శేఖర్ కపూర్ : సద్గురు, ఈ లోకంలో ఎక్కువగా చర్చించే విషయం అనుబంధాలే. తక్కిన అన్నిటి విషయాలకంటే ఆవేశకావేషాలకు  లోనవుతున్న సంబంధం స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. దీని స్వభావం గురించి చెప్పండి. రోజువారీ ఒత్తిడులు, ఘర్షణలను అధిగమించి ఆవలకు తీసికొని వెళ్లగలిగిన విశిష్ట లక్షణ మేదైనా  ‘వివాహం’ లో ఉందా?

సద్గురు: మనిషి – కుక్క ప్రేమ, స్త్రీ పురుష ప్రేమ, తల్లీ కొడుకు ప్రేమ, తండ్రీ కొడుకు ప్రేమ, తండ్రీ కూతురు ప్రేమ వంటివి లేవు. ప్రేమ అన్నది ఒక తీయని, భావం మాత్రమే. అయితే, మీరు ఈ తియ్యని భావానికి ఎలా చేరుకున్నారన్నది మాత్రమే ప్రశ్న. స్త్రీపురుష ప్రేమ వ్యవహారమన్నది అనివార్యమైన ప్రేమ వ్యవహారం. ప్రకృతి వీరిద్దరినీ ఒకరివైపు ఒకరిని తోస్తుంది. ఆ ప్రకృతికి ఉన్న ఏకైక ఆసక్తి తనను తాను శాశ్వతం చేసుకోవడమే. వాళ్లేదో విధంగా దగ్గరకు రావలసిందే. లేకపోతే మీరూ, నేనూ పుట్టే వాళ్లమే కాదు. ఇదొక అనివార్య ఆవశ్యకత. ఈ ఒక్క ప్రేమ వ్యవహారాన్నే ప్రకృతి రసాయనికంగా సమర్థిస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ ప్రేమ వ్యవహారాలు చాలావాటిలో ఈ రసాయన చర్య అయిపోగానే తామెందుకు కలసి ఉన్నామా అని అనుకుంటారు. అందువల్ల ఈ రసాయన చర్య పూర్తికాకముందే మీరు దాన్ని దాటిన మరో విభిన్న స్థాయి చైతన్యపు ప్రేమ వ్యవహారాన్ని స్థాపించుకోవాలన్నమాట. అలా చేయలేనప్పుడు ఆ  సంబంధం అసహ్యంగా తయారవుతుంది. శారీరక రసాయనికత దాని అవసరాల ప్రకారం కొన్ని పనులు చేయిస్తుంది. ఈ అవసరం తీరిపోగానే మీరక్కడెందుకున్నారనిపిస్తుంది. అది ప్రకృతి గారడీ. మీరు పది పదకొండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ప్రపంచంలో అంతా బాగానే ఉంటుంది. తర్వాత మీ బుద్ధిని మీ హార్మోన్లు హైజాక్ చేస్తాయి. ఆకస్మికంగా మొత్తం ప్రపంచమంతా భిన్నంగా కనిపిస్తుంది. రసాయనం మిమ్మల్ని హైజాక్ చేసింది. అందులో మంచీ లేదు, చెడూ లేదు. అది కేవలం పరిమితం. పరిమితం కావడం నేరమా? - కాదు. కాని మనిషి స్వభావం ఏటువంటిదంటే పరిమితులు అతన్ని బాధ పెడతాయి. అతనికవి నచ్చవు.

మీరు ప్రేమ అంటున్నది ప్రాథమికంగా మీ మధుర భావాలనే. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీ లోపలి తత్త్వం ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ వ్యక్తి నుండీ, ప్రతి దాని నుండీ విముక్తం కావాలని కోరుకుంటుంది. ఆ విధంగా మీరు ఉండదలచుకున్న విధంగా ఉండడానికి అవకాశం కావాలని కోరుకుంటుంది. ఒకసారి మనిషి తన అంతః స్వభావం గురించి మరింత జాగృతిని పొందిన తర్వాత అతను ప్రేమను, ఆనందాన్ని, పారవశ్యాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తాడు. జీవితంలోని పారవశ్య  మార్గాలను అనుభూతి చెందడానికి, నిజానికి మీకు మరొకరి అవసరం లేదు. మీరు కేవలం ఇక్కడ కూర్చుని కూడా మీలోనే అది జరిగేటట్లు చేయగలరు. ఎందుకంటే అది మీ శరీరం, అది మీ మనస్సు, అది మీ భావం, అది మీ రసాయనం, మీ జీవిత అనుభవాన్ని సృష్టించే వారూ మీరే. అంటే, అది మీ సృష్టే. ఇప్పుడు  మీరు మీ మనస్సు, శరీరం, భావం, శక్తి – ఇవ్వన్నీ మాధుర్యాన్ని సృజించాలని కోరుకుంటారా? లేకపోతే ఏదైనా చేదు అనుభూతిని కోరుకుంటారా?

శేఖర్ కపూర్: నేనైతే మధుర్యన్నే కోరుకుంటాను.

సద్గురు: అలా అయితే, సహజంగానే మీరు ప్రేమించే వారుగా ఉంటారు. మీరొక స్త్రీని, పురుషుణ్ణి చూసినప్పుడు ఒక సంబంధం గురించే మాట్లాడుతుంటారు. దానికి వేరువేరు కోణాలుంటాయి – సామజిక, శారీరిక, మానసిక లేదా ఒక ఆర్థిక కోణం కూడా ఉండవచ్చు. మన జీవితంలో అనేక రకాల వ్యక్తులతో సంబంధాలేర్పరచుకుంటాం – వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన సంబంధాలు. మనకు కావలసిన అవసరాలనో, ఇతరుల అవసరాలనో నెరవేర్చుకోవడం కోసం మనం సంబంధాలేర్పరచుకుంటాం. కాని మీరు ప్రేమ అంటున్నది మాత్రం మీ భావాలు మధురంగా ఉండడం మాత్రమే. మరొకవ్యక్తి మీ లోపల ఆ మాధుర్యాన్ని ప్రేరేపించేటట్లు చేయగలరు.

ఇద్దరు వ్యక్తుల కలయిక

శేఖర్ కపూర్: ఇద్దరు వ్యక్తులు తమ శరీర రసాయనికతను, హార్మోన్లను అధిగమించి ఒకరికోసం ఒకరు ఆ సంబంధాన్ని కొనసాగించడానికి ప్రారంభకులుగా ఉండడం సాధ్యమా?

సద్గురు: నిజంగా మీరు ఒకరితో కలసి ఉండాలంటే మీలో ఒక భాగాన్ని ఏదో విధంగా వదలుకోవలసి ఉంటుంది. అందుకే ‘ప్రేమలో పడడం’ అన్న అభివ్యక్తి చాలా ముఖ్యమైంది. మీరందులో పడగలరంతే. మీరందులో నిలబడలేరు, అందులో పైకి ఎక్కలేరు – మీరందులో పడాలంతే. తన గురించి తాను ఎక్కువగా ఆలోచించేవాడు ప్రేమ వ్యవహారంలో పడడు. ప్రేమ వ్యవహారంలో ఉండాలంటే ఎక్కడో ఒకచోట మీలో కొంత భాగాన్ని వశపరచవలసిందే.

శేఖర్ కపూర్: కాని మీరనే ఈ అల్లికలో, జ్ఞానోదయానికి సహాయపడే భాగస్వామిగా మరొకవ్యక్తితో మీరు కలిసి ఉండడం సాధ్యమేనా అని నా అనుమానం. అది సాధ్యమేనా? సంబంధానికి అదొక ఆధారం కాగలదా?

సద్గురు: అది కచ్చితంగా ఒక సంభావ్యత కానీ ప్రమాదం ఉన్న సంభావ్యత. మీ అంతిమ స్వభావాన్ని కనుగొనడానికి బదులుగా ఒక సంబంధంలో ఉండే అనేక సంక్లిష్టతలలో మీరు చిక్కుబడి పోవచ్చు. అది అసాధ్యమని నేను చెప్పడం లేదు. అది చాలా సంభావ్యమే. అందుకే భారతదేశంలో పెళ్లిలో మంగళసూత్రం కట్టిస్తాం. మీ శక్తి నుండి మీ భాగస్వామి శక్తి నుండి ఒక  పోగును తీసికొని దాన్ని మీ తర్కానికీ, మీ అవగాహనకూ, మీ మానసిక, భావోద్వేగ, శారీరక అవసరాలకు ఆవల ఎక్కడో అంతరాంతరంలో ఇద్దరు వ్యక్తులను, రెండు జీవితాలను కలిపి కట్టే విధానమొకటి ఉంది. అందుకే మేమెప్పుడూ అంటూ ఉంటాం, ఈ బంధం జీవితాంతమూ ఉండే బంధం, ఇది తెగని బంధం. మీరు దాన్ని తెంచడమంటే రెండు జీవితాలను చీల్చడం. అదొక విధమైన కలయిక. వివాహాలలో చదివే మంత్రాలన్నిటినీ మీరు జాగ్రత్తగా వింటే, ఇద్దరు వ్యక్తులను విడదీయరాకుండా అతికించడం గురించే అవి మాట్లాడతాయి. ఒక పద్ధతిలో చేసే ఈ వివాహాలు ఎన్నడూ మీ గురించి కావు. అదెప్పుడూ మీ  భాగస్వామి గురించే. ఇద్దరూ ఇలాగే ఆలోచిస్తే అది అద్భుతమైన అందమైన అనువైన బంధం అవుతుంది.. ఒక వ్యక్తి మాత్రమే అలా ఆలోచిస్తే, అది రెండోవారు వీరిని చేసే దోపిడి అవుతుంది. ఇద్దరు వ్యక్తులూ అలా ఆలోచించకపోతే అదొక ప్రతిబంధకమవుతుంది - నేను మీ నుండి ఏదో పిండుకోవడానికి ప్రయత్నిస్తాను, మీరు నా నుండి ఏదో పిండుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదిక ఎప్పుడూ ఒక సంఘర్షణాత్మక సంబంధమవుతుంది.