పంచభూతాలని వేటిని అంటున్నాం? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ­- వీటినే మనం పంచభూతాలని అంటున్నాం. మనం నివసించే ప్రపంచం ఈ పంచభూతాల ఆటే. ఈ ప్రపంచం అంతా ఈ పంచభూతాలతో ఏర్పడినదే. కాస్త గమనిస్తే, మన శరీరం  కూడా ఆ ఐదు అంశాలతో ఏర్పడినదే.

మన శరీరంలో 72 శాతం నీరు, 12 శాతం భూమి, 4 శాతం అగ్ని, 6 శాతం గాలి... మిగతాది ఆకాశం. ఈ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే, ఈ పంచభూతాలను శుద్ధి చేయాలి. ఆ యోగాలో ఈ అభ్యాసాన్నే భూతశుధ్ది అంటాం.

శరీరంలో ఉన్న పంచభూతాలను శుద్ధి చేసుకోవడానికి ఒక సులభ మార్గముంది. శరీరానికి వెలుపల ఉన్న పంచ భూతాలూ, లోపల ఉన్న పంచ భూతాలూ వేరు కావు. మీ దేహానికి వెలుపలవున్న భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం మొదలైన వాటిని ప్రత్యేక భక్తి భావనతో తలచుకున్నప్పుడు, మీలో ఉన్న పంచభూతాలు కూడా గొప్పగా స్పందిస్తాయి. శరీరం బయట ఉన్న నీటిని భక్తి భావంతో చూస్తే, శరీరంలోవున్న నీరు కూడా పవిత్రమౌతుంది. నీటిని మనం గంగామాత అని పూజించడం, గుడిలో నీటిని తీర్థంగా భక్తి ప్రపత్తులతో స్వీకరించడం ఇందు కోసమే.

గుడిలో కర్పూరం, దీపం వెలిగించడం లేక సాంబ్రాణి పొగ వేయడం లేక ఆహారాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవడం వంటివన్నీ అగ్నిని, గాలిని, భూమిని భక్తి భావనతో చూసే పద్ధతులు.  పీల్చే గాలిని భక్తి భావంతో చూస్తే, మీ లోపలి ఉన్న గాలి యొక్క గుణం కూడా మారుతుంది. ఇలా వెలుపల ఉన్న పంచభూతాలన్నిటినీ భక్తి భావంతో చూస్తే, పరిసరాల్లో ఉన్న ప్రకంపనల స్థితి మారుతుంది. తద్వారా శరీరారోగ్యమే కాకుండా, మీ జీవితంలో కూడా వెంటనే మార్పు రావడం మీరు గమనిస్తారు. పంచభూతాలలోని అయిదవ అంశమైన ఆకాశం 'లేక' బ్రహ్మాండం విశాలమైనది. ఈనాటి సైన్స్ శూన్యంతో ఉన్న బ్రహ్మాండానికి ఏదో తెలివి ఉందని చెబుతున్నది. అకారణంగా కొందరి జీవితం ఛిన్నాభిన్నం అవడం, అలాగే అకారణంగా కొందరి జీవితం బాగుపడడం మీరు చూసే ఉంటారు. ఇది తెలిసో, తెలియకో ఆకాశం యొక్క సహకారం పొందడం, లేదా పొందలేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఆకాశం లేక బ్రహ్మాండం చాలా ముఖ్యమైనది. దీన్ని ఆధారంగా చేసేకునే మిగతా నాలుగూ భూతాలు పనిచేస్తున్నాయి. భూమి, సూర్య మండలం వంటి వాటన్నటినీ వాటి స్థానాల్లో పట్టి ఉంచేదే బ్రహ్మాండం. మీ జీవితంలో ఆకాశం సహాయం ఎలా పొందాలో నేర్చుకుంటే జీవితం ఫలప్రదమౌతుంది. దీనికి నేనొక చిన్న ప్రక్రియ నేర్పుతాను. ఇది సులువైన ప్రక్రియే, కాని ఫలితం అమూల్యం!

పొద్దున సూర్యోదయం తర్వాత, సూర్యుడు 30 డిగ్రీల కోణం దాటక ముందు ఆకాశాన్ని చూసి, మిమ్మల్ని ఇక్కడ ఒకటిగా పట్టి ఉంచినందుకు దానికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. తర్వాత మధ్యాహ్నం  ఏదో ఒక సమయంలో పైకి చూసి, మరలా శిరస్సు వంచి నమస్కారం చేయండి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఒకసారి పైకి చూసి నమస్కారం చేయండి. తలవంచి నమస్కారం చేయడం అంటే, ఆకాశంలో ఉన్న ఏదో దేవుడికో, దేవతకో నమస్కరించడం కాదు. ఈ రోజు మనను ఒకటిగా సరైన స్థలంలో పట్టి ఉంచిన ఆ శూన్యాన్ని చూసి కృతజ్ఞతా భావంతో నమస్కరించాలని దాని అర్థం. దీన్ని క్రమం తప్పకుండా వరుసగా చేస్తూ ఉండండి. మీ జీవితం అనూహ్యరీతిలో మారిపోతుంది. ఈ అభ్యాసాన్ని రోజూ మూడుసార్లు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. దీనివలన ఆకాశం యొక్క సహకారం లభించిదంటే, మీ జీవితం ఒక మాయాజాలంలా నడుస్తుంది. అనుకోని విధంగా ఓ అద్భుత జ్ఞానం మీకు లభిస్తుంది.

మన సంస్కృతి యాదృచ్ఛికంగా సృష్టింపబడింది కాదు. ఎంతో జాగరూకతతో సృష్టింపబడింది. ఊరికే నిల్చోవడమైనా, కూర్చోవడమైనా, తినడమైనా లేదా దేన్నైనా ఇవ్వడమైనైనా, తీసుకోవడమైనా, ఏదైనా సరే, అన్నింటికీ సరిపోయే కొన్ని పద్ధతులు ఇక్కడ సృష్టించారు. ఒక్కో చర్యకు మన శరీరం, మనసు, భావోద్వేగం, శక్తి, అన్నీ ఎలా స్పందిస్తున్నాయనే దానిని గ్రహించి, దాని ప్రకారం సృష్టింపబడిన సంస్కృతి ఇది. ఈ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

http://imgkid.com/