సాఫల్యాలు సాధించేందుకు మానవులకున్న శక్తి యుక్తుల దృష్ట్యా చూస్తే, జీవిత కాలం చాలా స్వల్పం. తామేమిటో, తమలో ఉన్న శక్తి విస్తృతి ఏమిటో లోతుగా గమనించుకోనివారికీ, దుఃఖితులై క్రుంగిపోయి ఉన్న వారికీ, మాత్రమే జీవితం అతి దీర్ఘం అనిపిస్తుంది. దీనికి కారణం సమయం అన్నది సాపేక్షమైన అనుభవం కావటం. మిమ్మల్ని మీరు చురుకుగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంచుకోగలిగితే, జీవిత కాలం చాలా స్వల్పం అనిపిస్తుంది. మీరు చేయగలిగినదంతా చేసేసిన తరవాత, నిన్న ఏం జరిగింది అని ఇప్పుడు మథనపడటం అనవసరం. అయితే, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిన్న మీరు చేయగలిగినది ఎంత అని మీరు భావించారో, ఈ రోజూ అంతే చేస్తాను అంటే మాత్రం సరిపోదు. ఈ రోజు మీరు చేస్తున్నది నిన్నటికంటే మెరుగుగా ఉండి తీరాలి. మీ ఎదుగుదలకు అదే గుర్తు.

మీరు మీకున్న శక్తి యుక్తులను పూర్తిగా వినియోగించగలిగితే, జీవితంలో ప్రతి రోజూ అవకాశాల వెల్లువే.

మీరు మీకున్న శక్తి యుక్తులను పూర్తిగా వినియోగించగలిగితే, జీవితంలో ప్రతి రోజూ అవకాశాల వెల్లువే. మీరు వేగంగా బండి నడుపుతుంటే, వెనకకు చూసేందుకు వ్యవధి ఉండదు. కారును ఆపేసి కూర్చున్న వాళ్లయితే, 'రియర్ వ్యూ' అద్దం చూసుకొంటూ ఉండచ్చు, వాళ్ళు ఎటూ ఏ గమ్యాన్ని చేరేది లేదు కనక. నిన్న జరిగిపోయిన దాన్ని గురించి, ఇవాళ శవ పరీక్ష చేసి ప్రయోజనం లేదు. రేపును తీర్చి దిద్దుకోవటం ప్రధాన కర్తవ్యం. అద్భుతమైన భవిష్యత్తు సృష్టించుకోవాలంటే, మీరు ఎప్పుడూ మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. మీరు ఎలా ఉండగోరుతున్నారో అలా మిమ్మల్ని మీరు మలచుకోవటం ఎదుగుదల. అయితే, పరిణతి చెందిన కొద్దీ, మీరు ఎలా ఉండగోరు తున్నారనే మీ లక్ష్యం మారిపోతూ ఉండచ్చు.  మీ శరీర శక్తీ, మీ బుద్ధి బలం, మీ భావ తీవ్రతలను బట్టి,  మీరు అందుకోగల అత్యున్నత స్థాయి ఎంతో మీరే నిర్ధారించుకోండి. ఆ స్థాయి చేరటమే మీకు లక్ష్యంగా ఉండాలి.

మరొకరికంటే మీరు గొప్పగా ఉండనక్కర్లేదు. కానీ మీరు చేరగల స్థాయి కంటే తక్కువ స్థాయిలో మాత్రం ఉండకూడదు. మీ జీవితం అర్థవంతం కావాలని మీకు ఉంటే, మీరు మీ పూర్తి శక్తితో పని చేయాలి. లేకపోతే మాత్రం, జీవితం వ్యర్థమయినట్టే. జీవితాన్ని సుసంపన్నంగా గడపగలిగితే అది మహాద్భుతంగా ఉంటుంది. సగం చచ్చి బతుకుతున్నట్టు గడిపితే, అది దుఃఖ భరితమే అవుతుంది. ఒక రకంగా అది నరకానికి ముందస్తు సన్నాహం అవుతుంది. మీరు ఎక్కడ ఎలా ఉన్నా, మిమ్మల్ని మీరు ఉత్సాహవంతులుగా ఉంచుకోగలిగితే, మీకు ఎలాంటి సమస్యా ఉండదు. లేదంటే మీరు స్వర్గ లోకంలో ఉన్నా, దాన్ని మీరు నరకంగా మార్చేసుకొంటారు. మీరు మీ భవిష్యత్తును నిర్మించుకోగోరితే,  గతాన్ని ఒక సోపానంగా వాడుకోవాలి, నెత్తిమీది బరువుగా కాదు. ఒకవేళ మీ గతం దుఃఖ భూయిష్ఠంగా సాగి ఉంటే, దాని వల్ల మీరు మరింత వివేకాన్నీ, పరిణతినీ ఇతరులకంటే త్వరగా సాధించ గలగాలి. మనకేదయినా చెడు జరిగినప్పుడు, దానితో మనం దెబ్బతిని పడిపోతామా, లేక, పాఠం నేర్చుకొని వివేకవంతులమౌతామా? అదీ మనం తీసుకోవలసిన నిర్ణయం. మనకే అనర్థమూ జరగకూడదు అని ఆశ పడుతూ, ఒక మూల కూర్చో వద్దు. జీవితం అలా నడవదు! ఏది జరిగినా దాన్ని మీరు ఒక మహా భాగ్యంగా మార్చుకోవచ్చు.

మీకు చేతయినంత అత్యున్నత స్థాయిలో కృషి చేయాలి. వీరూ వారని తేడా లేదు, ఎవరయినా సరే ఏది చేసినా సరే, మీ శక్తినంతా ధారపోయాలి.

మేము ఈశ యోగ కేంద్రం స్థాపన ఆరంభించినప్పుడు, అది ఊళ్ళో కొంత సంచలనం సృష్టించింది. మాదగ్గరకు ప్రజలు రావటం మొదలు పెట్టారు. అక్కడి పలుకుబడి గల కుటుంబాలలో కొన్నింటికి ఇది నచ్చలేదు. వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొన్నారు. కొన్ని వందల మందిని తీసుకొచ్చి, యోగ కేంద్రాన్ని ధ్వంసం చేయాలని పథకం వేశారు. కానీ లోకజ్ఞత గల ఒక ముసలాయన అక్కడ ఉండి వాళ్ళని హెచ్చరించాడు, 'మీరు ఎవరితో తలపడుతున్నారో మీకు అర్థమౌతున్నట్టు లేదు. ఆయన మీద మీరు రాళ్ళు రువ్వితే, ఆ రాళ్ళతోనే ఆయన తను నిర్మించదలచుకొన్నది నిర్మిస్తాడు. అలాంటి పొరపాటు మాత్రం చేయకండి' అని.

జీవితం ఏ సవాళ్ళు విసురుతుందీ, ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అన్నది ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. కానీ, వాటిని మీరు ఎలా మలుచుకొంటారు అన్నది మాత్రం మీ నిర్ణయం. జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడు స్వాధీనంలో ఉండాలి: ఎవరేమి అన్నా,  ప్రపంచం మీతో ఎలా వ్యవహరించినా,  దాన్ని అంతటినీ మీరు మీ శ్రేయస్సు కోసం మళ్లించుకోవాలి. ఇలా చేయాలంటే సంయమనం కావాలి. మీకు చేతయినంత అత్యున్నత స్థాయిలో కృషి చేయాలి. వీరూ వారని తేడా లేదు, ఎవరయినా సరే ఏది చేసినా సరే, మీ శక్తినంతా ధారపోయాలి. ప్రతీవారినీ ప్రతీ విషయాన్నీ ఒకే తీవ్రతతో, మనసు ఒకే విధంగా లగ్నం చేసి తత్పరతతో పరిశీలించటం నేర్చుకోవాలి. కొన్ని విషయాలలో మాత్రమే మనసు లగ్నం చేయటమంటే, సగం ఊపిరితో జీవించటం లాంటిది. పరిపూర్ణుడైన మనిషిగా పరిణతి చెందాలంటే,  మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ, మీ సామర్థ్యాన్ని మీకు సాధ్యమైనంత ఉన్నత స్థాయిలో వినియోగించేందుకు ఎప్పుడూ ప్రయత్నించాలి.

దురదృష్టవశాత్తూ, మానవాళిలో నూటికి తొంభై మంది తమకున్న శక్తియుక్తులలో చాలా తక్కువ భాగమే వినియోగిస్తుంటారు. దీనికి కొంతవరకు కారణం ఎవరో ఏదో చెప్పటమో, చేయటమో. లేదంటే, కేవలం ఎవరైనా ఏమయినా అనుకొంటారేమోనన్న భయం మాత్రమే కావచ్చు. అంటే ఇతరుల మనసులలోకి చొరబడటం. అది ఎంత అసహ్యకరమో! ఇతరులు ఎవరైనా, ఏమి అనుకొన్నా, ఏమి చేసినా, ఏమి అన్నా, మీ త్రోవలో ఏది ఎదురయినా, అవన్నీ మీ మేలు కోసం మళ్లించటం నేర్చుకోండి. ఎవరయినా మీ మీద విషం చిమ్మితే, దాన్ని కూడా మీ మంచికే వినియోగించుకోండి. విషాలను ఔషధాలలో వాడుతూనే ఉన్నారు కదా? వాళ్ళు జాగ్రత్తగా గమనించి సమస్య ఎక్కడ పుడుతున్నాదో, పరిష్కారమూ అక్కడే దొరుకుతుందని గ్రహించిన వాళ్ళు.

ఎదగటమంటే, మిమ్మల్ని మీరు మీకు చేతయినంత ఉన్నత స్థాయికి చేర్చుకోవటం.

కన్నడంలో ఒక లోకోక్తి ఉంది. ఎవరయినా ఏదయినా తప్పు చేసి, ఇతరులు దాన్ని గురించి చర్చ చేయటం జరిగితే, తప్పు చేసిన వాడి మీద కంటే, దాన్ని గురించి మాట్లాడే ఇతరుల మీదనే దుష్ఫలితం ఎక్కువ ఉంటుందని. ఆ బరువేదో వాళ్ళనే మోసుకోనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని దుర్భాషలాడితే, వాళ్ళ నోరే చెడుతుంది. అది మీ సమస్య కాదు. అవతలి వాళ్లెవరో ఏదయినా అంటే, ఏదో చేస్తే, ఏదో అనుకొంటే అది మిమ్మల్ని ప్రభావితం చేయనక్కర్లేదు. మీరెప్పుడూ మీకు చేతయినంతగా మీ కృషి చేస్తూ ఉంటే, వాళ్ళ విమర్శల వెనక ప్రేరణ ఏమిటో కనుక్కోగలరు. పనికొచ్చే విషయమైతే దాన్ని ఒక సలహాగా మీరు స్వీకరించచ్చు. మిగిలిందంతా, వదిలేసేయండి. మీరు మీకున్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయి కృషి చేస్తుంటే మాత్రం, ఎవరైనా ఏమయినా అన్నప్పుడు, మీరు మీరేమిటో తెలుసుకోలేని అయోమయంలో పడతారు.

అంటే, మీరు ఎలా ఉండాలో మీరు ఒక్క సారి నిశ్చయం చేసుకొని జీవితమంతా అలాగే ఉండిపోవాలని కాదు. ఎదుగుదల అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉండే ప్రక్రియ. ఎదగటమంటే, మిమ్మల్ని మీరు మీకు చేతయినంత ఉన్నత స్థాయికి చేర్చుకోవటం. చాలామంది అస్థిరంగా, చంచలంగా ఉంటారు. అంటే, ఒక క్షణంలో అద్భుతంగా ప్రవర్తిస్తారు. అంతలోనే, మరో క్షణంలో చాలా హేయంగా వ్యవహరిస్తారు. మీరు అలా కాకుండా, ఎప్పటికప్పుడు, అప్పటికి అందుకోగల అత్యున్నత స్థాయి ఏమిటో నిర్ధారణ చేసుకొని , ఆ స్థాయికి చేరేందుకు కృషి చేయండి.

ఇది మాత్రం మీ జీవన విధానంలో భాగం కావాలి: ఏది చేసినా, మీ వైపునుండి ఏమాత్రం శక్తివంచన లేని ఉత్తమ స్థాయిలో చేయాలి.

ప్రేమాశీస్సులతో