ప్రశ్న: రెండు నెలల క్రితం, ఎంతో సీరియస్ పరిస్థితుల్లో, మా నాన్నగారు హాస్పిటల్ లో చేరారు. వాళ్ళు వారి శాయశక్తులా ప్రయత్నం చేసి, ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత, మా నాన్నగారు 36 గంటలు సజీవంగా ఉన్నారు.  మేమందరం ఆయన చివరి శ్వాస తీసుకునేటప్పుడు ఆయన చుట్టూరా నిలుచున్నాము. నేను ఆయన మరణాన్ని చూశాను. ఆయన చివరి శ్వాస తీసుకోవడం. ఆ క్షణంలో నేను డాక్టర్లను ఒక ప్రశ్న అడిగాను, “మన శరీరంలో ఉన్న శక్తి ఏది..? “ అని. ఎందుకంటే, నేను ఆయన తుది శ్వాసను తీసుకోవడం చూశాను. అయితే ఆయనలో ఉండి నడిపిస్తున్న శక్తి ఏది..? డాక్టర్లు ఎందుకు ఏమీ చెయ్యలేకపోయారు..? ఆ క్షణంలో ఆ డాక్టర్లందరూ కూడా, మాకు దేవుళ్లలా కనిపించారు. “డాక్టర్, మా నాన్నగారిని కాపాడండి” అని అందరమూ ఏడ్చాము. కానీ డాక్టర్లు, “మేము నిస్సహాయులం, మాకు ఏమి చెయ్యాలో తెలియదు. మీరు కూడా భగవంతుడిని ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తాం” అని చెప్పారు. అందరం భగవంతుడిని ప్రార్థించాం. నన్ను క్షమించండి.. నేను కొంచెం భావావేశంతో మాట్లాడుతున్నాను.  మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా  ఆయనను కాపాడలేక పోయాము. నాకు, అప్పుడు ఈ ప్రశ్న కలిగింది,” మన జీవితం ఎక్కడ ఉంది..? అది ఎక్కడ ఉంది..? మన శరీరాన్ని నడిపిస్తున్న శక్తి ఏది..?” డాక్టర్లు దానిని ఎందుకు కనుగొన లేకపోయారు..? నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. మిమ్మల్ని అడుగుతున్నందుకు క్షమించండి.

సద్గురు:  ఫర్వాలేదు.

ప్రశ్న:  నేను హాస్యాస్పదంగా ఉన్నానేమో..! నన్ను క్షమించండి.

సద్గురు:  మీరు దేనినైతే శరీరం అంటున్నారో.. అది, ఈ భూమిలో ఒక చిన్న ముక్క మాత్రమే..! దానిని, మీరు ఈ భూమినుండి తీసుకున్నారు. ఇది కేవలం భూమిలో ఒక చిన్న ముక్క మాత్రమే..! ఔనా..? కాదా..? ఇది మీకు అప్పుగా ఇవ్వబడినది. దానిని మీరు తిరిగి ఇచ్చేయవలసిన సమయం వచ్చినప్పుడు, మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు..? మీరు ఒక ఆడిటర్. మీకు, ఈ విషయం తెలుసుకదా..? మనం దేనినైతే అప్పుగా తీసుకుంటామో,  దానిని,  మనం తిరిగి ఇచ్చేయాలి కదా..? లేకపోతే, ఎవరో ఒకరు మన పద్దులు చూస్తూనే ఉంటారు కదా..? భూమి కూడా మీ పద్దులను చూస్తుంది. మీరు అందులోనుంచి ఒక్క అణువు కూడా తీసుకోలేరు. మీరు దానిని అప్పుగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ మీరు దానిని తిరిగి ఇచ్చేయాలి. జీవితం - ఈ విధంగానే ఉంటుంది. ఈ భూమి అనే ఈ చిన్న ముక్క(శరీరం) - అది  మీ తల్లి అనో,  మీ తండ్రి అనో,  మీరు అనో,  భార్య అనో, మీ పిల్లలు అనో ఇవన్నీ కూడా వీటికి సంబంధించి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీ ప్రేమ అనేది జీవితం కోసం కాదు.   మీ ప్రేమ 'మీకు చెందుతుంది' అని మీరు అనుకొనేదాని గురించి..!

నిజానికి మీ ఆతృత మరొక మానవుడు మరణించడం గురించి కానీ, మరొక జీవం గురించిగానీ కాదు. మీ ఆతృత అంతా మీ గురించే..!

