ధ్యానం నుండి మహాముద్ర వరకు

సద్గురు: 'ధ్యానం' అన్న పదం ఎన్నో వాటికి వాడుతున్నారు. సాధారణంగా మీరు దేనిమీదైనా దృష్టి కేంద్రీకరిస్తే మీరు ధ్యానం చేస్తున్నారు అని అంటారు. ఒకటే ఆలోచనను నిరంతరంగా ఆలోచిస్తే మీరు ధ్యానం చేస్తున్నారు అని అంటారు. ఒకే శబ్దాన్ని, మంత్రాన్ని లేక ఇంకేదన్న నిరంతరంగా ఉచ్చరిస్తుంటే దానిని కూడా ధ్యానమే అంటారు. మీ చుట్టూ జరుగుతున్న విషయాలపై లేదా మీ శారీరక వ్యవస్థపై మీరు పూర్తిగా మానసికంగా జాగరూకతతో ఉన్నా దానిని కూడా ధ్యానం అంటారు.

శాంభవి వీటిలో ఏ కోవకీ చెందదు. అందువల్లే మనం దీనిని మహాముద్ర అని లేక క్రియ అని పిలుస్తాము. 'ముద్ర' అంటే ఏమిటి? ముద్ర అనే పదం అంటే మూయడం, అంటే ఒక తాళం వేయడం వంటిది. మునుపటి కంటే, ఈనాటి ప్రపంచంలో మానవులకున్న పెద్ద సమస్య శక్తి విచ్ఛేదన (వృధా) కావడం, ఎందుకంటే మన ఇంద్రియాలు ముందెన్నడూ లేనట్టుగా ఇప్పుడు ఉత్తేజానికి గురవుతున్నాయి. ఉదాహరణకి, ఈ రోజున మనం రాత్రంతా పెద్ద లైట్ల వెలుగు కింద కూర్చోగలం. మీ కళ్ళు దీనికి సిద్ధంగా లేవు - అవి పన్నెండు గంటల వెలుగుకు, ఆ తరువాత పన్నెండు గంటలు చిరు వెలుగుకు లేక చీకటికి మాత్రమే తయారుగా ఉన్నాయి. ఈ రోజున మీ దృశ్య వ్యవస్థ వెర్రిగా ఉత్తేజ పరచబడుతున్నది. వ్యవస్థ మీద అధిక భారం: ఇంద్రియాలను అధికంగా ఉత్తేజపరచడం

పూర్వ కాలంలో మీరేదన్నా శబ్దం వినాలంటే, ఒక సింహం గర్జించాలి, లేదా ఒక ఏనుగు ఘీంకరించాలి, లేదా ఇంకేదన్నా శబ్దం అవ్వాలి, ఇవి లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండేది. ఇప్పుడు శబ్దాలు నిరంతరంగా ఉంటున్నాయి. మీ చెవులకి ఎడతెరిపి లేకుండా పని. ఇంతకు ముందు, ఏవైనా రంగులు చూడాలంటే సూర్యాస్తమయం కోసం ఎదురుచూడాలి. మీరు మీ కుటుంబ సభ్యులని పిలిచే లోపలే అది కాస్త మాయం అయిపోయేది. ఇప్పుడు మీరు టి.వి. స్విచ్ నొక్కగానే అన్ని రకాల రంగులను నిరంతరంగా కళ్ళు చెదిరేటట్టు చూడవచ్చు.

ఈ విధమైన తీవ్రమైన ఇంద్రియ కార్యకలాపం ముందెన్నడూ లేదు. ఇటువంటి ఇంద్రియ ప్రేరణ ఉన్నప్పుడు, మీరు కూర్చుని 'ఆమ్, అనో లేక 'రామ్' అనో, లేక ఇంకేదన్నా అన్నా అది కూడా అదుపులేకుండా జరిగిపోతూ ఉంటుంది. తమలో ఒక శక్తివంతమైన వ్యవస్థను సృష్టించుకోకపోతే, ఇప్పటి ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మనుషులు కళ్ళు మూసుకుని కూర్చుంటే పగటి కలలు కనకుండా ఉండలేరు.

శక్తి విచ్ఛేదనాన్ని తిప్పివేయడం

మహాముద్ర ఒక తాళంలా పనిచేస్తుంది. మీరు ఒక సారి దానిని ముద్ర వేసి, తాళం వేస్తే మీలోని శక్తి పూర్తిగా వేరే దిశలోకి మళ్ళుతుంది. అప్పుడు జరగవలసింది సజావుగా జరుగుతుంది. మొట్ట మొదటి రోజు నుంచే శాంభవి మహాముద్రలో అనుభవించ గలిగే శక్తిని మిగతా సాధనలలో అనుభవించడం అరుదు. దీనికి కారణం, మీరు శాంభవి మహాముద్రను సరైన విధంలో ఉపయోగిస్తే, మీలోని శక్తి ఇంతకు మునుపెన్నడూ తిరగని దిశకు మళ్ళుతుంది. లేకుంటే, మీలోని శక్తి వివిధ ఇంద్రియాల ఉత్తేజానికి గురై విచ్ఛేదమవుతుంది. ఇదేలాగంటే, మీరు దేనినైనా ఏకధాటిగా చూస్తూ ఉంటే కొంత సమయానికి మీరు అలసి పోతారు, మీ కళ్ళు మాత్రమే కాదు మీరు కూడా.

మీరు దేనిమీదనైనా ధ్యాసను నిలిపితే మీరు శక్తిని కోల్పోతారు. ఒక వెలుగు కిరణం మీ వైపు వస్తే, దానిని చూడటానికి మీరు కొంత శక్తిని కోల్పోతారు. మీరు ఒక శబ్దం వింటే కొంత శక్తిని కోల్పోతారు. మేము దీనిని తిప్పివేసి మీకు లాభం కలిగే విధంగా మార్చుతున్నాము. మేము ఇంత సమయం కేటాయించి మిమ్మల్ని మానసికంగా, భావపూర్వకంగా మిమ్మల్ని సంసిద్ధం చేసేది, మీరు 21 నిమిషాల ఈ సాధనను సరైన రీతిలో స్వీకరించటానికే.

 


ఈ డిసెంబర్‌లో చెన్నైలో సద్గురుతో జరిగే ఇన్నర్ ఇంజనీరింగ్ సమాపన కార్యక్రమంలో పాల్గొనండి.

ధృడమైన ప్రభావంపై వైజ్ఞానిక నిరూపణ

శాంభవిపై గణనీయమైన పరిశోధన జరుగుతూ ఉంది. ఈ రోజులలో మీలో ఏమి జరుగుతున్నది అన్న దానికి తగిన విలువ లేదు, దానిని పరిశోధన కేంద్రంలో కొలత వేస్తేనే దానికి గుర్తింపు. శాంభవి సాధన చేస్తున్న వారిలో కార్టిసోల్ ను మేలుకొలిపే స్పందన గణనీయంగా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. బిడిఎన్ఎఫ్ అనే మెదడు నుంచి జరిగే నాడీ ఉద్దీపనము కూడా పెరుగుతుంది.

కార్టిసోల్ మేలుకొలిపే స్పందన వివిధ రకాల మెలకువ స్థాయిలని గుర్తిస్తుంది. జ్ఞానోదయం కూడా ఒక రకమైన మెలుకువ. ఎందుకు? మనమిప్పుడు మెలకువగా లేమా? లేదు, మీరు మీ జీవితంలోని ప్రతి క్షణంలో ఒకటే స్థాయిలో మెలకువగా లేరు. నిద్రలేచిన ముప్పయి నిమిషాల తరువాత మీరు శాంభవి కనీసం ఒక తొంభై రోజుల పాటు చేస్తే, మీలోని కార్టిసోల్ మేలుకొలిపే స్పందన సాధారణ మానవుని కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది.

తాపం, వృద్దాప్యం ఇంకా ఒత్తుడులకు నివారిణి

ఇది తాపాన్ని తగ్గిస్తుంది. తొంభై రోజుల సాధన తరువాత మీ డిఎన్ఏలోని కణాల స్థాయిలో మీ వయసు 6.4 సంవత్సరాలు తగ్గుతుంది. ఇదంతా బాధ్యాతాయుతమైన శాస్త్రవేత్తలు కనుగొన్నది. అన్నిటికీ మించి, అధ్బుతమైన విషయమేంటంటే మీ మెదడుని పూర్తిగా చురుకుగా ఉంచుతూ మీలోని ప్రశాంతత ఎన్నో రెట్లు వృద్ధిచెందుతుంది. ఇదే శాంభవిలోని ప్రత్యేకత.

అమెరికాలో జరిగిన ఎన్నో పరిశోధనలు బౌద్ధమత ధ్యానాలకు సంబంధించినవి, మిగిలిన యోగ సంప్రదాయాలకు సంబంధించినవి కావు. బౌద్ధ మత ధ్యానాలలో చాలా మట్టుకు మనిషిని ప్రశాంత పరిచి, ఆహ్లాదపరుస్తాయి, అదే సమయంలో వారి మెదడులోని చైతన్యం కూడా తగ్గిపోతుంది. మనిషిని ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుతూ, మెదడుని ఇంకా ఎక్కువ చురుకుగా ఉంచడం శాంభవి ప్రత్యేకత.

సమస్యలు లేకుండా ప్రశాంతత, సంభావనీయత

మీ మెదడు పని చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మికం పేరుమీద కొందరు కూర్చుని 'రామ్, రామ్' అనో లేదా ఇంకే మంత్రంనో జపించడం మీరు చూస్తుంటారు. మీరలా కూర్చుని "డింగ్ డాంగ్ డింగ్" అని అంటే కూడా మీరు ప్రశాంతంగా ఉండగలరు. అదీ ఒక జోలపాట వంటిదే. ఎవరూ మీకోసం పాడకపోతే మీరే పాడుకోండి. మీకది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి ట్రిక్కులు అస్ప్రుహతో కనుక్కుని, వాటికి అలవాటుపడి ఉండవచ్చు. అది పవిత్రమైనది అని చెప్పబడే శబ్దం కావచ్చు లేక మామూలు అర్ధం పర్థం లేని శబ్దం కావచ్చు, మీరు దానిని ఆపకుండా చేస్తూపొతే, ఒక విధమైన మాంద్యం (Dullness) కలుగుతుంది. ఈ మాంద్యాన్ని పొరపాటుగా శాంతిగా భావిస్తున్నారు.

మీకున్న సమస్యల్లా మీ మస్తిష్క కార్య కలాపాలు. మీ మెదడులోని కార్యకలాపాలు తీసివేస్తే మీరు ప్రశాంతంగా, అధ్బుతంగా ఉంటారు కానీ మీకు సంభావనీయత దూరమవుతుంది. ఒకరకంగా మానవుడి సమస్య ఇదే, మీలో ఉన్న సంభావనీయతలను మీరు సమస్యలుగా భావిస్తునారు. మీలోని సంభావనీయతను తీసివేస్తే, మీ మెదడులో నుండీ సగ భాగం తీసివేస్తే, మీ సమస్య తీరిపోతుంది. మీ సంభావనీయతను మెరుగుపరుస్తూ కూడా మీకు సమస్య లేకుండా చేయడం - ఇదే శాంభవి మహాముద్రలోని ప్రత్యేకత.

ప్రేమాశీస్సులతో,

సద్గురు