భారతీయ అమెరికన్ రచయిత, వక్త, వైద్యులు అయిన దీపక్ చోప్రా 18 అక్టోబర్ 2015 న, ‘ఆధునిక ప్రపంచంలో ప్రాచీన జ్ఞ్యానం’ అనే అంశం పై సద్గురు తో ముచ్చటించారు. ఆ సంవాదం నుండి కొన్ని విశేషాలు.

మోడరేటర్: నేను ఇక్కడ ఉండగలగటం అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే విషయం ఏంటంటే, జ్ఞ్యానదాయకమైన ఈ అంశం గురించి మాట్లాడటానికి వేర్వేరు దృక్కోణాలు, రంగాలకు చెందిన ఇద్దరు అద్భుత వ్యక్తులు ఇక్కడ ఉండటం. డాక్టర్ చోప్రా గారు ఒక వైద్యుడిగా, వైజ్ఞానికుడిగా, సత్యాన్వేషిగా ఇక్కడున్నారు. సద్గురు ఒక మార్మికుడిగా, మనం ఇంకా తెలుసుకోనిది తెలుసుకున్నఒక వ్యక్తిగా, తమ జ్ఞ్యాన భాండాగారంతో మన ముందు ఉన్నారు.

మీ ఆలోచనా క్రమం కాలక్రమంలో చాలా మారిందా? ఈ ప్రశ్నకి దయచేసి ఇద్దరూ సమాధానం చెప్పగలరా?.

దీపక్ చోప్రా: సద్గురు, ఎన్నో సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలవటం గొప్ప గౌరవంగా అనిపిస్తోంది నాకు. నేను పోర్టోరికో లో మీతో ఫ్రిస్బీ ఆడటం నాకింకా గుర్తుంది. ఔను. నా ఆలోచన ఒక విధంగా మారిందనే చెప్పాలి. నేను నాకు ముఖ్య రంగమైన ఈ శాస్త్రీయ దృక్కోణం అనే దారి నించి మరలి, శరీరానికీ మనసుకీ ఉన్న సంబంధం తెలుసుకునే వైపు అడుగులు వేస్తున్నప్పుడు అది జరిగిందనుకుంటా.గత నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నించి నేను తెలుసుకున్న విషయం, ఎన్నో శతాబ్దాలుగా ఎందరో యోగులకు ఇదివరకే అనుభవం అయి ఉంది. అది ఏంటంటే, ‘సత్యాన్ని తెలుసుకోవటానికి ఒక నిర్దిష్టమైన ఆలోచనా ధోరణి అంటూ లేదన్న’ విషయం. ఒక శాస్త్రీయమైన ఆలోచనా ప్రక్రియ అయినా, ఒక గణితపరమైన ఆలోచనా ప్రక్రియ అయినా, క్వాంటం ఫిజిక్స్ ఆలోచన అయినా, ఈ ఆలోచనా ప్రక్రియలేవీ సత్యానుభావాన్ని మనకి ఇవ్వలేవు.ఎందుకంటే సత్యం అనేది ఆలోచనలకు అతీతమైనది.

సత్యం అనేది బుద్ధికి అర్ధం కాని విషయం. ఈ రకమైన ఆలోచనా ప్రక్రియలు ఎంత శాస్త్రీయమైనవైనా సరే, కొన్ని నమూనాలను తయారు చెయ్యగలవు తప్పితే సత్యాన్ని చూపించలేవు. కానీ మనకి వాటి మీద నమ్మకం. ఎందుకంటే, ఒకసారి ఒక నమూనా తయారైతే మనం దానికి ఒక సాంకేతికత తీసుకురావచ్చు. మనం జెట్ విమానాలు, బాంబులు, యంత్ర అనుసంధానిత మరణాలు, అంతర్జాలం లాంటి ఎన్నో అద్భుతాలు తయారు చెయ్యగలం. సైన్సు మనకి సత్యానికి దారి చూపిస్తుందని అనుకుంటాం మనం, కానీ విజ్ఞ్యానం అనేది ఇటు మనసుకీ, అటు పదార్ధానికీ చెందని ఒక వ్యవహారం. దానికి ఒక సరైన పదం లేకపోవటం వల్ల, అది చైతన్యం అని అంటాం. దాన్నే గొప్ప గొప్ప యోగులు ‘బ్రహ్మం’ అని అంటారు. దాని యొక్క సవరించిన రూపమే ఈ విశ్వం. మీ మనస్సు, మీ శరీరం, ఈ విశ్వం అన్నీ కూడా ఒక సృష్టించలేని, మనకు స్థానికం కాని, ఒక పార్శ్వమంటూ లేని, సమయం కానీ స్థలం కానీ లేని సత్యానిచే సృష్టించబడి, నిర్మించబడి, నిర్వహింపబడుతోంది.

