జూలై 27న జరిగే గురుపూర్ణిమ వేడుకల్లో పాల్గొనండి:

Register For Guru Purnima

సద్గురు:మనం దక్షిణాయనకాలంలోకి ప్రవేశించాం. సూర్యుడి సంచారం ఉత్తర దిశ వైపు నుండి దక్షిణం వైపుకు మారటం చేత , సూర్యుడికీ భూమికీ మధ్య గల సంబంధంలో మార్పులు వచ్చే కాలం ఇది. దీని ఫలితంగా మానవ శరీరంలో కలిగే పరిణామాల వల్ల ఈ కాలం సాధనకు అనువైనది. లక్ష్యాలను నిర్ణయించుకొనేందుకు అనువైనది. ఒక రైతు భూమిని నాగలితో దున్నే సమయం. ఇది యోగి తనకొక ప్రత్యేక వరంగా లభించిన తన శరీరమనే మట్టిముద్దను మర్దన చేయటం ఆరంభించే కాలం. అంతేకాదు, అనేక సంవత్సరాల క్రితం ఈ కాలం లోనే ఆదియోగి దివ్య నేత్రాలు మనిషి అనే ప్రాణి వైపు దృష్టి సారించాయి.

మొట్టమొదటి గురు పూర్ణిమ కథ

యోగ సంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను 'ఆది యోగి' - మొట్టమొదటి యోగి - గా భావిస్తాం. 15000 సంవత్సరాలకు పూర్వం, హిమాలయ శిఖరాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు. ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఆయనను 'ఆది యోగి' - మొదటి యోగి- అనే ప్రస్తావిస్తారు.

ఎలాగైనా ఆయన నుంచి నేర్చుకోవాలన్నదే వాళ్ళ కృత నిశ్చయం. ఆది యోగి వాళ్ళను పట్టించుకోలేదు.

ఆయన వచ్చి  కూర్చొన్నాడు. ఏమి చెయ్యలేదు. ఆయన సజీవంగా ఉన్నాడనటానికి ఆయన కళ్ల నుంచి నిరంతరం స్రవించే పరమానంద బాష్పాలు తప్ప మరే సూచనా లేదు. ఆయన శ్వాస కూడా తీసుకొంటున్నట్టు కనిపించలేదు. తమ ఊహకు కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని మాత్రం ప్రజలు గమనించారు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. కొంతసేపు నిరీక్షించి చూశారు. ఆయన ఎంతకూ వాళ్ళ ఉనికినే గుర్తించకపోవటంతో, వెళ్లిపోయారు.

ఏడుగురు మాత్రం అక్కడే ఉన్నారు. ఎలాగైనా ఆయన నుంచి నేర్చుకోవాలన్నదే వాళ్ళ కృత నిశ్చయం. ఆది యోగి వాళ్ళను పట్టించుకోలేదు. వాళ్ళు బతిమాలారు, 'మీకు తెలిసినదేదో మాకూ నేర్ప'మని. వాళ్ళను ఆయన విస్మరించాడు. 'మీరు మూర్ఖులు. ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే, కోటి సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు! దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి. ఇందుకు ఎంతో సాధన అవసరం. ఇది వినోదం కోసం చేసేది కాదు.'

వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు. పరిపూర్ణ పరిణతితో సన్నద్ధులై ఉన్నారు.

కానీ వాళ్ళు పట్టు విడవకపోవటంతో ఆయన వాళ్ళకు సంసిద్ధం అయ్యేందుకు కొన్ని సాధనాలను ఇచ్చారు. దాంతో వాళ్ళు తమ సాధన మొదలు పెట్టారు. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేశారు. అయినా ఆది యోగి మాత్రం వాళ్ళను పట్టించుకోలేదు. అలా వాళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాలపాటు సాధన చేస్తూ వెళ్లారు. ఎనభై నాలుగు ఏళ్ళ తరవాత ఒక  రోజున, సూర్యుడు తన సంచార దిశను మార్చి, ఉత్తరం నుంచి దక్షిణానికి పయనం ఆరంభించిన రోజున - మన సంప్రదాయంలో దీనినే 'దక్షిణాయనం' అంటున్నాం - ఆది యోగి ఈ ఏడుగురి వంకా చూశాడు. వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు. పరిపూర్ణ పరిణతితో సన్నద్ధులై ఉన్నారు. ఇంకా వారిని విస్మరించి వదిలి వేయటం ఆయన వల్ల కాలేదు.

