“సధ్గురూ! మీరు వేరే దేవతను కాకుండా లింగభైరవినే ఎందుకు ఎంచుకున్నారు?” అని జనాలు నన్ను అడుగుతున్నారు. మనం ఆమెను ఎన్నుకోలేదు - ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వ్యవహరించేటట్లు మనం ఆమెను తయారు చేసి, జన్మనిచ్చాం. ‘‘సధ్గురూ, అయితే లింగభైరవిని మీరే తయారు చేశారు - ఆమె వాస్తవం కాదన్నమాట!”. మనం చాలా తయారు చేస్తుంటాము, కాని అవి కూడా వాస్తవమే. మనం ఒక చెట్టు నాటితే, అది వాస్తవమే కదా? మీ తల్లితండ్రులు మీకు జన్మనిచ్చారు, మీరు వాస్తవమే కదా? ప్రాణము లేని మోటర్ సైకిల్ యొక్క ఇంజిన్ లోహంతో చేస్తారు, కాని ఉపయోగిస్తే, అది చేసే పనులు మనం కూడా చేయలేము కదా. అందుకే మనం యoత్రాలను తయారు చేస్తాం. మనం చేయలేని పనులను అవి చేయగలుగుతాయి.

linga bhairavi

లింగభైరవి ఒక రకమైన యంత్రం. మీరు కూడా ఒక రకమైన యంత్రమే.  మనుషులు తమ జీవితంలో తమకై తాము చేయలేని కొన్ని పనులు చేసేందుకు సహాయపడే విధంగా లింగభైరవి ఒక నిర్దిష్టమైన పద్దతిలో తయారు చేయబడింది. ఎందుకంటే ఆమెకు భౌతిక శరీరాన్ని భరించి, పోషించాల్సిన అవసరం లేదు. ఆమె ఓ అద్భుతం! ప్రతి జీవితం కూడా ఓ అద్భుతమే. ఒక చెట్టును తీసుకోండి అది కూడా అద్భుతమే-అది అన్ని వేళలా తాను చేయాల్సినవి ఎన్నో చేస్తుంది. వెల్లంగిరి పర్వతం కూడా అచేతనంగా ఉన్నా, ఎన్నో అద్భుతమయిన పనులు చేస్తుంది! సముద్రములో ఉన్నది నీరే అయినప్పటికీ, అది కూడా ఎన్నో మహత్తరమైన పనులు చేస్తుంది.

ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి – వాటిలో ప్రకృతి చేసినవి కొన్ని అయితే, మనుషులుచే చేయబడినవి కొన్ని. మనం ఏది తయారు చేసినా కూడా, అది ప్రకృతి ప్రక్రియలకు లోబడే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ధర్మాలను దాటి మనం ఏమీ చేయలేము. గురత్వాకర్షణ శక్తి ఒకరి అనుభవంలో ఒక బంధనంలా ఉంటుంది, మరొకరికి అదొక పెద్ద అవకాశంలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు రెక్కలు లేకుండా విమానం లేదా మరో యంత్రం ద్వారా పైకి ఎగరాలనుకుంటే, ‘‘ఈ గురుత్వాకర్షణ శక్తి నన్ను కిందకు లాగుతోంది!” అని మీకు అనిపిస్తుంది. కాని ఈ గ్రహాన్ని పట్టి ఉంచుతున్నది అదే. మనం ఏది చేసినా, ప్రకృతి ధర్మానికి లోబడే చేయగలుగుతాం. అయినా, ప్రకృతి ధర్మం అంటే బంధనం కాదు - అది ఒక రకమైన ఆట.

అద్భుతమంటే నియమాల పరిధిలో ఆడుకోవడం, అంతేగాని వాటిని దాటడం కాదు.  

ఆట ఎలా ఆడాలో తెలిస్తే, ఎన్ని పనులైనా చేయవచ్చు. అందుకనే మేము మా 'ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌'ని కొన్ని నియమాలతో ప్రారంభిస్తాం. మీరు కూడా మీ జీవితంలోని నియమాలు అర్థం చేసుకుని, వాటిని మీవిగా భావిస్తేనే అనుకున్నది చేయగలుగుతారు. లేదంటే జీవితం బాధామయం అవుతుంది. కేవలం సామజిక పరమైన విషయాల్లోనే కాదు, జీవితంలోని మౌలికమైన విషయాల్లో, అస్తిత్వ పరమైన విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఈ నియమాలను తెలుసుకుంటే, అద్భుతాలను సృష్టించవచ్చు, అంతే కాని వాటికి విరుద్ధంగా కాదు. అద్భుతమంటే నియమాల పరిధిలో ఆడుకోవడం, అంతేగాని వాటిని దాటడం కాదు. అంటే నియమాలను ఒక నిర్ణీత పద్ధతిలో ఉపయోగించుకోవడం నేర్చుకోవటం.

అందుకే, దేవికి తనదైన రూపం, రేఖా గణిత పరమైన ఆకృతి, సంఖ్యా శాస్త్రం ఉన్నాయి. ఆమెకి తనదైన ధ్వని కూడా ఉంది. లింగభైరవి కోసం అమెకు తగిన శబ్దాన్ని సృష్టించే సంగీతవాద్యం తయారు చేయాలని మా ఆకాంక్ష. ఇప్పుడు దేవి ఆలయంలో వినిపిస్తున్న మంత్రాలూ, పాటలూ దేవి ధ్వనికి అనుగుణంగానే ఉన్నాయి, కానీ ఈ మంత్రాలూ ఎక్కువగా దేవి యొక్క రేఖాగణితానికి(జామెట్రీకి) సంబంధించినవి. దేవి ధ్వని ఏమిటో మనకు తెలుసు. బాస్ (bass) అనే గాత్రంతో ఆ ధ్వనిని సృష్టించాలని ప్రయత్నించాం, కానీ అది సరిగా పని చేయలేదు. నేను కొంతమందితో చర్చిస్తున్నా, వారు ఆ ధ్వనిని ఎలక్ట్రానికల్‌గా తయారు చేయవచ్చు అన్నారు, కాని నాకు తీగ నుండి వచ్చే ఓ సరైన ప్రతిధ్వని కావాలి. మనం సరైన ధ్వనిని సృష్టించగలిగితే, దేవితో భక్తులు పొందే అనుభూతిని ఎంతో పెంపొందించవచ్చు.

మీలో అంతర్గతంగా ఏ సంఘర్షణ లేనప్పుడే, మీకు ఏ సమస్యా ఉండదు.

సృష్టిలో ప్రతి భౌతిక రూపమూ దాని రేఖా గణితాన్ని(జామోట్రీని) బట్టే ఉంటుంది. అది సక్రమముగా పనిచేస్తున్నదా లేదా అన్నది ముఖ్యంగా రేఖా గణితపు సమగ్రతపైనే ఆధారపడి ఉంటుంది. హఠ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అదే, అంటే మీ వ్యవస్థంతా కూడా ఏ సంఘర్షణా లేకుండా పని చేసేటట్లు మీ శరీరపు రేఖాగణితాన్ని సరిదిద్దటమే. మీలో అంతర్గతంగా ఏ సంఘర్షణ లేనప్పుడే, మీకు ఏ సమస్యా ఉండదు. లేకపొతే ఊరికే ఇక్కడ జీవించి ఉండడంమే మీకు ఓ సమస్య అవుతుంది. అలాంటప్పుడు, మీ ఎరుక(awareness)లోని ఉన్నత శిఖరాలకు అందుకోవటం ఎలా సాధ్యమవుతుంది? అది మీకు సాధ్యం కాదు. మీలో అంతా కుదురుగా, స్థిమితంగా ఉన్నప్పుడే, అది సాధ్యం అవుతుంది. మీకు మీరే ఓ సమస్య కానప్పుడు మాత్రమే,   మీరు ఏది కావలనుకుంటే అది చేయగలరు. లేదా కళ్ళు మూసుకుని కూర్చోగలరు - ఈ రెండు ఎంపికలు (choice) మీకుంటాయి.

తీవ్రంగా పనిచేయడం, నిశ్చలత్వం - ఒకే లక్ష్యానికి రెండు మార్గాలు!

ప్రేమాశీస్సులతో,
సద్గురు