ఎవరి జుట్టో పట్టుకొని లాగకపొయినా గాని, ఎంతో కరుకైన మాటల్ని మాత్రం వాడుతుంటాము. ఇటువంటి వ్యవస్థల్ని నెలకొల్పే ప్రయత్నం చేసాము. దీన్నే మనం ప్రజాస్వామ్య ప్రక్రియ అంటాం - ఇక్కడ ఎప్పుడూ వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. ఎదుటివారి మాటలని అవమానంగా భావించకండి. ఈ మాటల యుద్ధం చేసే హక్కును తీసివేస్తే అది నిజమైన యుద్ధాలకు దారితీస్తుంది. అందువల్ల నాలుకకు పదును పెట్టడంలో అందరికీ శిక్షణ ఇవ్వాలి. వాళ్లకా సామర్థ్యం కల్పించాలి. ఒకళ్లపైనొకళ్లు  సమర్థంగా నోరు పారేసుకునే అవకాశం ఉండాలి. అట్లా తమకోపం, అసంతృప్తి, నిస్పృహలను వెళ్లగక్కలేకపోతే వాళ్లు తమ చేతులు ఉపయోగించే ప్రమాదం ఉంది. మీరు మానవజాతినంతా సదాశివుడున్న  స్థాయికి తీసికొని వెళితే, అంటే లోపల ఏమీ లేని స్థితికి తీసికొని వెళ్ళే వరకు, ఈ నోటిదురుసుదనం అన్నది ఒక కళే. అది శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది.

మన పార్లమెంటులో, ఐక్యరాజ్యసమితిలో ఇలా ఈ నోరు పారేసుకొనే సామర్థ్యం లేకపోయినట్లయితే - ఈ ప్రపంచాన్ని ఇప్పటికెన్నోసార్లు నాశనం చేసి ఉండేవాళ్లు. అట్లా జరగడం లేదు. ఎందుకంటే ఆధునిక సమాజాలు తమ నోళ్లు ఉపయోగించడం బాగా నేర్చుకున్నాయి. చాలా నాగరికమైన పద్ధతిలో ఒకళ్ళ గురించి ఒకరు ఘోరంగా మాట్లాడడం నేర్చుకున్నాం. ఈ రోజుల్లోనయితే మీరు ఎదురుగా మాట్లాడే ధైర్యం లేకపోతే బ్లాగ్ రాయవచ్చు కూడా. ఇంట్లోనే కూర్చుని మీరు ఘోరమైన మాటలనవచ్చు. మాట్లాడేవన్ని నిజాలు కానవసరంలేదు, దాన్నెవరైనా చదువుతారో లేదో కూడా పట్టదు. దానికి అర్థం ఉందా లేదా అన్నది కూడా అవసరం లేదు. ఏదో ఒకటి అనెయాలి అంతే. మీరొకళ్లనొకళ్లు దూషించుకొమ్మని నేను చెప్పడం లేదు. కనీసం మీరు మాట్లాడగలిగితే, రాయగలిగితే, వాదించగలిగితే - బాంబు పేల్చరు కదా!

మీరు మీ వాదం వినిపించే అవకాశం లేనప్పుడే కదా మీరు బాంబు పేల్చేది. భారతదేశంలో ఇప్పుడు పేలుస్తున్న బాంబులు – ఇలా  అభివ్యక్తం చేసే ప్రయత్నాలే. ‘‘బూం! పదహారుగురు మరణం, నూరు మంది గాయపడ్డారు – అని ఒక ప్రకటన వస్తుంది. “మేము చంపింది పదహారుగురినే కదా, సైకిలు బాంబో, కారుబాంబో కాక ట్రక్కు బాంబే వాడి 2000 మందిని చంపగలిగే వాళ్లమే కదా!’’ అని కూడా వాదిస్తారు. కనీసం ఒక బలమైన మౌఖిక ప్రకటన చేయడమైనా నేర్పితే వారికి సైకిలుబాంబు తయారుచేయాలన్న ఆలోచన రాదు కదా! వాళ్ల ప్రకటన ఏదైనా కానీయండి, ప్రకటన చేయనివ్వండి. అప్పుడు వారు ఆ పదహారుమందిని చంపాల్సిన అవసరం ఉండదు. ప్రతి సమాజం కూడా సాధ్యమైనంతవరకూ తమ శక్తివంచన లేకుండా హింసను తగ్గించే ప్రయత్నం చేయాలి.

మొత్తం ప్రపంచాన్ని వివేకవంతం, జ్ఞానవంతం చేసేరోజు భవిష్యత్తులో ఎప్పుడో రావచ్చు. కాని ఆరోజు వచ్చే వరకు హింసను కనిష్ఠ స్థాయిలో ఉంచే ప్రయత్నం మనం చేయక తప్పదు. నేను నిరాశావాదిని కాదు, కాని ఇది నా జీవితకాలంలో జరుగుతుందనుకునేంత మూర్ఖుణ్ణి మాత్రం కాదు. కనీసం కొన్ని వందలమంది మనస్సులు వివేకవంతమైనా - అది అద్భుతం, ఎందుకంటే అది అనేకరెట్లుగా విస్తరిస్తుంది. ఇలా మానవాళిలో కొందరినైనా వివేకం వైపు మరల్చేందుకు మనకు మంచి అవకాశాలున్నాయి, నిజంగా చాలా మంచి అవకాశాలున్నాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు