సాంప్రదాయికంగా భారతీయ ఆధ్యాత్మికత చంద్రుడి దశలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. పౌర్ణమికి, అమావాస్యకూ భేదమేమిటో, వాటి ప్రాధాన్యత ఏమిటో సద్గురు వివరిస్తున్నారు.

పౌర్ణమి రాత్రికీ, మరో రాత్రికీ ఎంతో భేదం ఉంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది...! ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇది మైక్రోఫోన్‌లో ధ్వనిని పెంచినట్లు. సంభాషణ అదే అయినా ఉన్నపాటుగా ధ్వని పెరుగుతుంది, అంతా స్పష్టమవుతుంది. అదే విధంగా ముందే కొంచెం పిచ్చి ఉన్నట్లయితే దానికి మరి కొంచెం శక్తి ఇస్తే చాలు, ప్రతిదీ ఒక్కసారి పెరిగిపోయినట్లు అనిపిస్తుంది. పౌర్ణమి రోజున శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పిచ్చి మాత్రమే కాదు ఎక్కువయ్యేది, మీరు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత కూడా పెరుగుతుంది. మీరు ఆనందంగా ఉంటే ఆ ఆనందం కూడా పెరుగుతుంది. మీ లక్షణం ఏదైతే, అది పెరుగుతుంది. జనం పిచ్చిని తేలిగ్గా గమనిస్తారు, ఎందుకంటే చాలామంది ఆ స్థితిలోనే ఉంటారు కాబట్టి. కాని మీరు ప్రేమించే వ్యక్తులయితే మీ ప్రేమ కూడా పౌర్ణమినాడు ఉప్పొంగుతుంది.

మీరు దేనివైపైనా చూసినప్పుడు, అది మీకు అందమైనదైతే, ఆ వస్తువును గ్రహించే సామర్థ్యం మీకు అకస్మాత్తుగా పెరుగుతుంది.

శక్తిని అధికతరం చేసేదేమిటి? దీనికి ఒక కారణం ఏమిటంటే, నిర్దిష్టమైన సౌందర్య లక్షణం. మీరు దేనివైపైనా చూసినప్పుడు, అది మీకు అందమైనదైతే, ఆ వస్తువును గ్రహించే సామర్థ్యం మీకు అకస్మాత్తుగా పెరుగుతుంది. దేన్నైనా మీరు అసహ్యమైన వస్తువనుకుంటే, మీరు దాన్ని చూసిన క్షణంలో మీ గ్రహణా సామర్థ్యం తగ్గుతుంది. పౌర్ణమిలో ఒక విశిష్టసౌందర్య లక్షణం ఉంటుంది, అది మీ గ్రహణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరొక విశేషం కూడా ఉంది. ఈ గ్రహం(భూమి) తన ఉపగ్రహ(చంద్రుడు) స్థితికి సంబంధించి ఒక నిర్దిష్ట స్థానంలోకి కదిలినప్పుడు ప్రకంపనలు మరింత సూటిగా, తీవ్రంగా ఉంటాయి. చంద్రుడి ఆకర్షణశక్తి తన వైపు లాక్కోవడం వల్ల అలలు పైకి లేస్తాయి. నీళ్లు ఉప్పొంగి పైకి లేవడానికి ప్రయత్నిస్తాయి. అదే విధంగా మీ రక్తం కూడా ఉప్పొంగుతుంది, దూకడానికి ప్రయత్నిస్తుంది. మీ మెదడులో రక్తప్రసారం పెరిగితే మీలో ఉన్న లక్షణం ఏదైనా సరే, అది పెరుగుతుంది.

సూక్ష్మశక్తులా లేదా శక్తిమంతమా?

ఇక అమావాస్య విషయానికి వద్దాం. పౌర్ణమి నాటి ధ్యానానికి, అమావాస్య నాటి ధ్యానానికీ చాలా తేడా ఉంటుంది. ధ్యానం చేసే వ్యక్తికి పౌర్ణమి మంచిది. కాని కొన్ని క్రతువులూ, ప్రక్రియలకు అమావాస్య రోజు మంచిది. అమావాస్య రాత్రులలో మీ శక్తులు క్రూరంగా ఉంటాయంటారు; మదమెక్కిన ఏనుగు లాగా మీ శక్తులు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తాయి. అందుకే అమావాస్య రాత్రులను తాంత్రికులు ఉపయోగించుకుంటారు. అది శక్తులను కదిలిస్తుంది. పౌర్ణమిరాత్రులు మరింత మృదువైన స్వభావం కలిగి ఉంటాయి. సుందరంగా, సుఖంగా, సంతోషంగా – ప్రేమ లాగా ఉంటాయి. అమావాస్య శక్తి స్థూల శక్తి. మీరు ఈ రెండు శక్తుల్నీ పోల్చదలచుకుంటే అమావాస్యని కామాన్ని ప్రేరేపించేదిగాను, పౌర్ణిమ ప్రేమను పెంపొందిచేదిగా చెప్పవచ్చు. అమావాస్య నాడు శక్తి స్థూలమైనది, కానీ ఎంతో శక్తిమంతమైంది. పౌర్ణమి నాడు శక్తి సూక్ష్మస్వభావం కలిగి ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, మీరు శక్తిని అనుభూతి చెందలేరు. కుండలిని కూడా ఇట్లాగే ప్రవర్తిస్తుంది: పౌర్ణిమినాడు అది అతి మెల్లగా కదులుతుంది, అమావాస్యనాడు వేగంగా, ఉద్ధృతంగా కదులుతుంది. అమావాస్యలో తీవ్రత ఎక్కువ.