ఆధునికులకు దీన్ని అర్ధం చేసుకోవటం సాధ్యపడదు. కానీ మనం ప్రాచీన విజ్ఞ్యాన సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టీ, మీరు ‘యోగ వాశిష్టం’ చదివితే(ఒక ప్రాచీన భారత గ్రంధం లేదా స్మృతి) “మనం చూడలేనిదే బ్రహ్మమని కానీ అది లేనిదే చూపు లేదనీ, అవగతం కానిదే బ్రహ్మమని కానీ అది లేనిదే అవగాహనే లేదనీ, ఊహకి అందనిదే బ్రహ్మమని కానీ అది లేనిదే ఊహ, సృజన, దృష్టి, దృక్కోణం, అవకాశం ఇవేవీ లేవని” చెబుతుంది. మనం ‘సత్యం’ అనేదంతా ఒక సృష్టించలేని, పార్శ్వం అంటూ లేని, మనకు చెందని ఒక స్థానము. దానికి సమయమూ, ప్రదేశము రెండూ లేవు. కృష్ణ పరమాత్ముడు దీని గురించి చెబుతూ, “ నీరు తడి చెయ్యలేనిది, గాలి పోడిబార్చనిది, ఆయుధాలు పడగొట్టలేనిది, నిప్పు కాల్చలేనిది, ఎంతో ప్రాచీనమైనది, జనన-మరణాలు లేనిది” అని అన్నారు. అది బుద్ధికి అర్ధం కాదు కానీ, ఒకానొక సమయంలో అనుభవపూర్వకంగా తెలుస్తుంది-చైత్యన్యాన్ని అనుభవించినప్పుడు, ఈ ఉనికిలో లీనమైనప్పుడు, మీరు ఆ ఉనికీ వేరు కానప్పుడు. దీన్నే ‘సత్ చిత్ ఆనందం’ లేదా ‘తత్వమసి’ అని అంటారు. అది ఒక మేధోపరమైన అనుభవం కాదు ఒక అతీతమైన అనుభవం అంటూ ఇక ఇక్కడ నేను ఆపదల్చుకున్నాను.

మోడరేటర్: సద్గురు, మీకు ఈ స్థాయి అనుభవమే. మీ ఆలోచనా సరళి ఎలా మారిందో చెప్పండి.

సద్గురు: నేను ఆలోచన గురించి ఎక్కువగా చెప్పలేను ఎందుకంటే నాకు ఎక్కువగా ఆలోచన ఉండదు. నాకు, నాలో జరుగుతున్న ఈ జీవన గమనమనే ప్రక్రియే అన్నిటినీ మరిపించే విషయం. నేను ఏదైనా ఆలోచన అంటూ చేసేది, నేను భౌతికంగా ఏదైనా పని చెయ్యవలసి వచ్చినా, లేదా ఏదైనా అమర్చవలసి వచ్చినప్పుడు మాత్రమే. లేనప్పుడు ఒక్క ఆలోచన కూడా లేకుండా నాకు రోజులు గడిచిపోతూ ఉంటాయి. అందరూ ”మీ సాధన ఏమిటి?” అని అడుగుతారు. చిన్నప్పటి నించీ నా సాధన ఏంటంటే, నాకు నేను దేనితోనూ గుర్తింపు ఏర్పరుచుకోలేదు-కుటుంబంతో కానీ, సంస్కృతి తో కానీ, మతంతో కానీ, సమాజంతో కానీ, చుట్టూ ఉన్న ఇతర వస్తువులతో కానీ . నేను వాటితో మమేకం అయ్యి ఉన్నాను కానీ ఎవరితోనూ దేనితోనూ ఒక గుర్తింపు అంటూ ఏర్పరుచుకోలేదు.

మీ మేధస్సుని మీరు ఒక గుర్తింపుతో కట్టేయకపోతే, ప్రతి మనిషీ ఈ జీవితం యొక్క లక్షణాన్ని అవగాహన చేసుకోగలడు. మేధస్సు అంటే దానర్ధం, దీపక్ చోప్రా గారు చెప్పినట్టు అది ‘ఊహాతీతమైనది’. దురదృష్టం కొద్దీ మనకి ఇప్పుడున్న విద్యావిధానాల వల్ల, మన మేధస్సుకి ఉన్న ఒక పార్శ్వం తో మనం కట్టుబడిపోయి పరిమితమైపోయాం. మీరు మీ పంచేంద్రియాలతో పోగుచేసుకున్న సమాచార లక్షణాన్ని అనుసరించే మీకు ఆలోచనలు కలుగుతాయి. అది కేవలం జీవించటానికి ఉపయోగకరం అంతే. మీరు ఒక విషయాన్ని ఎలా చూస్తారు, ఎలా వింటారు, ఎలా వాసన చూస్తారు, ఎలా రుచిని ఆస్వాదిస్తారు, ఎలా తాకుతారు అనే విషయాలు కేవలం బ్రతకటానికి మాత్రమే ఉపయోగకరం. కానీ జీవితాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఈ అవగాహనా సాధనాలు చాలవు. ప్రకృతి మనకి పంచేంద్రియాల ద్వారా అవగాహన చేసుకునే లక్షణాన్ని ఇవ్వటానికి కారణం జీవించటం కోసం మాత్రమే. అదే విధంగా మిగతా జీవజాలానికి కూడా వాటికి తగిన ఇంద్రియ లక్షణాలను ఇచ్చింది. మీరు కేవలం జీవించటమే లక్ష్యం అనుకుంటే, ఈ పంచేంద్రియాలూ చాలు మీకు. కానీ మీరొక మనిషిగా పుట్టారు కాబట్టీ జీవించటం ఒక్కటే చాలదు మీకు. మీ కడుపు ఖాళీగా ఉంటే, ఒకే ఒక సమస్య- ఆహారం. కానీ ఒకసారి కడుపు నిండితే మాత్రం మీకు వంద విషయాలు తడతాయి. మనిషి యొక్క లక్షణం అదే. మీరు ఏం చేసినా సరే, మీరు ఇప్పుడున్న దానికన్నా ఇంకేదో కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటారు. ఆ ‘ఇంకొంచెం ఎక్కువ’ దొరికితే మరి కాస్త ఎక్కువ కావాలి అనిపిస్తుంది- అలా అది అనంతంగా సాగుతుంది. మనిషి అంతులేనంతగా ఎదగాలనుకుంటున్నాడు కానీ దానికి భౌతిక ఇంద్రియ మార్గాలు ఎంచుకుంటున్నాడు.

భౌతికత యొక్క లక్షణం ఒక గిరి గీసుకున్న హద్దు. ఒక హద్దు అనేది లేకపోతే ఈ విశ్వంలో భౌతికమైన విషయాలు యేవీ జరిగే అవకాశం లేదు. కానీ మనిషి అపరిమితత్వానాన్ని కోరుకుంటున్నాడు అది కూడా భౌతిక సాధనాలతో, అంచెలంచెలుగా కోరుకుంటున్నాడు. అంటే, పరిమితమైన వాటి ద్వారా మీరు అపరిమితత్వానాన్ని కోరుకుంటున్నారు. కోరిక బ్రహ్మాండంగా ఉంది కానీ పద్ధతి పనికిరానట్టుగా ఉంది. ఎందుకంటే మీకు మీరు ఒకదానితో లంకె వేసి గుర్తింపు ఏర్పరుచుకోవటం మొదలెడితే, మీ మేధస్సు ఆ గుర్తింపుని కాపు కాయటం మొదలెడుతుంది. మీరు దేనితో గుర్తింపు ఏర్పరుచుకున్నా సరే, ఒక దేశంతో అయినా, ఒక కుటుంబం, లింగం, జాతి, మతం, మరేదైనా సరే, మీ మేధస్సు ఆ గుర్తింపు చుట్టూనే పనిచేస్తుంది. ఏ రకమైన గుర్తింపైనా అది పక్షపాతమే. అందుకు నేను చేసింది ఏంటంటే, నేను ఎప్పుడూ దేనితోనూ గుర్తింపు ఏర్పరుచుకోలేదు. దానితో నాలో జీవ విస్ఫోటనం జరిగింది. దానిముందు ఆలోచనలు అనేవి ఏమాత్రం ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తాయి అందువల్లే నేను వాటి జోలికి పెద్దగా పోను.

ఆలోచన అనేది మీకు ఇదివరకే ఉన్న సమాచారాన్ని మార్చి మార్చి చూసుకోవటం మాత్రమే. ఆ విషయం మీకు ఇప్పుడు అర్ధమైతే, మీ జీవితం మీరు ఊహించనంతగా రూపాంతరం చెందుతుంది. లేకపోతే (మిమల్ని పాతిపెట్టి నప్పుడు) క్రిమికీటకాలు మీకు ఆ విషయాన్ని తెలియజేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున మీకు తెలుస్తుంది- మీరు దేనికీ చెందరని!.

ప్రేమాశీస్సులతో,

 

సద్గురు