ప్రశ్న: గుళ్ళలో, మందిరాలలో, ప్రార్ధనా స్థలాలలో కుంకుమ, చందనం, విభూతి ఇస్తారు. దీనివెనకాల ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా?

సద్గురు: కొన్ని పదార్ధాలు లేదా వస్తువులు శక్తిని మరింత వేగంగా గ్రహిస్తాయి. ఇలా అనుకుందాం. నా పక్కన ఇప్పుడు ఒక ఇనపకమ్మీ, విభూది, ఒక వ్యక్తి ఉన్నారనుకుందాం. నా దగ్గరనుండి ఈ పదార్ధాలు ఎంత శక్తిని గ్రహిస్తాయనేది భిన్నంగా ఉంటుంది. శక్తిని గ్రహించేందుకు అందరికీ సమానమైన అవకాశo ఉన్నా కూడా అందరూ లేదా అన్నీ శక్తిని ఒకేలా గ్రహించలేవు, నిలుపుకోలేవు. కొన్ని పదార్ధాలు సులభంగా శక్తిని గ్రహించి నిలుపుకునేవిగా గుర్తించబడ్డాయి. విభూతి అతి సున్నితమైన  ఒక పదార్ధం. మీరు దాన్ని సులువుగా శక్తివంతం చేసి ఇంకొకరికి ఇవ్వవచ్చు. కుంకుమ కూడా అలాంటిదే. చందన లేపనం కూడా అలాంటిదే. కానీ నన్నడిగితే, శక్తివర్తనానికి సంబంధించిన విషయంలో మాత్రం విభూతినే మొదటి స్థానం ఉంచుతాను. ఎన్నో పెద్ద దేవాలయాల్లో, శక్తి పరంగా ఎంతో గొప్ప ప్రభావవంతమైన ప్రకంపనలు ఇంకా నిలిచి ఉన్నాయి. అందుకే అలాంటి స్థలాల్లో ఈ పదార్ధాలని గనుక ఉంచితే అవి నిర్ణీతమైన శక్తిని గ్రహిస్తాయి. ఆ శక్తిని పంచడం అనేది అందులోని ముఖ్యమైన ఉద్దేశం. అందుకే అక్కడికొచ్చినవారికి ఆ పదార్ధం ఇస్తారు. మీలోనే సున్నితంత్వం ఉంటే, మీరు ఆ శక్తిని నేరుగానే గ్రహించగలరు. మీరు స్వయంగా గ్రహించలేని పక్షంలో మీకు ఆ పదార్ధం అన్నా ఇవ్వాలి కదా!!

కుంకుమ ఎలా తయారు చేస్తారు?

పసుపు, నిమ్మ కలిపి కుంకుమను తయారు చేస్తారు. అంటే, సరియైన పద్ధతిలో తయారు చేస్తే అది అచ్చం లింగ భైరవి కుంకుమలా ఉంటుంది. దురదృష్టవశాత్తు, చాలా చోట్ల అది కేవలం ఒక రసాయనిక మిశ్రమం మాత్రమే. పసుపుకి ఎన్నో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి. మనం సరిగా జీవించటానికి ఉపకరిస్తుంది గనుకనే మన సంప్రదాయాల్లో పసుపుని పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మన జీవితం ఎలా నడుస్తుందో నిర్ణయించేది, మన శక్తి, మన శరీరం, మన మనస్సు  పనిచేసేతీరు మాత్రమే. మన చుట్టూ ఉన్న విషయాలు కాదు. ఈ సంస్కృతిలో, మనం ఈ సాంకేతికతను సృష్టించిన ఉద్దేశం, మన శక్తులను ఒక మార్గం వైపు కేంద్రీకరింపజేయటానికే. కానీ ఇప్పుడు, చాలా మంది స్త్రీలు కుంకుమ స్థానాన్ని ప్లాస్టిక్ కి ఇచ్చేశారు. మీరు విభూతి, కుంకుమ లేదా పసుపు పెట్టుకోవచ్చు, లేదా మీకు వద్దనుకుంటే అసలు ఏమీ పెట్టుకోకుండా కూడా ఉండొచ్చు. మీరు ఏమీ పెట్టుకోకపోయినా పరవాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వద్దు. మీరు నుదుటిన ప్లాస్టిక్ పెట్టుకోవటం ఎలాంటిదంటే, మీ మూడో కన్ను మూసేసి తెరవను అని పట్టుబట్టి కూర్చున్నట్టే.

స్త్రీలు కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు?

ప్రశ్న: పెళ్ళైన ఆడవారు తప్పకుండా ఎందుకు పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి?

సద్గురు: దాని ప్రాముఖ్యత పసుపు వల్ల వస్తుంది. దాన్ని వాడటం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా ఎన్నో విధాల ఉపయోగాలున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మన సమాజంలో కుంకుమ పెట్టుకోవడాన్ని ఒక సౌభాగ్య  ప్రతీకగా భావిస్తారు. ఒక స్త్రీ కుంకుమ పెట్టుకుంటే ఆవిడకు పెళ్లి అయిందని, ఆవిడని ఒక గౌరవ దృష్టితో చూడాలనీ ఉద్దేశం. ఇది ప్రత్యక్షంగా చెప్పనక్కర లేకుండా పరోక్షంగా ఒక సూచన చెయ్యడంలాంటిది. పాశ్చాత్య దేశాల్లో, ఎవరైనా ఉంగరం పెట్టుకుంటే వారికి పెళ్లి అయిందని అర్ధం. అలాగే ఇక్కడ, ఒక స్త్రీ మట్టెలు, కుంకుమా పెట్టుకుని కనిపిస్తే ఆవిడకి పెళ్ళయిందని గుర్తిస్తాం. ఆవిడ ఒక కుటుంబ స్త్రీ అని, ఆవిడకు ఆ బాధ్యతలు ఉన్నాయనీ, ఎవరూ ఆవిడని వేరు దృష్టితో చూడకోడదనీ గుర్తిస్తారు. సమాజాన్ని నిర్వహించటానికి ఇదొక సుగమమైన మార్గం. సమాజంలో ఎవరు ఏమిటి అని చెబుతూ ఒక స్పష్టమైన గిరిగియ్యటం లాంటిదిది.

సంపాదకుడి గమనిక: లింగ భైరవి కుంకుమ ఘనమైన ఎరుపు రంగులతో సహజమైన పదార్ధాలతో చెయ్యబడటంవల్ల, అది పెట్టుకోవడం వల్ల ఆ దేవికృపకు మరింత చేరువ కాగలరు.