సద్గురు: మీరు దీనిని అర్ధం చేసుకోవాలి, మీరు అనుభవించగలిగే ప్రతీదీ జీవితమే. మీరు మరణం అని పిలిచేది కూడా జీవితమే. అయితే, మరణంలో ఎంపికలు ఉంటాయా? కచ్చితంగా ఉంటాయి. మరణం అని మీరు దేనినయితే అంటున్నారో, అది జీవితంలో చివరి క్షణం. మీరు మీ భౌతిక శరీర పరిమితులను దాటే ఆ చివరి క్షణం, మీ జీవితంలో కేవలం ఒకసారే జరుగుతుంది. మీ జీవితంలోని ప్రతీ అంశమూ ఎన్నోసార్లు జరుగ వచ్చు. కానీ మీరు మీ జీవితంలో చివరిగా చేసే ఈ ప్రక్రియ మాత్రం, జీవితంలో ఒకే ఒకసారి జరుగుతుంది. మీరు మరణాన్ని జీవితంగా అర్ధంచేసుకోవాలని నేను కోరతాను, మరో విధంగా కాదు. మీరు జీవితంలో చేసే చివరి పని అదే. అటువంటప్పుడు, దీనిని హుందాగా, అధ్బుతంగా చేయడానికి మీరు నిర్ణయించుకోవడమనేది ఎంతో ప్రధానం, అవునా? మీకు దాని మీద భయం ఉంటే, జీవన స్రవంతిపై అవగాహన లేకుండా దానిని ఒక ప్రతిబంధకంగా చూస్తే, సహజంగానే మీరు ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, వారి మరణానికి, సమయం, తేదీ ఇంకా స్థలాన్ని నిర్ణయించుకుంటారు. అన్నిటికంటే ముందే, యోగి ఎప్పుడూ మరణ సమయం, తేదీ తెలుసుకోవాలనుకుంటాడు. అతనే దానిని నిర్ణయించుకుంటాడు. కొన్ని సంవత్సరాల ముందే, అతను “ఈ తేదీన, ఈ సమయానికి నేను వెళ్ళిపోతాను” అని చెప్పి వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతడు, అతనిలో, శరీరాన్ని ఎరుకతో వదలటానికి అవసరమైన ఒక జాగృతిని (ఎరుకను) సృష్టించుకుంటాడు. బట్టలు తీసేసినట్టుగా, శరీరాన్ని కూడా తీసేసి, అంటే శరీరాన్ని ఎరుకతో వదలిపెట్టగలిగితే, అదే మీ జీవితానికి పరమోత్తమ సంభావనీయత అవుతుంది. మీలోని జీవం ఇంకా మీరు పోగేసుకున్న ఈ భౌతిక శరీరం ఎక్కడ ముడిపడి ఉన్నాయో తెలిసేంతగా మీ ఎరుకను పెంపొందించుకుంటే, సరైన సమయం వచ్చినప్పుడు, మీరు ముడిని విప్పివేయగలరు.

ఇది ఆత్మహత్యా? ఖచ్చితంగా కాదు. ఆత్మహత్య అనేది నిరాశ నిస్పృహల్లోనో, కోపంలోనో, భయంలోనో, యాతనను భరించలేనప్పుడో జరిగేది. కానీ ఇది ఆత్మహత్యా కాదు, అనాయాస మరణమూ కాదు. ఇది ఎలాగంటే, మీ అంతట మీకు జీవన చక్రం ముగిసిందని తెలుసుకునేంత పరిపూర్ణమైన ఎరుక తెచ్చుకుని, దాని నుంచి బయటకి వెళ్ళిపోవడం. ఇది మరణం కూడా కాదు. దీనిని సమాధి అంటారు. ఈ స్థితిలో మనిషి తనలో తాను, అతను పోగేసుకున్న భౌతికత నుంచి వేరుపడటానికి కావలిసినంత ఎరుకను పెంపొందించుకుంటాడు. ఆ స్థాయికి చేరుకున్న ఎరుకలో, శరీరాన్ని విడిచివేయవచ్చు. మీరు ఆ రకమైన ఎరుకను సాధించలేకపోతే, మీరు కొన్ని విషయాలను సరిగా నిర్వహించుకొని, కనీసం ఆ చివరి క్షణాన్ని ఆహ్లాదంగా, శాంతంగా, ఆనందంగా ఇంకా పరమానందకరంగా మార్చుకోవచ్చు.

మీరు దీనిని చేయదలచుకుంటే, కొంత సాధన అవసరమవుతుంది. మీరు జీవితాన్ని వృధా చేసి, మరణాన్ని మాత్రమే ఉపయోగించుకుందామంటే అది జరగని పని. మీ జీవితంలో ఒక స్థాయి ఎరుకలో మీరు ఉంటే, మీరు విడిచి వెళ్ళే ఆ క్షణాలు కూడా ఎరుకలోనే జరుగుతాయి. మీరు జీవితాన్ని పూర్తిగా ఎరుక లేకుండా గడిపి, ఆ చివరి క్షణంలో ఎరుక కావాలంటే, అది జరగని పని.

ఈరోజు రాత్రి ఈ సాధన చేయండి, మీరు (నిద్రలోకి జారుకునే) వదిలిపోయే చివరి క్షణంలో, నేను దీనిని వదిలిపోవడమనే అంటాను, ఎందుకంటే ఆ చివరి క్షణంలో మీరు మెలకువ వదిలి నిద్రలోకి జారుతున్నారు. ఆ సమయంలో మీరు ఎరుకతో ఉండి చూడండి. ఇది మీ జీవితాన్ని అసాధారణంగా మార్చివేస్తుంది. దీనిని విధిగా ప్రతీరోజు చెయ్యండి. ధృఢసంకల్పంతో మీరు దానిని చేయాలి. చివరి క్షణాలను ఎరుకలోకి తెచ్చుకునే స్థితికి మీరు చేరుకోవటం కొద్ది రోజుల్లోనే చూస్తారు. ఈ సులువైన పద్ధతి ద్వారా ఒక్కసారిగా మీ జీవితంలో ప్రతీ అంశం, ప్రాథమికంగా జీవిత నాణ్యత మెరుగవుతుంది. మీరు ఇలా మెలకువ నుంచి నిద్రలోకి జారుకోవడమనే ప్రక్రియను ఎరుకతో చేయగలిగితే, జీవితం నుంచి మరణానికి మీరు ప్రయాణించే చివరి క్షణం మీకు ఎంతో ఆహ్లాదంగా జరుగుతుంది. దీనికి ఇతర పద్దతులు కూడా ఉన్నాయి.

సాంప్రదాయంగా భారతదేశంలో, ప్రజలు వారికి ఇష్టమైన వారి సమక్షంలో చనిపోవటానికి సిద్ధపడేవారుకాదు. ఎందుకంటే మీ వాళ్ళ దగ్గర చనిపోతే, ఎన్నో భావావేశాలు ఉబికి వస్తాయి. సహజంగానే అప్పుడు మీరు మళ్ళీ జీవితానికి అతుక్కుపోయే ప్రయత్నం చేసి, మీరు జరగుతున్న ప్రక్రియను హుందాగా జరగనీయారు. కాబట్టి ప్రజలు ఆధ్యాత్మికంగా శక్తివంతమైనవి అని పేరొందిన ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ శరీరాన్ని విడిచి పెట్టాలనుకునేవారు. ఇప్పటికీ ప్రజలు దీనిని కొనసాగిస్తున్నారు. పశ్చిమ దేశాలవారికి ఇది ఊహించడం కూడా కష్టం, ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళ కుటుంబసభ్యుల మధ్య సౌకర్యంగా మరణించాలనుకుంటారు. అది తెలివైన పని కాదు. ఒక నిర్దిష్ట రీతిలో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన స్థలాన్ని ఎన్నుకొని, సాధ్యమైనంత హుందాగా వెళ్ళడమనేది మనిషి చేసే తెలివైన పని. మీరు మీ జీవితాన్ని ఎంతో హుందాగా గడపి ఉంటే గనుక, మీరు హుందాగానే మరణించడం అనేది ఎంతో ముఖ్యమవుతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు