Sadhguruనాకు పన్నేండేళ్ళ వయసులో, వేసవి సెలవుల్లో ఇది ప్రారంభమయింది. పురాతనకాలం నుండీ వస్తున్న మా తాతగారింట్లో మేనత్త, మేమనమామ పిల్లల్లు, పినతండ్రి పెదతండ్రి పిల్లలూ, పినతల్లి పెదతల్లి పిల్లలూ ఇలా అందరం కలుసుకున్నాం. పెరట్లో 150 అడుగులలోతున్న ఒక పెద్ద నుయ్యి ఉండేది. ఆడపిల్లలు దాగుడుమూతలు ఆడుకుంటుంటే, మగపిల్లలం మాత్రం ఆడే ఆట ఆ నూతిలోకి దూకడం మళ్ళీ బయటకి రావడం. దూకడమూ, అలాగే బయటకి రావడం రెండూ పెద్ద సవాళ్ళే. దూకడంలో ఏమాత్రం పొరపాటు దొర్లినా, బుర్ర పగిలి గోడలు రక్తసిక్తమౌతాయి. అలాగే ఎక్కడానికి మెట్లు ఉండేవి కావు కనుక, గోడకి ఆనుకుని జాగ్రత్తగా అంచుకి అంటిపెట్టుకుని ఎక్కాలి. నానిపోయి, శరీరం బరువుకి గోళ్ళు పగిలి రక్తాలు కారేవి. అందరి కుర్రాళ్ళలోనూ కొందరే ఈ సాహసానికి ప్రయత్నించేవారు. అందులో నేనొకణ్ణి. అందులో నాకు మంచి ప్రావీణ్యం ఉంది.

ఒకసారి ఒక డేబ్భైఏళ్ళు పైబడిన వ్యక్తి వచ్చాడు. అతను మమ్మల్ని కాసేపు పరీక్షగా గమనించాడు. మారు మాటాడకుండా అతను నూతిలోకి దూకేసేడు. మేం అతని పని అయిపోయిందని అనుకున్నాము. కానీ అతను నాకంటే తొందరగా పైకి ఎక్కి వచ్చేసాడు !  నా అహాన్ని పక్కనబెట్టి అతన్ని ఒకే ఒక్క ప్రశ్న అడిగాను: "ఎలా చెయ్యగలిగారు?"అని. "నాతో రా! యోగా నేర్చుకుందువుగాని," అని ఆ ముసలాయన అన్నాడు.

ఈ యోగా నన్ను మానసికంగానూ, శారీరకంగానూ చాలా మందికంటే  భిన్నంగా నిలబెట్టింది.

నేను అతని వెంట కుక్కపిల్లలా వెళ్లాను. ఆ రకంగా "మళ్ళాదిహళ్ళి స్వామి" (ఆ ముసలాయనపేరు అది)  దగ్గర, నా యోగాభ్యసానికి అంకురార్పణ జరిగింది. గతంలో నన్ను నిద్రలేపడం అంటే మా ఇంట్లో అందరికీ ఒక పెద్ద యజ్ఞంలా ఉండేది. మా ఇంట్లో వాళ్ళు నన్ను పక్కమీదనుండి లేపి కూర్చోబెట్టేవారు. నేను వాలిపోయి, నిద్రలోకి జారుకునేవాణ్ణి. మా అమ్మగారు టూత్ బ్రష్ చేతికి ఇచ్చేవారు. అది నోట్లో పెట్తుకుని నిద్రపోయేవాడిని. ఓపిక నశించిపోయి ఆమె నన్ను స్నానాల గదిలోకి తోసేవారు. అక్కడ కూడా నిద్రపోయేవాడిని.  అలాంటిది, యోగా అభ్యసించడం ప్రారంభించి మూడు నెలలు తిరక్కుండా, నా శరీరం తెల్లవారు ఝామున మూడునలభైకే మేలుకునేది... బయటనుండి ఎవరి ప్రయత్నమూ లేకుండనే. ఈ రోజుకీ అదే అలవాటు. నేను లేచిన తర్వాత, నా అభ్యాసాలు వాటంతట అవే చకచకా జరిగిపోతాయి... నేను ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా... ఒక్క రోజుకూడా విఘాతం లేకుండా జరిగిపోతాయి. ఈ సరళమైన యోగ సాధనని  "అంగమర్థన" అంటారు. (ఈ యోగ ప్రక్రియలో అన్ని అవయవాలూ, కండరాలూ బలపడతాయి). ఈ యోగా నన్ను మానసికంగానూ, శారీరకంగానూ చాలా మందికంటే  భిన్నంగా నిలబెట్టింది. అప్పట్లో అదే సర్వం అని నేను నమ్మేవాడిని.

యోగాకి సంబంధించిన కొన్ని భంగిమలు కేవలం శరీరక దారుఢ్యానికోసమేననీ అనుకునేవాడిని. కానీ చాముండి కొండమీద నా అనుభవం తర్వాత, నేను సాధన చేస్తున్నదంతా ఈ భౌతిక పరిమితులకి అతీతమైన పరిమాణాన్ని సాధించడానికి చేస్తున్న ప్రక్రియ అని అర్థం చేసుకున్నాను. అందుకే యోగ సాధన చేస్తున్న వాళ్ళకి చెబుతుంటాను: మీరు పొరపాటున వేరే లక్ష్యాలను ఆశించి యోగ సాధన చెయ్యడం ప్రారంభించినప్పటికీ, అది పనిచేస్తుందని.

ప్రేమాశిస్సులతో,
సద్గురు