ప్రశ్న:  నేనొక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుణ్ణి. పిల్లల విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలి, వాళ్లకి స్ఫూర్తినివ్వాలి. నాకు మీ సలహా కావాలి. నా విద్యార్థుల్లో సగం మందిని ఎడిడిలుగానో ఎడిహెచ్‌డిలుగానో (ADD / ADHD - Attention Deficit Disorder/Attention Deficit Hyperactive Disorder) వర్గీకరించడం వల్ల వాళ్లు రిటాలిన్ తీసుకుంటారు. దీని పట్ల మీ సలహా ఏమిటి?

సద్గురు: ఇంతమంది డాక్టర్లు, సైకియాట్రిస్టులతో ఉన్న ఈ సమాజంలో ఇంకా నార్మల్ పిల్లలు పుడతారని నేననుకోను. ఎందుకంటే వాళ్లేం చేసినా ఏదో ఒక ముద్ర వేస్తారు. వాళ్లు చాలా చురుగ్గా ఉంటే హైపర్ ఆక్టివ్ అంటారు. కొంచెం నెమ్మదిగా ఉంటే ఇంకోపేరు పెడతారు. వాళ్లు ఎట్లా ఉన్నా వాళ్లకో చీటీ తగిలించక తప్పదు, అది వాళ్లకు జీవితాంతం తగులుకుంటుంది. ఒకళ్లు వేగంగా పరిగెత్తవచ్చు, ఒకళ్లు కుంటవచ్చు, మరొకళ్లు మరొకటి చేయవచ్చు - ఇదంతా సాధారణమే. మనుషులుండేది ఇలాగే. మనం వాళ్లందరినీ ఒకే మూసలోకిలో చేర్చదలచుకున్నప్పుడే సమస్య - అప్పుడు వాళ్లు సాధారణంగా కనిపించరు.

అది మీ ప్రయాణపు సంచిలాంటిది. విమానాశ్రయంలో వాళ్లు దాని సైజు చూసినట్లు. అది సరిగ్గా ఉండకపోతే కొన్ని విమానయాన కంపెనీలు ఒప్పుకోవు. ఎవరి సంచీ కూడా కచ్చితంగా సరిపోదు. ఉగ్రవాదుల సంచీలు మాత్రం సరైన సైజులో ఉంటాయేమో. కాని సాధారణ ప్రయాణికుల సంచులు సరైన సైజులో ఉండవు. ఎందుకంటే వాళ్లు ప్రయాణం చేసేటప్పుడు వస్తువులు కావాలి - అది పెడతారు, ఇది పెడతారు, అది కొంటారు, ఇది కొంటారు - చివరికది ఎంతో లావవుతుంది, సైజు పెరుగుతుంది. అంటే వీళ్లంతా మామూలు మనుషులు కాదన్నమాట, నార్మల్ కాదన్నమాట.

అన్ని విధాలా సమానంగా ఉన్న మామిడి చెట్టును ఎక్కడైనా చూశారా? అట్లాగే సంపూర్ణ మానవుణ్ణీ ఎక్కడా చూడరు. యంత్రం ద్వారా తయారుచేస్తే తప్ప ఒకే విధమైన సమగ్రమైన వస్తువులు తయారుకావు. అందర్నీ ఒకే రంధ్రంలో దూర్చగలిగితే అది దోషరహితంగా నిర్దిష్టంగా ఉన్నట్లు మనకు లెక్క. ఎందుకంటే మనం అందరినీ ఒకే విధమైన పాఠశాలల్లో చదివిస్తాం, ఇంజినీరుగానో, డాక్టరు గానో, మరొకటి గానో తయారు కావాలి - పిల్లలు ఈ హింస భరిస్తున్నారు. అందుకే వాళ్లు ఎడిడిలు గానో, ఎడిహెచ్‌డిలు గానో కనిపిస్తున్నారు. లేకపోతే వాళ్లంతా ఏదో ఒకటి చేయగలిగిన సమర్థులే. కొందరు ఏమీ చేయకుండా ఎంతో సంతోషంగా ఉండవచ్చు.

మనందరం సమానమైన సామర్థ్యం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కొందరు నడవగలరు, కొందరు పాకగలరు, కొందరు ఎగరగలరు, మంచిదే.

మీరు అడవిలో జింకను చూడండి. ఎనిమిదిన్నరకల్లా ఇక్కడ గుంపులు గుంపులుగా చేరతాయి. తింటాయి, తిరుగుతాయి, ఏ పనీ చేయవు. బండిలాగే ఎద్దు వాటివైపు చూసి, ‘పనికి మాలిన జింకలు, ఏ పనీ చేయవు’ అనుకుంటుంది. ఏం చేయాలి? ఏనుగు కూడా ఏమీ చేయదు. అల్లరీ చేయదు. కనిపించిన వాటినన్నిటినీ చెదరగొడుతూ వెళుతుంది. కాని అది మంచిదే. అవి అట్లాగే ఉండాలి. దురదృష్టవశాత్తు మన సమాజం పారిశ్రామీకరణ చెందింది. మనకింక మనుషులవసరం లేదు, మనం తయారుచేసిన వ్యవస్థకు సరిగ్గా పట్టే నట్లూ, బోల్టులూ మాత్రమే కావాలి.

అందువల్ల ప్రతివాళ్లూ సాధారణంగా లేనట్లే కనిపిస్తారు. బహుశా మీరు సాధారణంగా లేరనుకుంటున్న 50% మంది మామూలు మనుషులే కావచ్చు. తక్కిన 50% మంది యంత్రాల ద్వారా తయారైన వారై ఉంటారు. ఇట్లా కొట్టిపారేయడం నాకిష్టం లేదు కాని, దురదృష్టవశాత్తు అలాగే జరుగుతూ ఉంది. మనం జీవించడం గురించి ఆలోచించడం లేదు, మనం ఉత్పాదకత గురించి ఆలోచిస్తున్నాం, మరింత అధిక ఉత్పత్తి చేసే యంత్రాలను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల మీరు యంత్రాలు ఎంత ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నారో అంత ఉత్పత్తి చేయని యంత్రాలను నార్మల్ కావని అంటున్నారు.

మనందరం సమానమైన సామర్థ్యం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కొందరు నడవగలరు, కొందరు పాకగలరు, కొందరు ఎగరగలరు, మంచిదే. ఇది ‘ఇంత' చేయగలిగితేనే 'నార్మల్ మనిషి' అన్న అర్థరహితమైన ఆలోచన ఎందుకు ఏర్పరచుకున్నాం? అట్లా కొలబద్ద ఏర్పరచుకోవలసిన అవసరం లేదు. ఒక శిశువును ఇది అది అని ముద్ర వేయడం అన్యాయం. ఎందుకంటే ఈ విధంగా మీరు ఆడుతున్న ఆట ఏమిటో శిశువుకు తెలియదు, మీరు ముద్ర వేసేశారు, వాళ్లు ఆ ముద్రను జీవితాంతం మోయవలసి వస్తుంది. మీరు మీ శిశువును పక్కవారి శిశువుతో పోలుస్తున్నారు. ఎందుకు?

మన విద్యావిధానం అంత త్వరగా మారదు. కనీసం మీతో ఉన్న మీ పిల్లలపై ముద్రవేయకపోవడం మీ బాధ్యత. నిజమే, వాళ్లు ఇతరులు చేస్తున్న పనులు చేయలేకపోతున్నారు. కాని వాళ్లేం చేయగలరో మీకు తెలియదు. నేను మీకిది చెప్పి తీరాలి. ఒకసారి అమెరికా నుండి కొంతమంది డాక్టర్లు వచ్చారు. వాళ్లు మైసూరుకు వెళ్లారు, నాకు చెప్పకుండానే వాళ్లు మా నాన్నగారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మా నాన్నగారి అభిప్రాయంలో పిల్లవాడు విజయం సాధించడమంటే, వాడు డాక్టరు కావాలి. ఆయన జీవిత స్వప్నం డాక్టరు కావాలని. కష్టపడ్డారు, డాక్టరయ్యారు. తర్వాత ఆయన కల ఏమిటంటే, తన నలుగురు పిల్లలూ డాక్టర్లు కావాలని. కాని మేం నలుగురమూ డాక్టర్లు కావడంలో విఫలమయ్యాం. నేను మరీ ఘోరం. ‘అది జరగనే జరగదు’ అని పదమూడోయేటనే ప్రకటించేసాను. అందువల్ల ఈ డాక్టర్లు తమ గురువు అక్కడ లేని సమయంలో ఆయన గురించి తెలుసుకోదలచుకున్నారు. వాళ్లు ‘సద్గురువు బాల్యంలో ఎలా ఉన్నారో మాకు చెప్పండి’ అని అడిగారు. మా నాన్నగారు ఆలోచించి, ఇలా చెప్పారు, ‘వాడు పెద్ద మొద్దు. కాని ఇప్పుడు గొప్ప మేధావి అయిపోయాడు.’

జీవిత లక్ష్యం జీవించడమే

బహుశా మీ తరగతి గదిలో 50% మేధావులుండి ఉండొచ్చు, మీరు గుర్తించలేకపోతున్నారు. A+B=C వంటి మీ సూత్రాలు వారికి తెలియకపోవచ్చు, దానికేమీ అర్థంలేదు. A+B ఎందుకు C తో సమానం?? ఎందుకు? ఎవరో చెప్పారనా?? వాళ్లు ఆ చట్రంలో బుర్రను బిగించలేకపోవచ్చు, కాని వాళ్ల మనస్సులో ఏం జరుగుతూ ఉందో మీకు తెలియదు. వాళ్లు ఏం చూడగలుగుతున్నారో మీకు తెలియదు. వాళ్లు చూడలేని దానిపట్ల వాళ్లు సిగ్గుపడేటట్లు చేస్తే, వాళ్లు చూడగలిగిన దాన్ని గురించి వాళ్లు ఎన్నటికీ మాట్లాడకపోవచ్చు. దానివల్ల మీరు ఏం గుర్తించలేకపోతున్నారో మీకు తెలియదు. ఎవరూ చూడనిది వాళ్లూ చూస్తూ ఉండవచ్చు.

మనిషిలో ఉన్న మేధాశక్తి, విద్య చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తుంది. అంటే విద్య అవసరం లేదని అర్థమా? కాదు, అదలాకాదు. అవసరమైనదేమంటే ఒక మానవ శరీరాన్ని, బుద్ధిని దాని సంపూర్ణ సామర్థ్యం వైపు తీసికొని వెళ్లడం, దాన్ని ఉపయోగించడానికి కావలసిన సమతుల్యతను సాధించడం. ఏ వైపుకు?? అది ఒక ప్రత్యేక దిశ కావలసిన అవసరం లేదు. మనుషులు అర్థవంతంగా నడిస్తే, అర్థవంతంగా జీవిస్తే అది చాలు. జీవిత లక్ష్యం జీవితమే. జీవితాన్ని అన్ని కోణాలలో అనుభవించడంలోనే జీవన సాఫల్యం ఉంటుంది. మన ఉపాధ్యాయులో, పూజారులో, పండితులో, పవిత్ర గ్రంథాలో చెప్పిన సిద్ధాంతాలో, బోధనలో పట్టుకొని వాటిమీద ఆధారపడకుండా మనం సత్యాన్వేషకులుగా ఉన్నప్పుడే మనకది ఒక సంభావ్యంగా ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు