వైవాహిక జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడం ఎలా?
 
 
 
 

జీవితాన్ని ఎంతో ప్రభావితం చెయ్యగల ఒక ముఖ్య ప్రశ్న: "పెళ్లి చేసుకోవాలా? వద్దా?" అన్నది సద్గురు ఇక్కడ చర్చిస్తారు. దానిలో భాగంగా ఫలప్రదమైన వివాహంలోని మౌలిక సూత్రాలు ఏమిటి? ఇవి చదివి మీకు మీరే తెలుసుకొండి. సద్గురు సరికొత్త కవిత్వం "నీడపడకుండా " కూడా ఇక్కడ చదవొచ్చు.

Sadhguruనన్ను తరచుగా చాలామంది అడిగే ప్రశ్న"జీవిత భాగస్వామిగా సరియైన వ్యక్తిని ఎలా  ఎంచుకోవాలి ?" అన్నది. నూటికి నూరుపాళ్ళు మనకు అనుకూలమైన వ్యక్తికోసం వెదకడం అసంభవమైన విషయాల్ని ఆశించడమే.  వివాహంలో ఒడిదుడుకులు ఎందుకు ఎక్కువగా వస్తాయంటే మిగతా అన్నిటిలోకంటే ఈ అనుబంధంలో మీరు రెండవవ్యక్తితో చాలా విషయాలు పంచుకోవాల్సి వస్తుంది.  సమస్య వివాహమూ కాదు, అది పురుషుడు గురించో, స్త్రీ గురించో, భర్తో, భార్యో కాదు. మీరు చాలా విషయాలు ఎవరితోనైనా పంచుకోవలసిన ప్రతి సందర్భంలోనూ ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూనే ఉంటారు.

వివాహంలోగాని, కలిసి సహజీవనం చెయ్యడంలోగని మీరు ఒకే స్థలాన్ని, ప్రతి వస్తువునీ కలిసి పంచుకోవాలి. పర్యవసానంగా, ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఏదో ఒక విధంగా ఒకరి హద్దుల్లోకి రెండవవారు ప్రవేశించే పరిస్థితి వస్తూంటుంది. ఇతర అనుబంధాలలోనైతే, ఎవరైనా హద్దులుమీరి ప్రవర్తించినపుడు, మీరు దూరంగా జరిగిపోవచ్చు. ఇక్కడ మీకు అటువంటి అవకాశం లేదు. ఒకరి హద్దుల్లో మరొకరు ప్రవేశించడం ఎక్కువవుతున్నకొద్దీ, సంఘర్షణ ఎక్కువవుతుంటుంది. ఎంతో అందంగా జీవిస్తూ, ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమతో, ఒకరికొకరు ఆసరాగా జీవిస్తున్న దంపతులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ అనుబంధం ఎంతో వికృతంగానూ పరిణమించగలదు. దానికి మూసిన తలుపుల వెనక ఏమిటి జరుగుతోందో ఎవరికీ తెలియకపోవడం ఒక కారణం. రోడ్డుమీద పోతున్న వ్యక్తి మీ  కాళ్లు తొక్కినపుడు మీరు ఒక విధంగా ప్రతిస్పందిస్తారు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు గనుక. ఈ అనుబంధంలో ఎవరూ గమనించేస్థితిలో ఉండరు. కనుక ఏదన్నా జరగవచ్చు.

ఒకరి హద్దుల్లో మరొకరు ప్రవేశించడం ఎక్కువవుతున్నకొద్దీ, సంఘర్షణ ఎక్కువవుతుంటుంది.

వివాహం ఫలప్రదం జరగడానికి కావలసింది ఏ లోపాలూ లేని వ్యక్తి కాదు... ఏ లోపాలూ లేని వ్యక్తి భూమి మీద ఉండడు. మీకు కావలసింది ఆ వ్యక్తికి నైతిక నిష్ఠ ఉండడం. ఎవరు మిమ్మల్ని పరిశీలిస్తున్నా, పరిశీలించకున్నా మీరు ఒక్కలాగే ప్రవర్తించాలి. మీ వ్యక్తిత్వం మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అన్నదాన్ని బట్టి మారిపోకూడదు. ఒకసారి మీ ప్రవర్తనాసరళిని నిర్ణయించుకున్నాక, మరొక వ్యక్తితో ప్రతిస్పందించడం ఎంతో ఆనందదాయకంగా పరిణమించగలదు. మీరిద్దరూ ఒకరినుండి రెండవవారు ఏదో ఒకటి రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నంత సేపూ, మీ ఇద్దరిలో ఎవరికి తాము రాబట్టదలుచుకున్నది దొరకకపోయినా అది అనునిత్యం సంఘర్షణకి దారి తీస్తుంది.

మీరు వ్యక్తిగా మిమల్ని మీరు పరిశీలించి చూసుకోవాలి: మీకు ఆ వ్యక్తిమీద ఉన్నది ఇలా ఉండి అలాపోయే వ్యామోహమా, లేక ఆ వ్యక్తి మీకు తోడుగా ఉండాలన్న బలమైన కోరికా? ప్రతివ్యక్తీ ఏదో ఒక అనుబంధంలో చిక్కుకోవలసిన అవసరమూ లేదు; ప్రతి వ్యక్తీ అలాగని ఒంటరిగా ఉండనూ అవసరం లేదు.  ఇది ప్రతి వ్యక్తీ తమకు తాముగా తీసుకోవలసిన నిర్ణయం. మీరు ఒక తోడు లేకుండా జీవించలేననీ, వివాహం మీ శ్రేయస్సుకి ఒక సోపానమనీ అనుకున్నప్పుడే మీరు వివాహం చేసుకోవాలి. పెళ్ళి చేసుకోవడంలో తప్పులేదు. కానీ మీకు ఆ అవసరం ఉందని అనిపించకుండా పెళ్లిచేసుకోవడం మాత్రం నేరం. ఎందుకంటే ఇలా చేయడంవల్ల మీ జీవితమూ, కనీసం మరొక వ్యక్తి  జీవితమూ దుర్భరం అవుతాయి గనుక. ఈ మానవజాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే, అందరినీ వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తాము.  కానీ ప్రపంచ జనభా విస్ఫోటనం చెందుతోంది. మీరు పిల్లల్ని కనకపొతే మీరు మానవజాతికి మహోపకారం చేస్తున్నట్టే. అది పక్కనబెడితే, ముఖ్యమైన విషయం అందరూ పెళ్ళిచేసుకోవలసిన అవసరం లేదన్నదే.

"నాకు తోడు అవసరమా?" అని ఎవరొ గౌతమ బుద్ధుణ్ణి అడిగితే ఆయన, "మూర్ఖుడితో ప్రయాణం చెయ్యడం కన్నా, ఒంటరిగా ప్రయాణం చెయ్యడమే మిన్న" అని సమాధానం చెప్పాడట. నేను అంత నిర్దాక్షిణ్యంగా ఉండను.  నేను "మీకు మీ వంటి మూర్ఖుడే దొరికితే ఏదో ఒక అంగీకారానికి రావొచ్చు" అని అంటాను.  అందరూ వివాహం చేసుకుంటున్నారు కాబట్టి నేనూ చేసుకోవాలనుకునో, ఒంటరిగా ఉండవలసి వస్తుందన్న భయం చేతనో, సమాజం ఏమని అనుకుంటుందో అన్న భయంవల్ల కాకుండా, మీ వ్యక్తిగత అవసరాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి.

మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం, మీకు ఆసరా కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. 

మీరు తోడుని కోరుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి? "నేను దారి తప్పిపోతే, నాతోపాటే దారితప్పిపొయే మరో వ్యక్తిని తోడు తీసుకుందాం," అన్నది కాకూడదు. వివాహమూ, సహజీవనమూ అస్తిత్వ సమస్యకి పరిష్కారాలు కావు. అవి మీ వ్యక్తిగత అవసరాలు కొన్ని తీర్చడానికి పనికి వస్తాయి అంతే. మీకు బలమైన శారీరక, భావావేశాత్మక, మానసిక అవసరాలుంటే, మీరు తప్పకుండా ఒక తోడు వెతుక్కోవలసిందే. మీరు కేవలం సామాజిక ఆర్థిక కారణాలకోసమే పెళ్లి చేసుకోకూడదు. మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం, మీకు ఆసరా కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మీరు ఆశించే ఆసరా, శరీరకమైనది కావచ్చు, భావావేశాత్మకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, సామాజికమైనదీ, ఆర్థికమైనదీ అయినా కావచ్చు.  కారణం ఏదైనప్పటికీ, మీరు ఒకరికి ఉపకారం చెయ్యడానికి పెళ్లి చేసుకోవడం లేదు.  మీరు పెళ్లి చేసుకుంటున్నది మీకు కొన్ని అవసరాలు తీరాలి గనుక. అవతలి వ్యక్తి మీకు మీరు కోరుకున్నది ఇవ్వడానికి సిద్ధపడినపుడు మీరు కృతజ్ఞతతో ఉండగలిగితే, అనుబంధంలొ సంఘర్షణలు తలెత్తే అవకాశమే లేదు.

ఆదర్శ పురుషుడుకోసమో, ఆదర్శ స్త్రీ కోసమో వెతకొద్దు. అటువంటి వాళ్లు ఎవరూ లేరు. మీ అవసరాలే  మీరొకతోడుకోసం వెదకడానికి కారణమని మీరు గ్రహించినపుడు, ఆ అవసరాలు తీరడానికి తగిన వ్యక్తిని ఎంపికచేసుకొండి. మీరు ఆ వ్యక్తిని అంగీకరించి, గౌరవించి, ప్రేమించి, మీ జీవితంలోకి ఆహ్వానించి, ఆ వ్యక్తి శ్రేయస్సు కాంక్షించి, ఒకరి బాధ్యత ఒకరు తీసుకోవడానికి మీరిద్దరూ సిద్ధపడిననాడు, అది ఎంతో అందమైన అనుబంధంగా రూపుదిద్దుకోగలదు.

నీడపడకుండా ..

ప్రతి ప్రేమికుడూ కోరుకునేది

రెండుజీవితాలు ఒకటి కావాలని.

మరొక జీవితంతో ముడిపడాలని 

కోరుకునే ఈ సమ్మేళనా కాంక్ష 

జీవితపు పరిపూర్ణత అనుభవించడం కొరకే. 

సౌందర్యం కేవలం కలిసి ఉండడంలో లేదు   

ఇద్దరి ఆలోచనలూ ఋజుమార్గంలో ఉండగలగడం

వస్తువు --- నీడా

చాలా అరుదైన సందర్భాల్లో తప్ప 

ఒకే సరళరేఖలో ఉండవు.

చిత్రం! జీవితం నిరంతర చలనశీలి.

దీపకళిక కదులుతున్నంత కాలమూ

దాని నీడ దానితో సరళరేఖలో ఉండదు.

అది ప్రతిక్షణం పొడవుగా, పొట్టిగా, 

పెరుగుతూనో, తరుగుతూనో ఉంటుంది    

మనలోని  అపారదర్శకతవలన  

ఎన్ని రకాలనీడలనైనా వెలువడతాయి   

వ్యక్తి తన ఆత్మ పారదర్శకత 

తెలుసుకోగలిగిననాడు 

నీడలేని దోషరహితమైన

అస్తిత్వపు ఋజుత్వము గ్రహించగలుగుతాడు. 

 English Blog

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1