యువత అంటే ఉత్సాహం, శక్తి ఇంకా సాహసం అని సద్గురు చెబుతున్నారు. ఒకసారి చిత్తూరు జిల్లాకు చెందిన దంపతులు సద్గురుని కలిసారు. వారి బిడ్డ భవిష్యత్తు నిర్ణయం గురించి వారు సద్గురుని అడగగా యువత అంటే, ఈ దేశానికి సేవ చేయడం అంటే ఏంటి అన్న దాని గురించి సద్గురు ఎం చెప్పారో ఈ వ్యాసంలో తెలుసుకోండి.

సద్గురు: ఆ దంపతులది చిత్తూరు. ఓసారి వీక్లీ సెషన్ లో కనిపించారు. ఇద్దరూ చాలా బాధలో ఉన్నట్టున్నారు. నేనూహించినట్టే, ఆ బాధంతా వాళ్ళ పిల్లాడి గురించి. ఒక్కడే కొడుకు, ఇంటర్ పూర్తయ్యింది. కాని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు.

"జస్ట్..త్రీ ఇయర్స్ లో వస్తానమ్మా" అంటున్నాడట. వీళ్ళకేమో ఆ కుర్రాడిని ఏ డాక్టరు గానో ఇంజనీరుగానో చూడాలని కోరిక. అవి చేయకపోయినా ఫరవాలేదు. కళ్ళముందుంటే చాలు. సైన్యంలో ఎందుకు? అని ఆ దంపతుల భయం. ప్రతి తల్లిదండ్రులకీ భయం ఉంటుంది. ఆ తప్పు తల్లిదండ్రులది కాదు. జీవితంలో ఇంకే సాహసం చేయక్కరలేదు అనుకునే వారి వయసుది. అది సహజం కూడా. కాని యవత అంటే శక్తి, ఉత్సాహం, జీవితేచ్చ. ఒక్క మాటలో చెప్పాలంటే... సాహసం!

మీ అబ్బాయి డిఫెన్స్ లో చేరతాననడం మామూలు విషయం కాదు. అది తన గుండె లోలోతుల్నుంచి వచ్చిన నిర్ణయమై ఉంటుంది

నా కుర్రతనం గడిచిందంతా కర్ణాటక చాముండి హిల్స్ లో. ఖాళీ దొరికినప్పుడల్లా కొండలపైకి మోటార్ బైక్ లో దూసుకెళ్తుంట. అర్ధరాత్రి కూడా చాలా వేగంగా నడిపేవాడిని. ఓ రోజు 'రోడ్డుపైనే ఎందుకు వెళ్ళాలి? గుట్టల్లో ఎందుకు పోకూడదు?' అనిపించింది. రై.. అంటూ దారి మళ్ళించాను. ఎదురుగా ఎమోస్తుందో తెలియదు! రాళ్ళూ, రప్పలూ, పొదలూ వేటినీ లెక్కచేయలేదు. అలా వెళ్తూంటే ఓ చెట్టు కొమ్మ తగిలి ఉంగరం వేలు విరిగిపోయింది. విపరీతమైన నొప్పి. నేను అదంతా లేక్కచేసే రకం కాదు! డబడబ మంటూ కొండలేక్కి..దిగేశా! ఇప్పుడైతే నేనల చేయలేను. అంటే..నా మనసుకా ధైర్యం లేదనికాదు. నా శరీరం సహకరించదంతే. మనం ఎం చేసినా యవ్వనంలోనే చేయాలి. ఇది సాహసాల వయసు.

'మేము అంత రిస్కు తీసుకునే..మా ప్రాణం పోగొట్టుకోవాలా!' అనొచ్చు. సాహసం అంటే అలా కొండలెక్కి దూకేయడం కాదు. మోటారు బైకుతో గుట్టల్లో దూసుకెళ్లడమూ కాదు.అవన్నీ ప్రాణాలతో ఆడే చెలగాటాలు! నేను చెప్పే సాహాసం.. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం. ప్రేమ..చదువూ..కెరీర్..ట్రెక్కింగ్..ట్రావెలింగ్..దేనికైనా ఇది వర్తిస్తుంది. ప్రేమించి ఎక్కడికో పారిపోయి కాపురం చేయడం కాదు సాహసమంటే! మీ ప్రేమపై..మీపై నమ్మకంతో పెద్దల్ని ఒప్పించి ధైర్యంగా బతకడం! ఉద్యోగంలో కూడా ఎప్పుడూ మీకు తెలిసిందే చేస్తూ తృప్తి పడటం కాదు. సరికొత్త జోన్ లోకి అడుగుపెట్టడం. అదే కుర్రతనానికి గుర్తు! ముసలితనమంటే ఆ తపన లేకపోవడమే!

నేను ఆ చిత్తూరు దంపతులకి చెప్పిందిదే: 'జీవితానికేప్పుడూ భద్రత లేదు. బతుకును భద్రంగా నడపడం ఎలాగో పిల్లలే నేర్చుకోవాలి. ప్రతి సందర్భంలోనూ భద్రాతే ముఖ్యమనుకుంటే.. మనం ఓ శవపేటికలో పడుకుంటే సరిపోతుంది! మనకే సమస్యా ఉండదు. ఆందోళన అక్కర్లేదు! జీవితం అంటే నిత్య చైతన్యం. మీ అబ్బాయి డిఫెన్స్ లో చేరతాననడం మామూలు విషయం కాదు. అది తన గుండె లోలోతుల్నుంచి వచ్చిన నిర్ణయమై ఉంటుంది. ఈ దేశానికి మీరొక గొప్ప వ్యక్తినిస్తున్నారని గర్వపడండి.

సాహసం లేనిదే జీవితంలో ప్రయోగాల్లేవు! యువత నుంచి ప్రయోగాల్లెకుంటే..ఆవిష్కరణలు రాకుంటే..అది మానవాళికి ముప్పు!

ప్రేమాశీస్సులతో,
సద్గురు