ఆయన వాళ్ళను శ్రద్ధగా గమనించాడు, మళ్ళీ పౌర్ణమి  నాటికి తాను వాళ్ళకు గురువు కావాలని నిశ్చయించుకొన్నాడు. ఆ పౌర్ణమినే గురుపూర్ణిమ అంటాము. గురు పూర్ణిమ అంటే ఆది యోగి, ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు. ఆయన దక్షిణ ముఖుడయ్యాడు. అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. అప్పుడే ఆ ఏడుగురు శిష్యులకూ యోగ శాస్త్రాన్ని ప్రసరింప చేసారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి, గురు పూర్ణిమ. ఆదిగురువు అవతరించిన రోజు!

గురు పూర్ణిమ - అతీత స్థితిని పొందే అవకాశం

ఈ యోగ శాస్త్రాన్ని ప్రసరింప చేయడం - ప్రపంచంలో తొట్టతొలి యోగాధ్యయన కార్య క్రమం- కేదారనాథ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంతి సరోవర్ సరస్సు తీరంలో జరిగింది. ఇక్కడ 'యోగ' అంటే  శరీరాన్ని మెలికలు తిప్పటమో, ఊపిరి బిగబట్టుకోవటమో కాదు. మనం మాట్లాడుతున్నది జీవిన మూల సూత్రాల గురించి. సృష్టిలో ఒక భాగాన్ని - నిన్ను! - అందుకోగలిగినంత శిఖరాగ్రాలకు చేర్చటం గురించి. మానవ చైతన్యానికి ఉన్న ఈ మహాద్భుతమైన  పార్శ్వాన్నీ, విశ్వ వ్యాప్తమైన మహా చైతన్యానికి గవాక్షంగా మారేందుకు మనిషికి ఉన్న మహత్తరమైన సామర్థ్యాన్నీ ఆవిష్కరించిన పుణ్య దినం గురు పూర్ణిమ.

మానవ చైతన్యానికి ఉన్న ఈ మహాద్భుతమైన  పార్శ్వాన్నీ, విశ్వ వ్యాప్తమైన మహా చైతన్యానికి గవాక్షంగా మారేందుకు మనిషికి ఉన్న మహత్తరమైన సామర్థ్యాన్నీ ఆవిష్కరించిన పుణ్య దినం గురు పూర్ణిమ.

మానవ జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టానికి గురుపూర్ణిమ గుర్తుగా నిలుస్తుంది. ఇది అతీత స్థితికీ, ముక్తికీ సంబంధించింది.  ఈ స్థితి సాధ్యం అనే విషయం కూడా మానవ జాతికి తెలియదు. మీ జన్యు వారసత్వం ఎలాంటిదయినా, మీ తల్లిదండ్రులు ఎవరయినా, జన్మతః మీరు ఎలాంటి పరిమితులతో పుట్టినా, పుట్టిన తరవాత ఎలాటి పరిమితులకు లోబడినా సరే,  మీలో కృషి చేసేందుకు సంసిద్ధత ఉన్నట్టయితే, మీరు వాటన్నిటికీ అతీతులు కావచ్చు. మానవ చరిత్రలో మొట్టమొదటి సారిగా,   మనవ చైతన్యంతో పరిణామం చెందడం సాధ్యమేనని ఆది యోగి తెలియజెప్పాడు.

కొన్నేళ్ళ క్రితం ఒక అమెరికన్ పత్రిక వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు: 'పాశ్చాత్య ప్రపంచంలో మానవ చైతన్యం గురించి అధ్యయనం చేసిన వారిలో అత్యంత ప్రముఖుడుగా ఎవరిని చెప్పచ్చు? అని. నేను వెంటనే, 'చార్ల్స్ డార్విన్!' అని సమాధానం ఇచ్చాను. 'ఛార్ల్స్ డార్విన్ కేవలం ఒక జీవ శాస్త్ర వేత్త మాత్రమే కదా? ' అన్నారు వాళ్ళు.    ' నిజమే, కానీ పరిణామ క్రమం సాధ్యం అనీ, ఇప్పుడు 'నువ్వు' ఎవరుగా ఉన్నావో, అంతకంటే ఉన్నతమైన స్థితికి ఎదగటం సంభవమేననీ, మనుషులకు మొదటిసారిగా తెలియజేసిన వాడు ఆయనే గదా?' అన్నాను నేను.

ఆది యోగి సప్తర్షులుకు యోగ శాస్త్రాన్ని అందించిన తరవాత,  ప్రపంచమంతా వ్యాప్తి చెయ్యాలని చెప్పారు

ఆనాడు జీవ పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించిన పాశ్చాత్య సమాజాలే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనాల పట్ల సుముఖత చూపిస్తున్నాయి. ' ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే భగవంతుడు మనల్ని సృష్టి చేశాడు. ఇది ఇంతే, మారే ప్రశ్నే లేదు!' అని నమ్మే వారు ఇలాంటి సుముఖత చూపలేరు.

డార్విన్ జీవ పరిణామం గురించి చెప్పింది రెండు వందల సంవత్సరాల క్రితం. ఆది యోగి ఆధ్యాత్మిక పరిణామం గురించి బోధించింది పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం. ఆయన బోధనలో సారం ఏమిటంటే, ' ఈ విశ్వంలో ప్రతి పరమాణువులోనూ - సూర్యుడు, గ్రహాలతో సహా- తనదైన చైతన్యం ఉంటుంది. కానీ వాటికి ఉండనిది వివేచించగల బుద్ధి. చైతన్య స్ఫురణకు వివేచన చేసే బుద్ధి తోడయితే, అదొక శక్తిమంతమైన సంభావ్యత. ఆ రెండూ కలిగి ఉండటమే మానవజాతి విశిష్టత !

గురుపూర్ణిమ కథలో వర్ష ఋతువు ప్రాముఖ్యత

ఆది యోగి సప్తర్షులుకు యోగ శాస్త్రాన్ని అందించిన తరవాత,  ప్రపంచమంతా వ్యాప్తి చెయ్యాలని చెప్పారు. వారిలో ఒకడైన అగస్త్య మహర్షి దక్షిణ దిశగా పయనించి భరత ఖండంలోకి వచ్చాడు. అగస్త్య మహర్షి జీవిత ప్రస్థానం  మానవమాత్రులకే అయితే సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన కృషి వల్లే హిమాలయాలకు దక్షిణాన ఉన్న ప్రతి మానవ ఆవాసంలోనూ ఆధ్యాత్మిక సాధనలు చోటు చేసుకొన్నాయి. ఈ రోజు ఇక్కడ మనం ఈశ యోగం పేరుతో చేస్తున్నది కూడా చాలా వరకూ అగస్త్యుడి కృషికి కొనసాగింపే!  

దక్షిణ దిశగా వెళ్ళి తిరిగి వచ్చే ఈ వార్షిక యాత్రా చక్ర సంప్రదాయం అగస్త్యుడి కాలం నుంచి సాగుతూ వస్తున్నది. ఇప్పుడు అలాంటి యోగుల సంఖ్య తగ్గింది.

Agastya’s move to the South began a tradition of yogis and spiritual sadhakas setting forth on a cycle of moving from the Himalayan region down south and back again up as the seasons come and go. | The Story of Guru Purnima: From Adiyogi till Today

 

దక్షిణ దిశగా అగస్త్యుడు చేసిన యాత్ర యోగులలో ఆధ్యాత్మిక సాధకులలో ఒక కొత్త ఒరవడిని  ఏర్పరచింది. వీళ్ళు కూడా ఋతు చక్రంలో మార్పులబట్టి, ఒక సమయంలో హిమాలయ ప్రాంతాలు వదిలి దక్షిణంగా వెళ్లిపోవటం, మరొక సమయంలో తిరిగి హిమాలయాలకు వెళ్ళటం సాగించారు. ఈ ఆనవాయితీ కొన్ని వేల సంవత్సరాల పాటు సాగింది. వేసవికాలంలో వాళ్లు హిమాలయ పర్వత గుహలలో ఉండేవారు. శీతాకాలంలో  దక్షిణ ప్రాంతాలలో ఉండేవారు. వాళ్ళలో చాలా మంది, కొన్ని వేల కిలోమీటర్లు నడిచి భరత ఖండం దక్షిణపు కొనలో ఉన్న రామేశ్వరం దాకా వెళ్ళి, మళ్ళీ హిమాలయాలకు తిరిగి వెళుతూ ఉండేవాళ్లు.

దక్షిణ దిశగా వెళ్ళి తిరిగి వచ్చే ఈ వార్షిక యాత్రా చక్ర సంప్రదాయం అగస్త్యుడి కాలం నుంచి సాగుతూ వస్తున్నది. ఇప్పుడు అలాంటి యోగుల సంఖ్య తగ్గింది. కానీ ఒకప్పుడు అది వందలు వేలుగా ఉండేది. ఆ రోజులలో వాళ్ళు అలా పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేసేటప్పుడు,  వాళ్ళకు జోరు వర్షాలు పడే ఆషాఢ మాసం గడ్డు సమయంగా ఉండేది.

ఆది యోగి అందించిన విజ్ఞానం, మతాలు అనేవి ఏర్పడటానికి ఎంతో  ముందుకాలం నాటి మాట.

ఇప్పుడయితే మనకంత ఎక్కువగా అనిపించదేమో కానీ, వర్ష ఋతువు  బీభత్సంగా ఉండే ఋతువు. జడివాన హోరు పేరులోనే ఉరుకూ పరుగూ  కనిపిస్తాయి! అలా ప్రకృతి  ఉధృతంగా ఉన్నప్పుడు, కాలి నడక కష్టమయ్యేది. ఈ ఒక్క మాసం మటుకూ సాధారణంగా ప్రతివారూ ప్రయాణం మాని, అందుబాటులో ఉన్న వసతి స్థానంలో ఆగిపోవాలని నిర్ణయించుకొనేవారు.

చాలా సంవత్సరాల తరవాత గౌతమ బుద్ధుడు కూడా బౌద్ధ భిక్షువులు ఈ నెలలో విశ్రాంతి తీసుకోవాలన్న నియమం విధించాడు. ప్రయాణం దుస్సాధ్యమైన వాతావరణ పరిస్థితిలో వాళ్ళూ ఒక నెల పాటు ప్రయాణాలు నిలుపుచేసే వాళ్ళు. ఆ నెలంతా చాలామంది సాధకులు ఒకే చోట నివాసం చేసేవాళ్ళు కనక ఆ సమయాన్ని నిరంతర గురు స్మరణలో గడిపే సంప్రదాయం ఏర్పడింది.

గురుపూర్ణిమ మతాల కంటే ప్రాచీనమైనది

మానవ జాతి గురు పూర్ణిమను తన శక్తియుక్తుల గురించిన కొత్త సంభావ్యత (possibilities)లను చూపే సుదినంగా గుర్తించి, ఒక పర్వ దినంగా జరుపుకోవటం వేలాది సంవత్సరాలుగా జరుగుతున్నది. ఆది యోగి అందించిన విజ్ఞానం, మతాలు అనేవి ఏర్పడటానికి ఎంతో  ముందుకాలం నాటి మాట. ప్రజలు, మానవ జాతిని మళ్ళీదగ్గరకు తెచ్చేందుకు వీలు కానంతగా చీలికలు  చేసే ఉపాయాలు వెతకక ముందే, మానవ చైతన్యాన్ని సమున్నత స్థాయికి చేర్చగల అతి శక్తిమంతమైన ప్రక్రియలు ఆవిష్కృతమయ్యాయి, వ్యాప్తిపొందాయి. వేలాది సంవత్సరాల క్రితమే ఆది యోగి ఈ మానవ యంత్రాన్ని (human mechanism)  అవగాహన చేసుకొని, దాన్ని అత్యున్నత ఆధ్యాత్మిక సాఫల్య సాధనంగా పరిణమింపచేసే విధానాలన్నిటినీ కాచి వడబోసి చూపాడు.

ఇది అంతర్ముఖత్వం వలన కలిగిన జ్ఞానానుభవం. దీనికి ఆయన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచపు స్థితి గతులతో సంబంధం లేదు

వాటి సంక్లిష్టత నమ్మ శక్యం కానిది.  ఆనాటి ప్రజలకు ఇంతటి నాగరికతా, కౌశలమూ ఉండేవా అన్న ప్రశ్న అసంగతం. ఎందుకంటే ఇది ఒక నాగరికత వల్లనో, ఒక ఆలోచనా ధోరణి వల్లనో వచ్చిన జ్ఞానం కాదు. ఇది అంతర్ముఖత్వం వలన కలిగిన జ్ఞానానుభవం. దీనికి ఆయన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచపు స్థితి గతులతో సంబంధం లేదు. ఇది ఆయన స్వస్వరూప అభివ్యక్తి.  ఈ మానవ యంత్రం (human mechanism) లోని ప్రతి అంశానికీ ఒక  అర్థాన్నీ, దాని ద్వారా సాధించగల సాఫల్యాలనూ ఆయన సవివరంగా చూపాడు.

ఈనాటికి కూడా అందులో మీరు ఏ చిన్న మార్పూ చేయలేరు. ఎందుకంటే ఆయన చెప్పవలసినదంతా ఎంతో ప్రతిభావంతంగా, అందంగా చెప్పేశాడు. మీరు మీ జీవిత కాలం అంతా దాన్ని అర్థం చేసుకోవటంలో గడపచ్చు.

ఇప్పుడు మనం గురుపూర్ణిమ పర్వదినంగా ఎందుకు జరుపుకోవటం లేదు?

గురుపూర్ణిమ అతీత స్థితికీ, మోక్షానికీ సంబంధించింది. ఈ స్థితి సాధ్యం అన్న విషయమే మానవ జాతికి తెలియదు. మీ జన్యు వారసత్వం ఎలాంటిదయినా, మీ తల్లిదండ్రులు ఎవరయినా, జన్మతః మీరు ఎలాంటి పరిమితులతో పుట్టి  ఉన్నా, పుట్టిన తరవాత ఏ పరిమితులకు లోబడిపోయినా  సరే, మీలో కృషి చేసేందుకు సంసిద్ధత ఉంటే, మీరు వాటన్నిటికీ అతీతులు కావచ్చు.

ఈ గురుపూర్ణిమ నాడు, ఆఫీసులకు వెళ్ళకండి ! సెలవు పెట్టి, 'ఈ రోజు గురు పూర్ణిమ కనక నేను ఆఫీసుకు రాలేను! ' అని చెప్పేయండి

ఈ సుదినానికి అంతటి గుర్తింపు ఉన్నది. ఇక్కడి నాగరికతలో వేలాది సంవత్సరాలుగా ఇది ఒక అతి ముఖ్యమైన పర్వ దినంగా భావించబడుతూ వస్తున్నది.  కానీ ఈ దేశాన్ని గత 300 సంవత్సరాలుగా పాలించిన వాళ్ళ పథకాలు వాళ్ళవి! ప్రజలలో ఆధ్యాత్మిక నిష్ఠా, బలమూ ఉంటే, ఆ ప్రజలను పరిపాలించటం తమకు సాధ్యం కాదని ఆ పాలకులకు తెలుసు. గురుపూర్ణిమ సెలవు దినం కాకపోవటమేమిటి? ఆదివారం నాడు సెలవు ఎందుకు? ఆదివారం నాడు మీరేం చేస్తారు? 'చిప్స్' తింటూ, టీవీ చూస్తారు! అంతకంటే ఏం చేయాలో కూడా మీకు తోచదు. అదే ఒక పౌర్ణమి నాడో , అమావాస్య నాడో, సెలవు వుంటే ఏం చేయాలో మీకు తెలుసు.

ఇది అందరూ పట్టించుకోవలసిన విషయం. ఈ గురుపూర్ణిమ నాడు, ఆఫీసులకు వెళ్ళకండి ! సెలవు పెట్టి, 'ఈ రోజు గురు పూర్ణిమ కనక నేను ఆఫీసుకు రాలేను! ' అని చెప్పేయండి. గురు పూర్ణిమ కనక సెలవు పెట్టేయమని మీ మిత్రులందరికీ కూడా చెప్పండి. ఆ రోజు ఏం చేయాలి? ఆ రోజును మీ ఆధ్యాత్మిక శ్రేయ్యస్సుకి అంకితం చేయండి. మితంగా భుజించండి. సంగీతం వినండి. ధ్యానం చేయండి. చంద్రుడిని చూస్తూ గడపండి. చాలా బాగుంటుంది, దక్షిణాయనంలో వచ్చిన తొలి పౌర్ణమి కదా! కనీసం పదిమందికి చెప్పండి, ఇది చాలా ముఖ్యమైన పర్వదినమని.

మనకు ప్రాముఖ్యత ఉన్న రోజు మనకు సెలవు దినంగా ఉండాలని గ్రహించ వలసిన సమయం వచ్చింది. గురు పూర్ణిమ సెలవు దినంగా ఉంటే ప్రజలకు దాని ప్రాముఖ్యత తెలిసి వస్తుంది. మనవ జాతికి సబంధించిన ఎంతో ముఖ్యమైన ప్రాకృతిక ఘటన వ్యర్థం కాకూడదు!