ప్రతిరోజూ ఈ ప్రపంచంలో ఎంతోమంది  మరణిస్తున్నారు. ప్రతి నిమిషం రెండు వందలమంది మరణిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ‘వీళ్ళంతా ఎందుకు మరణిస్తున్నారు’ - అని ఆలోచించారా..? మీరు ఎప్పుడైనా ఈ జీవితానికి మూలం ఎక్కడుంది - అని ఆలోచించారా..? కానీ ఇప్పుడు మీ నాన్నగారు మరణించారు. ఒకవేళ ఆయనే మీ నాన్నగారు - అన్న విషయం మీకు తెలియకపోతే, ఆ మనిషి మరణిస్తున్నా, మీరేమీ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మరణించినది మీ నాన్నగారు. అందుకనే ఇదంతా..! నిజానికి మీ ఆతృత మరొక మానవుడు మరణించడం గురించి కానీ, మరొక జీవం గురించిగానీ కాదు. మీ ఆతృత అంతా మీ గురించే..! మీ ఆందోళన ఈ విధంగా ఉన్నప్పుడు, ఇది వక్రీకరించబడిన ఆందోళన. అంటే, మీరు జీవితాన్ని ఒక వక్రీకరించిన కోణంలో చూస్తున్నారు. మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనప్పుడు, బాధ అన్నది తప్పని సరి..! ఇప్పుడు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు.   మనం ప్రేమించినవాళ్ళు, మనతో ఎంత కాలం వీలైతే అంత కాలం ఉండడానికి అన్నీ చేస్తాం. కానీ, ఎప్పటికైనా వారు వెళ్లిపోవలసిందే...కదూ..?

మనం ప్రేమించినవాళ్లని, జాగ్రత్తగా అట్టిపెట్టుకోవడానికి, శాయశక్తులా ప్రయత్నించాలి..కానీ, వారు మనల్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, మనం హుందాగా ఉండాలి.

నేను మీకొక కథ చెబుతాను. ఒకసారి మీలాంటి ఒకతను, క్రొత్త ఇంటిని కట్టుకున్నారు. మన సాంప్రదాయంలో ఒక సాధువుని కానీ, సన్యాసినికానీ ఇంటికి పిలిచి వారి ఆశీర్వచనం తీసుకుంటారు. అందుకని ఒక యోగిని వారు ఇంటికి తీసుకునివచ్చారు. వారందరూ ఆయనని సాదరంగా ఆహ్వానించారు. ఒక రాజులాగా చూసుకున్నారు. బాగా భోజనం పెట్టారు. ఆ తరువాత  ”మీరు మమ్మల్ని, మా ఇంటిని ఆశీర్వదించండి” అన్నాడు. అప్పుడు ఆ యోగి “సరే..!  ముందు మీ నాన్నగారు చనిపోవాలి. ఆ తర్వాత మీరు.. ఆ తరువాత మీ పిల్లలు...”అన్నారు. దీనికి వారికి ఎంతో కోపం వచ్చింది. “మూర్ఖుడా, మిమ్మల్ని ఇంటికి పిలుచుకువచ్చి ఒక రాజులాగా మిమ్మల్ని చూసుకుని మీకు భోజనం పెట్టాం,  బహుమతులిచ్చాం..! ఆశీర్వదించమని అడిగితే, మీరు మా నాన్నగారు చనిపోవాలి, తరువాత నేను చనిపోవాలి, తరువాత నా పిల్లలు చనిపోవాలి అంటారా..?” అన్నాడు. అతనికి ఒక భయం కూడా ఉంది - యోగి అన్నారు కాబట్టి అదే విధంగా జరుగుతుందేమోనని ..! దానికి ఆ యోగి, “నేను చెప్పినదాంట్లో తప్పేముంది..? ముందర మీ నాన్నగారు.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది మంచిదే కదా..?ఒకవేళ మీ నాన్నగారికంటే ముందర,  మీరు మరణిస్తే మంచిదా..? లేక మీ పిల్లలు మీకంటే ముందర, మరణిస్తే - అది మంచిదా..? మీ నాన్నగారు ముందు మరణించాలి.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది సహజమైన జీవన క్రమమే కదా..? ఈ విధంగానే కదా,  జీవితంలో జరగాలి... ఔనా..? అందుకే అలా చెప్పాను” అన్నాడు.

మీరు జీవితంతో ఒకటిగా లేరు కాబట్టి మీరు మీ నాన్నగారు మరణించకూడదు అనుకుంటున్నారు. సరే..! మీ నాన్నగారికి బదులు మీరు మరణించారు అనుకోండి, అప్పుడు పరిస్థితులు ఏమైనా మెరుగ్గా ఉంటాయా..? లేదా మీ పిల్లలు ముందర మరణించారనుకోండి అప్పుడేమైనా మెరుగ్గా ఉంటాయా..? ఉండవు కదా..? ఇది ఈ విధంగానే జరగాలి. అవును.. మనం ప్రేమించినవాళ్లని, జాగ్రత్తగా అట్టిపెట్టుకోవడానికి, శాయశక్తులా ప్రయత్నించాలి..కానీ, వారు మనల్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, మనం హుందాగా ఉండాలి. అలాగే మనం వెళ్లిపోవలసిన సమయం వచ్చినప్పుడు కూడా హుందాగానే ఉండాలి. ఇది మీకు చెందినది కాదు. మీరు, దీనిని కేవలం అప్పు తీసుకున్నారు... అంతే! దీనికి ఎటువంటి వడ్డీ లేదు. కానీ, మీరు దీనిలో ప్రతీ అణువు తిరిగి ఇచ్చేయవలసిందే..! ఇది,  ఆ విధంగానే ఉంది. అందుకని మీ నాన్నగారు ఆ ఋణం తీర్చేశారు. ఇందులో, మీ సమస్య ఏమిటి..? ఆయన పద్దులను సరిసమానం చేసేసుకున్నారు. ఆయన బ్యాలన్సుషీటు ఖాళీ అయిపోయింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు