మనం మన కోరికలతో పోరాడటం ఎందుకు వృధాప్రయాసనో,  అదే సమయంలో వాటిని సరైన దిశలో ఎలా నడిపించాలో సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: గౌతమ బుద్ధుడు 'ఆశలేనితనం' గురించి మాట్లాడారు అని సాధారణంగా అంటుంటారు. ఆయన 'ఆశలేనితనం' అని అన్నప్పుడు జనాలు కోరికలు లేకుండా బ్రతకగలరు అని అనుకునే మూర్ఖుడు కాదు ఆయన. కోరిక లేకుండా మనుగడే లేదు అనేది ఆయనకు తెలుసు. ఆశలేనితనంగా ఉండాలి అని మీరు అనుకునేది కూడా ఒక పెద్ద కోరికే.

కోరికలు లేకపోవటం అంటే అర్ధం మీ కోరికలతో మీకు ఎటువంటి గుర్తింపు లేదనే. అప్పుడు కోరికలు కేవలం మీరు ఆడుకునే వస్తువులు మాత్రమే. కోరిక లేకుండా అస్సలు ఆటే లేదు. కానీ ఇప్పుడు ఈ కోరికలు ఇక మీ గురించి కాదు. ఈ క్షణానికి, ఈ పరిస్థితికి అనుగుణంగా అవి ఉంటాయి. ఏది ఎలా ఉండాలో అలా ఉంది. దాని గురించి మీరు ఏమి చేయగలుగుతారో అది మీరు చేస్తారు. మీరు అన్నిటిలో ఎంతో లోతుగా నిమగ్నమవ్వవచ్చు కానీ మీరు ఇక దేనితో గుర్తించబడరు.

ఈ అవగాహన ఒకసారి వస్తే, ఈ కోణంలో మీరు కోరికలు లేని వారు అయితే ఆ వ్యక్తికి కర్మబంధం ఉండదు. వారు ఒక యుద్ధం చేసినా కూడా వారికి కర్మ ఉండదు ఎందుకంటే వారికి అటువంటిది ఏదైనా చేయాలని కోరిక లేదు. అది దేని మీద అయినా వారి ప్రేమనుంచో ద్వేషాన్నుంచో వచ్చేది కాదు. అది అలా జరగటానికి కారణం ఏమిటంటే ఉన్న మార్గం అదే కనుక.

గీతలో చెప్తుంది అంతా ఇదే. కృష్ణుడు ఎప్పుడూ నిష్కర్మ  గురించి మాట్లాడతాడు కానీ ఆయన, అర్జునుడు కర్మ చేయాలి అని పట్టుబడతాడు. ఆయన మాట్లాడుతుంది అదే ఆశలేనితనం గురించి కానీ వేరే బాషలో, వేరే సందర్భంలో కానీ చివరికి మాట్లాడుతుంది దాని గురించే.

 మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి.

మీ కోరికలను ఒకే దిశగా పంపించండి

మీ కోరికలతో,ఆశలతో పోరాడటానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరు ఎంత ఎక్కువగా పోరాడితే అవి అంత ఎక్కువగా వస్తాయి. పురాణాలలో, 'ఒక అసురుడిని చంపేటప్పుడు ఒక బొట్టు రక్తం నేల మీద పడితే, దానిలో నుంచి ఒక వెయ్యి మంది అసురులు పుడతారు' అని చెప్తారు. మీ ఆశలు, కోరికలూ అటువంటివే. మీరు ప్రయత్నం చేసి పోరాడితే, వాటిని నరికేస్తే అవి రక్తాన్ని చిందిస్తాయి. ఒక్కో చుక్కకూ ఒక వెయ్యి కోరికలు, ఆశలు పుడతాయి. వాటితో పోరాడటం పనికి రానిది, దాని వల్ల మీ జీవితం వృధా అవుతుంది. మీరు వాటితో ఎప్పటికీ పోరాడలేరు. మీ కోరికలను, ఆశలను సరైన దిశలో వెళ్ళేటట్లు మీరు శిక్షణ ఇవ్వాలి అంతే.

మీకు కోపం వస్తే దాన్ని మీరు ఉత్తమమైనది అనుకునే దాని వైపుకు మరల్చండి. మీ ఆశలను పెరగనివ్వండి.

మీ కోరికలు, మీ ఆశలు అన్నీ కూడా కేవలం సాధారణమైన శక్తి మాత్రమే. వాటిని కోరికలుగా లేక భయాలుగా లేక కోపంగా లేక మరొకటిగా చేస్తుంది మీరే. బహుశా ఇప్పుడు అవి మీ చేతుల్లో లేవేమో. బహుశా ఇప్పుడు మీకు ఆ అవగాహన లేదేమో. కానీ వాటిని అలా చేస్తుంది మాత్రం మీరే. భావాలు ఏవైనా, మీ కోరికల స్వభావం ఏదైనా,  అదంతా మీరు మీ జీవితంలో ఇంకా లోతుగా పాతుకుపోవాలి అని మీ జీవ శక్తి చేసే ప్రయత్నం మాత్రమే. మీ జీవ శక్తి మీ జీవితానుభవాన్ని మరింత పెంచటానికే ప్రయత్నిస్తుంది. అది ఈ ప్రపంచంలోని బాహ్యమైన వాటిపై దృష్టి పెడితే, ఎప్పుడైతే ఎవరైనా లేక ఏదైనా దాన్ని పూర్తిచేయటంలో అడ్డుపడితే మీరు బాధపడతారు. అదే ఒకే ఒక్క దిశలో దృష్టిపెడితే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. కనుక మీరు కోరుకునేటప్పుడు జీవితంలోని అత్యుత్తమమైన దాన్నే కోరుకోండి. మీరు కోపంగా ఉన్నపుడు ప్రేమగా ఉండలేకపోవచ్చు. మీరు కోపాన్ని వెంటనే ప్రేమగా మార్చలేకపోవచ్చు, కానీ మీరు మీ కోపాన్నే ఒక దిశలోకి మరల్చవచ్చు. మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి. వాటిని ఒక దిశలో పెట్టటం మీ చేతిలోనే ఉంది.

కోపం ఒక బ్రహ్మాండమైన శక్తి. వ్యామోహము కూడా ఒక బ్రహ్మాండమైన శక్తి. దాన్ని సరైన దిశలోకి మలచండి. మీకున్న శక్తినంతా, మీ వ్యామోహాలను, మీ ప్రతీ భావాన్ని, ప్రతీ ఆలోచనను మీరు ఒకే దిశలో కేంద్రీకృతం చేస్తే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి.

ప్రేమతో,
సద్గురు