అంతర్గత శాస్త్రంలోకి తొంగి చూడాలనుకుంటే, పురాతన కాలంనుండి దాదాపుగా ప్రపంచంలోని అన్ని ఆధ్యాతికమార్గాలు భక్తి తత్వాన్ని పేర్కొంటాయి. భావ పూరితమైన తీక్షణత అనుభవించగలగడం వల్ల చాలామందికి భక్తి మార్గం చాలా త్వరితమైనది.

ఈ రోజులలో మనుషులు తమకు తాము మేధావులమని నమ్మినా, భావోద్వేగమే వారిలో అత్యంత తీవ్రమైన లక్షణం. శారీరక తీక్షణత అన్నది చాలా మందికి తెలియదు. మనస్సు యొక్క తీక్షణత కొద్దిమందికి అనుభవంలో ఉంది, చాలా కొద్దిమందికి మాత్రమే తమలో ఉన్న ప్రాణశక్తి తీక్షణత గురుంచి తెలుసు. కానీ ప్రతిఒక్కరికి భావ తీక్షణత తెలుసు. ప్రేమ, కరుణల యొక్క తీక్షణత అనుభవించక పోయినా, కోపంలో ఉన్న తీక్షణత తెలుసు. భావ తీక్షణత అనుభవంలో ఉంది కనుక, భక్తి తత్వానికి ప్రాధాన్యతను ఇచ్చారు.

ఆధ్యాత్మిక ఉన్మాదం కనపరచిన వారిని సమాజం ఎప్పుడూ పీడించింది.

భారతదేశంలో భక్తి తత్త్వం నలుమూలలా కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస, అక్క మహాదేవి, మీరాబాయి మొదలైనవారు ఇందుకు చక్కటి ఉదాహరణ. వారిలోని భావుకత ఎల్లలు దాటగా వారు గొప్ప అందలాలు చేరుకోగలిగారు.భారతదేశంలో జరుగుతన్న విషయాలపై , ఎంతోమంది ఇతర నాగరికతలవారు కూడా ఇటువైపు ఆకర్షింపబడ్డారు. ముందస్తు సూఫీకి చెందిన మన్సూర్ అల్ హల్లాజ్ అందుకు ఒక ఉదాహరణ. ఇతడు దాదాపు పదవ శతాబ్దంలో పర్షియా దేశంలో నివసించాడు. దేశ సంచారం చేస్తూ ఇతడు భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంకి చేరి ఒక గురువు వద్ద ఎన్నో సంవత్సరాలు గడిపాడు. భక్తి ఉద్యమంలో ఎందరో గొప్ప యోగులను కలిసి వారు అనుభవిస్తున్న పరమానందాన్ని గమనించాడు. ఆ తరువాత పంజాబులో మరికొంత మందిని కలిసి ఉండవచ్చు.

మన్సూర్ పర్షియా తిరిగివెళ్ళి తన అనుభవాలను పంచుకోవాలనుకున్నాడు. ఇతర యోగులలాగా లంగోటా మాత్రమే ధరించి "అనల్ హక్" అన్నాడు. ఇది "అహం బ్రహ్మాస్మి" అన్న సంస్కృతానికి అనువాదం. అంటే "నేనే దేవుడిని, నేనే సత్యాన్ని" అని. ప్రజలు అతడిని పిచ్చివాడుగా చూసారు. ఒకటేమో లంగోటి, దానిపై నేనే దేవుడిని అని ప్రకటించడం. కానీ అతడు మాత్రం ఆపలేదు. వీధులలో వెర్రి వాడిలా పాడుతూ నాట్యం చేస్తుండేవాడు.

మక్కా చేరి తన కోసం ఒక చిన్న దేవుడి విగ్రహాన్ని ఏర్పరుచుకున్నాడు – బహుశా అతను దానిని ఒక రకంగా ప్రతిష్టించి ఉండొచ్చు. ప్రజలు అతని వద్దకు వెళ్ళటం ప్రారంభించారు. ఇతరులు దీనిని సహించలేక అతడిని అతి క్రూరంగా అంతం చేశారు. ప్రాణంతో ఉండగానే చర్మాన్ని వలిచి అతడిని నడుము వరకు పాతిపెట్టారు. అటుగా వచ్చి వెళ్లేవారు అతనిపై రాళ్ళు విసరాలని ఆజ్ఞ జారీ చేశారు. మన్సూర్ ఆప్త మిత్రుడైన శెబ్లి అటుగా వెళ్తూ అతని మీదికి రాయి విసరడానికి మనస్కరించక, ఒక పుష్పం విసిరివేసాడు.ఇది చూసి మన్సూర్ "నా మీద విసిరిన ఏ రాళ్ళు నన్ను బాధపెట్టలేదు ఎందుకంటే అవి అజ్ఞానులు విసిరినవి, కానీ అన్నీ తెలిసిన నువ్వు విసిరిన ఈ పువ్వు నాకు ఎనలేని బాధని కలిగించింది" అంటూ కవిత్వం పలికాడు.

ఆధ్యాత్మిక పరమైన వెర్రితనం కనబర్చిన వారందరినీ సమాజం ఎప్పుడూ వేధించింది. సమాజాలు ఎప్పుడూ భక్తులను చూస్తే ఆందోళన చెందేవి ఎందుకంటే ఈ భక్తుల విధానం సమాజ తర్కానికి చిక్కేది కాదు. భక్తులు వారంతట వారు ఎంతో అందమైన వ్యక్తిత్వాలు. కానీ వారు సామాజిక పరిస్థితులలో ఇమడలేరు. భక్తులు కావాలని మీరు అనుకుంటే మీలో కొంత వెర్రితనం ఉండాలి, ఇది ఎంత అత్యంత అందమైన వెర్రితనమైనా, వెర్రితనమే.

మీకు పూర్తిగా మతిలేకుండాపోతే మీరు సంపూర్ణ తెలివితో ఉన్నట్లు, మీరు మన్సూర్ లాగా మారతారు - ఇది ఎలాగో ఎంతోమంది ప్రజలకి అర్ధంకాని విషయం.

ఏదైనా కొత్తది జరిగింది అన్నదానికి నిదర్శనం కొంత వెర్రితనం. కొత్తది అనుభవంలోకి రావాలి అంటే తర్కం దూరం కావాలి. అంటే మీరు పిచ్చివారవుతారని అర్థమా? కాదు, మనము సాధారణంగా వెర్రి అని అనేది ఒకరకమైన పిచ్చితనం. పిచ్చితనం అనేది తర్కానికి దూరమయ్యి కాదు తర్కానికి అవసరం కనిపించక. ఒక పిచ్చివాడికి తన పిచ్చిలో పూర్తి కారణం కనిపిస్తుంది. అతనికి సంబంధించినంత వరకు, తన చుట్టూ ఉన్నవారికి తర్కం కనిపించడంలేదు. ఇతరుల తర్కానికి అతడు అవకాశం ఇవ్వడు. మీరు ఎప్పుడైతే "చుట్టుప్రక్కల వారందరూ తప్పు, నేనొక్కడిని చెప్పేదే నిజం" అనుకుంటారో అదే మీ పిచ్చికి మొదటి సంకేతం.

వెర్రితనం తర్కానికి అందనిది కాదు. అది ఒక వక్రమైన తర్కం. జ్ఞానోదయం అన్నది తర్కానికి దూరం, అందులో తర్కం లేదు. మీలో ఏమీ లేనప్పుడు అది మీలోనించి ప్రవహిస్తుంది. మీకదంతా అందుబాటులోనే ఉంది.సాధారణంగా, వెర్రితనాన్ని వివరించడానికి "అతనికి మతిలేదు" అని అంటాము. మీకు మతిలేకపోతే మీరు వెర్రివాళ్ళు ఎలా అవుతారు? వెర్రితనం ఎప్పుడు మనస్సుకు సంబంధించిందే. మనస్సు ఉంటేనే వెర్రివాళ్ళు కాగలరు. మీరు మీ మనస్సు నుండి బయట పడినట్లయితే, మీరు ఖచ్చితంగా సంపూర్ణంగా ఉంటారు, మన్సూర్ లాగా. ఇది చాలా మందికి అర్ధంకాదు.

మీ చుట్టూ ఉన్నవాళ్ళకి మీరు చేసేది అర్థం కానప్పుడు మిమ్మల్ని హింసిస్తారు. మీరు మనస్సుని, భావాలని, శరీరాన్ని ఒక రకమైన వెర్రిలో ఉంచుకుంటే వెంటనే మీరు సామాజికంగా అసంబద్ధమవుతారు. అందువల్లనే మీలో ఉన్న ప్రాణశక్తిని ప్రధానంగా వెలికి తీసుకురావడం ముఖ్యం. మీలో ఉన్న ప్రాణశక్తితో మీకు సామాజిక వ్యవహారం ఉండదు. అందువల్ల అది ఎటువంటి వెర్రితనంలో మునిగి ఉన్నా మీరు మీ మనస్సుని, ఆవేశాన్ని, శరీరాన్ని సామాజిక పరంగా అనుకూలంగా ఉంచుకోగలరు.

సాధారణం అనుకున్న దాని సరిహద్దులు దాటిన తరువాత కూడా సామాజిక పరంగా అనుకూలంగా ఉండాలని ఆశిస్తే మీరు మీ శరీరాన్ని, మనస్సుని, ఆవేశాన్ని ఇంకా ప్రాణశక్తిని అన్నిటిని తోడుగా పెంపొందించుకోవాలి. అటువంటి పరిస్థితిలోనే మనుషులు పరమానందాన్ని చవిచూస్తూ కూడా తమలోని సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని పూర్తిగా వారి జీవనంలో చూపగలరు – ఇప్పటి ప్రంపంచంలో కావాల్సింది ఇదే. మీలోని శక్తి వెర్రితనం చవిచూసినా, మీ మనస్సు స్థిరంగా ఉంటే, మీరు మీ ఆంతర్యంలో మత్తులో మునుగుతూ, వెలుపలికి బుద్ధిగా, తెలివిగా ఉండగలరు. ఈ కాలంలో ఆధ్యాత్మికతను ఈ విధంగా నిర్వహించడమే ఉత్తమం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు