ఉపవాసం చేసి స్వచ్ఛందంగా శరీరాన్ని విడవడమనే జైన సంప్రదాయాన్ని ఇటీవల న్యాయస్థానం చట్టబద్ధం కాదని తీర్పు ఇచ్చిన సందర్భంలో ‘‘ఉద్దేశపూర్వకంగా వ్యక్తి తన నశ్వర శరీరాన్ని విడిచిపెట్టడం’’ గురించి సద్గురు వివరిస్తున్నారు. దీనికి ఎంతో ప్రాముఖ్యముందనీ, ఈ తీర్పులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసిన చట్టాలను కొనసాగింపు చట్టాలపై ఆధారపడినవనీ ఆయన వివరిస్తున్నారు.

Sadhguruస్వచ్ఛందంగా ఎరుకతో  భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడమనే సంప్రదాయం కేవలం జైనసముదాయానికే పరిమితం కాదు. యోగ సంస్కృతిలో ఇది సాధారణ సంప్రదాయం. హిందూ సంస్కృతిలో ఇది ఒక భాగం. నశ్వరమైన దేహాన్ని స్వచ్ఛందంగా త్యజించిన సందర్భాలు చారిత్రక, పౌరాణిక కథనాల్లో ఎన్నో కనిపిస్తాయి.

మనం ఈ చర్యను,  ఫలవంతమైన వివేకంగానూ, వ్యక్తి జీవిత నశ్వరత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించడంగానూ చూడడం జరిగింది. ఇది కేవలం అన్నపానీయాలను త్యజించడంగానే కాదు, మనం  సంపాదించుకున్న ఈ శరీరంతో - ఈ భూమిలో ఒక చిన్న  భాగమైన ఈ శరీరంతో మనకున్న సంబంధాన్ని కూడా పరిశీలించడం ఈ ప్రక్రియలో భాగం. ఈ ప్రయత్నంలో ఉపవాసం అన్నది ఒక పద్ధతి, ఒక సాధనం. యోగ శాస్త్రంలో, కొద్ది గంటల్లోనే దేహం నుండి విముక్తి పొందడానికి  ఎన్నో పద్ధతులున్నాయి. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, చైతన్యంతో దేహాన్ని విడిచిపెట్టడం అన్నది మహోన్నతమైన  ప్రాధాన్యత గల అంశం - అంటే  రోగిగా శరీరం విడవడం కాకుండా, యోగిగా దేహాన్ని విడవడం అన్నమాట.

పండ్లు నేలమీద రాలినప్పుడే ఆయన వాటిని తినేవాడు; లేకపోతే ఆయన వాటిని తాకేవాడు కూడా కాదు.

కర్ణాటకలో నిర్మలానంద స్వామి అనే సాధువు ఉండేవాడు. ఆయన జీవితంలోని చివరి సంవత్సరాలలో నేను ఆయనతో చాలా సన్నిహితంగా గడిపాను. ఆయన వయస్సు 72 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆయన ఇచ్ఛాపూర్వకంగా దేహత్యాగం చేసారు. ఇలా చేయడానికి కొన్ని వారాల ముందర, తాను 1997 జనవరిలో దేహం విడుస్తానని ఆయన ప్రకటించాడు. అప్పుడు పత్రికల్లో దీనిపైన చాలా గొడవ జరిగింది; ఆయన ఆత్మహత్య చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ హేతువాదులు ఆయనపై కేసుపెట్టారు. దీనితో ఆయన ఆశ్రమం వెలుపల ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను కాపలాపెట్టారు. ఆయన ఆశ్రమం నాలుగెకరాల భూమిలో ఉంది. అంతకుముందు గడిచిన పధ్నాలుగేళ్లలో ఆయన అసలు ఆశ్రమంలో నుండి బయటకు అడుగేపెట్టలేదు. ఆశ్రమంలో ఎన్నో పండ్ల చెట్లున్నాయి. కాని ఆయనెన్నడూ ఒక్క పండైనా కోసి ఎరగడు. ఆయన చెట్లకు హాని చేయదలచుకోలేదు. పండ్లు నేలమీద రాలినప్పుడే ఆయన వాటిని తినేవాడు; లేకపోతే ఆయన వాటిని తాకేవాడు కూడా కాదు. ఆయనకొక చిన్నగుడి ఉంది. పూజకు కూడా ఆయన పూలు కోసేవాడు కాదు. రాలిన పువ్వులే ఉపయోగించేవాడు. అటువంటి సాత్విక జీవనం గడుపుతూ ఉండేవాడు. అయితే 1996 డిశంబరులో నేను ఆయనను చూడడానికి వెళ్లినప్పుడు ఆయన నన్ను కావిలించుకొని ఏడ్చాడు, ‘‘వాళ్లు నా ఆశ్రమంలో పోలీసులను పెట్టారు’’ అని. అలా పోలీసులను పెట్టారన్న అవమానమే ఆయన్ను ఎక్కువగా బాధ పెట్టింది.

ఒకరోజున ఆయన ఉపవాసం ప్రారంభించడంతో, అక్కడ అంతా సంచలనం మొదలైయింది. ఆయన తాను దేహాన్ని విడిచి వెళ్లిపోతానని చెప్పిన రోజున ఆయన్ను అరెస్టు చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన వీటన్నిటితో విసిగిపోయాడు. అయన చెప్పిన రోజుకు రెండు రోజులముందు ఆశ్రమం ముందున్న చిన్న వరండాలో కూర్చుని అతి మామూలుగా, నిశ్శబ్దంగా దేహత్యాగం చేశాడు. ఇది పోలీసులతో సహా నలభైమంది సమక్షంలో జరిగింది. సమయం వచ్చినప్పుడు ఈ విధంగా దేహాలను విడిచిన ఎందరో వ్యక్తుల ఉదాహరణలు ఈ దేశంలో ఎన్నో లభిస్తున్నాయి. మనుషులే కాదు తమకు వెళ్లవలసిన సమయం వచ్చిందని గ్రహించినప్పుడు జంతు ప్రపంచంలో కూడా అనేక ప్రాణులు ఆహార పానీయాలు విడిచిపెడతాయి. కొన్ని తాచుపాములు ప్రాణాలు వదలడం నేను చూశాను. అవి ప్రశాంతంగా వెళ్ళిపోవడం కోసం తిండీ, నీరూ వదిలి ఒక నిర్దిష్ట స్థలంలో ఉండడాన్ని నేను గమనించాను.

శరీరాన్నిలా అనవసరంగా అంటిపెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది పాశ్చాత్య ప్రభావాల కారణంగానే.

దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో మనదేశంలోని చాలామంది వైద్యులు, తమ పాశ్చాత్య మిత్రులను అనుకరిస్తూ, ప్రతివాళ్లూ వైద్యుల చేతుల్లోనే ప్రాణాలు వదలాలని అనుకుంటున్నారు, అది కూడా భారీ వ్యయంతోనని గుర్తుంచుకోవాలి. శరీరాన్నిలా అనవసరంగా అంటిపెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది పాశ్చాత్య ప్రభావాల కారణంగానే.

రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు కేవలం చట్టానికి అర్థం చెప్తున్నారంతే. ఈ చట్టాలు భారత నేరస్మృతి (ఐపిసి)ని 1857 భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానంతరం కొద్ది సంవత్సరాలకు 1860లో రూపొందించినవన్న విషయం మరచిపోకూడదు. ఈ తీర్పు కేవలం మన వివేకం మీద మెకాలే (Macaulay) ప్రభావం చూపించడమే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు