మునుపెన్నడూ మానవాళి చరిత్రలో లేని విధంగా ఈ రోజున ఆహారాన్ని మనం  క్రమబద్ధీకరించాం. ఈరోజున,  మన దగ్గర డబ్బులు ఉంటే, మనం ఒక స్టోర్ కి వెళ్ళి, మనకి సంవత్సరానికి కావల్సిన ఆహారాన్నంతా కొనుక్కొని ఇంటికి రావచ్చు. మనం, ఇంటి గడప కూడా దటనవసరం లేకుండా జీవించవచ్చు. కనీసం 25-30 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి విషయం జరగడం అన్నది అసాధ్యం. ఎన్నోవేల సంవత్సరాల మానవాళి చరిత్రలో, ఆహారం అన్నది ఎప్పుడూ మానవాళికి ఒక ప్రధానమైన సమస్యగానే ఉండేది. ఇప్పుడు, మనం ఆహార నిలవల్ని ఎంతో క్రమబద్ధంగా చేశాం కాబట్టి, అవి సంవత్సరం పొడవునా మనకు అందుబాటులో ఉన్నవి కాబట్టి, మన దృష్టిని మనం వేరే విషయాలవైపుకి మళ్లించగలుగుతున్నాం. ఇంతకు మునుపెన్నడూ ఇలా జరుగలేదు.

ప్రతీ సమాజంలోనూ, ప్రతీ సాంప్రదాయంలోనూ కూడా కరువులు అన్నవి సహజంగా ఉండేవి. మన సాంప్రదాయంలో కరువులు వచ్చినప్పుడు, గ్రామీణ వాసుల్లో ఒక సామాన్యమైన వివేకం ఏమిటంటే - ఇంటిలో కనుక ఒక ఆవు ఉన్నట్లైతే, పిల్లల్ని బ్రతికించుకోవచ్చునని.  ఇంట్లో ఒక ఆవు లేకపోతే, పిల్లలు పోషణ లేక మరణిస్తారు. ఇది అంత తేలికైన విషయం. అందుకని ఆవు సహజంగానే ఒక తల్లి లాంటిదిగా భావించబడ్డది. ఆవు మనకి ఒక పెంపుడు తల్లి లాంటిది. మన తల్లి స్తన్యం మనకి ఆహారాన్ని ఇవ్వలేనప్పుడు, మనకి ఆవు దగ్గర నుంచి ఆహారం అన్నది వస్తుంది.  అందుకని, ఆవు అందరికీ ఒక తల్లి లాంటిది.

ఆవు మనకు తల్లి తరువాత తల్లి లాంటిది. అందుకని ఈ సాంప్రదాయంలో ఆవుకి కొంత పవిత్రతను జోడించి పవిత్రంగా చూసుకుంటాం.
మనమందరం ఏదో ఒక సమయంలో ఆవు పాల మీదే మన పౌష్టికతను తీసుకున్నాం. ఔనా..? కాదా..? ఇది మనకి ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే తన బిడ్డకు అందించాల్సిన పాలు అది మనల్ని తీసుకొనిస్తుంది. నిజానికి మనం అది అలా నమ్ముతాం అంతే..! అది మనల్ని తీసుకొనిస్తుందో లేదో..?! మనం దానినుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనకు అటువంటి పౌష్టికతను ఇస్తుంది. ఆవు మనకు తల్లి తరువాత తల్లి లాంటిది. అందుకని ఈ సాంప్రదాయంలో ఆవుకి కొంత పవిత్రతను జోడించి పవిత్రంగా చూసుకుంటాం.

మరొక కారణం ఏమిటంటే, మానవులకి ఉన్నటువంటి భావాలు ఆవుకి కూడా ఉంటాయి. మీ బాధకి, మీ దుఃఖానికీ ప్రతిస్పందించగల జంతువు ఆవు. ఒకవేళ మీరు చాలా విచారంగా ఉన్నారనుకోండి, ఆవు దానిని అనుభూతి చెంది,  మీ బాధకు అది కన్నీరు కారుస్తుంది. అందుకే మన భారతదేశంలో గోవధ చేయకూడదని చెప్పాం. ఎందుకంటే దాని భావాలు మానవుడి భావాలకు ఎంతో దగ్గరగా ఉంటాయి. ప్రజలు ఆవులతో ఎంతో లోతైన అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈరోజున ఇదంతా పోయింది. అవన్నీ కూడా డెయిరీ ఫారాలలో ఉన్నాయి. వాటినుండి పాలు పితకడం..అంతే మనకు తెలిసినదల్లా. కానీ గ్రామాల్లో ప్రజలు ఆవులతో ఎంతో సన్నిహితమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు