అసతోమా సద్గమయ - జీవితంలో పనిచేసే విధానం

 
 
 
 

ఈ వారం లేఖలో సద్గురు “అసతోమా సద్గమయ” అన్న దానిని గురించి వ్రాస్తున్నారు. ఇది మనం అసత్యం నుంచి సత్యం వైపు నడవడానికి ఒక మేలుకొలుపు. మనం స్వయంగా తయారు చేసుకున్న విషాదాలు, బాధల నుండి బయటపడి సాఫల్యం, శ్రేయస్సు కలిగిన జీవితాన్ని ఎలా చేరుకోవాలో – చెప్తున్నారు. “మీలో మీరు వేళ్లూనుకొని లేకుండా ఏవో పనులు చేస్తున్నట్లైతే, అవి మీకు వ్యతిరేకంగా పని చేస్తాయి” అని చెప్తున్నారు.

ఈశాలో ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను సహజంగా అసతోమా...సద్గమయ.. ఉచ్చరిస్తూ మొదలు పెట్టాలి అని చెప్తుంటాను. ఇది ఏదో ఒక సంస్కృతిని తయారు చేయాలన్న ఉద్దేశం కాదు. అసతోమా...సద్గమయ..అనే ఆవాహన ఒక మేలుకొలుపు. ఇది మీరు, అందరి శ్రేయస్సుకి పనికొస్తున్నారా..? లేదా..? - అని గుర్తుచేసే విధానం. ఇది మనం సృష్టించే ప్రతీదానికీ వర్తిస్తుంది. అది మనలో మనం సృష్టించుకొంటున్న ఆలోచనలు, భావాలు అవ్వచ్చు లేదా మనం బయట సృష్టించుకోవాలనుకుంటున్న డబ్బుగానీ, వ్యాపారం గానీ, జీవనోపాధులు గానీ లేదా రాజకీయాలు గానీ, ఆర్థిక వ్యవహారాలు గానీ, యుద్ధాలుగానీ – ఏవైనా సరే..! ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, మౌలికమైన ప్రశ్న ఏమిటంటే - మనం అందరి శ్రేయస్సుకై పని చేస్తున్నామా..? లేదా..? - అన్నది. కనీసం ఇది ఎక్కువమందికైనా  శ్రేయస్సును కలిగిస్తూ అయినా  ఉండి ఉండాలి.

కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులని ఎలా ఏర్పరచుకున్నామంటే - మన శరీరం ఏమైపోతుందో, మన మనస్సు ఏమి చేస్తుందో మనకు అవసరం లేదు. కేవలం మన బ్యాంకు అకౌంట్ మాత్రం బాగుండాలి.

మీరు ఏదైనా గనుక ఒక ప్రత్యేకమైన విధానంలో పని చెయ్యాలి అనుకుంటే, మీరు జీవితానికి సంబంధించిన సత్యం తెలుసుకోవాలి. ఇది రెండింటికీ వర్తిస్తుంది - ఈ ప్రపంచానికీ, మీలో ఉన్న అంతఃస్వభావానికీ కూడా. యోగా అంటే మీ జీవితం ఎక్కడ మెరుగ్గా పని చేస్తూ ఉందో - ఆ దిశగా కదలడమే. మీ శరీరం, మీ మనస్సు, మీ శక్తి, మీ భావాలూ, మీ చుట్టూరా ఉన్న పరిస్థితులు -  మీరు గనక ఈ క్రమాన్ని పాటిస్తే, ముందర మీరు మీ శరీరం ఎలా పని చేస్తుదో అర్థం చేసుకొని, తరువాత మీ మనస్సు ఎలా నడుస్తుందో తెలుసుకొని, ఏమి చేస్తే మీ భావాలు ఆహ్లాదకరంగా ఉంటాయో  అది చేస్తూ, మీ శక్తిని గనుక ఉన్నతంగా అట్టిపెట్టుకున్నట్లైతే అప్పుడు ఈ ప్రపంచంలో ఏది కావాలి - అన్నది తెలుసుకోవడం పెద్ద శ్రమ పడే విషయమేమీ కాదు. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులని ఎలా ఏర్పరచుకున్నామంటే - మన శరీరం ఏమైపోతుందో, మన మనస్సు ఏమి చేస్తుందో మనకు అవసరం లేదు. కేవలం మన బ్యాంకు అకౌంట్ మాత్రం బాగుండాలి. ఇలా చేస్తే, మనకి ఈ బాధలు అన్నవి తప్పవు. మీరు ఏమి చేస్తున్నారంటే కాళ్ళు బలపడకుండానే నడవాలని ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తే, మీరు బోర్లా పడతారు. అందుకని, మనం ఏది ముందర చేయాలి..? అని తేల్చుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.

సామాన్యంగా, నాకు ఏవైతే సరిగ్గా పనిచేస్తాయో అవి అంటే ఆసక్తి. యంత్రాలు సహజంగానే బాగా పని చేస్తాయి.  అందుకే నేను అప్పుడప్పుడూ కార్ల ప్రకటనలు చదువుతూ ఉంటాను. కానీ, వాటిలో వేరే అదనపు విషయాల గురించి, అంటే స్టీరియోలు, సీట్లు, కుషన్లు, ప్రత్యేకంగా వేసే పెయింటు గురించి మాట్లాడుతారు తప్పితే ఇంజిన్ ఎలా పని చేస్తుంది..? దాని ట్రాన్స్మిషన్ ఎలా ఉంది..? డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి వాటి గురించి ఏమీ మాట్లాడరు. ఈ మధ్య ప్రజల్లో కొద్దిగా భయం మొదలైంది కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ గురించి కూడా చెప్తారు. ప్రజల్లో ఎక్కువ శాతం మంది ఏ విధంగా జీవిస్తున్నారో ఈ ప్రకటన తెలియపరుస్తుంది. వారికి బయటి మెరుగులు మాత్రమే ఆసక్తిని కలిగిస్తాయి. ఇది ఎలాంటిదంటే ప్రజలు జీవిత భీమాని తీసుకుంటున్నారు కానీ, వారికి జీవితమే లేదు. వారు, వారి విషాదంలో పెట్టుబడి పెట్టుకుంటున్నారు.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే - మీ ప్రాధాన్యతలను సరి చేసుకోవడమే. ఇలా సరి చేసుకొని అన్నిటినీ సరిగ్గా పని చేసేలాగా ఒక క్రమంలో ఏర్పరచుకోవడమే. మీ ప్రాధాన్యతలను గనుక మీరు సరి చేసుకోకపోయినట్లైతే మీకు కనీసం ప్రశాంతంగా కూర్చోవడమైనా తెలియదు. 90% ప్రజలకు ప్రశాంతంగా ఉండడం కూడా తెలియదు. ఒక ఆవో, ఒక గాడిదో కడుపునిండా తిన్నాయంటే, అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ మానవులకి అది కూడా చేత కావడం లేదు. ఏ కారణం లేకున్నా సరే ఎవరికి వారే, ఎంతో విషాదాన్ని కలిగించుకుంటున్నారు. వారికి అక్కరలేనిది ఏదైనా జరిగితే దానికి బాధ పడుతున్నారు. వారికి కావలసినది ఏదైనా జరగకపోతే మరింత బాధ పడతారు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, ఎక్కడికో వెళ్ళడం కాదు. ఇది అన్నిటినీ సరైన స్థానాల్లో పెట్టడమే.  మీరు గనుక ఏది ఎలా ఉందో దానిని అలా చూడగలిగితే మీ ప్రాధాన్యతలు వాటంతట అవే మారిపోతాయి. మీరు ఒక చెట్టుని పెంచాలనుకున్నారనుకోండి, మీరు దేన్ని సంరక్షించాలి..? ఆకులనా..? కొమ్మలనా..? లేదా కాండాన్నా..? లేదా మీరు ఎక్కువ పౌష్టికతను ఇవ్వవలసినది వేరుకా..?

నలభై సంవత్సరాలక్రితం నేను మైసూర్ తోటల్లో ఉన్నప్పుడు, ఎవరో ఒకరు వచ్చి వారి దగ్గర అద్భుతంగా పని చేసే ఒక ద్రావకం ఏదో ఉందని చెప్పారు. నా తోటలో ఎన్నో మామిడి పళ్ళు ఉండేవి. నేను ఆ ద్రావకాన్ని పండ్ల మీద చల్లితే, అవి ఒక్కసారిగా ఎంతో పెద్దవైపోతాయని చెప్పారు. అప్పటికి నాకు జ్ఞానోదయం కలగలేదు. కానీ నాకు ఆ మాత్రం ఇంగితం ఉంది. వారేం చెప్పారంటే, "పండు మీద .. వేరు మీద కాదు” అని.  కానీ ఇది ఎంత హాస్యాస్పదంగా మారిందంటే, మా ప్రాంతంలో అందరూ దీనిని ఒక పెద్ద జోక్ గా తీసుకున్నారు. ఒకసారి వారికి ఈ విషయం అర్థం అయిన తరువాత వారు ఈ పనిని వదిలేసి వెళ్ళిపోయారు.

మొదట మిమ్మల్ని మీరు యోగంలో అట్టిపెట్టుకున్న తరువాత, మీకేమి కావాలంటే అది చేయండి. అప్పుడు అది పని చేస్తుంది.

సత్యం వీరు చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. అదెలా అంటే - మీరు వేరుని సంరక్షిస్తే పండుని గురించి ఆలోచించక్కరలేదు. పండు దానంతట అదే వస్తుంది. ఒక రోజు నేను ఒకరిని కలిశాను. నేను వారితో హాస్యమాడుతూ “మీరు చేస్తున్న పనులకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా..? “ అని అడిగాను. దానికి వారు “మీరు ఈశాలో ఏమి చేసినా ఎవరూ మిమ్మల్ని పొగడరు. ఏదైతే సరిగా లేదో... అది మాత్రమే చెబుతారు” అన్నారు.  దానికి నేను “అది మంచిదే కదా..? వాళ్ళు ఈ సంస్కృతి నా దగ్గరనుంచే నేర్చుకున్నారు” అన్నాను. ఏదైతే పని చేయడం లేదో దానిమీదే కదా శ్రద్ధ పెట్టాలి. మీరు సరిగ్గా చేసిన వాటి గురించి నేను మిమ్మల్ని పొగడనవసరం లేదు. సరిగ్గా చేసినవాటికి ఫలితాలు ఎలానూ వస్తాయి. వాటిని మీరు అనుభవిస్తారు. ఏదైతే సరిగ్గా లేదో, ఏదైతే ఈ సృష్టితో అనుసంధానమై లేదో అది పని చేయదు. మీరు వేరుని ఎంత బలిష్టంగా తయారు చేస్తే అది అంత అద్భుతమైన ఫలాన్ని మీకు ఇస్తుంది. పండుని పెద్దగా తయారు చేసే ఎటువంటి గొప్ప ఫోర్ములా అయినా సరే కొన్ని రోజులకి అది చెట్టు మీదా, వేరు మీదా ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది, అన్నది అర్థం అయిపోతుంది.

ఆధ్యాత్మికత అంటే, మీరు వేరుని అర్థం చేసుకోవడం, పండుని కాదు. గీతలో చెప్పిన విధంగా మీరు ఫలాన్ని గురించి ఆలోచించకండి, చేయవలసిన కర్మను చేయండి. "యోగస్థ కురు కర్మాణి" అని చెప్తుంది. మొదట మిమ్మల్ని మీరు యోగంలో అట్టిపెట్టుకున్న తరువాత, మీకేమి కావాలంటే అది చేయండి. అప్పుడు అది పని చేస్తుంది. యోగంలో వేళ్లూనుకొని ఉండడం అంటే మీరు అన్నింటితో ఒక్కటై ఉండడం. మీరు మీ చుట్టూరా ఉన్న వాటితో ఒక్కటిగా ఉండడం.  ఈ రకమైన చైతన్యంతో మీకు ఏది కావాలంటే అది చేయవచ్చు. చైతన్యం అనేది ఒక ఆలోచన కాదు. మీరు గనుక యోగానుభూతిలో నాటుకొని ఉన్నట్లైతే అప్పుడు మీరు ఏమి చేసినా సరే అది మీ జీవితాన్ని ఫలవంతం చేస్తుంది.

మీకు ఎలాంటి ఫలం వస్తుంది అన్నది మీరు ఎటువంటి చెట్టు అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక కొబ్బరి చేట్టై ఉండి, ఒక మామిడి పండు రావాలని ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా విఫలులౌతారు.  ఒకవేళ ఒక కొబ్బరికాయ వచ్చినప్పటికీ దానిని ఫలించడంగా భావించరు. ఇది ఎంతోమందికి జరుగుతుండడం నేను చూస్తూనే ఉంటాను. వారికి ఉత్తమమైనవి వారి త్రోవలో వచ్చినప్పటికీ వారికి గుర్తించే తెలివితేటలు ఉండవు. వారికి మరేదో కావాలి. అది వారికి ఎప్పటికీ జరగదు. ఇదే విధంగా జీవితం వృధా అయిపోతుంది. మీకు మీ దగ్గర ఉన్న ఫలాన్ని ఎలా ఆస్వాదించాలి అనేది తెలియదు. మీరు మరో ఫలం కోసం చూస్తూ ఉంటారు. అది ఎప్పటికీ రాదు.  తప్పుడు ఊహాగానాలు అనేవి ప్రజలను కొంచెం పిచ్చివారిగా చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే - సమాజాలు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నాయి కాబట్టి.

ప్రజలకు వారు ఏమి అవ్వాలి, అన్నదానిపట్ల ఆసక్తి లేదు, వారికి ఏమి ఉండాలి అన్న దానిపట్ల మాత్రమే ఆసక్తి..!! సమాజం ‘మీరు ఎవరు..?‘ అన్నదానిని గుర్తించదు. మీ దగ్గర ఏమున్నది..? - అన్నదానినే గుర్తిస్తుంది. మీరు ఈరోజున ఎవరినైనా “ ఆయన పెద్దమనిషి” అంటే  ఆయన బాగా తెలివిగలవారనో, గొప్ప మనసు ఉందనో లేదా ఆయన ఎంతో విజ్ఞత కలిగినవారనో కాదు, ఆయన దగ్గర చాలా డబ్బు ఉందని..అంతే. ఆయన దగ్గర ఎంత ఉంది..? ఇదే ఈ నాడు అడిగే ప్రశ్న. ప్రజలు వారిని వారు అవి, ఇవి ప్రోగు చేసుకోవడం ద్వారా పెంపొందించుకోవాలని అనుకుంటున్నారు. మన దగ్గర ఉన్నదంతా కూడా మనం భూమాత దగ్గరనుండి దొంగిలించినదే..మన మనుగడ కోసం కొంతవరకు ఇది చేయక తప్పదు... కానీ, మనందరం కూడా ఇక్కడ పారవశ్యంలో కూర్చోగలిగితే అప్పుడు ఏది ఎంత వరకు అవసరమో అది అంతవరకు మాత్రమే చేస్తాం. కొంచెం ఎక్కువా చెయ్యము, కొంచెం తక్కువా చెయ్యము.

మీరు ఎవరు అన్నది, మీ చుట్టూరా ఉన్న వస్తువులను బట్టి ఆధారపడినప్పుడు, మీరు ఏమి చేసినా సరే అది ఈ భూమిని ధ్వంసం చేస్తుంది. మీరు దీనిని నియంత్రించలేరు. ఎందుకంటే, ఒక మనిషి దానిని విలాసంగా ఉండడం అని అనుకోవచ్చు, మరో మనిషి దానిని నిత్యావసరంగా భావించవచ్చు. మీ సామాజిక అనుభూతులను బట్టి, మీ అవగాహన మారుతూ ఉంటుంది. కానీ అది మీ జీవిత స్వభావాన్ని నిర్ణయించలేదు. అందుకే, అసతోమా... సద్గమయ.  ముందర మిమ్మల్ని మీరు గనుక సత్యంలో స్థిరపరచుకోగలిగితే అప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మీరు మీలో గనుక నాటుకొని లేకపోతే మీరు ఏ పని చేసినా సరే, అది చిట్టచివరకు వ్యతిరేకంగానే పని చేస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు