కర్ణాటక ఇంకా తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన కావేరి నది సమస్యకు సద్గురు స్థిరమైన పరిష్కారాన్ని చూపిస్తున్నారు..

జలవనరులు మనం నిర్వహించవలసినవి. గత కొన్ని దశాబ్దాలుగా మనం దీనిపట్ల శ్రద్ధ వహించలేదు. జల పరిరక్షణను ప్రోత్సహించడానికి సబ్సిడీలిస్తున్నాం కాని, నీటి పరిరక్షణతో కూడిన వ్యవసాయ పద్ధతులను ఎలా పాటించవచ్చో పరిశీలించలేదు. ఉదాహరణకు తమిళనాడులో మనమింకా చాలావరకు వరద నీటితో సాగుచేస్తున్నాం. నీటి వినియోగంలో ఇది అత్యంత క్రూరమైన పద్ధతి. ఇది భూమికి కాని, పంటకు కాని మంచిది కాదు. గతంలో ఇటువంటి పద్ధతులు అవలంబించాం కాని ఇప్పుడు మరింత సమర్థమైన వ్యవసాయ పద్ధతులు వినియోగంలోకి వచ్చాయి. మనం ఎక్కువ నీటిని ఒకేచోట నిలిపితే జీవకార్యకలాపం పూర్తిగా తగ్గిపోతుంది. మొక్క పచ్చగా కనిపించవచ్చు కాని అది అనేక విధాల నష్టపోతుంది.

దక్షిణ భారతదేశంలో మనకు నదులు మంచు వల్ల పారవు కదా. ఇవన్నీ అడవులు ఇచ్చే నీటి వల్ల ఏర్పడిన నదులు.

మనం దీన్ని మార్చినట్లయితే తమిళనాడు తన నీటి పరిస్థితిని తానే నిర్వహించుకో గలుగుతుంది. మరొ పక్క మనం కావేరీ నదిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి. నేను భాగమండలం నుండి కృష్ణరాజసాగర్ ఆనకట్ట, బృందావన్ గార్డెన్స్ వరకు తెప్ప ప్రయాణం చేశాను. ఇది 160 కి.మీ. కు పైగా ఉంటుంది. నాలుగు లారీ ట్యూబులు 12 వెదురు గడలతో చేసిన ఈ తెప్పపై ఈ ప్రయాణానికి నాకు 13 రోజులు పట్టింది. ఈ భూభాగం నాకు బాగా తెలుసు. అయితే ఈ 160 కి.మీ.లో మొదటి 30, 35 కి.మీ. మాత్రమే ఎంతో కొంత ప్రాంతం అడవి ఉంది. ఆ తర్వాత అంతా వ్యవసాయమే. ఈ విధంగా ఉంటే ఒక నది ఎలా ప్రవహించగలదు? దక్షిణ భారతదేశంలో మనకు నదులు మంచు వల్ల పారవు కదా. ఇవన్నీ అడవులు ఇచ్చే నీటి వల్ల ఏర్పడిన నదులు. అడవి లేకపోతే కొంతకాలం తర్వాత అక్కడ నది ఉండదు. మనకున్న జలగ్రాహక ప్రాంతం 35 కి.మీ. లోయ మాత్రమే. తక్కిన దూరమంతా జలగ్రాహక ప్రాంతం లేనేలేదు.

ప్రజలు ఏమనుకుంటారంటే నీళ్లున్నాయి కాబట్టి చెట్లున్నాయని. కాని వాస్తవానికి చెట్లున్నాయి కాబట్టి నీళ్లున్నాయి. నది పొడవునా అటూ ఇటూ కనీసం కి.మీ. వరకు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉందో అక్కడ మనం తక్షణమే అడవులు పెంచాలి.  ఎక్కడెక్కడైతే భూమి రైతుకు చెందినదో అక్కడ వ్యవసాయం బదులు పండ్లతోటలు పెంచాలి. రైతు వ్యవసాయం నుండి పండ్లతోటలు పెంచేందుకు మారాలంటే,  మొదటి ఐదు సంవత్సరాలూ ప్రభుత్వం అతనికి సబ్సిడీ ఇవ్వాలి. తర్వాత అతనికి పండ్లతోటలనుండి ఫలసాయం అందుతుంది. ఒకసారి ఫలసాయం ప్రారంభమైన తర్వాత ఈ వందలాది ఎకరాల ఉత్పత్తులను వినియోగంలోకి తేవడానికి సంబంధిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రైవేటు రంగానికి ప్రోత్సహం అందించాలి.

