Sadhguruఅగస్త్యముని ఎంతో అసమానమైన జీవితం గడిపారు. ఈయన చాలా ఎక్కువ కాలం జీవించారు అని కూడా అంటారు. ఇతిహాసాలు, సుమారు నాలుగు వేల(4000) సంవత్సరాలని చెప్తాయి, కానీ ఎంతకాలమో మనకు తెలీదు. బహుశా 400  అయ్యుండవచ్చు. మనం భారతీయులం కదా, సున్నాలని మనం తెలిగ్గా వాడేస్తాం. సున్నా మనం కనిపెట్టిందే కదా? సున్నా భారతీయులు కనిపెట్టిందే కాబట్టి, దాని మీద హక్కు మనకు ఉంది కాబట్టి, మనం దానికేమి టాక్స్ కట్టక్కర్లేకుండా ఎలా ఐనా సరే మనం తేలిగ్గా వాడేసేయచ్చు. అందుకని మనం కొంచెం తెలిగ్గా వాడుతాం. ఆయన ఎన్నో ప్రయాణాలు కాలినడకన చేశారు. నేను కూడా చాలా ప్రయాణాలు చేసాను. కానీ నేను ఫ్లైట్లో వెళ్ళాను. ఈయన చేసిన ప్రయాణాలు చూస్తే, మీరు ఆయన చాలా ఎక్కువ కాలం జీవించారు అని గ్రహించవచ్చు. అది 200లో, 300లో,400లో  మనకు తెలీదు. ఇప్పుడు  డెక్కన్ ప్లాటో అనే ప్రాంతానికి అంటే 'వింధ్యా చలానికి’ దక్షిణం వైపుకి వెళ్తే -  మీరక్కడ ఏ గ్రామానికి వెళ్లినా సరే - ఆ ప్రాంతంలో ఉన్నవారు, “ అగస్త్య ముని ఈ గుహలో ఉండేవారు, అగస్త్యముని  ఇక్కడ తపస్సు చేసుకున్నారు, అగస్త్యముని ఈ చెట్టు నాటారు” ఇలా మీకు అంతులేనన్ని కధలు చెప్తారు.

ఆధ్యాత్మికతను ఈయన ప్రజలకి ఎలా నేర్పించారంటే, - వారు నిల్చునే విధానం, కూర్చునే విధానం, పనులు చేసే విధానం - అంతా కూడా వారికీ తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అయిపొయింది.

ఈయన హిమాలయాలకు దక్షిణం వైపున ఒక్క మానవ సమూహాన్ని కూడా ఆధ్యాతికతతో స్పృశించకుండా వదలిపెట్టలేదు. ఈయన ప్రతీ మానవ సమూహం వద్దకు వెళ్లి, వాళ్లకు ఆధ్యామిక ప్రక్రియను బోధించారు. ఇది ఈయన ఒక బోధనలానో, ఒక మతంగానో, ఒక తత్వంగానో వారికి నేర్పించలేదు. ఇది వారి జీవన సరళిగా మార్చేశారు. ఎంత సులువుగా అంటే, మీ అమ్మ మీకు పొద్దున్నే లేచి పళ్ళు తోముకోమని చెప్పింనంత  సులువుగా. వాటి అవశేషాలు ఈ రోజుకీ అక్కడి ప్రజల్లో ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అంతగా మిగల్లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశం ఎన్నో దండయాత్రలకు లోనైది. రాజ్యాంగపరంగా, సాంస్కృతికపరంగా మతపరంగా ఎన్నో దండయాత్రలు చేశారు. కానీ దక్షిణ భారతం మరింత కిందకి ఉండడం వల్ల, దీనికి మూడు పక్కల సముద్రాలు ఉండడం వల్ల ఇది మరికొంత సురక్షితంగా ఉంది. వింధ్యాచలాలను దాటి ఎవరు రాలేదు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా జలసేన లేదు. దండయాత్ర చేయాలంటే భూమి మీద నుంచి రావాల్సిందే. అందుకని దక్షిణ భారతం మరింత సురక్షితంగా ఉంది. ఆధ్యాత్మికతను ఈయన ప్రజలకి ఎలా నేర్పించారంటే, - వారు నిల్చునే విధానం, కూర్చునే విధానం, పనులు చేసే విధానం - అంతా కూడా వారికీ తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అయిపొయింది. ఈ విషయం వారికీ తెలియకుండానే అన్నీ చేసేస్తారు. కానీ వీటన్నిటికి ఒక ఆధ్యాత్మిక మూలం ఉంది.

మీరు ఎంతో గొప్ప ఆలోచన అనుకున్నది కూడా, ఆయన పదిహేను వేల సంవత్సరాల క్రితం, చెప్పేసిన ఆలోచనే.

ఇప్పుడు నేను దక్షిణ భారతదేశంలో ఏదయినా ఒక గ్రామానికి వెళ్లాననుకోండి, ఉత్తర భారతదేశంలో కూడా కొంతవరకు ఇది వర్తిస్తుంది. అదేవిటంటే ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అసలు ఏమి చదువుకోని వ్యక్తి  కూడా వచ్చి, నాకు ఒక బంగారు గుర్రం కావాలనో, మరొకటో అడగరు. వారు ‘అయ్యా! నాకు ముక్తి ప్రసాదించు’ అని అడుగుతారు. అంటే అస్సలు ఏమి చదువుకోనటువంటివాడు, జీవితంలో ఎటువంటి గ్రంధాలు చదివి ఉండకపోవచ్చు, ఎటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు విని ఉండకపోవచ్చు. కానీ అతనిలో ఎక్కడో ‘ముక్తి’ అన్నది కోరుకోవాలి అన్న జ్ఞానం ఉంది. ఇది సాంస్కృతిక పరంగా వచ్చేసింది. మనం ఈ భూమి మీద ఇలాంటిది మరెక్కడా చూడలేము. ఈ సంస్కృతిలో ఇది చాలా బలంగా నాటుకుపోయింది.

‘ముక్తిని’ సాధించాలని, ప్రస్తుతం తను ఉన్న స్థితిని మించి, మరో కోణాన్ని దేన్నో శోధించాలి అన్న విషయం వారికి తెలుసు. ఇది ఎంతగా నాటుకుపోయింది అంటే, ఎనిమిది, పది తరాల పాటు పేదరికం అనుభవించిన తరువాత కూడా వారు ‘ముక్తినే’ కోరుకుంటారు. మీరు వీరిని చూసినట్లైతే, ఎంతో స్థిరత్వంతో, సంతృప్తిగా, ఆనందంగా ఉండడం గమనిస్తారు. ఇలా మనం ప్రపంచంలో మరెక్కడ చూడలేం. ఇలా జరగడం చాలా అరుదు. దాదాపు పదితరాల పాటు భౌతికమైన విషయాల్లో చాలా దుస్థితి అనుభవించిన తరువాత కూడా, మనం ఇది వీరిలో చూడచ్చు. తెలిసో, తేలీకో ప్రజలు ముక్తిని కోరుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో చాలా వరకు ఇది తెలియకుండానే జరుగుతోంది.

“ఆదియోగి” చేసిన ఈ కృషి - మానవ చైతన్యానికి అందించిన ఈ కానుకను మరెవ్వరు ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే మానవ చైతన్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సాంకేతికతని ఆయన చాలా స్పష్టంగా అందించారు. ఇందులో ఎలాంటి సందిగ్ధం లేదు. మీరు ఎంతో గొప్ప ఆలోచన అనుకున్నది కూడా, ఆయన పదిహేను వేల సంవత్సరాల క్రితం, చెప్పేసిన ఆలోచనే. మీరు ఎన్నివిధాలుగా చూసినా కూడా ఒక్క కొత్త ఆలోచనతో చేయలేరు. మీరు ఆయన చెప్పింది  తిరిగి చేయగలరు, అంతే..!

దశావతారాల వివరణ

రెండువందల సంవత్సరాల క్రితం డార్విన్ మానవ ఆలోచనా క్రమంలో ఒక తీవ్రమైన మలుపును తీసుకునివచ్చారు. అదేమిటంటే జీవితం పరిణామం చెందుతుంది అని. ప్రస్తుతం ఉన్న కోణం నుంచి మరో  కోణానికి  జీవితం పరిణామం చెందుతుందని ఆయన చెప్పారు. కానీ ఇది రెండు వందల సంవత్సరాల క్రితం కాదు, ఆదియోగి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత జీవిత తత్వం ఏదయినా సరే, దానికి తగిన పరిస్థితి కల్పిస్తే, అది పరిణామం చెందుతుంది. ఎంతగా పరిణామం చెందుతుందంటే అంతకుముందర ఉన్న రూపం, ఇప్పుడు ఉన్న రూపానికి ఏ మాత్రం పోలిక లేనంతగా పరిణామం చెందగలదు అని. దీన్ని ఈయన ఎంతో స్పష్టంగా వివరించారు. డార్విన్ చెప్పిన దాన్ని కొంతమంది తర్కించారు. కానీ ఆదియోగి ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఆయన తర్కానికి తావే ఇవ్వలేదు. ఇదే యోగాకు మూలం కూడాను. మీరు వేసే ఆసనాలకి జంతువుల పేర్లు పెట్టారు. ఈ విషయం మీకు తెలుసా? దీనికి అర్ధం ఏమిటంటే, వీటి ద్వారా మిమ్మల్ని మీరు పరిణామం చెందించుకుంటున్నారని అర్ధం.

నిజానికి మనం దివ్య అవతారాలని చెప్పుకునేవి కూడా ఒక పరిణామ క్రమాన్ని సూచిస్తున్నవే.“మొదటిది మత్స్యం - ఇది చేప - ఇది నీటిలో ఉంటుంది. రెండవది కూర్మం - తాబేలు, ఇది నీటిలో మనగలదు, భూమి  మీద కూడా  ఉండగలదు. మూడవది -వరాహం, అడవి పంది. ఇది భూమి మీద గట్టిగా స్థిర పడిన జంతువు. నాలుగవది - సగం జంతువు సగం మనిషి, నారసింహం. ఐదవది - ఒక మరుగుజ్జు మనిషి. ఆరవది - సంపూర్ణంగా ఎదిగిన మానవుడు, కానీ అంతగా స్థిరత్వం లేని మానవుడు పరుశురాముడు, ఈయనకి కోపం చాలా ఎక్కువ, ఏడవది - పరిణామం చెందిన మానవుడు, ఎనిమిదవది- ప్రశాంతమైన మానవుడు, తొమ్మిదవది - ప్రేమ, ధ్యాన గుణం కలిగిన మానవుడు, ఇలా ఇది ఈ  పరిణామ క్రమాన్ని సూచిస్తోంది. దీన్ని ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. చార్లెస్ డార్విన్ చెప్పింది  నూటికి నూరు పాళ్ళు దీనితో ఏకీభవిస్తుంది.

మానవుడు ఇంకా ఇంకా  శక్తివంతంగా మారుతున్నాడు, కానీ దురదృష్టవశాత్తు దానికి తగ్గ సూక్ష్మ గ్రాహ్యత, సున్నితత్వం రావడం లేదు.

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మానవుడికి “తానూ ప్రస్తుతం ఉన్న పరిమితిని దాటి పరిణామం చెందగలడు, ఈ అవకాశం ఉంది” అన్న ఈ ఆలోచన్ని కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది  ఈ రోజున చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మునుపెన్నడూ లేనివిధంగా మానవజాతి ఎంతో సాధికారతను సాధించింది. మునుపెన్నడూ మానవుడికి ఇంత సాధికారత లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మానవజాతి మూర్ఖంగా ఉంటానంటే ప్రపంచానికి దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు ఒక చిన్న చీమలా ఉన్నారనుకోండి, ఎవరి మీద పాకినా పర్వాలేదు, కానీ ఒక ఏనుగులాగా పరిణామం చెందిన తరువాత, ఎక్కడకు కదిలినా సరే ఒక విధ్వంసమే జరుగుతుంది. మానవుడు ఇంకా ఇంకా  శక్తివంతంగా మారుతున్నాడు, కానీ దురదృష్టవశాత్తు దానికి తగ్గ సూక్ష్మ గ్రాహ్యత, సున్నితత్వం రావడం లేదు. ఇంతకు ముందు తరాలలో ఇంత సాధికారత ఎప్పుడూ లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ రోజున ప్రపంచంలో ఏ సమస్యనైనా ఎదుర్కొనగలం. 25 సంవత్సరాల క్రితం కూడా ఇది సాధ్యపదేది కాదు. ఇలాంటి  వనరులు లేవు, ఇలాంటి  సామర్ధ్యం లేదు. కానీ ఇప్పుడు మనకి అవన్నీ ఉన్నాయి.

మనకి కావాలనుకుంటే మనం ఏవైనా చేయగలం. మనం భూమిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగలం, అలానే భూమిని ఎంతో ఘోరంగాను తయారుచేయగలం. కావాలనుకుంటే భూమిని రెండు ముక్కలుగా చేయగలం. రెండుముక్కలేవిటి, ఈరోజున ఎన్నో విస్ఫోటకాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా ఉపయోగిస్తే భూమిని ఎన్ని ముక్కలైనా చేసేయ్యగలం, ఎంతటి విధ్వంసాన్నైనా చేయగలం. గ్రహాన్నే విధ్వంసం  చేసేస్తాం. ఇలా జరగకుండా ఉండాలంటే మనం మానవ చైతన్యం పెంపొందించడానికి కొంత కృషి చేయాల్సిన అవసరముంది. మానవాళికి ‘మనిషి తాను ఇప్పుడున్న కోణం నుంచి మరో కోణానికి పరిణామం చెందగలడు’ అన్నది తెలియపరచడం ఎంతైనా అవసరం.

కానీ ఇప్పుడు అలాంటి కృషి ఎక్కడా జరగడం లేదు. ఒక ప్రభుత్వరీత్యా కానీ, సామాజిక పరంగా గాని ఏమి జరగడంలేదు. కొంతమంది వ్యక్తులు చేస్తున్నప్పటికీ, క్రమబద్ధంగా ఏది లేదు. ఇప్పుడు ఉన్న మానసిక స్థితితో, మనసుతో మనం సృష్టించిన సమస్యలు, అదే మానసిక స్థితితో, మనస్సుతో, పరిష్కరించగలం అనుకోవడం మూర్ఖత్వం. అలా పరిష్కారాలు లేని ప్రయత్నం చేయడం, పరిష్కారం చేయాలని ప్రయత్నించడం వల్ల మరిన్ని సమస్యల్ని సృష్టిస్తాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. మనం ఇది కనక మార్చకపోతే తరువాత దీనివల్ల వచ్చే పరిణామాన్ని ఎంతగానో దుఃఖించవలసి ఉంటుంది. మనందరం కూడా దుఃఖించాల్సి ఉంటుంది. అసలు ఆ పరిణామాన్ని చూడడానికి మనం జీవించే ఉండమేమో కూడా. అది కూడా సాధ్యమే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు