జీవితానుభవాన్ని మెరుగుపరచుకోవడం ఎలా?

 
 
 
 

జీవితంలో ఇంతకంటే ఎంతో ఉంది. ఈ వారం సద్గురు సోషల్ మీడియా గురించి ఆయన ఏమి గమనించారు....అది మన చైతన్యం స్థాయిని ఎలా ప్రతిబింబిస్తుంది..? దీనిని మనం  మరో స్థాయి అనుభవానికి ఎలా తీసుకు వెళ్లవచ్చు..? - అన్న విషయాలను వివరిస్తున్నారు. మీరు, మీ అనుభూతిని పెంపొందించుకోవడానికి జీవితాన్ని ఉపయోగించినప్పుడే, జీవితం ప్రాముఖ్యతను సంతరించుకుంటుందనీ, మీ అనుభూతి మీ మానసిక-భావోద్వేగ చట్రాన్ని అధిగమించి ఉన్నప్పుడే మీ జీవితనికి ప్రాముఖ్యత కలుగుతుందని సద్గురు చెప్తున్నారు.

ప్రతిచోటా ప్రజలు వారి ఫోన్లకు అతుక్కుపోయి ఉండడం నేను చూస్తున్నాను. సాంకేతికత అనేది మంచిదో లేక చెడ్డదో అనేది ఇక్కడ విషయం కాదు..! మనం దానిని ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు విషయం. ఈ రోజుల్లో ప్రజలకు వారి  ఫోటోలను అందరికీ చూపించుకోవాలని, పోస్టు చేయాలని - ఒక నిర్బంధం ఏర్పడి పోయింది. వారికి ఎలాంటి భావాలు కలిగినా సరే, వాటిని వారు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆలోచనలకూ, భావాలకు మించిన జీవితానుభవం వారిలో లేదు. నిజానికి, ఇలాంటి చెత్తనంతా వేరేవారితో పంచుకోవడంలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. ఒకప్పుడు ప్రజలు వారి నిత్య జీవితంలో జరుగుతున్న విషయాల గురించి, డైరీ రాసుకొనేవారు. ఎవరైనా ఆ డైరీ తెరిచి చదివితే, వారి మనసు విరిగిపోయేది. “నా జీవితం గురించి మీరెందుకు చదివారు..?” అన్నట్లుండేది. కానీ ఈ రోజుల్లో ప్రతీవారికీ కూడా, వారు పోస్టు చేసిన ఫేస్ బుక్ పోస్టులను ఎవరూ చదవకపోతే, వీరి గుండె పగిలిపోతుంది. ఎవరో ఒకరు వాటిని చదివి ఇష్టపడాలి. మీ జీవితంలో మీరేమీ చేశారు..? మీరెక్కడికి వెళ్లారు..?  ప్రతీ క్షణం, మీ జీవితంలో మీరేమి చేస్తున్నారన్నది ప్రతివారికీ తెలియాలని అనుకుంటున్నారు. దేనికైతే ప్రాముఖ్యత లేదో దానికి ప్రాముఖ్యతనివ్వాలని అనుకుంటున్నారు.

మీ మానసిక-భావోద్వేగ చట్రాలకు మించిన అనుభూతి మీకు కలిగినప్పుడే మీ జీవితనికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. చాలామంది వారి జీవితాన్నంతా ఆలోచనలు, భావాలకే పరిమితం చేస్తున్నారు. వారు, మిగతా దేనినీ అనుభూతి చెందడం లేదు. వారు, ఇదే నిజమైనది అని నమ్ముతున్నారు. మన ఆలోచనలు, భావాలు అనేవి అంతా కూడా మన మానసిక నాటకం మాత్రమే..! ఉదాహరణకు, మీరు ఇప్పుడు ఏదో సరిగ్గా జరగలేదు అనుకున్నారనుకోండి - వెంటనే,  మీరు బాధ పడడం మొదలు పెడతారు. నిజానికి  ఏమీ జరగకపోయినప్పటికీ మీరు బాధ పడతారు..! అలా కాకుండా,  ఏదైనా సరిగ్గా జరగక పోయినప్పటికీ, మీరు “ఫర్వాలేదు అన్నీ బాగానే జరుగుతాయి” అనుకున్నప్పుడు, మీరు బాగానే ఉంటారు.

ప్రేక్షకుడిగా కాకుండా..నిజంగా పాల్గొనండి

మీ ఆలోచనలు, మీ భావాలు అన్నవి - మీరు సృజించినవే..! వాటికీ, వాస్తవానికీ - ఎటువంటి సంబంధమూ లేదు.   అలాగే, మీరు మీ సమయాన్ని, వేరే వారి అనుభూతులను చూస్తూ వృధా చేసుకోకండి. మీరు, ఇంకొకరికి ఏమి జరుగుతుంది అనే దాని పట్ల దృష్టి పెడితే, మీకు జరిగేదేమీ ఉండదు. మీరు, ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోకుండా, జీవితంలో పాల్గొనే వారిగా ఉండాలి. మీరు ఏమి చేస్తున్నా సరే దాని తీక్షణతను పెంచుకోవడానికి ప్రయత్నించండి.   ఇలా ప్రయత్నం చేసి చూడండి. ఉదాహరణకు - మీరు దేనినో చూస్తున్నారనుకుందాం. మీరు దానిని, పది శాతం ఎక్కువ తీక్షణతతో చూడగలరేమో ప్రయత్నించండి. ఒక విషయాన్ని ప్రతివారి కళ్ళూ ఒకే విధంగా చూడవు. మీ అనుభవం, మీరు ఎంత తీక్షణతతో ఉన్నారు - అన్న అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మీ తీక్షణతను పెంచుకోవాలంటే, మీరు కొంత ఎరుకతో కృషి చేయవలసి ఉంటుంది.

మీరు మీ చుట్టూరా ఉన్న వాటిని, ఎంత అనుభూతి చెందగలుగుతున్నారు అన్నది, మీరు ఉన్న ఎరుక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది.

చాలా మంది ఏదీ సాధించలేకపోతున్నారు. ఇది ఎందుకంటే, వారు ఒక అడుగు ముందుకు వేస్తే, ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. మీరు ఒక అడుగు కావాలనుకొని ముందుకు వేసినప్పుడు, మీరు దాన్ని గుర్తించినప్పుడు, అది మీకు ఒక రకమైన వేగాన్ని కలిగిస్తుంది. అది మీరు మరొక అడుగు తీసుకునేలాగా చేస్తుంది. తీక్షణత అనేది, దానంతట అది వచ్చేది కాదు. మీరు, మీ వోల్టేజిని కొంత పెంచుకోవాలి. మీరు ఇంకొంచెం ఎరుకతో మసలుకోవాలి. మీరు మీ చుట్టూరా ఉన్న వాటిని, ఎంత అనుభూతి చెందగలుగుతున్నారు అన్నది, మీరు ఉన్న ఎరుక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు - మీరిప్పుడు స్పృహతో లేరనుకోండి - మీకు మీరిక్కడ ఉన్నారన్న విషయమూ తెలియదు, మీ చుట్టూరా ఉన్న ప్రపంచం గురించి కూడా తెలియదు. కానీ  మీరిప్పుడు కొంత స్పృహతో ఉన్నారు, అందుకే, మీరిక్కడ ఉన్నారన్న విషయం మీకు తెలుస్తుంది. మీ చుట్టూరా ఈ ప్రపంచం ఉందని తెలుస్తుంది. దీని తీక్షణత మరికొంచెం పెంచుకోగలిగారనుకోండి, మీ చైతన్యం కూడా వృద్ధి చెందుతుంది. మీరప్పుడు గ్రహించలేని విషయాలను కూడా,  గ్రహించడం మొదలు పెడతారు. మనకు సాధ్యపడతాయా అని అనుకునే విషయాలను కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. నా ఆకాంక్ష, నా ఆశీర్వచనం ఏమిటంటే.. మీ జీవితంలోని ప్రతి క్షణం కూడానూ ఎంతో ఉత్తమమైనది కావాలి.  మీరు బోరు కొట్టి చనిపోవడంకంటే..అత్యుత్సాహంతో చనిపోవడం అన్నది ఎంతో మెరుగైనది కదా..!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు