చాలా మంది తాము పడే బాధలకి మూల కారణం కోరిక అని చెబుతుంటారు..కొంతమంది ఆధ్యాత్మికులు అని చెప్పుకునేవారు కూడా కోరికే అన్నిటికీ కారణమని, కోరికలు లేకుండా జీవించాలని అంటుంటారు. దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోండి..

బాధలకి మూల కారణం కోరిక కాదు. కాని "నెరవేరని కోరిక" అన్ని బాధలకీ మూల కారణం. మీకు మీ కోరికలు నెరవేరాయనుకోండి  అవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.  ఏ కోరికలైతే తీరడం లేదో అవే కదా మీకు విచారాన్ని కలిగిస్తాయి. ప్రజలు ఏమంటారంటే " మీరు మీ కోరికల్ని చంపేస్తే తప్ప, మీ బాధలు తొలగిపోవు" అని. ఇప్పుడు మీరు కనుక  మీ కొరికలని వినాశనం చేసెయ్యలనుకుంటే, మీకు మిగిలేదల్లా, “ మీ కొరికలని నాశనం చెయ్యాలి” - అని ఒక గొప్ప కోరిక మాత్రమే..! ఇది, ఎప్పటికీ నెరవేరకుండానే ఉంటుంది. ఎందుకంటే.. నాకు కోరిక ఉండకూడదు - అనేదీ ఒక కోరికే కదా. అందుకని,  మీరు దీనితో ఆటలాడాలని చూస్తే, ఇది మీకు పని చేయదు.

జీవితమే కోరిక. మీ జీవిత మూలమే ఒక కోరిక.

మీరు కోరిక అని దేనినైతే అంటున్నారో, ఆ శక్తి మీ ప్రాణ శక్తి నుంచి వేరైనదేమీ కాదు. మీరు ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్లాలనుకున్నారనుకోండి, మీకు అటువంటి కోరిక ఉంది కాబట్టే అది జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్ళేది బస్సో, కారో, మరొకటో కాదు, అది మీ కోరికే. మీరు భోజనం చేసేలా చేసేది మీ కోరికే. అందుకని, మీరు దేనినైతే కోరిక అని అంటున్నారో, మీరు దేనినైతే జీవితం అని అంటున్నారో -  ఈ రెండిటి మధ్య పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. జీవితమే కోరిక. మీ జీవిత మూలమే ఒక కోరిక.

ఇప్పుడు నేను మీ కొరికలని చంపేయండి అని చెపితే, మీకున్న ఒకే ఒక మార్గం - మీరు ఉరి పోసుకోవడమే..! నిజానికి మరొక మార్గమే లేదు. కానీ, నేను చనిపోవాలీ అని అనుకుంటే అది కూడా ఒక కోరికే..! అందుకని ఇలాంటి విషయాలతో మిమ్మల్ని మీరు, మోస పుచ్చుకోకండి. కోరిక అనేది మీ జీవిత సారం. కానీ, అదే సమయంలో మీరు ఈ కోరికని ఒక అంతులేని విషయంగా మలచుకోవద్దు. మీరు కనుక ఒకదానిని తృప్తిపరిస్తే మరొకటి సిద్ధంగా ఉంటుంది. మీరు దానిని కూడా నెరవేరిస్తే మరుసటి రోజు మరొకటి తయారవుతుంది. ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ ఈ చట్రంలో ఉంచుతూనే ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేరకుండా ఉంటాయి. ఈ నెరవేరని కోరికలు, ఎంతో విషాదాన్ని కలిగిస్తాయి.

మీరు కనుక ఒకదానిని తృప్తిపరిస్తే మరొకటి సిద్ధంగా ఉంటుంది. మీరు దానిని కూడా నెరవేరిస్తే మరుసటి రోజు మరొకటి తయారవుతుంది.

మీ కోరికను కనుక పరిశీలించి చూస్తే.. ఇప్పుడు ఉన్నదానికంటే ఇకొంచం ఎక్కువగా ఉండాలి అని కాంక్షిస్తూ ఉంటారు. ఇదే కోరిక. మీ కోరిక పరమోన్నతమైనది, అపరిమితమైనది, అంతులేనిది కాకపొతే దీనిని మీరు ఎరుక లేకుండా చేస్తున్నారు. మీరు చెయ్యవలసినదల్లా, మీ కోరికని మీ ఎరుకలోనికి తీసుకుని రావడమే..! ఇప్పుడు ఇది అచేతనంగా ఉంది. ఎందుకంటే, మీ కోరికలు కనీసం మీ గురించి కూడా కాదు. ఒక విషయం గమనించి చూడండి. ఇప్పుడు మీరు హైదరాబాదులో ఉన్నారనుకుందాం, మీ పొరుగింటివారికి ఒక పెద్ద కారు ఉంటే, మీ కోరిక ఏమిటి..? మీకు అలాంటి రెండు కార్లు కావాలి. మీరొక పల్లె ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ కార్ల గురించి తెలియదు. అక్కడ మీ పొరుగింటిలో ఒక పెద్ద గేదె ఉందనుకోండి.. మీ కొరికేమౌతుంది..? మీకలాంటి రెండు గేదెలు కావాలి. అందుకని కోరిక అనేది మీరు నివసిస్తున్న సామాజిక పరిస్థితులకు  ఒక స్పందన మాత్రమే..! ఇది మీరు అనంతంగా ఎదగాలి అన్న కాంక్షని, అచేతనంగా వ్యక్తపరచడమే అవుతుంది.

మీరు కనుక కోరిక అన్న ప్రక్రియను ఒక సచేతన ప్రక్రియగా మలిస్తే అప్పుడు, కోరికతో ఎటువంటి సమస్యా లేదు. కోరిక అనేది ఒక అద్భుతమైన వాహనమే. ఇది మిమ్మల్ని ఎన్నో చోట్లకి తీసుకు వెళ్తుంది. మీరు ముక్తిని పొందాలన్నా సరే, దానికి కోరిక కావాలి. అవునా..? కాదా..? మీలో ఉన్న కోరిక మీకు అపరిమితత్వాన్ని, అనంతత్వాన్ని కాంక్షిస్తూ ఉంది. అది ముక్తిని కాంక్షిస్తోంది. మీరు చెయ్యవలసినదల్లా దాన్ని మీ ఎరుకలోనికి తీసుకురావడమే..! కోరికల ప్రక్రియని ఎరుకతో చేస్తే.. అది మీకు ఒక గొప్ప సాధనం అవుతుంది. అది గనక అచేతనంగా అభివ్యక్తం అవుతుంటే.. అది మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా పరిగెత్తిస్తుంది. ఎప్పుడూ మిమ్మల్ని అలా పరిగెత్తిస్తూనే ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

 pixabay