భారత ప్రభుత్వం విధానాలూ, పని తీరు గురించి సద్గురు అభిప్రాయం

ప్రశ్న: ఈ ప్రభుత్వం పని తీరు ఎలా ఉందంటారు?

సద్గురు: అసలు సమస్య ఒకటే అదేమిటంటే, మనం దేశాన్ని ప్రభుత్వం నడిపిస్తుందని అనుకోవటం. నిజానికి ప్రభుత్వం విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకొంటుంది. ప్రజలు, తమకు తెలియకుండానే,  తమ జీవితాలెలా నడుపుకోవాలో నిర్దేశించమని ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తుంటారు. ప్రభుత్వం పని సరైన విధానాలు ప్రవేశపెట్టటమే. ఆ కోణం నుంచి చూస్తే, ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేతమైన విధానాలు ప్రవేశ పెట్టిందనే నాకనిపిస్తున్నది. దేశానికి సంబంధించిన మూల వ్యవస్థలలో పరివర్తన తేవటానికి విధానాలు రూపొందించటంలో ప్రభుత్వం పని తీరు చాలా బాగుంది. ఇంటి పునాదులు మారుస్తున్నప్పుడు, పై కప్పు కొంత భాగం కూలి పడచ్చు.

అది మన తల మీద పడితే మనకు నచ్చదు. కానీ, పునాదులు బలహీనమైపోతే గగ్గోలు పెట్టేది మనమే. (ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో)మౌలికమైన వ్యవస్థాత్మక పరిణామాలు జరుగుతున్నాయని నేననుకొంటున్నాను. ఎన్నో అడ్డంకులు ఎదురైనా, ప్రభుత్వ విధానాల రూపకల్పన  శ్రద్ధగానే  సాగిందని నాకనిపిస్తున్నది. విద్యారంగంలో మాత్రం చేయవలసినంత చేయలేదన్నదొక్కటే నాకు నిరాశ కలిగిస్తున్నది. సంచలనాత్మకమైన మార్పులు వస్తాయని నేను ఊహించాను. కానీ చిన్న చిన్న మార్పులు మాత్రమే వచ్చాయి. నేను వాళ్ళతో సంప్రదింపులు జరిపాను. వాళ్ళు కొత్త ఆలోచనలు స్వీకరించటానికి సిద్ధంగానే ఉన్నారు. మార్పు లు జరిపేందుకు సన్నద్ధత ఉంది.

ప్రశ్న: ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులలో మీకు బాగా నచ్చిందేమిటి ?

సద్గురు: వస్తు, సేవల పన్ను- జీ.యస్. టీ. - చాలా పెద్ద మార్పు. అది అసౌకర్యంగా ఉందని ప్రజలు ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, కానీ ఈ మార్పు తీసుకురాకపోతే, మీరు రోజూ పదమూడు రకాల వేరు వేరు పన్నులు కట్టుకోవాలి. ఇక్కడ మీరు  గ్రహించాల్సిన విషయం ఏమిటంటే,  ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసే విభాగాల సంఖ్య ఎంత ఎక్కువయితే, అవినీతి అంత ఎక్కువగా ఉంటుంది. మనకున్న అనేక విధాలైన పన్నులను, ఒకటి రెండు తరగతుల కింద కుదించటం క్లిష్టమైన వ్యవహారం. మొత్తం మీద జీ.యస్.టీ. బాగానే ఒక కొలిక్కి వచ్చిందని నేననుకొంటున్నాను. ఇది చిన్న వ్యాపారులను దెబ్బ  తీస్తున్నట్టు కనిపిస్తుందేమో కానీ, మనం ఇప్పుడీ సమస్య పరిష్కరించుకోకపోతే, మన దేశమే ఒక 'చిన్న వ్యాపారం' గా మిగిలిపోతుంది. దేశం పెద్ద వ్యాపార శక్తిగా ఎదగాలంటే, కొన్ని మౌలికమైన చట్టాలను దృఢసంకల్పంతో ప్రవేశపెట్టక తప్పదు.

ప్రశ్న: సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి మేలు జరుగుతుందంటారా ?

సద్గురు: ఈ భారతదేశంలో అంతర్భాగంగా ఎన్నో భారత దేశాలున్నాయి. దేశ జనాభాలో దాదాపు నలభై శాతం దారుణమైన దారిద్ర్యంలో మగ్గుతున్నారు. మనం మాట్లాడుకోవాల్సింది అణగారిఉన్న ఆ భారతదేశం గురించి. ఆ భారతదేశం బాగు కోసం, రాబోయే అయిదు పది సంవత్సరాల పాటు పటిష్ఠమైన, సుస్థిరమైన ప్రభుత్వం మనకు అవసరం.

మనకు వాద వివాదాలూ, నాటకీయ పరిణామాలూ కావాలనుకొంటే సంకీర్ణ ప్రభుత్వాలు వాటిని అందించగలవు. కానీ వాటి వల్ల పని జరుగుతుందా అన్నది ప్రశ్న. తమ గాలి మాటలతో తామే మురిసిపోయే కడుపు నిండిన బేరాల వారు సంకీర్ణ ప్రభుత్వాలను ఇష్టపడతారు.

సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే, పని జరుగుతుంది. ఇప్పుడు మనమున్న గోతిలోనుంచి ముందు బయటికి రాగలిగితే, తరవాత  అన్ని రకాల చిత్ర, విచిత్రమైన విషయాల గురించీ మాట్లాడుకోవచ్చు.  ప్రభుత్వం సుస్థిరంగా, సుపరిపాలన అందించే స్థితిలో ఉండాలి. స్థిరత్వం కోసం వెతుకులాడుతూ దిన దిన గండంగా పడుతూ లేస్తూ ఉంటే కుదరదు. మన దేశానికి, యువ జనాభా రూపంలో ఒక అమూల్యమైన వనరు ఉంది. ఇది మరో పది, పదిహేను సంవత్సరాలు మాత్రమే లభ్యమౌతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనకు సుస్థిరత అవసరం.

ప్రశ్న: మీరు ఇటీవల స్టెర్లైట్ గురించి, తమిళనాడులో నిరసనల గురించి చేసిన వ్యాఖ్యలు,  పరిశ్రమలూ-పర్యావరణ కాలుష్యం చర్చను మళ్ళీ లేవనెత్తాయి.

సద్గురు: నేనన్నదల్లా దేశంలో చట్టాలు ఉన్నాయి అని మాత్రమే. ఎవరయినా చట్టాలను ఉల్లంఘిస్తే, చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఒక పారిశ్రామిక సంస్థకు సంబంధించిన సమస్యలు వీధి పోరాటాలతో పరిష్కరించలేము. మీ వాదం న్యాయమైనది అని మీరు భావించినంత మాత్రాన శాసన ఉల్లంఘనను సమర్థిస్తామంటే కుదరదు. నిజంగా మీ వాదం న్యాయమైనదయినా, అనుసరించవలసిన ప్రక్రియలేవో వాటిని అనుసరించాలి.

ప్రశ్న: గంగా నదిని శుభ్రపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి, మీ విశ్లేషణ ఏమిటి?

సద్గురు: అసలు కాలుష్యం కంటే పెద్ద సమస్య, నీటివనరులే తగ్గిపోవటం. మీకు గట్టి సంకల్పం ఉంటే, కాలుష్య సమస్యను కొన్ని సంవత్సరాలలో పరిష్కరించగలరు. కానీ తగ్గుతున్న నదీ జలాల సమస్య పరిష్కరించాలంటే ఎన్నో దశాబ్దాలు పడుతుంది. గంగా నది విషయానికొస్తే, గంగలో కాలుష్యాలలో 70 శాతం పారిశ్రామిక కాలుష్యాలు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం అయితే, ఏ పారిశ్రామిక సంస్థ వల్ల కాలుష్యాలు ఏర్పడుతున్నాయో, ఆ సంస్థే ఆ కాలుష్యాలను శుద్ధి చేసే చర్యలు తీసుకోవాలి. ఈ విధానాన్ని మార్చవలసిన అవసరం ఉంది. కాలుష్యాలను శుద్ధి చేసే సంస్థ వేరుగా ఉండాలి.

నీ సంస్థ వల్ల ఉత్పన్నమైన కాలుష్యాలను శుద్ధి చేయటమే నా సంస్థ వ్యాపారం అయితే, నేను కాలుష్యాలు నదిలో కలవకుండా జాగ్రత్త పడతాను. మేము ప్రభుత్వానికి ఇదివరకే ఈ సిఫారసులు అందజేశాం. వాటి మీద ప్రభుత్వం సరైన దిశలోనే చర్యలు చేపడుతున్నట్టు కనిపిస్తున్నది. గంగా నది కాలుష్య సమస్యను 70 శాతం పరిష్కరిస్తామని నితిన్ గడ్కరీ గారు అన్నది ఈ నేపథ్యంలోనే.

https://twitter.com/sadhgurujv/status/912927832417775617

అసహనం గురించి, మూక తీర్పు (lynching)ల గురించి సద్గురు అభిప్రాయం

ప్రశ్న : సమాజంలో అసహనం పెరిగిపోతున్నదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని మీరెలా చూస్తారు?

సద్గురు: నా చుట్టూ నేను గమనించగలిగినంత వరకూ, మతఘర్షణలూ, ఇతర కల్లోలాల విషయంలో, గత డెబ్భయి ఏళ్ళకంటే, ఇప్పుడు మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని నాకనిపిస్తున్నది. ఏ గ్రామానికయినా వెళ్ళండి. ఏ జన సముదాయాన్నయినా చూడండి. జరగవలసింది ఇంకా చాలా ఉన్న మాట వాస్తవమే అయినా, కులాల పట్టింపులూ, మతాల పట్టింపులూ గణనీయంగా తగ్గాయి.

ఒక్క తేడా ఏమిటంటే, ఈ కాలంలో చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతివాళ్లూ జర్నలిస్టులే. మూక తీర్పులూ (lynching), హత్యలూ ఈ దేశంలో కొత్త కాదు. మూక హత్యలు జరుగుతున్నాయంటే, చట్టం అమలు జరగటం లేదని అర్థం. జనసమూహాలు ఏదయినా విషయాన్ని తమంతట తాము పరిష్కరిస్తామని పూనుకొంటే ఇలాగే జరుగుతుంది. నేను దీన్ని సమర్థించటానికి ప్రయత్నించటం లేదు. ఇది మన దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కనిపించే ఒక దురదృష్టకరమైన వాస్తవం.  భయాందోళనలు వ్యాపింపచేయటం కూడా ఎప్పుడూ జరుగుతూ వస్తున్నదే. ఇప్పుడు సాంకేతిక విజ్ఞానం సహాయంతో ఇది మరింత వేగంగా జరుగుతున్నది. ఈ మూక దాడులు ఒక వర్గానికి మాత్రమే విరుద్ధంగా జరుగుతున్నాయని కొందరనుకొంటున్నారు. కానీ ప్రజల మూకలు ఎవరి మీదనయినా దాడి చేయగలవు. ఇది భయం వల్ల, అజ్ఞానం వల్ల జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న: సుప్రీం కోర్టు వారు మూక హత్యలను అరికట్టే చట్టం ఒకటి ఉండాలి అంటున్నారు. మీ అభిప్రాయం?

సద్గురు: మీరు కొత్త చట్టాలు తేగలరు.  కానీ, వాటిని అమలు చేసేదేవరు ?  భారత దేశంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 12-13 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళలో నలుగురు రాత్రి షిఫ్టువాళ్ళు. ఇద్దరు సెలవు మీద ఉంటారు. మిగిలిన ఏడెనిమిది మందితో చట్టాలు అమలు చేయటం అనేది సాధ్యమైన పనే అనుకొంటున్నారా?  భారతదేశంలో సంఘ వ్యవస్థను సంఘమే రక్షించుకొంటుంది. పోలీసులు రక్షించరు. కొద్దిమంది నిరాయుధులైన పోలీసులు ఒక జన సమూహం కోపోద్రిక్తతను నియంత్రించ గలదనుకొంటున్నారా?

చట్ట సభలలో స్త్రీల రిజర్వేషన్ బిల్లు గురించి సద్గురు అభిప్రాయం

ప్రశ్న: రాజకీయ దళాలన్నీ కూడివచ్చి, స్త్రీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించవలసిన సమయం వచ్చిందంటారా?

సద్గురు: 'ముప్ఫయి మూడు శాతం మాత్రమే ఎందుకు?' అని నా ప్రశ్న. స్త్రీలు దేశ జనాభాలో దాదాపు యాభయి శాతం ఉన్నారు. మరి రిజర్వేషన్ 33 శాతానికి పరిమితం చేయటం ఎందుకు? మీరు ఎవరికయినా కేవలం లింగ భేదం ఆధారంగా ఏదయినా పదవి ఇస్తే, అది లింగ వివక్ష అవుతుందని నాకనిపిస్తున్నది. తమ సమర్థత వల్ల జనంలో విశ్వసనీయత పెంచుకోగలిగిన వారు నాయకులుగా ఎన్నికవుతారు. అలా కాకుండా, లింగభేదం ఆధారంగా వాళ్ళను మీరు ఎంపిక చేస్తామనేట్టయితే, స్త్రీల శాతం 33% కే పరిమితం అవుతుంది. మనం బాలికలకు బాగా విద్య నేర్పించాలే గానీ, రేపు పార్లమెంటులో వాళ్ళ సంఖ్య ఎనభయి శాతానికి చేరుతుందేమో, ఎవరు చెప్పగలరు? విధానాల నిర్ణయాధికారంలో లింగ వివక్షకు తావుండకూడదు. వివక్ష ప్రజా స్వామ్యాన్ని భంగపరుస్తుంది.