సాధారణంగా మనుషులు వారి ఆనందాన్ని మనోభావపరంగా చూస్తారు. నేను మిమ్మల్ని దీన్ని సాంకేతిక పరంగా చూడమంటాను. ఎందుకంటే మనోభావాలు రసవంతంగా, బాగానే ఉంటాయి, కానీ మీరు వాటిని తిరిగి సృష్టించలేరు. మీరు వాటిని తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తే, అవి డాంబికంగా, బాధాకరంగా తయారవుతాయి. దానిని మీరు సాంకేతిక పరంగా చూస్తే, మీకు ఆనందంగా ఉండటంలోని మెళుకువలు తెలిస్తాయి. అప్పుడు మీరు దానిని ఎల్ల వేళలా సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం ఆనందంగా ఉండాలని మీరు ఎన్నో ప్రయత్నాలు, ఏవేవో పనులు చేస్తున్నారు గానీ, అవి పని చేయటం లేదు.

నేను మీకు ఒక జోక్ చెప్పనా? మీరు బానే ఉన్నారా? మీరు ఎంత సీరియస్ గా ఉన్నారంటే నాకు జోక్ చెప్పటానికి కూడా భయం వేస్తోంది. ఒక రోజు ఒక ఎద్దు, ఒక పిట్ట ఒక పొలంలో మేస్తున్నాయి. ఎద్దు మేస్తూ ఉంటే, పిట్ట దాని మీద ఉన్న పేలు ఏరుతోంది. పిట్ట ఆ పొలం కొనకు ఉన్న ఒక పెద్ద చెట్టుని చూసి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకానొక సమయంలో ఆ చెట్టు చిటారు కొమ్మకు ఎగిరే దాన్ని, కానీ ఇప్పుడు నా రెక్కలలో దాని కింది కొమ్మ మీదకు ఎగిరేంత బలం కూడా లేదు!’ అని వాపోయింది. అప్పుడా ఎద్దు ‘‘అదేమి పెద్ద సమస్య కాదు, రోజూ నా పేడ కాస్త తిను. పదిహేను రోజుల్లో నువ్వు కోరుకుంటున్నట్లుగా చెట్టు చిటారు కొమ్మకు ఎగరగలవు!’’ అని ధైర్యం చెప్పింది. అప్పుడు పిట్ట ‘‘హాస్యంగా ఉందా?! ఏమిటీ ఈ అర్థం లేని మాటలు?” అంది . ‘‘నిజం, ప్రయత్నించి చూడు, మనుషులంతా అదే చేస్తున్నారు!’’ అంది ఎద్దు. పిట్ట అయిష్టంగానే ఆ పేడ కొంచెం తిన్నది, ఆ రోజే అది చెట్టు మొదటి కొమ్మ పైకి ఎగరగలిగింది.

పదిహేనోరోజున అది చిటారు కొమ్మకు ఎగిరి కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తోంది. అలా చిటారు కొమ్మ మీద బాగా బలిష్ఠంగా ఉన్న పిట్టని ఒక ముసలి రైతు చూశాడు, అతను వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీతో ఆ పిట్టను కాల్చాడు.

ఇందులోని నీతి ఏమిటంటే చాలా సార్లు ఎందుకు పనికిరానిది కూడా మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్ళగలదు, కానీ దాని వలన ఎప్పటికీ మీరు అక్కడే ఉండడం సాధ్యంకాదు. అది మిమ్మల్ని ఎప్పటికీ అక్కడే ఉంచలేదు, అవునా, కాదా? మీరు మీ సంతోషంతో అదే చేస్తున్నారు, ఎలాగైనా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్క క్షణం ఆనందంగా ఉంటున్నారు, మరొక క్షణం దుఃఖంతో ఉంటున్నారు. మీరు ఇటువంటి ప్రయత్నంతో శాశ్వత ఆనంద స్థితిని చేరుకోలేరు.

మీరు మీ ఆనందాన్ని పదేపదే కోల్పోతూ ఉంటారు. మీరు "ఆనంద రహస్యం ఇదే!” అని ఎన్ని సార్లు అనుకున్నా కూడా, అది పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు దానిలోని మెళుకువలని అర్ధం చేసుకోవటం లేదు.

అందుకనే మీరు మీ ఆనందాన్ని పదేపదే కోల్పోతూ ఉంటారు. మీరు "ఆనంద రహస్యం ఇదే!” అని ఎన్ని సార్లు అనుకున్నా కూడా, అది పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు దానిలోని మెళుకువలని అర్ధం చేసుకోవటం లేదు. మీరు ఎలాగో ఓలాగా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు ఎలాగో ఓలాగా ఆనందాన్ని పొందలేరు. మీరు ఎక్కడికి చేరాలన్నా, ఏమి చేయాలన్నా, మీరు ఏదైనా ఫలితాన్ని మీ అంతరంగంలో కానీ, బయట కానీ సృష్టించాలనుకున్నా, తదనుగుణంగా మీరు సరైన పనులు చేయాలి.

మీరు సరైన పనులు చేయకపోతే, కావలిసిన ఫలితం రాదు. మనుషులతో సమస్య ఏమిటంటే తమ లోపల గానీ, బయట గానీ ఏదో విధంగా వారికి కావలిసినది సృష్టించగల మనుకుంటారు. అది అలా సాధ్యం కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.