ఎక్కువ శాతం మంది నిజానికి జీవించడం లేదని కేవలం ఆలోచిస్తున్నారని, మీరు మీ స్వంత సృష్టిలో మునిగిపోయి సృష్టికర్త సృష్టికి దూరమైపోతున్నారని సద్గురు చెబుతున్నారు.

మీరొక విషయం అర్థం చేసుకోవాలి. కేవలం ఈ జీవితం యొక్క మౌలికమైన అంశాలు మాత్రమే సృష్టించబడ్డాయి. మీరు సృష్టికర్త అని పిలిచే వారిచే సృష్టించబడ్డాయి. మిగతాదంతా కూడా మీ సృష్టే..! మీకు కనుక కొంత వక్రమైన మనస్సు ఉంటే, ఖచ్చితంగా ఇదంతా మీ సృష్టే..!! మీలోనికి ఎటువంటి సమాచారం వెళ్ళినప్పటికీ మీరు దానిని, మీకెలా కావాలంటే అలా మలచుకోగలరు. ఆ విధంగా మలచుకొనే సామర్థ్యము మీకుంది. ప్రస్తుతం ఇది కనుక ఏదో ఒక మూల భయానకంగా మారిందీ అంటే, అది ఎవరి సృష్టి..? మీదే కదూ..? దీనికి సృష్టి కర్తతో పని లేదు.

మీరు పదిమంది కళ్ళలో బాగున్నట్టు కనబడాలి" అనుకుంటున్నారు. కాని ఈ బయట విషయాలు  మార్చినంత మాత్రానా మీలో మీరు ఎలా ఉన్నారు అనేది మారదు.

ప్రస్తుతం మీరు ఉన్న ఈ సృష్టిలో, మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు దేనినైతే చూస్తున్నారో, ఇదంతా కూడా మీ మేధస్సుకీ, మీ ఊహాకీ ఎంతో అతీతమైనది. అవునా కాదా? ప్రతీ అణువు మీ అవగాహనకూ, మీరు అర్థం చేసుకోవడానికీ, మీ మేధస్సుకీ ఎంతో అతీతమైనది. అవునా? ఇంత గొప్ప సృష్టి. దీనిలో కేవలం ఒక్క రేణువును కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇటువంటి సృష్టి తప్పుగా ఉండే అవకాశమే లేదు.

తప్పు-ఒప్పులనేవి మీ ఆలోచనలో మాత్రమే ఉన్నాయి. నిజానికి ఉన్నది ఒక్కటే, మీరు చేయవలసింది ఈ సృష్టితో అనుసంధానంలో ఉండడమే..! ప్రస్తుతం, మీరు ఈ ప్రపంచంలో జీవించడం లేదు. మీరిక్కడ ఒక జీవంగా ఉండడం లేదు. ఎందుకంటే 95% సమయం మీరు కేవలం జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. మీరు జీవించడం లేదు. మీ ఆలోచనల్నే మీరు జీవితంగా నమ్ముతున్నారు. దురదృష్టవశాత్తూ.. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది జీవితం కాదు. మీరు దేనిగురించి అయితే ఆలోచిస్తున్నారో  దానికీ జీవితానికీ ఎటువంటి సంబంధమూ లేదు. మీకేది కావాలంటే అది ఆలోచించుకోవచ్చు. కానీ దానికీ జీవితానికీ ఎటువంటి సంబంధమూ లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు