్రం అందులోని వేల్ గురించే.

రష్యా నిర్మాణాలు

కొన్ని పుస్తకాలు మీకు జీవితం గురించి ఉన్న ఆలోచనలని, భావాలని మార్చివేయగలవు. ఎంతోమందికి పుస్తకాలు జీవన దిశని మార్చివేశాయి. టాల్ స్టాయ్ రచనల నన్నిటినీ చదివాను. కాని ‘అన్నా కారేనిన’ ని పూర్తి చేయలేదు, అది అంతులేకుండా సాగుతూనే ఉంది. ఎన్నో ఏళ్ళ క్రితం నేను దోస్తోఎవ్స్కీ, కాము ఇంకా కాఫ్కా చదివాను.

వారి తెలివి నన్నెంతో ఆకట్టుకుంది. వీరు ఎంతో తెలివైనవారే కానీ, నాకు వీరిలో కనిపించిన మానసిక అంశం అనవసరమనిపించింది. అన్నిటినీ ఉద్దేశించి ఒక విధమైన వికారం, బాధలని గొప్పగా చేసుకోవడం కనిపించింది.

ఆ రోజులలో 'నవ కర్ణాటక' అన్న పేరుతో పుస్తకాల షాపులు ఉండేవి. వాళ్ళు ప్రత్యేకంగా రష్యన్ పుస్తకాలు అమ్మేవారు. లియో టాల్స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ రెండు రూపాయలకి, ఇంజనీరింగ్ పుస్తకాలు ఒకటి రెండు రూపాయలకి దొరికేవి - అన్ని హార్డ్ బౌండ్ పుస్తకాలే. నేను కొన్ని రష్యన్ సివిల్ ఇంజనీరింగ్ పుస్తకాలు కొన్నాను. జల శుద్ధి గురించి కొన్ని పుస్తకాలు కొని, నా పొలంలో కూర్చుని వాటిని రాత్రి పగలు చదివాను. వాటిని రెండు మూడు నెలలు అధ్యయనం చేసాను. ఆ తరువాత నిర్మాణంలోకి అడుగు పెట్టాలని కోరుకున్నాను. నీటి ట్రీట్మెంట్ అవసరమున్న ఒక పరిశ్రమలోని టెండరు అడిగాను. ఓనర్ నన్ను చూసి "నీకు నవ్వులాటగా ఉంది, నీవిది చేయలేవు. ఇది అసాధ్యం అన్నాడు. నీ టెండర్ కు దగ్గరలో ఉన్న టెండరు 32 లక్షలైతే నీవు ఒక లక్ష డెబ్భై ఆరు వేలలో ఎలా చేయగలవు" అన్నాడు.

నాకింకొక రోజు సమయం ఇవ్వమని అడిగాను, తిరిగి వెళ్లి నా పుస్తకాలను చదివాను. మరునాడు తిరిగివచ్చి చేయగలనని చెప్పాను. నీకు తొంభై రోజుల సమయం ఇస్తాము, నీవు ఈ పని పూర్తి చేయాలి, అది సరిగా పనికూడా చేయాలి. అది పని చేయకపోతే నీ ఖర్చుతో నీవు దీనిని ఇక్కడి నుండి తీయాలి, ఈ స్థలం శుభ్రం చేయాలి, నీకు ఒక రూపాయి కూడా అడ్వాన్సుగా ఇవ్వము అని చెప్పారు.

దీనిని నేను డెబ్భై రోజులలో, తొంభై వేల రూపాయల ఖర్చుతో పూర్తి చేసాను. ఒకటేసారి ఎనభై వేల రూపాయల లాభం పొందాను. ఇలా నా వ్యాపారం మొదలయ్యింది, మేము ఒక పెద్ద నిర్మాణ సంస్థగా పెరిగాము. పెద్దగానే ఎదిగాము, అప్పుడే నాకు జ్ఞానోదయం అయ్యింది, దానితో వీటన్నిటిని వదిలేశాను.

ప్రేమాశీస్సులతో,

సద్గురు