ప్రశ్న : సద్గురు, మనం మౌనంగా ఉన్నప్పుడు కూడా మనస్సు అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచనలు లేకుండా ఎలా ఉండాలి?

సద్గురు : ఆలోచనలు లేకపోవడం, మనసు లేకపోవడం (no-mind) ఇలాంటివి అందరూ మాట్లాడుతూనే ఉంటారు. మనం చాలా వింటూనే వుంటాం. ఇవన్ని మనం చాలా అపార్ధం  చేసుకుంటూనే  కూడా ఉంటాం. ఇటువంటి పదాల్ని చాలా అపార్దం చేసుకుంటూనే  ఉంటాం మనం. చాలా మంది నన్ను "నా మనసుని ఆపటం ఎలాగా?" అని అడుగుతుంటారు. మీరు, ఒక విషయం అర్ధం చేసుకోవాలి - ఈ మనస్సు ఇలా పరిణామం చెందటానికి కొన్ని వేల  సంవత్సరాలు పట్టింది. కొన్ని వేల సంవత్సరాల పరిణామం తరవాత ఇలా తయారయ్యింది. ఇన్ని మిలియన్ సంవత్సరాల పరిణామం తరవాత మీకు ఇలాంటి మనస్సు/మెదడు  లభించింది. ఇప్పుడేమో మీరు దాన్ని స్తంభింప జేయలనుకుంటున్నారు. అసలు ఎందుకు ఆపాలి అనుకుంటున్నారు? మీ మనసు గనక ఇరవై నాలుగు గంటల సేపు కేవలం ఆహ్లాదాన్నే మీకు ఇచ్చింది అనుకోండి మీరు దాన్ని ఆపాలనుకుంటారా? లేదు.

కాని చాలా చికాకు, ఆందోళనలు, ఇదే మీకు ఇస్తోంది కాబట్టి దీన్ని ఆపాలి అని అనుకుంటున్నారు, అవునా? మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా..మీరు చాలా మందిని అడగండి, "మీరు ధ్యానం చేయండి" అని చెప్పగానే ,  “నేను నా మనసుని ఆపలేక పోతున్నానండి” అని వాళ్ళంటారు.  సరే, నేననేది ఒకటే- మీరు మీ కాలేయాన్ని ఆపుతున్నారా? గుండెని  ఆపుతున్నారా? ఇవన్ని ఆపగలుగుతున్నరా? అవన్నీ ఆపేస్తే మీ మనస్సు కూడా ఆగిపోతుంది. మరి అవి మీరు ఆపాలి అని అనుకుంటున్నారా అంటే, వాళ్ళు “లేదు” అంటారు. మరి మీకు మీ మనసంటే ఎందుకంత కోపం? దాన్ని ఎందుకు ఆపాలని చూస్తున్నారు? మీ కాలేయం పని చేస్తున్నా కూడా మీరు ధ్యానం చేయచ్చు, మీ గుండె పని చేస్తున్నా ధ్యానం చేసుకోవచ్చు, అలాగే మీ మనస్సు పని చెస్తున్నప్పటికీ మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఎవరో మతి లేని వారు అలా చెప్పారు, అంత మాత్రాన మీరు దాన్ని నమ్మేస్తారా?

ఈ మనస్సు ఇలా పరిణామం చెందటానికి కొన్ని వేల  సంవత్సరాలు పట్టింది.

మీ మనసుని మీరు స్తంభింప చేసుకోక్కరలేదు. మీరు శాంభవి మహాముద్ర లోకి దీక్ష పొందిన తరువాత, ఇది ఎంతో శక్తివంతమైన ప్రక్రియ అని  మీరు గమనించే ఉంటారు. మీరు ఇది గమనించారా -  మీరిలా కూర్చుంటే, మీ శరీరం ఇక్కడుంటుంది,  మీ మనస్సు అక్కడ ఉంటుంది, మీరు అనేది ఇంకోచోట ఉంటుంది. మీకు, మీ మనసుకి ఆ కాస్త దూరం అవసరం. ఆ రెండిటికీ మధ్య ఒక రవ్వంత దూరం వచ్చిందంటే చాలు, సరిపోతుంది. ఇది ఎలాంటిదంటే,  మీరు ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్నారనుకోండి, ఆ ట్రాఫిక్ నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తుంటారు, అదొక అనుభవం. కాని మిరెక్కడో దూరంగా ఓ హాట్ ఎయిర్ బలూన్ లో నుండి చూస్తున్నారు, కింద మీకు ట్రాఫిక్ జాం కనిపిస్తోంది, మీరెంతో ఆనందంగా ఎంతో ప్రశాంతంగా దాన్ని చూస్తారు. అవునా? ఎందుకు? ఎందుకంటే ఆ దూరం ఒక ప్రశాంతతను తీసుకొస్తుంది అంతేనా? ఇది పూర్తిగా ఒక వేరే అనుభవం. మీరెక్కడో హాట్ ఎయిర్ బలూన్ లో కుర్చుని కింద ట్రాఫిక్ జాం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎంతో బాగుంటుంది ఆ దృశ్యం అవునా? ఎందుకు? ఎందుకంటే దానికి, మీకు ఆ దూరం ఉంది కాబట్టి మీకు బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే మీ ఆలోచనలకి, మీకు కొద్దిగా దూరం వస్తే మీకు అంతా బాగానే అనిపిస్తుంది.

మీ ఆలోచనలో అలా ఎడతెరపి లేకుండా వస్తున్నాయనుకోండి, అప్పుడు దీన్నే మానసిక విరోచనాలు (mental diaherria) అని అంటారు. అంటే మీరు సరైన ఆహారం మీ మనసుకి ఇవ్వలేదు అంతేనా? మాములుగా మీకు శారీరకంగా విరోచనాలు ఎప్పుడొస్తాయి? మీరు చెడిపోయిన ఆహారం తీసుకున్నప్పుడు వస్తుంది. అలాగే మీ మనసుకి కూడా ఇలాంటి విరోచనాలు వచ్చాయంటే మీ ఆలోచనలు సరైనవి కావని అర్ధం .

“మీరు” కాని దానిని "మీరు" అని ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు ఆలోచనలన్నీ మొదలవుతాయి.

“మీరు” కాని దానిని "మీరు" అని ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు ఆలోచనలన్నీ మొదలవుతాయి. మిమ్మల్ని మీరు దేనితోను మమేకం చేసుకోకుండా ఉంటె మీరు అన్నిటితోనూ ఉంటారు. అది నేను అని అనుకోకుండా ఉంటె, మీరు ఇలా కూర్చునప్పుడు మీ మనస్సు దానంతట అదే అలా స్థిరంగా నిలబడి ఉంటుంది. కావాలంటే పని చేస్తుంది, అవసరం లేదంటే అలాగే కూర్చుంటుంది. ప్రస్తుతం మీ చేతులు ఎలా ఉన్నాయి, మీ చేతులని మీరు కట్టుకుని కూర్చోరు కదా? మీ అనుమతి లేకుండా అవి అన్ని చోట్లకి వెళ్ళవు కదా? అలాగే మీ మనసుని కూడా కావలసినప్పుడు ఉపయోగించచ్చు లేదంటే అలాగే అట్టిపెట్టి ఉంచవచ్చు. ఒకవేళ మీ చేతులు మీ ప్రమేయం లేకుండా వాటి పని అవి చేసుకుపోతున్నాయి అనుకోండి, ఎంత అవమానంగా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది? చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనస్సు ఇలాగే ఉంటుంది, అదృష్టం ఏంటంటే మీ మనస్సు ఇలాగే ఉంది, మిగిలిన వాళ్ళ మనస్సూ కూడా ఇలాగే ఉంది కాని ఈ విషయం బయటికి కనిపించదు, అంతే, అదే మీ అదృష్టం. కాని ఇంకొకరు చూసారా లేదా అనేది కాదు విషయం, మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది మీ మనస్సు. అది మీ నియంత్రణలో లేకపోతే, అదొక పెద్ద సమస్య కదా?

మీ జీవితంలో ఎంతగానో ఉపయోగించే ఈ పరికరం మీ నియంత్రణ లో లేదు అంటే అది నిజంగా విషాదకరమైన విషయమే కదా? అందుకే మీరు ఈ రోగం నుండి తప్పించుకోవాలంటే మీరు సరైన ఆహారం తీసుకోవాలి. చెడిపోయిన పదార్ధాలను తీసుకోకూడదు, చెడిపోయిన పదార్ధాలు అంటే ఏంటి? మీరు కానిదానితో మీరు మమేకమైపోవటం, మీరు కానిది మీరు అని అనుకోవడం. అలా అనుకోకుండా ఉంటే మీకు అంతా బానే ఉందని తెలుస్తుంది. మీ మనస్సు మీకు కావలసింది చేస్తుంది, మీరు చెప్పిన మాట వింటుంది. అలాగే కూర్చుంటుంది. మీ మనసెప్పుడు దానికి కావలసిన కథలు చెప్పకూడదు, మీకు కావలసిన కథలు అది చెప్పాలి. లేకపోతే అది చాలా గందరగోళం అయిపోతుంది, మీరు దాన్ని భరించలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు