ప్రశ్న: సద్గురు! ఇటు భారత దేశమూ, అటు ఐక్యరాజ్య సమితీ కూడా ఈ మధ్యనే బాలల దినోత్సవాన్ని జరిపాయి. దేశం లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?

సద్గురు: యువత మీకంటే ఎక్కువ ఉత్సాహ పూరితంగానూ, ఆదర్శవంతంగానూ, స్ఫూర్తిభరితంగానూ ఉంది. అసలు ఈ ప్రపంచానికి యువత మార్గదర్శనం చేసే పరిస్థితి ఉండివుంటే, ప్రపంచం ఎంతో మెరుగుగా ఉండేది. అయితే ఇతరులతో పోలిస్తే యువతలోలో శక్త్యుత్సాహాలు ఉరకలు వేస్తూ ఉంటాయి గనక వాళ్ళు చేసే పనుల్లో కొంత 'అతి' చోటు చేసుకొంటుంది. ఈ ప్రపంచంలో నిర్మాణాత్మకమైన కృషి ఏదయినా జరగాలంటే, అది యువత ద్వారానే సాధ్యం. ప్రపంచంలో విధ్వంసాత్మకమయిన పని ఏదయినా జరగాలంటే, అదీ యువత ద్వారానే సాధ్యం!

నిజం చెప్పాలంటే, ఈ ప్రపంచానికి చిన్న పిల్లలు దిశా నిర్దేశం చేసి నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, వాస్తవిక జీవితానికి వాళ్ళున్నంత దగ్గిరగా ఉండేవాళ్లు మరెవరూ లేరు ! అసలు మనం ఏ పని తలపెట్టినా అది మానవ సంక్షేమం కోసమే గదా? మానవ సంక్షేమం అంటే మనుషులంతా సంతోషంగా ఉండటం కదా! మీరు మీ పిల్లలని చూడండి, మిమ్మల్ని చూసుకోండి! మీ పిల్లలు మీకంటే ఎంతో సంతోషంగా ఉంటారు. అలాంటప్పుడు జీవితాన్ని గురించి సంప్రదించదగిన నిపుణులు వాళ్ళే, మీరెలా అవుతారు ? మీరు మీ ఆలోచనలతో, భావోద్వేగాలతో, విషయం నుంచి దూరంగా ఎటో వెళ్లిపోతారు. వాళ్ళు వాస్తవిక జీవితానికి చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే ఈ ప్రపంచం పిల్లలకేదో నేర్పే ప్రయత్నం చేయకుండా, పిల్లలనుంచి నేర్చుకోగలిగితే, ఒక అందమైన లోకం రూపు దిద్దుకొంటుంది.!

జీవితంలో మీరు ఎన్ని కోరుకొంటే అన్నీ సాధించగల యౌవన ప్రాయం, దురదృష్టవశాత్తూ సరయిన స్పూర్తి లభించక పోవటం వల్ల వ్యర్థమైపోతుంది

సాధారణంగా పెద్ద తరాల వాళ్ళు, యువత అంటే వాళ్ళకు ఏదో చికిత్స అందిస్తేగానీ సాధారణస్థితికి రాలేని రోగుల లాగా పరిగణిస్తూ ఉంటారు. వాళ్ళకు ఏ చికిత్సా అవసరం లేదు. చికిత్స కావలసింది వాస్తవిక జీవితం నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకు. జీవితానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు శుభ్రంగా జీవించేస్తారు! యువతకు శక్త్యుత్సాహాలు అపారంగా ఉంటాయి. సరయిన మార్గ దర్శనమూ, స్ఫూర్తీ లేకపోతే, ఆ శక్తి దుర్వినియోగం వైపు మళ్లటం తేలిక.

మన విద్యా విధానం నూటికి నూరు పాళ్లూ విషయాల గురించి సమాచారం అందించే వ్యవస్థ అయిపోయింది. అందులో స్ఫూర్తి లేదు! స్ఫూర్తి లేకపోతే, మనిషి తన జీవన విధానం పరిమితులను అధిగమించి పైకి రాలేడు. వట్టి సమాచారమే అయితే, అది ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని ప్రత్యేకంగా ఉపాధ్యాయుల ముఖతః మాత్రమే తెలుసుకోనక్కరలేదు.

అసలు, కేవలం సమాచారమే అయితే, అది అందించటానికి ఉపాధ్యాయుడికంటే మంచి సాధనాలు చాలా ఉన్నాయి. ఉపాధ్యాయుడి కంటే పుస్తకం మెరుగు. దానికంటే ఇంటర్నెట్ మరీ ఉత్తమం. ఉపాధ్యాయుడి పాత్ర పిల్లలకు స్ఫూర్తినివ్వటం, వాళ్ళలో ఒక జ్ఞాన తృష్ణను పెంచటం అయితేనే ఆ పాత్ర అర్థవంతమౌతుంది.. ఆయన ప్రయత్నమంతా ఊరికే సమాచారం అందించటానికే పరిమితమై పోతుంటే మాత్రం, అలా సమాచారం అందించేందుకు ఇతర సాధనాలే మనిషికంటే మెరుగు. ఎందుకంటే, మనిషి తను అందించే సమాచారానికి తన వక్రభాష్యం చేర్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. విద్యా విధానమంతా సమాచారాత్మకం చేసేయటం అపారమైన నష్టాన్ని కలిగించింది. జీవితంలో మీరు ఎన్ని కోరుకొంటే అన్నీ సాధించగల యౌవన ప్రాయం, దురదృష్టవశాత్తూ సరయిన స్పూర్తి లభించక పోవటం వల్ల వ్యర్థమైపోతుంది.

ఆధునిక విద్య మనిషికి తన విషయం గురించి, తన విషయం గురించి మాత్రమే, ఆలోచించుకోవటానికి నిరంతరం శిక్షణ ఇస్తున్నది.

ఇది మొక్కను పెంచటం లాంటిది. మొక్క పెరిగి ఫలవంతం కావాలంటే, మీరు దానికి రోజూ పోషణ చేయాలి. రోజూ నీళ్ళు పోయాలి. రోజూ దాన్నిగురించి జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఇలాంటి అంకిత భావం ప్రదర్శిస్తే, పిల్లలు అద్భుతాలు చేసి చూపుతారు. సామాన్య ప్రజానీకంలో అలాంటి అంకిత భావం లోపించటం వల్లే, దేశంలో యువత ఏ దిశానిర్దేశమూ లేనివారుగా తయారయినట్టు కనిపిస్తున్నది. ఏమి చేయాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తోచిందేదో చేసుకుపోతున్నారు. ఇప్పుడు అందరికీ స్వల్ప కాలీన లక్ష్యాలమీదే శ్రద్ధ కనక యువత కూడా స్వల్పకాలీన లక్ష్యాల మీదే దృష్టి ఉంచుతున్నది.

యువతలో ముఖ్యంగా రావలసిన మార్పు ఒకటి ఏమిటంటే- ఇది అందరిలోనూ రావలసిన మార్పే- మానవ జాతి అంటే నేను మాత్రమే అన్న భావన స్థానంలో నా చుట్టూ ఉన్న సమాజమూ, ఆ పైన ఉన్న విశాల ప్రపంచమూ కూడా, అన్న స్ఫురణ పెరగాలి. దురదృష్టవశాత్తూ, ఈ నాటి విద్యలో ఈ ధ్యాస లోపించింది. ఆధునిక విద్య మనిషికి తన విషయం గురించి, తన విషయం గురించి మాత్రమే, ఆలోచించుకోవటానికి నిరంతరం శిక్షణ ఇస్తున్నది. (ఉదాహరణకు) సైన్సు నేర్చుకోవటం వెనక ఉద్దేశ్యం ఒక్కటే. దీని వల్ల నా సుఖమూ, సంక్షేమమూ ఎలా పెంచుకోవచ్చు, అని. ఆ స్వప్రయోజనం కోసమే, మొదట భూగోళం లో వనరులు వాడతాం. తరవాత చెట్టూ చేమా, తరవాత పశు పక్షులూ, ఆ తరవాత సాటి మానవులూ. అందరినీ మన ప్రయోజనం కోసం, మన సుఖం కోసం వాడేసుకోవటమే. ఆధునిక విద్యా విధానం వల్ల ఇలాంటి ధోరణి లోతుగా వేళ్లూనుకొంటున్నది.

మనం మన సమయాన్నీ, శక్తినీ, వనరులనూ, సమాచారాత్మకమైన విజ్ఞానం నేర్పించటానికి వినియోగిస్తునట్టే, మరి కొంత సమయాన్నీ, శక్తినీ, వనరులనూ యువతకు స్ఫూర్తినీ, ప్రేరణనూ అందించేందుకు కూడా ఉపయోగించాలి. అదే జరిగితే, ఈ ప్రపంచం నిజంగా ఎంతో అందమైన ప్రదేశంగా మారిపోతుంది!