ఇప్పుడు మన నదులలో ప్రవాహం ఎంత తగ్గిపోతున్నదంటే మరో  20 ఏళ్లలో అవి వర్షఋతువులో మాత్రమే ప్రవహించే నదులుగా మారిపోతాయి.

ఈ చర్య వల్ల కలిగే లాభాలను మీరు వ్యవసాయదారుడికి చూపించగలిగినట్లయితే - అంటే భూమి దున్నడం కంటే ఉద్యానవన సాగువల్ల లభించే పంటలు లాభసాటిగా చూపించగలిగితే అతను సహజంగానే ఉద్యానవన సాగుకు మారతాడు. మీరు నదికి ఇరువైపులా కనీసం కి.మీ. దూరం - అంతకంటే ఎక్కువ వైశాల్యంలో అయితే మరీ మంచిది - పదిహేనేళ్ల లోపల అడవి పెంచగలిగితే కావేరిలో నీటి ప్రవాహం కనీసం 10 నుంచి 20 % పెరుతుంది. ఇప్పుడు మన నదులలో ప్రవాహం ఎంత తగ్గిపోతున్నదంటే మరో  20 ఏళ్లలో అవి వర్షఋతువులో మాత్రమే ప్రవహించే నదులుగా మారిపోతాయి. ఇప్పటికే కావేరి సంవత్సరంలో రెండుమూడు నెలలు సముద్రాన్ని చేరుకోవడం లేదు. ఈ దేశంలో రాబోతున్న పెద్ద ప్రమాదం ఇది.

అసలు ఇండియా అన్నపదమే సింధునది నుండి వచ్చింది. మనది నదీనాగరికత. నదీతీరాల్లో మనం పెరిగాం. ఇవ్వాళ మన నదులన్నీ ప్రమాదంలో పడ్డాయి. మనమిలా పరస్పరం తగాదాలాడు కోవడం కంటే అందరం కలిసి మననదులను పునరుజ్జీవింపజేయడమెలాగో ఆలోచించాలి. లేకపోతే కొన్నేళ్లలో మనం సీసాలతో నీళ్లు తాగం. సీసానీళ్లలో స్నానాలు చేయవలసి వస్తుంది. దాదాపు ఇప్పటికే సగం దేశం నీళ్లు లేనందువల్ల ఉదయం స్నానం చేయకుండానే పనికి వెళుతున్నారు. మరి కొన్నేళ్లలో మనం పదిరోజులకొకసారి స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం మన పిల్లలకు వదిలివెళుతున్న వారసత్వం, మీ దగ్గర ఏదున్నప్పటికీ వారికి సుఖాన్నివ్వదు - వాళ్లు సుఖంగా ఉండాలంటే ప్రకృతిలో ఒక తీవ్రమైన దిద్దుబాటు జరగాలి.

ఉద్దేశపూర్వకంగా మనమే ఆ పని చేస్తామా, లేదా ప్రకృతికే వదిలివేస్తామా అన్నది మనముందున్న ఎంపిక. ప్రకృతే ఈ పని చేసేటట్లయితే అది ఈ పని చాలా క్రూరంగా చేస్తుంది. వేలాది సంవత్సరాలుగా ఈ నదులు మనల్ని అక్కున చేర్చుకొని సంరక్షించాయి. ఇప్పుడు మనం మన నదుల్ని అక్కున చేర్చుకొని సంరక్షించవలసిన సమయం వచ్చింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు