సద్గురు: ఒక బాలుడు దేన్నీ ఊహించుకోకుండా పెరిగితే, ఇతరుల ప్రభావం తనమీద లేకుండా అతను జీవిస్తే, అతను తన స్వంత వివేకంతో జీవిస్తే, ఆధ్యాత్మికుడు కావడం అనేది ఒక సహజ ప్రక్రియ అవుతుంది. చాలామంది జీవితంలో ఆధ్యాత్మికత అనేది లోపించడానికి కారణం, విద్య వారిమీద రుద్దబడుతుంది, విద్యార్జన సహజసిద్ధంగా జరగట్లేదు. స్వతహాగానే మిమ్మల్ని మీ గురుంచి తెలుసుకునే అవకాశమిస్తే, జీవం గురించి మీ మేధతోనే తెలుసుకోమంటే, మీరు సహజంగానే అంతర్ముఖులు అవుతారు. సహజంగా చూడవలసింది లోపలికే.

భారతీయ సంస్కృతిలో విద్య ఎప్పుడూ కొన్ని మంత్రదీక్షలు ఇచ్చిన తర్వాతనే మొదలయ్యేది. ఎందుకంటే వారు విద్య అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియగా భావించారు.

మనం ఈ భూమ్మీద సుందరమైనవి తయారు చేస్తామా, వినాశకరమైన బాంబుల్ని లేక అంతకన్నా ఎక్కువ వినాశకరమైన వాటిని తయారు చేస్తామా అనేది అంతా మీ మేథస్సు, మీ మనోభావాలు ఎంత సమన్వయంగా ఉన్నాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత సమన్వయంగా ఉన్నమనిషి, మీరు మీ వివేకాన్ని ఎంత బాగా ప్రయోగిస్తారు అనేదే, మీరు ఈ ప్రపంచంలో ఏమి సృష్టిస్తారు అనేదానికి దారితీస్తుంది. 

ప్రపంచంలో బాగా తెలివైనవాళ్లే ప్రపంచంలోని ఇంత హింసకు కారణమయ్యారు. నిజానికి మనుషుల్లో ఒక భాగం ఎప్పుడూ హింసాత్మకమైన వారే. పూర్వం మొట్టమొదట మనిషి గుహలో జీవించేటప్పుడు దేనినైనా చంపాలంటే, అతను రాయిని ఉపయోగించాడు దానినే రాతి యుగం అంటారు. ఇనపయుగం అంటే అతను ఇనుప ఆయుధాలతో చంపాడని. కంచుయుగం అంటే అతను కంచు ఆయుధాలతో చంపాడని, అణుయుగం అంటే అణ్వాయుధాలతో చంపుతాడని. ప్రపంచంలో కొందరు వ్యక్తులు ఎప్పుడూ హింసాత్మకమైన వారే, కానీ ఈనాడు హింస ఇంత ఎక్కువ కావడానికి కారణం, ప్రపంచంలోని అతి గొప్ప బుర్రలు, ఎంతో హింసాత్మకమైన వాటిని తయారుచేయడానికి ఉపయోగించటమే. ప్రపంచంలో తెలివైనవారు సహకరించకపోతే, ఒక హింసాత్మకమైన మనిషి, ఒకరు లేక ఇద్దరిని, ఒక రాయితోనో, కర్రతోనో చంపేవాడు, కానీ ప్రపంచంలోని తెలివైన వారు సహకరించడంవల్ల, నేడు ఒక్క మనిషే లక్షల మందిని చంపగలుగుతున్నాడు.

తెలివితేటలను మన శ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచేయనిస్తే, అవి తెలివితేటలు కాదు. తెలివి తేటలు మనిషికి గొప్ప వరం, కానీ ప్రస్తుతం అవే మానవజాతికి ఒక పెద్ద శాపం అయ్యాయి. ఎందుకంటే మనిషి ఒక సమన్వయంగల వ్యక్తిగా తయారు కావటం లేదు. అతనిలోని మానవుడు అస్థిర మయ్యాడు, ఇటువంటి తెలివితేటలు చాలా ప్రమాదకరమైనవి.

భారతీయ సంస్కృతిలో విద్య ఎప్పుడూ కొన్ని మంత్రదీక్షలు ఇచ్చిన తర్వాతనే మొదలయ్యేది. ఎందుకంటే వారు విద్య అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియగా భావించారు. విద్యారంభానికి ముందే బ్రహ్మోపదేశం అనే ప్రక్రియ ద్వారా మీకు ఒక మంత్రాన్ని ఇవ్వటం జరిగేది. పిల్లవానికి ‘అహం బ్రహ్మాస్మి’ అనే మంత్రం ఇవ్వబడుతుంది, దాని అర్థం ఏమిటంటే ‘నేనే బ్రహ్మాండాన్ని (నేనే బ్రహ్మను)’అని. దీన్ని ఎలా తీసుకోవాలంటే మీరు ‘నేనే బ్రహ్మాండాన్ని (నేనే బ్రహ్మను)’ అంటున్నారంటే, అన్నింటికీ నేనే బాధ్యుడను అని అంటున్నట్టు. అంటే విశ్వంలోని అన్నింటినీ అనుభూతి పరంగా పిల్లవాని జీవితంలోకి తీసుకువస్తున్నాం, అప్పుడే, ఆ తరువాతే అతనికి విద్యనివ్వడం జరుగుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు