శివుని వివిధ రూపాలు

శివుని వివిధ రూపాలు

శివునికి అనేక రూపాలున్నాయి, అవి మనిషి ఊహించలేనన్ని వివిధ గుణాలతో ఉన్నాయి. కొన్ని భయంకంగానూ, నిగూఢంగానూ, మరికొన్ని మనోహరంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటాయి. అమాయకమైన బోలేనాథ్ నుంచి భయంకమైన కాలభైరవ దాకా. అతి సుందరుడైన సోమసుందరుని దగ్గర నుంచి భయంకొల్పే అఘోరా దాకా శివుడు అన్ని రూపాలను ధరించినా వాటికి వేటికీ ప్రభావితంగాని విధంగా ఉన్నాడు. ఈ అన్ని రూపాలలో ముఖ్యమైనవి ఐదు ఉన్నాయి. ఈ వ్యాసంలో ఇవి ఏమిటో, వాటి ప్రాముఖ్యత ఏమిటో, వాటి వెనుకనున్న శాస్త్రీయత ఏమిటో వివరిస్తున్నారు.

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

యోగీశ్వర

సద్గురు: యోగ మార్గంలో ఉండడం అంటే, జీవితంలో మీరు ఒక దశకు చేరుకున్నట్టు. మీరు ఈ భౌతికమైన దాని పరిమితులు తెలుసుకుని, పరాన్ని తెలుసుకోవాలి అన్న అవసరం మీకు కలిగి, మీకు ఈ విశ్వం అంతా కూడా ఒక నిర్బంధంలాగా అనిపించినప్పుడు – మీరు ఈ దశకు చేరుకుంటారు. ఒక చిన్న సరిహద్దు మిమ్మల్ని నిర్బంధిస్తే, ఎంత పెద్ద సరిహద్దు అయినా సరే, ఎప్పుడో అప్పుడు మీకు నిర్బంధమే కదా..? ఈ విషయం తెలుసుకోడానికే మీరు విశ్వాన్నంతా చుట్టి రానక్కర్లేదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఈ సరిహద్దు మిమ్మల్ని నిర్బంధిస్తుంది అని తెలిస్తే, మీరు విశ్వాన్నంతా చుట్టివస్తున్నపుడు ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు అది కూడా నిర్బంధంగానే మారుతుంది. కాకపోతే మీరు ఎంత వేగంగా అక్కడవరకు చేరుకోగలరు… అన్నదే ప్రశ్న! ఒకసారి మీరు వేగంగా చేరుకోగల సామర్థ్యాన్ని పెంచుకున్నారనుకోండి – అప్పుడు ఎలాంటి సరిహద్దైనా సరే మీకు ఒక నిర్బంధంగానే మారుతుంది. ఒకసారి ఇది మీరు అర్థం చేసుకున్న తరువాత, మీలో ఒక రకమైన తృష్ణ మొదలౌతుంది. ఈ భౌతిక సృష్టినంతా అధిగమించినా కూడా, ఆ తృష్ణ సంతృప్తి చెందదు – అప్పుడు “యోగా” మొదలవుతుంది. యోగా అంటే ఈ భౌతికమైన పరిమితులను కూలదొసేయడమే. మీ కృషి కూడా, ఈ భౌతిక సృష్టి మీద ఆధిపత్యం సాధించడానికి కాదు, దాని పరిమితులను కూలదొసేయడానికి, అభౌతికమైన దానిని స్పృశించగలగడానికి. మీరు ఈ పరిమితమైన దానిని, అపరిమితమైన దానితో ఐక్యం చేయాలనుకుంటున్నారు. ఈ పరిమితాని అపరిమిత తత్వంతో లయం చేయాలనుకుంటున్నారు. అందుకని -“యోగీశ్వరాయ”.

Forms of Shiva

భూతేశ్వరాయ

ఈ భౌతిక సృష్టి అంతా కూడా మనం దృష్టి, శ్రవణం, రుచి. వాసన, స్పర్శ వలనే గ్రహించగలుగుతున్నాము. ఈ శరీరం, ఈ గ్రహం, ఈ విశ్వం, ఈ సృష్టి అంతా కూడా ఈ పంచ భూతాల విన్యాసమే. కేవలం ఐదు పదార్థాలతో ఎంత గొప్ప సృష్టి. కేవలం ఐదు పదార్థాలతో. మీరు వీటిని మీ చేతి మీద లెక్కబెట్టవచ్చు కూడా, వీటితో ఎన్ని సృష్టించబడ్డాయి. ఈ సృష్టి ఇంతకంటే ఎక్కువ కారుణ్యం చూపించలేదేమో. ఒకవేళ ఐదు కోట్ల పదార్థాలంటే మీకు ఏం చేయాలో తెలీదు.

కానీ కేవలం ఐదు పదార్థాలు…ఈ పంచ భూతాలు. వీటిమీద మీరు నియంత్రణ చేయగలిగితే, మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీరు ఈ ప్రపంచంలో ఉండే స్థానం, మీకేమి కావాలో అది సృష్టించుకోగలిగే సామర్థ్యం – ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. తెలిసో తెలియాకో, ఎరుకతోనో ఎరుక లేకుండానో ప్రజలకి వీటిమీద కొంత వరకు నియంత్రణ ఉంటుంది. ఎవరికి ఎంతవరకు వీటిమీద నియంత్రణ ఉంది అన్నదాన్ని బట్టి వారి శరీర తత్వం, వారి మానసికత, వారు చేసే పనులు, వారు ఈ ప్రపంచంలో ఎంత సఫలత పొందుతారు, వారికి ఎంత దూర దృష్టి ఉంటుంది – ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.
“భూత భూత భూతేశ్వరాయ” – అంటే ఎవరికైతే ఈ పంచ భూతాలమీద నియంత్రణ కలిగి ఉన్నారో వారు, ఈ జీవన గమ్యాన్ని కనీసం భౌతిక పరిస్థితుల్లో నిర్ణయించగలరు…అని అర్థం.

కాలేశ్వరాయ

కాల అంటే సమయం. మీరు ఈ పంచభూతాల మీద ఎంత నియంత్రణ సాధించినప్పటికీ, మీరు ఈ అనంతమైనదానితో ఒక్కటై పోవాల్సిందే. మీరు లయం అయిపోవాల్సిందే. మీరిక్కడ ఉన్నంతవరకు మీ కాలం సాగిపోతూనే ఉంటుంది. కాలాన్ని నియంత్రించగలగడం అనేది పూర్తిగా ఒక విభిన్నమైన కోణం. కాల అంటే కేవలం సమయం కాదు. కాల అంటే అంధకారం కూడా. కాల అంటే ఎందుకు అంధకారం..? కాలం వెలుగు అవ్వలేదు. ఎందుకంటే వెలుగు కాలంలో ప్రయాణం చేస్తుంది. వెలుగు కాలానికి దాస్యం చేస్తుంది. మనం వెలుతురు అని దేనినైతే అంటామో దానికి ఒక మొదలు, ఒక అంతం ఉన్నాయి. కానీ కాల అలాంటిది కాదు. మన హిందూ విధానంలో దీనిని అర్థం అయ్యేలా చెప్పాలంటే ఆరు కోణాలుగా కాలాన్ని మనం వివరించవచ్చు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నంతసేపు మీ కాలం సాగిపోతూనే ఉంటుంది. మనం ఎవరైనా చనిపోయినప్పుడు – అతని ‘కాలమై పోయింది’ అని చెపుతాము.

ఇంగ్లీష్ భాషలో కూడా ‘ఎక్స్పైర్డ్’ అన్నమాట వాడతారు. ఇప్పుడు మందులన్నీ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తున్న విధంగానే, మానవులు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తున్నారు. మీరు ఎన్నో చోట్లకి వెళ్తున్నాం అని అనుకోవచ్చు. కానీ మీ దేహానికి సంబంధించినంతవరకు మీరు శ్మశానం దిశగానే వెళ్తున్నారు. ఒక్క క్షణం కూడా ఆ దిశను మార్చడం లేదు. కావాలంటే మీరు కొద్దిగా నిదానించవచ్చు. కానీ మీరు ఈ దిశని మార్చలేరు.మీకు వయసు మీద పడుతున్నకొద్దీ ఈ భూమి మెల్లిగా మిమ్మల్ని తనలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోందని మీరు గమనిస్తారు. అప్పుడు ఈ జీవితం దాని ఆవృత్తాన్ని పూర్తి చేసుకుంటుంది.

