ప్రశ్న: సద్గురు, మొన్నొకరోజు మీరు కర్మ గురుంచి మాట్లాడుతూ, కర్మను నమోదు చేయడానికి జీవానికి మనస్సు (మైండ్), శరీరం ఇంకా శక్తి వంటి ఎన్నో రకాల నిల్వ ప్రక్రియలు ఉంటాయన్నారు. మైండ్ ని తీసివేసినా కూడా, అది శరీరం ఇంకా శక్తులలో ఇమిడి ఉంటుంది. చూడటానికి ఇది చాలా విస్తృతంగా ప్రతీ ఒక్కింటినీ యాతనకు గురిచేసే వంచనలా ఉంది. ఎందుకు ఇది ఇలా ఉంది? 

సద్గురు: చూడండి, నేను ఎప్పుడు మాట్లాడినా, ఆ మాటను వెనక్కి తీసుకోనివ్వకుండా వంచనతో మీలో మూడు రకాల కర్మలు నమోదు అవుతాయి. అజాగ్రత్తగా ఉన్న ఒక క్షణంలో నేను ఒక మాట ఇస్తే, నేను ఆ మాటమీద వెనక్కి వెళ్ళకుండా చూడటానికి మీరు మూడు రకాలుగా రికార్డు చేస్తున్నారు ఇక్కడ.

కర్మ అనేది మీరు అర్థం చేసుకున్నట్టు ఉండదు. ఇది చెడ్డది కాదు. మీ కర్మ కారణంగానే మీరిప్పుడు ఇలా ఉన్నారు. మీరు పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకూ, మీరు చేసిందీ, ఆలోచించిందీ, భావించి అనుభవించినదీ, అంతా మీ కర్మే. మీరేమిటనేది నిర్ణయించేది ఇదే. అదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కాబట్టి కర్మ అనేది వంచించే ప్రక్రియ కాదు. అది ఒక బంధమే కావచ్చు కానీ కర్మ మీకు రక్ష కూడా. ఇప్పుడు మీ భౌతిక అస్థిత్వానికి కర్మే ఆధారం. కర్మ పదార్ధమే లేకపోతే, మీరు మీ శరీరానికి అట్టిపెట్టు కోలేరు. శరీరానికి మీకు మధ్య సిమెంట్ లాగా ఒక బంధన కలిగించేదే కర్మ. మీ కర్మ మొత్తాన్ని తీసివేస్తే, ఈ క్షణమే మీరు శరీరాన్ని విడిచిపెడతారు, కానీ ఇప్పుడది మా చేతుల్లో జరగాలని మేము ఆశించటం లేదు. శరీరం, మనస్సు, సంవేదన, ఇంకా శక్తి స్థాయిలలో మీకు సంబంధించినవి ఏవీ కోల్పోకుండా చూడటానికే ఈ నమోదు ప్రక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి.

స్వీయ పరిరక్షణే ప్రాథమికంగా మానవుడిలోని సహజ గుణం. మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవాడానికి మీ చుట్టూ కట్టుకున్న గోడలు మీకు కొంత కాలం రక్షణనిచ్చి మిమ్మల్ని ఆనందానికి గురిచేశాయి. కానీ మీలోని ఒక పార్శ్వం, ఎల్లప్పుడూ అపరిమితంగా విస్తరించేందుకు కోరుకుంటుంది. ఇప్పుడా పార్శ్వం ఒక్కసారిగా, మీరు కట్టుకున్న గోడను ఒక చెరసాల అని చెప్పటం మొదలుపెడుతుంది. అది గోడను బద్దలుకొట్టి వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ మీలోనే ఉన్న వేరే పార్శ్వం స్వీయ పరిరక్షణ కోసం తర్జన భర్జన పడుతూ ఈ గోడను బలోపేతం చేయాలనుకుంటుంది. అది ఆ గోడను మరింత మందంగా చేయాలనుకుంటుంది. చార్లెస్ డార్విన్ చెప్పిన ప్రకారం చూసినా, మానవుని చరిత్రంతా ఒక జంతు లక్షణమే (మానవ పరిణామమంతా ఒక పశు శ్వభావమే). కానీ మీలో ఉన్నదేదో ఎల్లప్పుడూ విస్తరించేందుకే కోరుకుంటుంది. మీరు ఈ కోరికను సునిశితంగా పరిశీలిస్తే, అది ఎక్కడా ముగియదని మనకు అర్థమవుతుంది. అపరిమితమయ్యేంత వరకూ అది తృప్తి పడదు.

కర్మ భవనం

మానవుని చరిత్రంతా ఒక జంతు లక్షణమే (మానవ పరిణామమంతా ఒక పశు శ్వభావమే). కానీ మనిషి భవిష్యత్తు ఒక దివ్యత్వం. కానీ మీరు ప్రస్తుతం ఒక లోలకం (Pendulum) లాగ అటూ ఇటూ రెంటికీ మధ్యలో ఊగిసలాడున్నారు. మీలోని ఒక పార్శ్వం స్వీయ పరిరక్షణ అనే మీలోని బలమైన సహజ గుణం అయితే, మరొక పార్శ్వం మీ పరిధులన్నిటినీ అధిగమించాలనుకునే కోరిక. కర్మ అనేది స్వీయ పరిరక్షణకు గోడలాంటిది. ఒకప్పుడు ఎంతో జాగ్రత్తగా మీరు నిర్మించుకున్నది ఇప్పుడు మీచుట్టూ ఒక స్వయం నిర్మిత కారాగారంలా అనిపిస్తుంది. కర్మ అనేది ఈ స్వయం నిర్మిత కారాగారానికి ఒక భవనం లాంటిది. అది ఉన్నా మీకు ఇబ్బందే, లేకున్నా ఇబ్బందే. అదే సమస్య. మీరు మీ కారాగారం పరిమాణాన్ని పెంచాలని చూస్తారు. కానీ మిమ్మల్ని మీ అనుమతి లేకుండా 5*5 కొలతల కారాగారంలో పూర్తిగా బంధీని చేస్తే, మీరు అందులోనుంచి స్వేచ్చను కోరుకుంటారు. మీ దృష్టిలో స్వేచ్చ అంటే, ఆశ్రమంకున్న ప్రహరీ గోడలే. మిమ్మల్ని ఆ ప్రహరీ గోడ అవతలకి వెళ్ళనిస్తే, మీకది అపారమైన స్వేచ్చగా అనిపిస్తుంది. కానీ మూడు రోజుల్లో పర్వతాలనీ, ఆకాశాన్నీ, గేటుని చూస్తారు. తరువాత మీకున్న స్వేచ్చ అనే ఆలోచన (భావం) ఆశ్రమం గేటు నుంచి ఇంకోదానికి విస్తరిస్తుంది. అప్పుడు మేము మీకు “సరే, మీరు తనికండి గ్రామం దాకా వెళ్ళిరండి” అని చెప్తాం. కొంత కాలం వరకూ అది మీకు గొప్ప స్వేచ్చగా అనిపిస్తుంది. కానీ తరువాత మీకు కోయింబత్తూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ కొన్నిసార్లు అక్కడికి వెళ్లేసరికి తరువాత అది కూడా చాలదనిపిస్తుంది. సాంప్రదాయ ఆధ్యాత్మిక ప్రభావం బాగా ఉన్న మీలో కొంతమందికి హిమాలయాలకు వెళ్ళాలనిపిస్తుంది, లేదంటే ఇంకో ఏదో పెద్ద నగరానికి లేదా ఉంకో చోటుకి. కాబట్టి, ఇలా మీ స్వీయకారాగారమనేది నిరంతరం మారుతూ ఉంటుంది. స్వేచ్చ అనే మీ ఆలోచన కూడా నిరంతరం వృద్ది చెందుతుంది.

అంచెలంచెలుగా జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఎందుకు ఒక జీవిత కాలాన్ని వెచ్చించి, చివరకు ఒక మూర్ఖుడిలా చావడం? దీనిని అవగతం చేసుకోవటానికి ఇదే సమయం. స్వేచ్చ అనే ఈ భావం అపరిమితమైనది (అనంతం). మీలోని జీవం అపరిమితానికి తప్ప, మరిక దేనికీ తృప్తి పడదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే, అది చక్కగా స్పష్టమవుతుంది. మీరు అపరిమితం కావాలనుకుంటే, అది భౌతిక అడ్డంకులను అధిగమించడం ద్వారా సాధ్యపడదు, ఎందుకంటే, భౌతికమనేది ఎప్పటికీ అపరిమితం కాలేదు. భౌతిక వాస్తవికత పరిమితులను మీరు దాటగలిగి, భౌతిక అస్తిత్వాన్ని కూడా దాటగలిగితే, అపరిమితానికి అవకాశం ఉంటుంది.

