ప్రశ్న: ఏ గుణాలనైతే, మనం ఉయ్యాలలో ఉన్నప్పుడు నేర్చుకుంటామో, కేవలం అవి మనం మరణించినప్పుడు మాత్రమే పోతాయా?

సద్గురు: దీన్ని మనము మరోకోణం నుంచి చూద్దాం! ఒక అలవాటు అన్నది ఎందుకు ఏర్పడింది అంటే అది మీ జీవితంలోకి కొంత సులువును తీసుకువస్తుంది కాబట్టి. మీ జీవితంలో కొన్ని విషయాలను అది ఆటోమాటిక్ చేసేస్తోంది. మీరు దాని గురించి ఆలోచించక్కరలేదు. ఆ పని కేవలం అలా జరిగిపోతుంది అంతే. మనలో స్వయం రక్షణ కోసం కొన్ని అలవాట్లు మనకి ఏర్పడుతాయి. ఎందుకంటే వేరే జంతువుల్లాగా మన స్వభావాలు నిర్దేశించబడలేదు. కాని జంతువులకు చాలావరకు వాటి గుణాలు, తత్వాలు అన్నీ కూడా నిర్దేశించబడ్డాయి. మీరు కనక కొంచెం గమనించి చూస్తే ఒక కుక్కకు మరో కుక్కకు, లేదా ఒక పిల్లికి మరో పిల్లికి పెద్దగా తేడా ఉండదు. వాటి వ్యక్తిగత  స్వభావం వేరుగా ఉండచ్చు. కానీ సహజంగా వాటి గుణాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ మనకు నిర్దేశించబడింది ఎంతో కొంచెం. మానవులకి అన్నీ తెరిచే ఉంచబడ్డాయి. అందుకే ఒక పిల్లవాడిగా మీరు ఒక రకమైన రక్షణ కవచాన్ని ఏర్పరుచుకోవాలనుకుంటారు. మీరు మీకైన ఒక క్రమాన్ని(Pattern) సృష్టించుకోవాలనుకుంటారు.

క్రమాలను తొలగించండి

ప్రతి పిల్లవాడు  కూడా కొన్ని అలవాట్లు మనుగడ కోసం నేర్చుకుంటాడు. ఇది మనుగడ కోసం సాగించేది. ఇటువంటి క్రమాలతో అతను కొంత తేలిగ్గా, సులువుగా పని చేయగలుగుతాడు. ఇది ప్రతి పిల్లవాడికి కూడా ఎంతో అవసరమైనది. కానీ పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ, వారి అవగాహనను బట్టి, వారి ఎరుకను బట్టి ఈ క్రమాలను తొలగించేసుకుంటూ వస్తారు. వారి అవగాహన బట్టి, విద్య బట్టి, వారి చుట్టూరా ఉన్న మనుషులను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వారు ఎంతగా మారిపోతారంటే... ఒక మూడు సంవత్సరాలు ఎక్కడికయినా వెళ్లి, వెనక్కి తిరిగి వచ్చేసరికే తల్లిదండ్రులు వారి పిల్లల్ని గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. వారిలో ప్రతి విషయం మారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే వారికి మరొకరకమైన అవగాహన ఏర్పడింది కాబట్టి. ఎవరైతే భయస్తులుగా ఉంటారో, ఎప్పుడు తమ స్వయం రక్షణ కోసం చూస్తూ ఉంటారో వారు వారి పాత అలవాట్లను తేలిగ్గా వదిలిపెట్టరు.

ఎందుకంటే నిజానికి మంచి అలవాటు, చెడ్డ అలవాటు అన్నది  ఏది లేదు. అన్ని  అలవాట్లూ చెడ్డవే.

ఎవరైతే జీవితంలో కొంత ఉత్సాహాన్ని, సాహసాన్ని కోరుకుంటారో వారు వారి అలవాట్లను ఎంతో తేలిగ్గా వదిలి పెట్టెయ్యగలుగుతారు. ఎందుకంటే వారు ఎల్లప్పుడు వారి జీవితాలని మలుచుకుంటూనే ఉంటారు. ఏ విధంగా పరిస్థితులకు అవసరమైతే వారు ఆ విధంగా వారిని వారు మలుచుకుని జీవిస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథాన్ని తీసుకున్నప్పుడు అతని అలవాట్లన్నీ కూడా వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే నిజానికి మంచి అలవాటు, చెడ్డ అలవాటు అన్నది  ఏది లేదు. అన్ని  అలవాట్లూ చెడ్డవే. కొన్ని మన మనుగడ కోసం, మన జీవితంలో ఒక స్థాయిలో అవి మనకి ఉపయోగపడవచ్చు. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనకి ఎటువంటి అలవాటు ఉండకూడదు - మంచిదయినా సరే, చెడ్డదైనా సరే. ఎందుకంటే మీరు ఒక అలవాటు అన్నారంటే దానర్ధం మీరు మీ జీవితాన్ని ఎరుక లేకుండా గడపాలనుకుంటున్నారని. ఇది  మీకు సురక్షితంగా అనిపించచ్చు. కాని దీనర్ధం మీకు మీరే జీవితాన్ని ఎన్నో విధాలుగా నిరోధించుకుంటున్నారని.

అలవాట్లు - కర్మ

ఆధ్యాత్మికత అనేది మీ ఎరుక లేకుండా మీరు సృష్టించుకున్న క్రమాలను (patterns) తొలగించే ఒక మౌళికమైన సాధనం. మనం దేనైతే కర్మ అంటున్నామో అది ఇదే. కర్మ అంటే  మీరు ఎరుక లేకుండా మీకై మీరు ఒక క్రమాన్ని సృష్టించుకోవడం. ఇది కేవలం మీ ప్రవర్తనకు మాత్రమే కాదు, మీ జీవితం ఎలా సాగుతుంది అన్నదాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రజలు కనక, వారి జీవితాల్ని గమనించి చూసినట్లైతే ఏ పరిస్థితైనా ఎలా జరుగుతోంది, వారికి అవకాశాలు ఎలా వస్తున్నాయి, వారు కొంతమందిని ఎలా కలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక రకమైన క్రమంలోనే జరుగుతాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, వారి కార్మ క్రమాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. అలవాటు అనేది ఈ కర్మ క్రమం యొక్క అభివ్యక్తీకరణమే. మీరు దేన్నో ఆధారంగా చేసుకుని, దాన్ని ఒక క్రమంగా మార్చేసుకుంటే అదే మీ అలవాటుగా మారుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీలో ఏది ఎరుక లేకుండా జరగకూడదు అని మీరు అనుకోవడమే. మీ జీవితాన్ని ఎరుక లేకుండా గడపడం అన్నది ఒక తెలివితక్కువ పని.

మీరు స్మశానానికి వెళ్లినా సరే మీ శరీరాన్ని కాల్చేసినా సరే మీ క్రమాలు అన్నవి తొలగిపోవు. ఇదే కర్మ అంటే.

మీరు ఒక అలవాటుని మీ ఉయ్యాల్లో నేర్చుకున్నా సరే, లేదా మీ తల్లి గర్భంలో నేర్చుకున్నా సరే, లేదా ఇంకా దానికంటే ముందరే నేర్చుకున్నా సరే మీరు కనక పరిణామం చెందాలి అని కోరుకుంటున్నట్లైతే,  మీరు కనక ముక్తి లేదా స్వేచ్ఛను కోరుకుంటున్నట్లైతే మీ క్రమాలను మీరు తొలగించుకోవాల్సిందే. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే అన్నిటిని కూడా మీరు తొలగించుకోవాల్సిందే. మీరు చనిపోయేవరకు దీనికోసం ఎదురుచూడక్కరలేదు. మీరు చనిపోయినాసరే, మీ సమాధి కూడా మీ క్రమాలను ఏ విధంగానూ కూలదోయలేదు. మీరు స్మశానానికి వెళ్లినా సరే మీ శరీరాన్ని కాల్చేసినా సరే మీ క్రమాలు అన్నవి తొలగిపోవు. ఇదే కర్మ అంటే. ఇది మీ మరణం తరువాత కూడా మీతో వస్తుంది. ఎందుకంటే ఈ క్రమాలు కేవలం మీ శరీరంతో తొలగిపోవు. అందుకని ఎంతో ముఖ్యమైన విషయం ఏవిటంటే మీరు ఇంకా ఇక్కడ సజీవంగా, స్పృహతో ఉన్నప్పుడే మీరు ఈ క్రమాలను దాటడానికి ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి.

మీ క్రమాలను కూలదోసేసి, మీ జీవితాన్ని ఎరుకతో మీరు గడపాలి. ఉదాహరణకి- నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను అలవాటుగానైనా మాట్లాడవచ్చు లేదా ఎరుకతనైనా మాట్లాడచ్చు.  ఈ రెండిటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. నేను ఇక్కడ కూర్చొని, ఊరికే కూర్చొని పోచుకోలు  చెప్పినా సరే, పదివేల మంది ప్రజలు వచ్చి దాన్ని వినాలనుకుంటారు. ఎందుకంటే నేను ప్రతి పదం కూడా ఎరుకతో మాట్లాడతాను. కేవలం అలవాటుగా కాదు. ఇందులో అలవాటు అన్నది ఏది లేదు. నేను చెప్పేది ఏదైనా సరే, నేను ఏం చెప్తున్నానో ప్రజలు దాన్ని ఎందుకు వినాలనుకుంటున్నారంటే ప్రతి మాట కూడా ఎంతో ఎరుకతో వస్తోంది. దానికి ఒకరమైన శక్తి ఉంటుంది. మీరు మీ శ్వాసని లోపలికి, బయటకి ఎరుకతో తీసుకున్నారనుకోండి, మీ శ్వాసకు కూడా ఒక విధమైన శక్తి వస్తుంది. మీ జీవితంలో ప్రతి అడుగు మీరు ఎంతో ఎరుకతో చేస్తే, ప్రతి అడుగు కూడా ఎంతో శక్తివంతంగా మారుతుంది. మీకు కనక  జీవితంలో శక్తి తెలియాలంటే మీరు దానిపట్ల ఎరుకతో ఉండాలి, లేకపోతే ఆ శక్తి ఏమిటో మీకు తెలియదు.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు