ఈ మధ్య ఒక ఛానల్ వారితో జరిగిన ముఖముకీ లో సద్గురు వస్త్రాల గురించిన ప్రస్థావన వచ్చింది. వారు అడిగిన ప్రశ్నలకి సద్గురు ఏమి సమాధానం చెప్పారో, ఇంకా ఇదివరకు ఒకసారి ఇదే ప్రస్థావన వచినప్పుడు సద్గురు ఏమి చెప్పారో, జతపరిచి ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము. మీరూ చదివి ఆనందించండి...

మీరు ధరించే దుస్తులు /వస్త్రాలూ చాలా బాగుంటాయి. వీటిని ఎవరు డిజైన్ చేస్తారు?

నన్ను చూస్తుంటే నా దుస్తులు డిజైన్ చేసుకోవడానకి నాకొకరి సహాయం కావాలని అనిపిస్తోందా! గత కొద్దికాలంగా నా చుట్టూ ఉన్నవారిలో మంచి ‘టేస్ట్’ రావడాన్ని గమనిస్తున్నాను. కళల్లో కానీ, సంగీతంలో కానీ, అన్నిటిలోనూ ఇదివరకటికంటే ఇప్పుడు ఆ ‘కళాపోషణ’ అందరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హస్త కళల్లో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది.ఈశా యోగ సెంటర్ కి వచ్చే వేలాదిమందిలో ఇక్కడినుండి వెళ్ళాక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విదేశాలనుండి వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసి వెనక్కి వెళ్లి తమ ఇంటి ఇంటీరియర్ డిజైన్ మార్చేసిన వారు ఎంతమందో! ఈ ప్రదేశం చూసాకా వారికి తమ ఇళ్ళకీ ఇక్కడి ఆశ్రమ అలంకరణలో ఉన్న తేడా తెలిసింది. ఇది చాలా ప్రశంసనీయం.

భారతదేశం కళాపోషణకూ అద్భుతమైనా నిర్మాణాలకూ పెట్టింది పేరు. మన పురాతన కట్టడాలూ - మీరు మర్చిపోయినట్లయితే, ఒకసారి మన ఆలయాలు చూస్తే మీకర్ధమౌతుంది.  ఇంజనీరింగ్ పరంగా చూసినా,నిర్మాణ శాస్త్ర పరంగా చూసినా ఇవి అపురూప కళా ఖండాలు. నేను ప్రపంచమంతా తిరిగి అన్ని కట్టడాలూ చూసాను కానీ ఎల్లోరా లోని కైలాశ్ వంటిది కానీ, కర్ణాటక లోని హళీబీడు, కోణార్క్ వంటిది కానీ, తంజావూరు ఆలయం వంటిది కానీ ఎక్కడా చూడలేదు. మీకు ఇటువంటి అద్భుతమైన శిల్ప కళ ఎక్కడా కనిపించదు. భారతీయులం ఈ సౌందర్య శాస్త్ర జ్ఞానాన్ని ఔపోసన పట్టిన వాళ్ళం. కానీ ఇప్పుడు అదంతా అంతరించిపోతోంది. బహుశా మరో దేశపు వారిచే పరిపాలింపబడ్డాము కాబట్టి, ఇప్పుడు మన టేస్ట్ ఎలా ఉందంటే ఏషియన్ పెయింట్ వారిచ్చే 166 రంగులన్నిటినీ వారి ఇళ్ళకి వాడేస్తున్నారు! ఇదిగో ఇలా మారిపోయింది మన టేస్ట్!

సరే..ఇక వస్త్రాల విషయానికొస్తే మన దేశంలో 120 రకాల చేనేతలున్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనన్ని..!! ఇవన్నీ ఇలా పరిణామం చెందాయంటే అది కొన్ని వేల సంవత్సరాల కృషీ, నైపుణ్యం వల్లే. ప్రతీ చేనేతా మరో దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎంతో వివరం ఉంది. ఇవన్నీ కూడా అంతరించిపోతున్న కళలే. మరో తరంవారికి ఇవేంటో తెలియాలి. అందుకే నేను చేనేత వస్త్రాలని వారి నిత్యజీవితంలో భాగంగా చేసుకోమని కోరుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మన కళాకారులకి జీవనోపాధి దొరకడమే కాక ఈ చేనతల గురించి రాబోయే తరాలవారికి తెలుస్తుంది. లేకపోతే  భవిష్యత్తులో మనమందరం చైనా సిల్క్ బట్టలే వేసుకోవలసి వస్తుంది!

వస్త్రధారణ విషయానికి వస్తే, మీరు వేసుకునే దుస్తులు సర్వసాధారణంగా మనం చూసే యోగులూ, మునులూ వేసుకునే తరహాలో ఉండవు. సొగసైన రీతిలో మనసునాకట్టుకునే రీతిలో వస్త్రాలు ధరించడానికి వెనక ఉద్దేశ్యం ఏమిటి?

ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించాలన్న నా ముఖ్య జీవిత లక్ష్యం నెరవేరే దాకా  నేను చాలా సీదాసాదాగా వస్త్రధారణ చేసేవాడిని. సుమారు 20 సంవత్సరాలపాటు నేను ఏ బట్టల దుకాణంలోకీ అడుగుపెట్టలేదు, నా కోసం ఏమీ కొనుక్కోలేదు. ప్రజలు నాకు తెల్లని వస్త్రాలు ఇచ్చేవారు, నేను వాటిని ధరించేవాడిని. చాలా సార్లు అవి చూడడానికి ఇంపుగా ఉండేవీ కావు, నాకు నచ్చేవీ కావు. నేను ఏ పని చేసినా సృజనాత్మకంగా, రసవంతంగా ఉండాలన్నది నా అభిమతం. కానీ దాని మీద ముందు దృష్టిపెట్టి నా లక్ష్యం నుండి దూరమవ్వదలుచుకోలేదు. నే చెయ్యబోతున్నది వేరు. ఆ పని పూర్తయిన తర్వాత, "సరే! ఇకనుండి వస్త్రధారణ మీద మరి కొంచెం శ్రద్ధ పెట్టచ్చు," అని అనుకున్నాను. అప్పటినుండీ నా వస్త్రాలు ఎలా ఉండాలో నేనే రూపకల్పన చేసుకుంటున్నాను.  నేను మన భారతదేశాన్ని ప్రతిబింబిచ్చేట్టుగా వస్త్రాలు ధరించాలనుకున్నాను.

ఈ భూమండలం మీద దుస్తుల్లో ఎన్ని రకాలున్నాయో వాటిలో అధిక భాగం ఈ దేశంలో ఉన్నాయి. ఇన్నాళ్ళ పరిశీలన తర్వాత ఇప్పుడు మనదేశంలో మన దుస్తులు గురించి నాకు బాగా తెలుసు. మనదేశంలో కొన్ని గ్రామాల్లో కనిపించే బట్టల నేతలు ఆ వూరిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి మన దేశంలో. మనదేశమే గనక దాని నేత వస్త్రాల్ని సరిగ్గా అమ్మగలిగితే, దాని ఆదాయంతో దేశాన్ని నడిపించవచ్చు. అందుకని నా వస్త్రధారణ మన చేనేత పరిశ్రమకి ప్రాతీకగా ఉండాలన్నది నా అభిమతం. నేను అందుకే అలాంటి దుస్తులే ధరిస్తాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు