ఈ వారం సద్గురు మనకి - సంవత్సరంలోని ఈ సమయంలో, ఉత్తరార్థగోళంలో సూర్యుని ప్రభావం ఎలా ఉంటుందో, సౌరశక్తి మన శ్రేయస్సునీ, చైతన్యాన్ని ఎలా పెంపొందిస్తుందో చెప్తున్నారు. ప్రాణికోటిలో ఏదైనా సరే చెట్ల నుంచి, జంతువుల నుంచి మానవుల వరకు - ఇవి సుసంపన్నం అవ్వాలంటే ప్రకృతితో అనుసంధానమై ఉండవలసిందేనని చెప్తున్నారు.

భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో  ఈ రోజున సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఇది, వసంత ఋతువుకి ఆరంభానికి సూచనగా  జరుపుకుంటారు. న్యూ ఇయర్ వేడుకలలా కాకుండా  - ఉగాది, యుగాది, గుఢీపడవా అన్నది సూర్యునికి భూమికి ఉన్న సంబంధాన్ని బట్టి, సూర్యుడి స్థానాన్ని బట్టి జరుపుకునేది. భూమిపై ఉన్న ప్రాణికోటి మీద సూర్యుడి ప్రభావం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఇది మన మనుగడకు మూలమైనది. మీరు కనుక మీ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటే, సూర్యునితో మీ సంబంధం ఎంతో ముఖ్యం. మీరు ధ్యానం చేసుకోవాలి లేదా మీ పరిమితులను అధిగమించాలి అంటే సూర్యుని స్థానాలు లేదా గ్రహాల స్థానాలు మీకు ఖచ్చితంగా తెలియవలసిన అవసరం లేదు. మీరు కనుక మీ చైతన్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటే, మీకు సహజంగానే ఇటువంటి కదలికలు తెలుస్తాయి.

మానవ శరీరం ఇంతకు మించి పరిణామం చెందాలంటే, సౌర వ్యవస్థలో ఎంతో నాటకీయమైన మార్పులు జరగాలి.

నా జీవితంలో ముఖ్య సన్నివేశాలను ఎప్పుడూ కూడా, ముందుగా ఈ విధంగా జరగాలి - అని అనుకోలేదు. కానీ అవి ఎప్పుడూ కూడా సరిగ్గా, అనువైన రోజునే జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు వ్యక్తం అవ్వాలంటే, దానికి అనువైన వాతావరణం ఉండాలి. ఇలాంటి అనువైన వాతావరణం నాలో సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే వసంత ఋతువులో పూలు పుష్పిస్తాయో అలాగన్నమాట. పూలకు ఇప్పుడు పుష్పించాలి అన్న ఉద్దేశ్యంతో వికసించవు.  ప్రకృతి అందుకు అనువుగా ఉంటుంది కాబట్టి, వికసిస్తాయి. కానీ, కొన్ని రకాల మొక్కలు, ఇవి ఎంతో గట్టివి. ఇవి శీతాకాలంలో కూడా  పుష్పించగలవు. అదే విధంగా ఒక మానవుడు కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటి ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత వరకు తట్టుకుని నిలబడగలడు. కానీ ఎవరూ కూడా ఈ ప్రక్రియల ప్రభావాల నుంచి పూర్తిగా విముక్తులు కారు.

మానవ వ్యవస్థను నిర్మించినదంతా కూడా - ఈ సౌర చక్రమే. 

ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆదియోగి మనకు తెలిపినట్లుగా, ఎన్నో విధాలుగా మానవ వ్యవస్థ అన్నది ఉన్నత స్థాయికి చేరుకున్నది. ఇది శారీరకంగా, న్యూరాలజి పరంగా ఇంకా అనుభూతి చెందడం, తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం అనేటటువంటి సామర్థ్యాల పరంగా ఉన్నత స్థాయిని చేరుకున్నది. ప్రకృతి, మానవ చైతన్యం పరిణామం చెందడానికి తావు ఇస్తూనే ఉంది.

మీరు ఈ మానవ వ్యవస్థ మీద పూర్తి నియంతృత్వం సాధించాలి అనుకుంటే, అందుకు 108 విషయాల మీద, మీరు పని చేయవలసి ఉంటుంది.

మానవ శరీరం ఇంతకు మించి పరిణామం చెందాలంటే, సౌర వ్యవస్థలో ఎంతో నాటకీయమైన మార్పులు జరగాలి. ఈ గ్రహ వ్యవస్థలోని ప్రస్తుత భౌతిక ధర్మాలు లేదా నియమాలు మానవ భౌతికత ఇంతకు మించి పరిణామం చెందేందుకు అనుమతించవు. మానవ దేహంలోని 114 చక్రాలలో రెండు శారీరిక పరిమితికి ఆవల ఉన్నాయి. మిగిలిన 112 చక్రాలలో మీరు 108 చక్రాలను ఉత్తేజితం చేయగలిగితే, మిగిలిన నాలుగూ సహజంగానే తెరుచుకుంటాయి. నిజానికి, మనం ప్రభావితం చేయగలిగింది 108 చక్రాలను మాత్రమే. అందుకే, సాంప్రదాయ పరంగా మనకి ఏదైనా మాలలో 108 పూసలు ఉంటాయి, 108 సార్లు మిమ్మల్ని ఏదైనా మంత్రం చదవమంటారు. ఏవైనా శక్తి స్థానాలలో 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం అంతా కూడా – ఈ మానవ వ్యవస్థలోని 108 విషయాలలో మీరు పూర్తి నియంతృత్వం సాధించడానికే..! మీరు ఈ మానవ వ్యవస్థ మీద పూర్తి నియంతృత్వం సాధించాలి అనుకుంటే, అందుకు 108 విషయాల మీద, మీరు పని చేయవలసి ఉంటుంది.

మన గ్రహాలు అమర్చబడిన తీరులో ఇది  ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడి వ్యాసం, భూమి వ్యాసానికి 108 రెట్లు పెద్దది. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం, సూర్యుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే వస్తుంది. భూమికి చంద్రుడికీ మధ్య ఉన్న దూరం, చంద్రుడి వ్యాసాన్ని 108తో గుణిస్తే వస్తుంది. ఒక సంవత్సరంలో భూమి కక్ష్యను 108 పాదాలుగా విభజించవచ్చు.  అంటే, భూమి సూర్యుడి చుట్టూ 108 పూసలుగా, తనను తానే ఏర్పాటు చేసుకుంటోంది.   అలానే మీరు వేసుకునే మాలలో కూడా 108 పూసలు ఉంటాయి, భారత సంస్కృతిలో మన జీవితంలోని ఎన్నో అంశాలు -  గ్రహ వ్యవస్థకూ మానవ వ్యవస్థకూ మధ్య ఉన్న సంబంధం తెలుసుకొని, అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకొని, ఆ మార్పులను మనం ప్రతీక్షణం, ప్రతీరోజూ ఎలా ఉపయోగించుకోవచ్చో, ఆ విధంగానే ఏర్పరచారు.

మీ వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనించి వాటికి అనుగుణంగా మీలో జరుగుతున్న మార్పులను గమనించండి.

ఈ ఆధునిక సాంకేతిక కాలంలో, మీరు ఎల్లప్పుడూ మీ సెల్ ఫోన్ కో, టీవి కో లేదా కంప్యూటర్ కో అలా అతుక్కొని కూర్చొని చూస్తూ ఉండిపోకండి. మీరు బయటికి వెళ్ళండి. మీ వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనించి వాటికి అనుగుణంగా మీలో జరుగుతున్న మార్పులను గమనించండి. ప్రాణికోటిలో ఏదైనా సరే - చెట్లు, జంతువుల నుండి మానవుల వరకు - అవి ప్రకృతితో అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే సుసంపన్నం అవ్వగలవు. వచ్చే మూడు వారాలలో మానవ శక్తి మీద, మానవ చైతన్యం మీద సూర్యుని ప్రభావం ఎంతగానో ఉంటుంది.

ఈశాలో, ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందించే “ఆదియోగి“ ని - మానవాళికి అంకితం చేయడం జరిగింది.   మనమందరం కూడా ఈ సమయాన్నీ, ప్రకృతి సహజమైన ప్రభావాలనూ - మానవ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. వచ్చే 21 రోజులు సూర్యుని శక్తి మన గోళం మీద ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీ సౌర శక్తిని పునరుత్తేజితం చేసుకోండి. ఇది మీ శ్రేయస్సుని, సుభిక్షతను సుసంపన్నం చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు