ప్రశ్న: లింగభైరవి మహా హారతి, పౌర్ణమి నాడు  ఆమె ఉత్సవ విగ్రహం తీసుకుని ధ్యానలింగం వరకు గొప్ప ఊరేగింపుగా జరుపుతారు కదా.. దాని ప్రాముఖ్యత ఏమిటి? దేవి శివుణ్ణి బుజ్జగిస్తోంది అన్నారు కదా, దాన్ని మరింత వివరించగలరా?

సద్గురు: జీవితాన్ని సమూలంగా మార్చగల నిజమైన ఏ ఆధ్యాత్మిక ప్రక్రియకైనా, మీకు అఖండమైన శక్తి కావాలి. మీరు దాన్ని సృష్టించలేకపోయినా, అది లభ్యమవుతున్నపుడు దాన్ని ఏదో విధంగా అందుకో లేకపోయినా, కేవలం మాటలే తప్ప జీవితంలో ఏ రకమైన మార్పూ సంభవించదు. ఈ ప్రక్రియను అందిస్తున్న వ్యక్తికి కొంత స్థాయిలో శక్తి ఉంటే, అది కొంతకాలం కొనసాగుతుంది. ఒక సారి అతని శరీరం బలహీనమవగానే, అది అంతరించిపోతుంది. అతను చనిపోనక్కరలేదు, అతనికి ఏదో అనారోగ్యం చేసో  మరొకటో అయ్యి, అతని శరీరం బలహీనమవగానే, మొత్తం ప్రక్రియ అంతా క్రమంగా క్షీణించిపోతుంది. కనుక మీరు ప్రాథమికంగా ఒక శాశ్వతమైన "శక్తిస్థల్లాన్ని"  సృష్టించకపోతే, మీరు చైతన్యవంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియని అందించగల స్థితిలో ఉండరు.

ధ్యానలింగం ఒక సమున్నతమైన శక్తిస్థావరం. అది చాలా సూక్ష్మమైన విషయం, ఎందుకంటే అది చాలా కాలం కొనసాగాలి. చాలా కాలం అంటే చాలా చాలా కాలం. మీరు ఎంత శక్తివంతమైన వస్తువుని తయారుచేసినా, అది బయటకి ఎంత శక్తివంతమైనదైనా, దాన్ని అనునిత్యం సంరక్షణ చెయ్యకపొతే, ఎంతో కాలం నిలవదు. దేవిని ప్రతిరోజూ శక్తివంతం చేస్తుండాలి. లేకపోతే ఎక్కువకాలం మనలేదు. అందుకనే ఆమె శక్తి కొనసాగాలంటే, ఆమె చుట్టూ ఉన్న వారికి అఖండమైన భక్తి, సేవాతత్పరత కావాలి. ధ్యానలింగ పరిరక్షణ బాధ్యత వహిస్తున్న వారు కేవలం ఆ పరిసరాల సంగతీ, వస్తున్న యాత్రికుల సంగతీ చూసుకుంటున్నారు. వాళ్ళు ధ్యానలింగానికి సంబంధించి ఏ సంరక్షణా చెయ్యడం లేదు. ఎందుకంటే, ధ్యానలింగానికి అటువంటి అవసరం లేదు. ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఆయన అలాగే ఉంటాడు. కాని లింగభైరవి విషయం పూర్తిగా భిన్నం. పరిసరాలూ, అక్కడికి వచ్చే భక్తులతో పాటు, దేవి సంరక్షణ కూడా అక్కడి వాళ్ళు ప్రతిరోజూ చేస్తుంటారు. అటువంటి శ్రద్ధ ప్రతిరోజూ తీసుకోపోతే, ఆమె మనలేదు. ఆమె గురించి తగిన శ్రద్ధ చూపించకపోతే, ఆమెకి ఆగ్రహం వస్తుంది. కనుక ఆమె గురించి శ్రద్ధ తీసుకునే వారు ఆమెకు ఆగ్రహం వచ్చే రీతిలో ప్రవర్తించకూడదన్న అవగాహన కలిగి ఉన్నారని అనుకుంటున్నాను.

దేవికి ఆ శక్తి, మహాశక్తివంతమైన ధ్యానలింగం నుండే వస్తుంది. ఆమె అస్తిత్వం దానిమీదే ఆధారపడి ఉంది.

దేవికి ఆ శక్తి, మహాశక్తివంతమైన ధ్యానలింగం నుండే వస్తుంది. ఆమె అస్తిత్వం దానిమీదే ఆధారపడి ఉంది. అందుకే ఆమె ఇప్పుడున్న స్థితిలో ఉంచబడింది. మనం ఇప్పుడు కొత్తగా ఏది సృష్టించినా, దాన్ని ప్రపంచంలో ఎక్కడ ప్రతిష్టించినా, దానికీ శక్తి ధ్యానలింగం నుండి రావలసిందే.  ఏడు చక్రాలూ మరికొంత అదనంతో, ఏ శరీరాకృతీ లేని ధ్యానలింగం ఒక పరిపూర్ణమైన శక్తి స్థావరం. అతనిది అశరీరమైన, పూర్తి శక్తిమంతమైన కేంద్రకం. అది మంచిదే. అతనికి భౌతిక సమస్యలు ఏవీ ఉండవు. దేవికి కేవలం 3 1/2 చక్రాలు మాత్రమే ఉన్నాయి. ఆమెది అర్థ శరీరం అన్నమాట. కాని సచేతనమైన అర్థభాగం. మీరు చూసే అవకాశం తప్పిపోకూడదు. మీరు ధ్యానలింగాన్ని చూసినపుడు ఏ అనుభూతీ కలుగకపోతే, మీరు ఒకసారి లింగభైరవి దగ్గరకి వెళ్ళి చూడండి.  ఆమె మీకు ఒక లెంపకాయ కొడుతుంది. ఆ అనుభూతి మీకు ఎందుకు కలుగుతుందంటే, ఆమె ఒక రకంగా  ప్రకంపిస్తుంది. అటువంటి ప్రకంపన, క్రమంతప్పకుండ నిర్వహిస్తే తప్ప, ఆమెలో ఎక్కువ కాలం నిలవదు.

కనుక నెలకొకసారి ఆమె బయటకి ధ్యానలింగాన్ని ప్రత్యక్షంగా తాకడానికి వస్తుంది. అలా చెయ్యడం ద్వారానే ఆమె నిలద్రొక్కుకోగలదు. భవిష్యత్తులోని నిర్వాహకులు కూడా ప్రతి పౌర్ణమనాడూ ఆమె బయటకి వచ్చి ధ్యానలింగాన్ని స్పృశించేలా ఏర్పాట్లు చెయ్యాలి. వర్షం ఏకధారగా కురుస్తున్నా, ఆమె బయటకు రావలసిందే. వరదొచ్చినా సరే . ఆమె బయటకు రావలసిందే. అది ఆమె ఉనికికి చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే ఆమె శక్తి క్షీణిస్తుంది. ఆమె అందంగా, బలంగా, శక్తివంతంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ శక్తి నశిస్తే ఆమెకి ఆగ్రహం వస్తుంది. అలా జరగడం మంచిదికాదు. ఆమెని శక్తివంతంగా, సచేతనంగా ఉంచగలిగితే అందరికీ సంక్షేమాన్ని అనుగ్రహిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు