యోగ ప్రక్రియలు శరీరంతోనే ఎందుకు మొదలౌతాయి..??
 
 

Sadhguruమీకు తెలిసిన దాని నుండి ప్రారంభించి ఆ తర్వాతి అడుగును మీకు తెలియని దానిలోకి వేయించడమే - యోగ ప్రక్రియ. ‘’యోగ’’ అంటే ‘’ఐక్యం’’ అని అర్థం. అన్నింటిలో ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే మీరు యోగాలో ఉన్నట్లుగా భావించాలి. మీ అంతరంగంలో ఈ ఏకత్వాన్ని చేరుకునేందుకు అనేక మార్గాలున్నాయి; వాటిల్లో ఒకటి హఠయోగం. హఠయోగం అంటే శరీరంతో ప్రారంభించడం అని అర్థం. శరీరానికి కూడా తనకంటూ ఒక అహం, వైఖరి, స్వభావం ఉంటాయి. మీరెప్పుడైనా పరిశీలించారా? మనసుకే కాదు, శరీరానికి కూడా అహం ఉంటుంది. దానికి తన సొంత వైఖరులు బలంగా ఉంటాయి, వాటికి మీరు లొంగిపోవలసిందే, అవునా? ఉదాహరణకు ‘’రేపటి నుంచి, పొద్దున్నే అయిదింటికి లేస్తాను, బీచ్‌లో నడుస్తాను’’ అనుకొని అలారం పెట్టుకొని నిద్రపోతారు.

మీకు తెలియని దాని గురించి నేను చెబితే, మీరు దానిని అయితే నమ్మాలి లేదా నమ్మకుండా అయినా ఉండాలి.

ఉదయాన్నే అలారం మోగుతుంది. మీరేమో లేవాలనుకుంటారు, కాని మీ శరీరం మాత్రం ‘’నోర్మూసుకొని పడుకో!’’ అంటుంది. మీ శరీరం అలాగే చేస్తుందా? ఎందుకంటే దానికి కూడా సొంత స్వభావం ఉన్నది. అందుకే మనం యోగాను శరీరంతోనే మొదలు పెడతాం. శరీరంతో పని చేయించి, క్రమశిక్షణ నేర్పించి, శరీరాన్ని పరిశుద్ధి చేసి, ఉన్నత శక్తిని స్వీకరించే విధంగా శరీరాన్ని తయారుచేసే ప్రక్రియే హఠయోగం. మనమంతా మానవులమే, ఇక్కడ అందరం కలిసి కూర్చున్నా మనమంతా జీవితాన్ని ఒకే తీవ్రతతో అనుభూతి చెందడం లేదు. దీనికి కారణం, మనలోని శక్తిస్థాయుల్లో ఉన్న తేడాలే. మనందరిలోని ప్రాణశక్తులు ఒకేలా ఉండవు; ఒకొక్కరు జీవితాన్ని ఒక్కో స్థాయులలో అనుభూతి చెందుతారు.

ఉదాహరణకు, ఒకరు ఆ చెట్టును గమనిస్తారు, వారికి చెట్టు అంటే ఒక చెట్టు అంతే.  చాలా మంది అసలు చెట్టునే గమనించకపోవచ్చు, కనీసం ఆ చెట్టు వైపు కూడా చూడకపోవచ్చు. కాని అదే చెట్టును, ఒక చిత్రకారుడు కేవలం చూడడమే కాదు, అన్ని కోణాలలో దాని రంగు, రూపం కూడా గుర్తిస్తాడు. ఇంకొకరు ఆ చెట్టునే కాకుండా, దానిలోని దివ్యత్వాన్ని కూడా చూస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా చూస్తారు. దీనికి కారణం జీవితాన్ని అనుభూతి చెందే స్థాయి అందరిలో ఒకేలా ఉండకపోవడమే.

తెలిసినదాని నుంచి తెలియని దాని వరకు

అయితే శరీరం అంటే ఏమిటో మీకు తెలుసు, అది మీ అనుభూతిలో ఉంది. ఇలా మీకు తెలిసిన దాని నుండి ప్రారంభించి ఆ తర్వాతి అడుగును మీకు తెలియని దానిలోకి వేయించడమే - యోగప్రక్రియ. అందుకే యోగాను శరీరంతో ప్రారంభిస్తాం. మీకు తెలియని దాని గురించి నేను చెబితే, మీరు దానిని అయితే నమ్మాలి లేదా నమ్మకుండా అయినా ఉండాలి. అంతే కదా! ఉదాహరణకు, నేను భగవంతుని గురించి మాట్లాడడం మొదలు పెట్టాననుకోండి, నేను చెప్పే భగవంతునిపై మీకు నమ్మకం కలగవచ్చు లేదా నమ్మకం కలగకపోవచ్చు. మీరు నమ్మినా, నమ్మకపోయినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేనినీ మీరు అనుభూతి చెందడం లేదు.

మీ అంచనాల మేరకు ఓ అభిప్రాయానికి వస్తున్నారు, అంతే. ఈ అంచనాలు, నమ్మకాలు, ఊహలకు దారితీస్తాయి కాని ఎదుగుదలకు కాదు. అందుకే మనం శరీరం గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు తెలిసిన విషయమే. శరీరం మీ అనుభూతిలోనే ఉంది. కాబట్టి మీరు ఈ శరీరాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపొండి. తరువాత నేను మనసు గురించి చెప్తాను. అది కూడా మీకు తెలిసిన విషయమే. దానిని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకుపొండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, అక్కడి నుండి ఒక అడుగు ముందుకు వేయండి, అక్కడ నుండి మళ్ళీ ఇంకో అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత మళ్లీ ఇంకో అడుగు, ఇలా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సాగండి! ఈ విధంగా మాత్రమే మీరు ఎదగగలరు.

మీకు తెలియని దాని గురించి మాట్లాడితే, మీరు ఊహల్లోకి వెళ్ళిపోతారు. సంయమనం కోల్పోతారు.

ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో గుర్తించి, అక్కడి నుండి తరువాతి అడుగు వెయ్యడమే ఎదుగుదల. మీకు తెలియని దాని గురించి మాట్లాడితే, మీరు ఊహల్లోకి వెళ్ళిపోతారు. సంయమనం కోల్పోతారు. ప్రస్తుతం మతం పేరుతో ఉన్నవన్నీ ఇటువంటి కథలే. ఒక కథ, మళ్లీ అందులో ఇంకో కథ - ఇలా అంతా కథల మయమే. అసలు ఈ కథలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. వీటిలో ఏది ఊహొ, ఏది వాస్తవమో కూడా మీకు తెలియదు. కాని యోగ సాధన మాత్రం,  మీకు తెలిసినదానితో – మీ శరీరంతో ప్రారంభమై, తరువాత శ్వాసతో, ఆ తరువాత మనసుతో సాగుతుంది. ఈ యోగశాస్త్రం, ఒక భౌతికశాస్త్రం లాంటిదే రెండు వంతులు హైడ్రోజన్‌, ఒక వంతు ఆక్సిజన్‌ కలిపారనుకోండి; నీరు తయారవుతుంది. ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ రెండింటినీ కలిపినా నీరే తయారవుతుంది. ఒక మూర్ఖుడు ఈ రెండింటినీ కలిపినా, నీరే తయారవుతుంది. అలాగే, యోగలో కూడా. మీరు ఇది చేస్తే ఇది జరుగుతుందని స్పష్టంగా పేర్కొనబడింది. ఒక గొప్ప యోగి చేసినా, ఒక మూర్ఖుడు చేసినా, తేడా ఉండదు. ఎవరైనా క్రియలు, సాధనలు సక్రమంగా చేస్తే, ఫలితాలు స్పష్టంగా తెలుస్తాయి.

అందుకే యోగాలో విధానాలు నిర్దేశించబడ్డాయి. అభ్యాసం ప్రారంభించేటప్పుడు శరీరంతో మొదలుపెడతారు, తర్వాత శ్వాస, ఆపై మనసు, ఆ తర్వాత అంతరాత్మ చెంతకు, ఇలా పలు మెట్లుగా యోగా రూపొందించబడింది. ఈ దశలన్నీ యోగాలోని విభిన్న అంశాలే కాని యోగాకు ఉపశాఖలు కావు. వీటన్నింటిని యోగాలోని అంతర్భాగంగానే చూస్తాం, వీటన్నింటికీ ప్రాధాన్యత ఇస్తాం. వాటన్నిటినీ సమపాళ్ళలో, ఒకటిగా  నేర్పడం ముఖ్యం. మీరు కేవలం శరీరంతోనే సాధన చేస్తే, దాని ఉద్దేశ్యం శరీరాన్ని సిద్ధం చేయడమే అని గుర్తుంచుకోండి. వాస్తవంగా యోగాలో ఎలాంటి విభజనలు లేవు, వీటన్నింటినీ (శరీరం, శ్వాస, మనసు, భావోద్వేగం, శక్తి) కలిపితేనే యోగా.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1