ఎంపికతో జీవించటం

భౌతికతతో మీకు మూలాలను ఏర్పరచేదే కర్మ. కర్మ అనేదే లేకపోతే మీకు ఆ మూలం ఏర్పడదు. కాబట్టి ప్రకృతి మీరు పని చేయటానికి ఒక ఆధారం ఉండేలా చూస్తుంది. శరీరంలో ఉండకపోతే, జిజ్ఞాస అనేదే ఉండదు. నిర్కాయ జీవి ఎంపికతో జిజ్ఞాసను కలిగి ఉండలేదు. అది ధోరణుల వల్ల మాత్రమే జిజ్ఞాసను కలిగి ఉండగలదు. ఒక నిర్దిష్ట స్థాయికి చేరితే తప్ప, అది ఎంపికతో జిజ్ఞాసను కలిగి ఉండలేదు. కానీ శరీరమున్న జీవికి (మనిషి) ప్రతీ క్షణాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మీరు జీవితంలో ఎరుకతో ఉంటే, ప్రతీ క్షణం ఒక ఎంపికే అవుతుంది.

బ్రహ్మచర్యం లేదా సన్యాసం అంటే, మీరు ఎంపికతో జీవిస్తున్నారన్నమాట. ఈ ఎంపిక ప్రక్రియను ఒక జీవన వాస్తవికతగా చేయడానికే మేము యోగాలో కొన్ని ప్రక్రియలను ప్రవేశపెట్టాం. ఉదయం నిద్ర లేచే సమయంలో, మీరు మంచం మీద అటూ ఇటూ దొర్లాలనుకుంటారు. అది శరీరరానికుండే సహజ లక్షణం, కానీ మీరిప్పుడు ఉదయం యోగాసనాలు వేస్తున్నారు. అప్రయత్నంగా మీరు మంచం మీద దొర్లవచ్చు కానీ అప్రయత్నంగా మీరు ఉదయంపూట ఆసనాలు వేయలేరు. సహజంగానే శరీర కదలిక అనే ప్రక్రియ ఎరుకలోకి వస్తుంది. ఎరుక అనే అంశాన్ని మీ జీవితంలోకి తీసుకురావలనుకుంటారు. ఇదే విధంగా, ఆలోచించడం, భావోద్వేగం, జీవించటం అనేవి కూడా ఎరుకతోనే చేస్తారు. దీనితో జీవశక్తి అనేది ఎరుకలోకి వస్తుంది, ఎందుకంటే మీరు ఎరుకలో ఉంటేనే, జీవితంలోని అంశాలను మీరు ఎంపిక చేసుకుంటారు. లేదంటే, మీ జీవితం నిర్బందాలతోనే నడుస్తుంది. స్వేచ్చకు, బంధనానికి ఉన్న వ్యత్యాసం ఇదే – మీరు నిర్బంధంతో వ్యవహరిస్తున్నారా లేక ఎంపికతోనా అనేదే.

మనుష్యులలో వివిధ రకాల కర్మలు ఉంటాయి. దాని ఫలం ఎప్పుడూ ఉంటుంది, కానీ క్షణక్షణం మీరు దాని నుంచి ఏమి సృష్టించుకోగలరనేది పూర్తిగా మీ ఎంపికే, అది మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎటువంటి కర్మ ఉందనేది అనవసరం, కానీ ఈ నిముషంలోని కర్మ ఎల్లప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎరుకలో ఉండటానికి సిద్ధపడితే, ఈ క్షణంలో, మీరు ఆనందంగా ఉంటారా లేక విచారంతో ఉంటారా అనేది ఎల్లప్పుడూ మీ ఎంపికే అవుతుంది. కర్మ నమోదుకావడం, లేదంటే, నేను చెప్పేది మూడు ప్రక్రియల్లో నమోదు కావడమనేది సమేస్యే కాదు, ఎందుకంటే నేను చెప్పిన మాటలను నేను ఎప్పుడూ వెనకకు తీసుకోను. మరిక ఏమిటి సమస్య? కావలిస్తే మూడు వందల విధాలుగా రికార్డు చేసుకోండి. మీరు ఒక్కటే నమోదు చేస్తారు. జీవం కొన్ని లక్షల విధాలుగా నమోదు చేస్తుంది. అయితే ఏంటి? మీరు ముందుకే వెళ్ళగలరు, వెనకకి కాదు. వాటిని నమోదు చెయ్యనివ్వండి. దేవతల్ని, దెయ్యాల్ని ఇంకా ఎవర్నో నమోదు చేస్తే చెయ్యనివ్వండి. చెట్లు, జంతువులూ, కీటకాలూ మీ కర్మను నమోదు చేస్తే చెయ్యనివ్వండి.....ఏంటి సమస్య?

ప్రేమాశీస్సులతో,

సద్గురు