యౌవనం, నమ్మకం ఇంకా విశ్వాసం

 

నమ్మకానికి, విశ్వాసానికి భేదం ఏమిటి? ఒకసారి చెప్పిందల్లా విశ్వసించడం మొదలు పెడితే యువకులు వృద్ధుల్లా ప్రవర్తించడం మొదలు పెడతారని  సద్గురు వివరిస్తున్నారు..

నేటితరానికి  మతం పట్ల నిష్ఠ లేదనీ, వారి ముందటి తరాల విశ్వాసాలను వారు పంచుకోవడంలేదని తరచుగా చాలామంది బాధపడుతూ ఉంటారు.

వ్యక్తిగతంగా నా కోరిక ఏమిటంటే, మరింతమంది యువత ఇటువంటి విశ్వాసాలు కలిగి ఉండకూడదనే..! తమ తండ్రులు చెప్పేదాన్ని విశ్వసించే యువత ఉండడం అంటే  ఈ ప్రపంచపుచానికి అది  దురదృష్టమే. వారు దేన్నీ విశ్వసించకుండా ఉన్నప్పుడే యువకులు యౌవనంతో  ఉన్నట్టు లెక్క. వాళ్లు శోధనకు సిద్ధంగా ఉండాలి; వాళ్లకు తమంత తామే తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. వాళ్లలో ఆ కోరిక నశించిపోతే వాళ్లను మీరింకా యువకులని ఎలా అనగలరు? వాళ్లు వృద్ధులే...!

ముందు మనం మతానికీ, ఆధ్యాత్మిక ప్రక్రియకీ ఉన్న తేడా తెలుసుకోవాలి. మీరొక వ్యవస్థీకృత మతానికి చెందినవారైతే మీరు అన్నిటిని విశ్వసిస్తారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మీరు ప్రతిదీ శోధించి తెలుసుకుంటారు.

కానీ ఒక అన్వేషి తనకు తెలియనిది , తెలియదు అని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. 

ఈ రెండింటికీ తేడా ఏమిటి? ‘నేను విశ్వసిస్తాను’, అని మీరన్నప్పుడు ‘నాకు తెలియదని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను’ అని మీరు చెప్పినట్లవుతుంది. అతను తన అనుభవ పరిధిలో లేని విషయం గురించి నిర్ధారణలు చేస్తాడు. కానీ ఒక అన్వేషి తనకు తెలియనిది, తెలియదు అని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు.

అన్వేషించడం - అంటే మీలో ప్రాధమిక లక్షణం, ఈ సృష్టికి మూలం ఏమిటి అని మీకు తెలియదన్న విషయం మీరు తెలుసుకున్నారన్న మాట. మీరెవరో మీకు తెలియదు, మీరు ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియదు, మీరెక్కడికి వెళతారో మీకు తెలియదు. మీరు ‘నాకు తెలియదు’ అన్న స్థితిలో ఉన్నప్పుడు మీరు సజీవంగా, శిశువులాగా, ఎటువంటి ఘర్షణ లేకుండా ఉంటారు. మానవ మేధ ఎటువంటిదంటే అది మిమ్మల్ని జీవితం గురించి ఆశ్చర్యంతో ఆలోచింపజేస్తుంది. ఈ ఆశ్చర్యం, లేదా సందేహం స్థానంలో నిశ్చితత్వం చోటు చేసుకుంటే తెలుసుకోవడానికి ఉన్న సంభావ్యతలన్నిటినీ మీరు నాశనం చేసుకున్నట్లే. విశ్వాసంలో మీకొక కొత్త రకమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది కాని స్పష్టత లేని నిశ్చితత్వం మీకూ, ప్రపంచానికీ కూడా ప్రమాదకరం. 

మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ప్రారంభించండి

ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు మీ పట్ల పూర్తి నిజాయితీగా ఉన్నారని అర్థం. కృష్ణుడో, జీససో, బుద్ధుడో, దేవుడో, దేవుడి సందేశం తెచ్చేవారో ఎవరైనా సరే, వారేం చెప్పారన్నది ముఖ్యం కాదు. బహుశా వారు సత్యమే చెప్తుండవచ్చు. కాని, మీకు అది అనుభవంలో లేదు. మీరు ఎంతో గౌరవంతో అంతా వినవచ్చు, అయినా మీకేమీ తెలియదు.

మీకు తెలియదని మీరు తెలుసుకున్నప్పుడు, మీరెక్కడున్నారో అక్కడినుండి మొదలయ్యే నడక ప్రారంభించవచ్చు. అయితే విశ్వాసిలాగా మీ అంతిమ గమ్యం గురించి ఊహలు చేయవద్దు. ఎందుకంటే మీరు కనీసం ఒక అడుగైనా నేలమీద పెట్టారు, మీకదేమిటో కొంత అవగాహన కలుగుతుంది; అది మీకు పనిచేస్తుందో లేదో మీకు తెలుస్తుంది. అంటే మీ తెలివి పనిచేయడానికి ఇంకా అవకాశం ఉందన్నమాట. కాని మీ గమ్యం గురించి నిర్ధారణలు చేసుకుంటే, మీ తెలివికి అవకాశం ఉండదు; ఫలితం ఎక్కడున్న గొంగళి అక్కడే.

అందరూ అనుకుంటునట్లు, ఈ ప్రపంచంలోని ఘర్షణ అంతా కూడా మంచి చెడుల మధ్య కాదు. ఘర్షణ ఎప్పుడూ ఒకవ్యక్తి విశ్వాసానికీ, మరో వ్యక్తి విశ్వాసానికీ మధ్యనే. అది ఒక కుటుంబంలోనే కావచ్చు లేదా దేశాలమధ్య కావచ్చు. మీరొకదాన్ని విశ్వసించిన వెంటనే దానికి వ్యతిరేకమైన మరో విశ్వాసంతో మీకు ఘర్షణ ఏర్పడుతుంది. మీరు మెత్తగా మాట్లాడి ఘర్షణను వాయిదా వేయవచ్చు. కాని ఘర్షణ తప్పదు.

నమ్మకం సరే, విశ్వాసం వద్దు!

ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి మీకు కొంత నమ్మకం ఉండాలి, కాని విశ్వాసం కాదు. నమ్మకం అన్నది ఒక గాఢమైన అంతరంగ అనుభవం వల్ల కలుగుతుంది. అందులో లెక్కలుగాని, ఉద్దేశాలు గాని, సిద్ధాంతీకరణలుగాని, గ్యారంటీలు గాని ఉండవు.

ఈశాలో మొదటిరోజునుండీ జనం మనసుల్లో నేను సందేహాన్నే పెడతాను. మీలో నిరంతరం సందేహాన్నే పెంచుతూ ఉంటాను. నిజమైనది జరగాలంటే మనలోకి ఎక్కించిన సిద్ధాంతాలన్నీ పోవాలి. నేను జనాల మనసులో అసౌకర్యం కలిగించే విధంగా నా వ్యక్తిత్వాన్ని కావాలనే రూపొందించుకున్నాను. నేనెన్నడూ జనాన్ని ‘నన్ను నమ్మ’ మని అడగను. ఈ మాట చాలా దురుపయోగం పొందింది. అయినా ఇంకా జనం నన్ను పట్టుకొని ఉన్నారంటే కారణం అంతర్గత అనుభవం. ఇది మానసికం కాదు. ఇది నమ్మకం. ఈ ప్రయాణంలో వారి జీవనశక్తులే సూటిగా పాల్గొంటున్నాయి.

విశ్వాసం అన్నది ప్రయత్నపూర్వకంగా పెంపొందించింది. నమ్మకం దానంతటదే ఏర్పడేది.

నమ్మకం అంటే అర్థరహితంగా ఉండడంకాదు. మన పరిమితమైన తర్కాన్ని అధిగమించిన వివేకమేదో విశ్వంలో ఉన్నదని మనం గుర్తించడం అది, ఆ వివేకాన్ని పొందడానికి మార్గాన్వేషణ అది. కాని ప్రస్తుతం దురదృష్టవశాత్తు నమ్మకం అంటే మూఢనమ్మకం అని అర్థం చేసుకుంటున్నారు.

ఒకవేళ ఒకరోజు మీ అనుభవం మీ బుద్ధి పరిమితులను అధిగమించినట్లయితే నమ్మకం దానంతటదే కలుగుతుంది. విశ్వాసం అన్నది ప్రయత్నపూర్వకంగా పెంపొందించింది. నమ్మకం దానంతటదే ఏర్పడేది. మరోవిధంగా చెప్పుకుందాం. నిరంతరం బోధన వల్ల అభిప్రాయాలు ఏర్పరచడం విశ్వాసం; బుద్ధిని శుద్ధి చేయడం నమ్మకం.

మీలో ప్రశ్నించే బుద్ధి ఉంటే దాన్ని నిరంతరం వాడి పెంపొందించుకోండి. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయకండి; అది అసాధ్యం. నమ్మకమున్నచోట హేతువు, హేతువున్నచోట నమ్మకమూ ఉండదనడం సరికాదు. అపరిపక్వమైన హేతువు నాస్తికవాదం. హేతువు పరిపక్వత చెందినప్పుడు అది నమ్మకమవుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1