కాలం అనేది ఎంతో విశేషమైన కోణం. ఇది మిగతా కోణాలతో ఇమడదు. ఈ సృష్టిలో అన్నిటిలోకెల్లా పట్టు చిక్కనిది ఈ కాలమే. మీరు దానిని ఆపలేరు. ఎందుకంటే అది నిజానికి అసలు లేదు. అది మీకు తెలిసిన సృష్టి రూపాలలో లేదు. ఇది ఎంతో శక్తివంతమైన సృష్టి కోణం. ఇది సృష్టినంతా కూడా ఒక్కటిగా పట్టి ఉంచుతోంది. ఇందుకనే మోడ్రన్ ఫిజిక్స్ కి గురుత్వాకర్షణ శక్తి ఎలా పని చేస్తుందో తెలియడం లేదు. ఎందుకంటే గురుత్వాకర్షణ అనేది లేదు. కాలమే అన్నిటిని ఒక్కటిగా పట్టి ఉంచుతోంది.

శివ – సర్వేశ్వర – శంభో

శివ అంటే, ఏదైతే లేదో, ఎదైతే లయం అయిపోయిందో – అది. ఎదైతే లయమైపోయిందో అది ఈ సృష్టి అంతటికీ కూడా మూలం. ఎదైతే అనంతమైనదో అది సర్వేశ్వరుడు. శంభో అనేది ఒక తాళం చెవి లాంటిది. ఒక మార్గం. మీరు మీ శరీరం చీలిముక్కలైపోతుందేమో అనే విధంగా దీనిని ఉచ్చరించగలిగినప్పుడు మీకు ఆ మార్గం లభ్యం అవుతుంది. మీరు మిగతా అంశాలనన్నింటినీ నియంత్రించి అక్కడికి చేరుకోవాలంటే ఎంతో ఎక్కువ కాలం పడుతుంది. కానీ మీరు ఈ చిన్న దోవ తీసుకుంటే వాటన్నిటినీ దాటి వెళ్లిపోవచ్చు. వాటిని అధిగమించడం ద్వారా కాదు. వాటినుంచి తప్పించుకోవడం ద్వారా.

నాచిన్నప్పుడు, మైసూరు జూలో నాకు స్నేహితులు ఉండేవారు. ఆదివారం ఉదయం అంటే నాకు రెండు రూపాయలు పాకెట్ మనీ దొరికేది. దానితో నేను చేపల మార్కెట్ కి వెళ్లేవాడిని. మార్కెట్లో చాలా లోపల సగం మురిగిపోయిన చేపలు ఉండేవి. రెండు రూపాయలకు ఒక్కోసారి నాకు రెండు, మూడు కేజీల అటువంటి చేపలు దొరికేవి. నేను వాటిని ఒక ప్లాస్టిక్ సంచీలో పెట్టుకుని జూకి వెళ్ళే వాడిని. నా దగ్గర ఇక వేరే డబ్బులు ఏమీ ఉండేవి కావు. ఆ కాలంలో జూ చూడాలంటే టికెట్ ఒక రూపాయి. అంటే మీరు నిటారుగా వెళ్లాలంటే అది టికెట్. అక్కడ ఒక అడ్డకమ్మి ఉండేది, రెండు అడుగుల ఎత్తులో. మీరు దాని కిందగా వెళ్ళగలిగితే మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నాకేమి సమస్య? నేను రోజంతా నా స్నేహితులకు మురిగిపోయిన చేపలు పెడుతూ గడిపేసేవాడిని.

మీరు నిటారుగా నడవాలంటే, అది చాలా కష్టతరమైనది, ఎంతో శ్రమించాలి.మీరు పాకడానికి సిద్దపడితే అక్కడ చాలా సులువైన దారులు ఉన్నాయి. అదే మీరు ఏదో నేర్చుకోవాలి అక్కరలేదు. అలా పాకుతూ పోయేవారు ఏమీ నేర్చుకోనక్కర లేదు. మీరు ఎంత కాలం కావాలంటే అంత కాలం బతకండి కానీ పోయినప్పుడు మాత్రం సర్వోన్నత స్థితికి చేరుకోవచ్చు.

అందులో ఒక విధమైన అందం ఉన్నది, ఈ చిన్న విషయాన్ని నేర్చుకోవడంలో ఎంతో అందం ఉన్నది. ఒక బంతిని చిన్న పిల్లవాడు కూడా తన్నవచ్చు. కానీ దానిని బాగా నేర్చుకున్న వారు, దానిలో ఎంతో నేర్పు చూపుతారు. దాని మూలంగానే సగం ప్రపంచం అలా చేస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తుంటుంది. మీరు ఆ నిష్ణత ఆస్వాదించాలంటే, ఎంతో శ్రమించవలసి ఉంటుంది. కానీ మీరు ప్రాకడానికి సిద్దపడితే, అది చాలా సులువైన ‘శంభో’.

ఎవరీ శివుడు : మనిషా, కల్పనా లేక దైవమా?

ఎవరీ శివుడు : మనిషా, కల్పనా లేక దైవమా?

శివుడు ఎవరు? భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ వ్యక్తి చుట్టూ ఎన్నో కధలు, పురాణాలూ ఉన్నాయి. ఆయన దేవుడా? లేక భారతీయ సంస్కృతి చేసిన సంయుక్త కల్పనా? లేక దాన్ని అన్వేసిస్తున్న వారికి మాత్రమే అర్థం అయ్యేలా ‘శివ’ అనేదానికి ఇంకా లోతైన అర్థం ఏదైనా ఉందా?

Sadhguru: సద్గురు “శివ” అన్నప్పుడు మనం రెండు ప్రాధమికమైన అంశాల గురించి మాట్లాడుతున్నాము. “శివ” అనే పదానికి భాషా పరంగా“ఏది లేదో అది” అని అర్థం. నేడు ఆధునిక విఙ్ఞాన శాస్త్రం కూడా అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. ఈ సృష్టి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలు కేవలం చల్లిన నీటి తుంపర లా, దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యమే, దీనినే శివ అంటారు. అంటే అదే గర్భం, ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి.

Shiva illustration - Who is Shiva?

ఇందువల్లే శివుణ్ణి అస్తిత్వం ఉన్నవానిగా కాక అస్తిత్వం లేనివానిగా వర్ణిస్తారు. శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు. మానవాళి వెలుగును ఎంతో గొప్పగా ప్రశంసించడానికి కారణం, వారు చూడటానికి ఉపయోగించే కళ్ళ గుణం అలా ఉంది కాబట్టి. కానీ, నిరంతరం ఉండేది చీకటి మాత్రమే. వెలుగు అనేది ఒక తాత్కాలికమైన ఘటనే అవుతుంది. ఈ వెలుగుకి మూలం ఏదైనా సరే– ఒక లైట్ బుల్బ్ లేక సూర్యుడు – ఏవైనా, కాలంతో పాటు వెలుగునిచ్చే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. వెలుగు శాశ్వతమైనది కాదు. అది ఒక పరిమితమైన ఘటనే, ఎందుకంటే అది కొద్ది కాలముంటుంది ఆ తరవాత ముగిసిపోతుంది. వెలుగులో కంటే చీకటిలోనే ఓ గొప్ప సాధికారత దాగుంది. చీకటి అన్ని చోట్లా ఉంటుంది. అంతా నిండి ఉంది ఒక్క చీకటే.

కాని నేను “దివ్యమైన చీకటి” అంటే, నేను క్షుద్ర పూజ చేసేవాడిననో లేదా మరొకటో అనుకుంటారు. వాస్తవానికి కొన్నిపశ్చిమ దేశాల్లో శివుడు ఒక దెయ్యమనే ప్రచారం జరుగుతోంది! కాని మీరు దీనిని సిద్ధాంతపరంగా గమనిస్తే ఈ సృష్టి పరిణామం, అది ఎలా జరిగిందనే దాని గురించి ఈ భూమి మీద ఇంతకన్నా తెలివైన సిద్ధాంతం మరొకటి లేదు. “శివ” అనే మాట వాడకుండా సాంకేతిక పదాల ద్వారా ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని శాస్త్రజ్ఞులతోనూ నేను ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, “నిజామా? ఇది ముందే తెలుసుకున్నారా? ఎప్పుడు?” అని. మనకు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసు. భారతదేశంలోని ప్రతి పల్లెటూరు బైతుకు కూడా అనాలోచితంగా ఈ విషయం తెలుసు. దాని వెనుక ఉన్న విఙ్ఞానం తెలియకుండానే అతను దాని గురించి మాట్లాడతాడు.

ఆయన ఆది యోగి……

మరి ఇంకోస్థాయిలో మనం “శివ” అన్నప్పుడు మనం ఒక యోగి గురించి, మొట్టమొదటి యోగి లేక ఆదియోగి గురించి, అలాగే మొట్టమొదటి గురువు లేక ఆది గురువు గురించి మాట్లాడుతున్నాము. ఈ రోజున మనం యోగ అనే దానికి మూలమైన వారి గురించి మాట్లాడుతున్నాము. యోగ అంటే తల్లక్రిందులుగా నుంచోటమో లేక శ్వాసను బిగపట్టి ఉంచటమో కాదు. ఈ సృష్టి ఎలా జరిగిందనే దాని ప్రాధమిక స్వభావం తెలుసుకోవటానికి, దాన్ని అత్యున్నత స్థాయికి (సంభావ్యతకు) ఎలా తీసుకువెళ్ళవచ్చో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానమే యోగ.

యోగ శాస్త్ర బోధన మొట్ట మొదటిసారిగా కాంతి సరోవరమనే సరస్సు ఒడ్డున జరిగింది. ఇది హిమాలయాల్లో కేదార్ నాథ్ కు కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ ఆది యోగి ఈ అంతర్గత పరిజ్ఞానాన్ని మనం ఈ రోజు సప్త ఋషులుగా కీర్తించే తన మొదటి ఏడుగురు శిష్యులకు విధి విధానంగా నేర్పించారు. ఇది మతాలన్నీ పుట్టక మునుపే జరిగింది. మానవాళిని (మళ్ళీ ఒక్కటిగా చేయలేని విధంగా) విడగొట్టటానికి మార్గాలు సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన శక్తివంతమైన సాధనాలను సాక్షాత్కరింప చేసుకుని, నేర్పించటం జరిగింది.

ఆ రెండు ఒక్కటే…..

అంటే ……“శివ” అంటే “అస్తిత్వం లేనిది” అనీ, అలాగే ‘ఆదియోగి’, అని కూడా సూచిస్తుంది. ఎన్నో విధాలుగా అవి రెండు కూడా పర్యాయ పదాలు. ‘ఆదియోగి’ అయిన ఈ వ్యక్తి, ‘విశ్వానికి ఆధారమైన అస్తిత్వం లేని వాడూ’, ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే ఎవరినైనా ‘యోగి’ అనాలంటే, అతను ‘ఈ సృష్టి మొత్తం తానే’ అని అనుభూతి చెంది ఉండాలి. ఈ విశ్వాన్నంతా మీలో భాగంగా ఒక్క క్షణం అయినా అనుభూతి చెందాలంటే మీరు ఆ శూన్యమై పోవాలి. శూన్యమే అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుంది. ఇక వేరేదేదీ, అన్నింటినీ తనలో ఇముడ్చుకోలేదు. ఒక పాత్ర ఈ సముద్రాన్ని తనలో ఇముడ్చుకోలేదు. కానీ, ఈ గ్రహం సముద్రాన్ని తనలో ఇముడ్చుకోగలదు. మళ్లీ అదే గ్రహం ఈ సౌర వ్యవస్థను తనలో ఇముడ్చుకోలేదు. మళ్ళీ అదే సౌర వ్యవస్థ తనలో ఈ గ్రహాలను, సూర్యుడ్ని ఇముడ్చుకోగలదు కాని మిగతా పాల పుంతను తనలో ఇముడ్చుకోలేదు. ఇలా మీరు స్థాయిని పెంచుకుంటూ పోతే అన్నిటినీ తనలో ఇముడ్చుకోగలిగేది శూన్యం మాత్రమే. “యోగ” అనే పదానికి అర్థం “ఐక్యత”. ఈ ఐక్యతను అనుభూతి చెందిన వారే యోగి అవుతారు. అంటే కనీసం ఒక్క క్షణమైనా అతను శూన్యాన్ని అనుభూతి చెందాలి.

“ఏది కాదో అదే” అని మనం శివుని గురించి అన్నప్పుడు, శివుణ్ణి ఒక ‘యోగి’ అన్నప్పుడు, ఓ విధంగా అవి రెండు పర్యాయ పదాలే అయినా, అవి రెండు విభిన్నమైన అంశాలు. భారతదేశం తార్కిక సంస్కృతి కనుక దీన్నుంచి దానికి మనం తేలికగా మారిపోతాము. ఒక క్షణం మనం శివ అంటే పరమోన్నతమైంది అంటాము, మరు క్షణమే మనం శివ అంటే ఈ యోగా ప్రక్రియను మనకు అందించిన వ్యక్తి అని మాట్లాడుకుంటాము.

అయితే, ఏది శివుడు కాదు..?

దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో అందరికీ శివుడంటే భారతీయ క్యాలెండర్ చిత్రపటంగా మాత్రమే పరిచయం అయ్యారు. ఆయన్ని బూరె బుగ్గల వానిగా, నీలవర్ణునిగా చూపిస్తారు ఎందుకంటే ఆ క్యాలెండర్ కోసం బొమ్మ గీసిన కళాకారుడికి ఒక్క ముఖం గీయటమే తెలుసు. కృష్ణుడ్ని గీయమని అడిగితే ఆ చేతిలో ఒక వేణువు పెడతాడు. రాముడ్ని గీయమని అడిగితే చేతిలో ఒక ధనుస్సు ఉంచుతాడు. శివుణ్ణి అడిగితే తలమీద ఒక చంద్రుణ్ణి ఉంచుతాడు, అంతే తేడా! ఈ కాలెండర్లు చూసిన ప్రతిసారి నేను ఎప్పుడూ, ఏ చిత్రకారునితోనూ పని చేయకూడదని అనుకుంటాను. ఫోటోగ్రాఫర్లు పర్వాలేదు – మీరు ఎలా ఉంటే అలా ఫోటోలు తీస్తారు. మీరు ఒక దెయ్యంలా ఉంటే అలానే కనిపిస్తారు. శివుడు లాంటి ఒక యోగి బూరె బుగ్గలతో ఎందుకు ఉంటాడు? ఆయన్ని సన్నగా, పీక్కుపోయినట్లు చూపిస్తే పర్వాలేదు కాని శివుడు బూరె బుగ్గలతో ఎలా ఉంటాడు?

యోగ సంప్రదాయంలో శివుణ్ణి ఒక దేవుడిగా చూడరు. ఆయన, హిమాలయ ప్రాంతంలో నివసించినవాడు, ఈ భూమి మీద నడచినవాడు. యోగ పరంపరకు మూలంగా ఆయన మానవ చైతన్యానికి చేసిన సహాయం అద్భుతమైనది, విస్మరించలేనిది! ఈ మానవ వ్యవస్థ ఎన్ని విధాలుగా పరమోత్తమ స్థాయికి తీసుకురావచ్చో ఆ సాధానాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అణ్వేషించబడ్డాయి. అది నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో వారు అంత నాగరికత ఉన్నవారా అనేది అసంబద్దమైనది, ఎందుకంటే ఇది ఒక నాగరికత నుండో, లేక ఒక ఆలోచనా విధానం నుండో వచ్చింది కాదు. ఇది ఆత్మసాక్షాత్కారం నుండి ఉద్భవించింది..! ఇది ఆయన చుట్టూ ఏం జరుగుతుందనే దాని ఆధారంగా వచ్చింది కాదు. అది ఆయన అభివ్యక్తీకరణమే. మానవ యాంత్రికతలోని ప్రతీదాని అర్థమేమిటి , దానితో ఏం చేయవచ్చో ఆయన ఎంతో వివరంగా చెప్పారు. దాంట్లోనుంచి నేటికి కూడా మనం ఒక్కటీ మార్చలేం ఎందుకంటే ఆయన చెప్పగలిగినదంతా ఎంతో అందంగా, తెలివైన విధంగా చెప్పారు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఓ జీవితకాలం గడపవచ్చు.