ధ్యానం చేసే వ్యక్తికి పౌర్ణమి మంచిది. కాని కొన్ని క్రతువులూ, ప్రక్రియలకు అమావాస్య రోజు మంచిది.

పౌర్ణమి అద్భుతమైన ఉపస్థితి. చంద్రుని ఉపస్థితి ఎంత స్పష్టంగా ఉంటుందంటే మీరు ఎటు చూసినా ప్రతిదీ పారదర్శకమవుతుంది. అది కలిగించే ప్రకంపన, ప్రకాశాలకు ప్రతిదానికీ ఒక నూతనమైన కాంతిమత్వాన్ని కలిగించే లక్షణం ఉంటుంది. పూర్ణచంద్రుడు మనలో కలిగించే ప్రకంపనలు, అనుభూతి, చంద్రుడి తక్కిన దశలకంటే భిన్నంగా ఉంటుంది. మీలోని ఇడ, పింగళలు భిన్నరీతిలో పనిచేస్తాయి. ప్రాణశక్తి భిన్నమైన రీతిలో ప్రవహిస్తుంది. ప్రకంపనలు మారతాయి కాబట్టి మీలోని శక్తి అంతా భిన్నపద్ధతిలో ప్రవహిస్తుంది.

మీరు ప్రతిరోజూ పౌర్ణమిలో ఉండలేరని కాదు, ఉండవచ్చు. మీ సూర్యచంద్రుల మీద – ఇడ, పింగళ మీద – మీకు ఆధిపత్యం ఉంటే గ్రీష్మతాపంలో కూడా పౌర్ణమి సౌందర్యం మీలో ఉంటుంది. మీకు నిర్దిష్ట ఆధిపత్యం, నియంత్రణ ఉంటే మీరు రోజూ పౌర్ణమినే ఎంపిక చేసుకోవచ్చు, లేదా మీరు ప్రతిరోజునూ అమావాస్యగా చేసుకోవచ్చు. లేదా మీరసలు ఏ ఎంపికా చేసుకోకుండా, ప్రకృతిలో జరిగే జీవితపు అన్ని దశలనూ యథాతథంగా మీరు ఆనందించవచ్చు.

ఉపస్థితి అనుపస్థితి

పౌర్ణమి అద్భుతమైన ఉపస్థితి. అమావాస్య అనుపస్థితి. తార్కికంగా ఆలోచించే బుద్ధి ఎల్లప్పుడూ ఉపస్థితిని శక్తిమంతం గాను, అనుపస్థితిని శూన్యంగానూ భావిస్తుంది. కాని అది అలా కాదు. వెలుగుకు శక్తి ఉన్నట్లే, వెలుగు లేకపోవడానికి అంటే చీకటికి దాని శక్తి దానికుంటుంది. వాస్తవానికి చీకటికి వెలుగుకంటే ఎక్కువ శక్తి ఉంటుంది, కదూ! రాత్రి శక్తి పగటికంటే ఎక్కువ. ఎందుకంటే చీకటి అనేది కేవలం 'లేకపోవడం'. చీకటి ఉందనడం పొరపాటు. వెలుగు లేదనాలి. ఆ 'లేకపోవడం' ఒక వశీకరించుకోగలిగిన ఉపస్థితి. అదే ఇక్కడా జరగవచ్చు.

మీరు ఎరుకతో ధ్యానంలో నిమగ్నులైనప్పుడు, అంటే – మీరు అనుపస్థితిలోకి వెళ్లిపోతారన్నమాట. మీరు అనుపస్థితిలో ఉన్నప్పుడు, మీ ఉపస్థితి అద్భుతమవుతుంది. మీరు ఉపస్థితిలో ఉండే ప్రయత్నం చేసినప్పుడు మీకసలు ఉపస్థితే ఉండదు. అహానికి ఉపస్థితి లేదు. మీరు అనుపస్థితులైనప్పుడు, అక్కడ అద్భుతమైన ఉపస్థితి ఉంటుంది. అమావాస్య విషయంలోనూ ఇదే వాస్తవం. క్రమంగా చంద్రుడు అదృశ్యమవుతాడు, ఆ చంద్రుని అనుపస్థితి ఒకవిధమైన శక్తని సృజిస్తుంది. అందుకే అమావాస్యకు ప్రాధాన్యం.

కష్టపడి పనిచేసే దృఢమైన, కఠినమైన వ్యక్తికి అమావాస్య కచ్చితంగా ముఖ్యమైన అంశం. అట్లాగే చాలా సున్నితమైన, మృదువైన వ్యక్తికి పౌర్ణమి. రెండింటికీ వాటి వాటి శక్తి ఉంది. లక్షణాల విషయం పరిశీలిస్తే పౌర్ణమి ప్రేమపూరితం, అమావాస్య కార్యసాధన(దూకుడు). కాని మనం రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. ఈ రెండూ కూడా శక్తే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు