ప్రసూన్ జోషి: మనం ఒక మనిషిని ప్రేమిస్తూ, దానిద్వారా, భగవంతునితో తాదాత్మ్యం చెందవచ్చా? లేక అది కేవలం ఒక కాల్పనిక భావనేనా?

సద్గురు: ‘ప్రేమ’ను నిశితంగా పరిశీలిస్తే......ప్రతి మనిషిలోనూ వాళ్ళు ఇప్పుడున్న దానికన్నా, ఇంకా ఎక్కువగా కావాలన్న తపనే అది. మీకు తెలిసింది మీ శరీరమే అయితే, అప్పుడు దాని వ్యక్తీకరణ లైంగికత ద్వారా అవుతుంది. మీ లైంగికతకు మీరు ఎన్ని రకాల రంగులు, పేర్లు ఇంకా నైతికత ఆపాదించవచ్చు. కానీ అది ప్రాధమికంగా మీది కాని దాన్ని మీలో భాగంగా చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనే ఒక క్షణంపాటు మీకు అలా అనిపిస్తుంది. కాని మరుక్షణం అది వీడిపోతుంది. మీరు కాని దాన్ని లేదా మీకు కాని వారిని, ఇలా మీలో ఒక భాగంగా చేసుకోవాలనే కోరిక భావోద్వేగపరంగా ఉంటే దానినే మీరు ‘ఒకరిని ప్రేమించాను’ అంటారు. మరి ఈ శారీరక బంధం ఎంత కాలం ఉంటుంది లేదా భావోద్వేగ బంధం ఎంత కాలం ఉంటుంది, అని పోల్చిచూస్తే భావోద్వేగ బంధమే ఎక్కువ కాలం ఉంటుంది. 

శారీరక కలయిక క్షణికం. కాని భావోద్వేగంతో మీరు ఏర్పరుచుకున్న బంధం, ఆ ‘ఒకటే అన్న భావం’ కావాలనుకుంటే మీరు రోజుల తరబడి, నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి ఉంటుంది. మన సాహిత్యంలోని శృంగార కథలను చూస్తే, ఎవరైతే భావోద్వేగపరమైన బంధాన్ని చాలా కాలం నిలుపుకుంటారో వారిని మనం ప్రశంసిస్తాం. ఎందుకంటే ప్రేమలో పడిన వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. వాళ్ళు మేఘాలలో తేలుతున్నట్లు కనిపిస్తారు. మనిషి భావోద్వేగాలలో ఒక అందం ఉంటుంది. తాము తెలివైన వారిమని అనుకునే వారితో సహా, చాలా మందిలో అత్యంత శక్తివంతమైనవి భావోద్వేగాలే. కాని నిజమైన తెలివైన వారు భావోద్వేగాలను దరికి రానివ్వరు, ఎందుకంటే వాళ్ళు తమ మేధోశక్తితో మైమరచి ఉంటారు.

మనిషి భావోద్వేగాలలో ఒక అందం ఉంటుంది. తాము తెలివైన వారిమని అనుకునే వారితో సహా, చాలా మందిలో అత్యంత శక్తివంతమైనవి భావోద్వేగాలే

మనం స్త్రీ, పురుష సంబంధాల గురించి మాట్లాడుతున్నాం గనుక ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒకరితో ఒకరు విడదీయరాని బంధంలో పడ్డారు అనుకుందాం. అప్పుడు అందులో ఒకరికి ఒక అద్భుతమైన పుస్తకం దొరికితే, హఠాత్తుగా అందులోని ఊహాజనితమైన పాత్రలు, కేవలం కాగితాల మీద అచ్చు వేసిన పదాలే, పక్కనే కూచున్న అందమైన స్త్రీ కంటే, లేదా అద్భుతమైన పురుషుని కంటే ఆసక్తిదాయకం, మనోరంజితం కావచ్చు. అప్పుడు ఒక భాగస్వామి రెండో భాగస్వామి పుస్తకాలలోని పాత్రలతో అసూయపడతారు. ఒకసారి మేధోశక్తి ప్రజ్వరిల్లితే, భావోద్వేగాలు వెనకడుగు వేస్తాయి. మేధోశక్తి రసహీనంగా అనిపించవచ్చు. కాని దానిలో వేరే రకమైన మెరుపు ఉంటుంది. అది ప్రపంచాన్ని పారదర్శకం చేస్తుంది.

మీరు మీ మేధోశక్తిని సరిగ్గా ఉపయోగిస్తే, అసాధ్యం అనుకున్న వాటిని కూడా మీరు అందుకోవచ్చు. అందువలనే మేధో శక్తికి ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంది. భావోద్వాగాలు అందమైన రంగులలో ఉంటాయి. కాని అవే ప్రతికూలమైనవైతే, అవి అసహ్యంగా ఉంటాయి. మనుషులు భావోద్వేగంతో ఉన్నప్పుడు వారిలో అత్యద్భుత పార్శాన్ని చూడవచ్చు, లేక అతి అసహ్యకరమైన పార్శాన్ని చూడవచ్చు. భావోద్వేగాల తీరే అంత. అదే సమయంలో మీరు ఎలా అనుకుంటారో వాటిని అలాగే అనుభూతి చెందుతారు. ఒక విధంగా అనుకుని వేరే విధమైన అనుభూతి మీరు పొందలేరు. ఉదాహరణకి మీరు ఒకరి గురించి “ఆమె అద్భుతంగా ఉంది’’ అనుకున్నారనుకో, ఆమె పట్ల మీ భావోద్వేగాలు మధురంగా ఉంటాయి.

ప్రసూన్ జోషి: అలాంటిది చెదురుమదురుగా జరగవచ్చు. మనం ఆలోచించేది మన అధీనంలో ఉంటుందంటారా? మన తలలో ఆలోచనలు అలా అలా మొలకెత్తుతాయా లేక వాటికి మనం దిశానిర్దేశనం చేయవచ్చా?

సద్గురు: అది మీకు, మీరు ఏమి చేసుకన్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనలకు మీరు దిశా నిర్దేశం చేస్తేనే అవి అర్థవంతంగా ఉంటాయి. ఆలోచనలు ఎక్కడనుంచో పుట్టుకు రావు. మీరు సేకరించి పెట్టుకున్న సమాచారం నుంచే అవి పుట్టుకొస్తాయి. ఉన్న సమాచారాన్ని, మీరు కేవలం వివిధ ఆలోచనలుగా మలచగలరు, అంతే.

ఆలోచనలు ఎక్కడనుంచో పుట్టుకు రావు. మీరు సేకరించి పెట్టుకున్న సమాచారం నుంచే అవి పుట్టుకొస్తాయి.

మీ మనస్సు కున్న శక్తి సామర్ధ్యాలను బట్టి, దాని నైపుణ్యం బట్టి, సమాచారాన్ని మీరు మలచగలరు. అయితే మీరు సేకరించుకున్న సమాచారం కన్నా మీకు ఏమీ ఎక్కువ లభించదు. ఇక మళ్ళీ మీ అసలు ప్రశ్నకు వస్తే, మీ ప్రేమ వ్యవహారం వేరే పరిమాణాన్ని తాకగలదా? 

ముఖ్యంగా ఇదంతా కూడా, మీది కాని భాగాన్ని మీరు పొందాలనుకోవడమే. మీకు సరిహద్దులున్నాయి – మీ అనుభూతుల సరిహద్దులు. మీ అనుభూతుల సరిహద్దులలో ఉన్నదీ ‘మీరు’ అనుకుంటారు. మీ అనుభూతుల సరిహద్దుల అవతల ఉన్నదీ ‘మీరు కాదు’ అనుకుంటారు. ఇప్పుడు మీ శరీరంలో కిలోగ్రాముల రూపంలో ఉన్న ఈ బరువు ఒకానొక సమయంలో మీ శరీరం వెలుపల ఎక్కడో ఆహారంగా ఉంది. మీరు నెమ్మదిగా దానిని ఆహారంగా తీసుకున్నారు. ఎప్పుడైతే మీ శరీరంలో అది ఇమిడిపోయిందో అప్పుడు దాన్ని మీరు మీ శరీరంలో భాగంగా భావించారు. ఒక వేళ మీరు బరువు తగ్గారనుకో. అప్పుడు మీరు కోల్పోయిన కిలోగ్రాముల కోసం మీరు వెతుక్కుంటూ వెళ్ళరు. ఎందుకంటే అవి ఎప్పుడైతే మీ ఇంద్రియ శరీర సరిహద్దులు దాటాయో ఇక వాటికీ, మీకూ సంబంధం లేదు.

కనుక అది లైంగికత, ప్రేమ వ్యవహారం, కోరిక, అత్యాస, ఆక్రమణ, ఆధ్యాత్మికత లేదా భక్తి ఏదైనా కావచ్చు – ముఖ్యంగా మీరు మీ ఇంద్రియ శారీరక పరిమితులను దాటి, వేరే దానిని లేదా వేరే వారిని మీలో భాగంగా అనుకోవడం. మరో విధం గా చెప్పాలంటే, ఉదాహరణకి మీరు నీరు తాగితే అది మీ శరీరంలో భాగం అయిపోతుంది. మీరు మీ మేధోశక్తి, మీ భావోద్వేగం, మీ శరీరం, మీ శక్తులు, ఏవైనా, మీరు మీ శరీరం నుంచి బయటకు పంపించి వేరేదానిని గాని, వేరే వారిని గాని మీ శరీరంలో భాగంగా అనుభూతి పొందితే , మీరు యోగ స్థితిలో ఉన్నారన్నమాట. మీ శరీరం ద్వారా చేస్తే దాన్ని మనం కర్మ యోగ అంటాం. నీ మేధో శక్తితో చేస్తే దాన్ని జ్ఞానయోగ అంటాం. మీ భావోద్వేగాలతో చేస్తే దాన్ని భక్తి యోగ అంటాం. మీ శక్తితో చేస్తే దాన్ని క్రియ యోగ అంటాం. యోగ స్థితికి చేరడానికి ఇవన్నీ మార్గాలే.