ప్రశ్న: మన ఆలోచనలే మన కర్మ వ్యవస్థని ప్రతిబింబిస్తాయి. అంటే, మన ఆలోచనా సరళిని మార్చుకుంటే మన కర్మ వ్యవస్థని ప్రభావితం చేయవచ్చునా? మనం దాని నుండి విముక్తి పొందటమెలా?

సద్గురు: ఆలోచనకు, ఆలోచన ప్రక్రియకు భేదం ఉంది. ఆలోచనలు ఊరికే అలా తేలిపోతూ ఉంటాయి. అవి మీ మనసులో ఉండే విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఆలోచన ప్రక్రియ అంటే మీరు మీ సంకల్పంతో ఒక విషయంపై ఆలోచించటం. మీరు ఎలా ఆలోచిస్తారు అనే విషయం మీ మనసులో ఉన్న విషయాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, మీరు వెళ్ళాలనుకుంటే, దానిని దాటి వెళ్ళే విచక్షణా శక్తి మీ బుద్ధికి ఉంది. ఈశా ఫౌండేషన్ వారి ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమంలో ఇరవై ఒక్క నిముషాల అభ్యాసాన్ని మీకు నేర్పేందుకు, మీతో మేము ఇంచుమించు ముప్ఫై గంటల సమయాన్ని వెచ్చిస్తాము. ఆ సమయంలో మేము చేస్తున్నదల్లా సంకల్ప పూర్వకంగా మీరు మీ కర్మపరిమితులను అధిగమించి ఆలోచించడానికి సహాయపడటమే! మీరు ఏదైనా ఒక సాధనను, లేదంటే ఒక క్రియను చేస్తుంటే మీ ఆలోచన దానికి సహకరించనప్పుడు, శక్తి ఊర్ధ్వముఖంగా పయనించినా, మీ ఆలోచన క్రిందికి పయనించగలదు. ఒకవేళ ‘ఆలోచన’ - ‘శక్తి’ రెండూ ఢీకొంటే అది కొంత ఘర్షణకు, పోరాటానికి దారితీస్తుంది.

చాలా మందికి ఇదే జరుగుతోంది. మీరు కార్యక్రమంలో కూర్చుని హఠాత్తుగా “అంతా నేనే చేస్తున్నాను, ఇంతకాలం ఎవరో నాతో ఏదో చేయించుతున్నారని అనుకుంటున్నాను కానీ అదికాదు నిజంగానే నేనే చేస్తున్నాను” అని గ్రహిస్తారు. కార్యక్రమం పూర్తైన మూడు నెలల వరకు మీరు అదే విధంగా అనిపిస్తుంది. అదంతా ఒక కలలా అనిపిస్తుంది - అంతా మారిపోతుంది. కానీ ప్రజలు నెమ్మదిగా తమ పాత పద్ధతుల్లోకి జారిపోతారు. మీరు మళ్ళీ మీ జీవితంలో జరుగుతున్న దానికి ఇతరులను నిందించటం ప్రారంభిస్తారు. అంటే మీరు మీ అజ్ఞానాన్ని పునః స్థాపించుకుంటున్నారని అర్థం. ఆ సమయంలో మీ సాధన ఫలించటానికి సరైన పరిస్థితులు లేవు. తగిన మానసిక వాతావరణాన్ని సృజించుకోకుండా మీరు అభ్యాసం చేసినట్లయితే మీలో ఏమార్పూ రాదు, కేవలం ఆరోగ్యం మెరుగు పడుతుంది.

దీనికి కారణం మీ అభ్యాసం విఫలం కావటం కాదు, సాధన పనికిరానిదై పోవటం కాదు. మీరు మీ సాధన ఫలించటానికి అనువైన మానసిక వాతావరణాన్ని కల్పించుకోక పోవటమే అందుకు కారణం. శాంభవి మహా ముద్ర క్రియను (ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం లోనిది) తగిన మానసిక వాతావరణం లేకుండా చెయ్యాలని చూస్తే, మీ శక్తి పైకి వెళుతుంది, కానీ మీ మనస్సు దాన్ని క్రిందికి లాగుతుంది. అందువల్ల మీలో ఈ కార్యక్రమాన్ని చేసినవారు ఇన్నర్ ఇంజనీరింగు లోని మూడు నిముషాల సంక్షిప్త కోర్సును శాంభవి ముద్ర చేసే ముందు ప్రతిరోజూ చేయవలసి ఉంటుంది.

ఈ సంక్షిప్త కోర్సు చెయ్యటం వల్ల మిమ్మల్ని మీరు కర్మవ్యవస్థ నుండి దూరం చేసుకోగల మానసిక వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఆ మానసిక వాతావరణాన్ని ఏర్పరుచుకోకపొతే, మీ మనసులోని విషయం మిమ్మల్ని పట్టి ఉంటుంది. దానిని సరిచేసేందుకే ఖచ్చితమైన మార్గాన్ని అందించటమే మీకు మేము ఇన్నర్ ఇంజనీరింగులో నేర్పించేది. మీరు ఎక్కడా చిక్కుకుపోయే అవకాశమే లేదు. అలా మానసిక వాతావరణాన్ని నియంత్రించు కున్నాక ప్రతిరోజూ చేసే అభ్యాసం మీ పురోగతికి నిరంతరం సహాయపడుతుంది. మీరు జీవించినన్నాళ్ళూ పురోగమిస్తూ, అందులోని గాఢ స్థితులకు చేరుకుంటారు. ఈ ఒక్క అభ్యాసం చాలు, మీరు వివిధ పద్ధతులను అనుసరించే పనిలేదు. మిమ్మల్ని మీరు ఈ ఒక్కదానికి అర్పించుకుంటే అదే మిమ్మల్ని చివరిదాకా తీసుకొని వెళుతుంది. కర్మ వ్యవస్థకు అతీతంగా ఉండటం అంటే, దాన్ని మరచి పొమ్మని కాదు. మతిమరపులో స్వేచ్ఛ లేదు. దాన్ని తెలుసుకుని, దానికి తగులుకోకుండా ఉండడం ముఖ్యం. ఏదైనా తెలియకపోవడం స్వేచ్ఛ కాదు. దానిని తెలుసుకొని కూడా, అందుకు కట్టుబడకుండా ఉండటమే ముఖ్యం. మీరు ఈ వాతావరణాన్ని ఏర్పరచుకుంటే అది మిమ్మల్ని కర్మ వ్యవస్థని అధిగమించేలా చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు